ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం, విద్య/జ్ఞానార్జన పట్ల మొక్కవోని పట్టుదలా ఇమిడి ఉన్నాయి. ఇందులో  అడుగడుగునా  దళిత జీవితపు  ఆత్మగౌరవ పతాకం ఎక్కడా  అవనతం కాకుండా రెపరెపలాడుతూ ఎగురుతున్న అద్భుత దృశ్యాన్ని మనం చూడవచ్చు.

       ఈ తరం పిల్లలు తమ కుటుంబ చరిత్ర, దాని మూలాలు తెలుసుకోవాల్సిన అవసరం, మంచి భవిష్యత్తు నిర్మాణం కోసం గతాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమని భావించి ఈ పుస్తకాన్ని రాసినట్టుగా రచయిత ఇందులో పేర్కొన్నాడు. (భూమిక పే. 9) ‘ఏ పని చేసినా, అందులో శ్రేష్ఠత సాధించాలి’  అన్న తన నాయన బాలయ్య మాటల్ని అక్షరాలా పాటించి ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు.

      మనువు సూత్రీకరణకు అనుగుణంగా నిర్మితమైన కుల బంధిత గ్రామీణ వ్యవస్థలో  సుమారు నూట పాతిక సంవత్సరాల క్రితం అగ్రకులాల వేధింపులు భరించలేక భార్య శవాన్ని భుజాన వేసుకుని ఆరేళ్ళ కొడుకుతో తన పూర్వీకుల గ్రామాన్ని వదిలి పెట్టిన అంటరాని  మాదిగ నరసయ్య, మళ్లీ ఆ గ్రామాన్ని తిరిగి చూడలేదు. అలా గ్రామాన్ని వదిలి రావడం వల్ల తనను తానే కాకుండా తన తర్వాతి తరాలను  కూడా క్రూరమైన కుల బంధనాల నుండి విముక్తం చేశాడు. బావమరుదుల సాయంతో పాయింట్స్ మాన్ గా  రైల్వేలో ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మేనమామల ప్రేమానురాగాలతో కొడుక బాలయ్యా పెరిగి పెద్దవాడయ్యాడు. 

      ఆ రోజుల్లో స్టేషన్ మాస్టర్ లాంటి రైల్వే ఉద్యోగాలు మినహా మిగిలిన గ్యాంగ్ మాన్, పాయింట్స్  మాన్, షంటర్ లాంటి రైల్వే పనులన్నీ ప్రాణాపాయమైనవే. పాయింట్స్ మాన్  అయితే పట్టాల మధ్య పరిగెత్తి, గంట మోగించి, కిరోసిన్ దీపాలు వెలిగించి సిగ్నల్స్ ఇవ్వాలి. ఆనాడు ఈ పనులన్నింటికీ ఎక్కువగా అంటరానివారు, శూద్రులే  పూనుకునేవారు.  బ్రిటిష్ వలస వాదులు తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసమే రైల్వే మార్గాలను నిర్మించినప్పటికీ, అవి అంటరానివారందరికీ కాకున్నా కొందరికైనా విముక్తి మార్గాలుగా అందివచ్చాయి. వలసవాద ఆధునికత వారిని సాపేక్షికంగానైనా గ్రామీణ సమాజపు విధి నిషేధాలకు, ఆంక్షలకు దూరంగా బతికే వీలు కల్పించింది. అయితే అక్కడ కూడా  పైకి చూడ భౌతికంగా అంటరానితనం పాటింబడనప్పటికీ, దళితుల పట్ల అస్పృశ్య మానసికత, సాంఘిక  అవమానాలు లేనేలేవని అనలేం.

      అయినప్పటికీ, బాలయ్య తన ఆత్మగౌరవాన్ని  తాకట్టు పెట్టకుండా నిరంతరం ఎగురుతున్న జెండాలా  జీవించాడు. విద్యార్జనే ధ్యేయంగా బ్రతికాడు. తన బతుకు అజెండాలో సమయపాలనకు, ఎంచుకున్న లక్ష్య సాధన కోసం కష్టించి పని చేయడానికి, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత నిచ్చాడు. అవే అతని వ్యక్తిత్వంలోని ప్రబల బలాలుగా కనబడతాయి. అందుకే బాలయ్యకు తన సంతానాన్ని విద్యావంతుల్ని  చేయాలనే  దృఢసంకల్పం ఉంటుంది. చదువే దళితుల సమస్యల పరిష్కారానికి ఒక వెలుగు దారి చూపిస్తుందని గాఢముగా  నమ్మాడు. చెక్కుచెదరని స్థిర చిత్తంతో   తన పిల్లలనందర్నీ చదివించాడు. ఫలితంగా తన కుటుంబంలో రచయితతో సహా నలుగురు కొడుకులు కళాశాల అధ్యాపకులు అయ్యారు.

      కాలం గడుస్తున్న కొద్దీ బాలయ్య కుటుంబాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. శాస్త్ర సాంకేతిక ప్రగతి సంభవించినందువల్ల వాళ్ళ ఇళ్లల్లోకి ఎలక్ట్రిక్ బల్బులు, ఫోన్లు, డైనింగ్ టేబుళ్ళు, సోఫా సెట్లు, ఫ్రిజ్ లు, టీవీలు వచ్చి చేరి జీవితం సుఖమయం అయిపోయింది. ఇదంతా బాలయ్య  దంపతులకు సంతోషకరంగానే ఉన్నది.

      ఇదంతా నాణానికి ఒకవైపు ఉందనుకుంటే, మరోవైపు వాళ్ల జీవితం హైందవీ(సంస్కృతీ)కరణ చెందిందని ,భోజన శైలి, జీవనశైలీ మారిందని రచయితే ఒకచోట అంటాడు. దళితులను ప్రత్యేకంగా గుర్తించి ఎత్తిచూపే భౌతిక చిహ్నాలేవీ  ఇప్పుడు నగరాల్లో లేవని కూడా అంటాడు. ఉదాహరణకు, విద్యావంతులైన దళిత ఆడవాళ్లు ఒకప్పటిలా మోకాళ్లపైకి చీరెలు  కట్టుకోవడం లేదని, గడ్డంమీద, చేతులమీద పచ్చబొట్లు పొడిపించుకోవడం లేదని, దళిత పురుషులైతే చెప్పులు వేసుకుని హిందువుల ఎదుటికి దర్జాగా  వెళ్తున్నారని, సవర్ణ హిందువుల లాగే దళితుల వేషభాషలు మారా యని రచయిత అంటాడు. ఇంకా తన చిన్ననాటి జీవితం లో ఉండినట్లుగా ఇప్పుడు దళితుల పిల్లలు స్కూల్లో విడిగా కూర్చోవడం లేదని, అందరితో సమానంగా కూర్చొని చదువుకుంటున్నారని అంటాడు. ఒకప్పటిలా యాదగిరి  నరసింహా స్వామి దర్శనంలో కొండ మొదట్లో పూజలు వేరేగా చేసుకోవడం ఇప్పుడు లేదని, సవర్ణ హిందువుల వలె వారు కూడా మెట్లేక్కి  పోతున్నారని చెబుతాడు.

     అయితే దేవుళ్ల విషయంలో చాలా మార్పులు వచ్చాయని అంటాడు. దుర్గమ్మ, నరసింహాస్వామి స్థానంలో సరస్వతి, లక్ష్మి, గణపతి, వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబాల్లోకి  వచ్చి చేరారు. వాస్తు పట్టింపులు, తులసి పూజలు, గాయత్రీ మంత్రాలు కూడా వచ్చేశాయని చెబుతాడు. పెళ్లిళ్ల విషయంలో కూడా ఎంతో మార్పు వచ్చిందని, బ్రాహ్మణ పూజారుల మంత్రాల మధ్య విద్యావంతులైన దళితుల పెళ్లిళ్లు జరుగుతున్నాయని అంటాడు.

      ఇందులో  రచయిత వాళ్ళ నాయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలను గురించి  వివరంగా రాశాడు. ఆయన మౌలిక మానవత్వం ఉన్న మనిషని, తన శరణుగోరి వచ్చిన బ్రాహ్మణ అమ్మాయిని సైతం ఇంట్లోకి ఆహ్వానించి, ఆమె ప్రేమించిన తన కొడుకు నర్సింగరావుతో 1972 లోనే కులాంతర వివాహం జరిపించాడని చెబుతాడు.

పట్టణాలలో  ఇన్ని సడలించబడిన పరిస్తితులున్నప్పటికీ, అంటరాని కులమని బాహాటంగా  తెలిసినప్పుడు ఇల్లు అద్దెకు దొరుకకపోవడం, ఒక రకమైన అదృశ్య వెలి  వంటి ఎన్నో సాంఘిక అవమానాల్ని నేటికీ దళితులు ఎదుర్కుంటున్నారని  తెలుపుతాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు గడిచినా  అగ్రవర్ణాల ఆలోచనా విధానం  ఏమాత్రం మారలేదని, దళితుల పట్ల వివక్ష కొత్త కొత్త రూపాలలో ఇంకా కొనసాగుతూనే ఉందని అంటాడు.

      అయితే వలస ఆధునికత వల్ల ప్రారంభమైన కొన్ని సామాజిక చలనాలు వలసానంతర కాలంలో సాపేక్షికంగా విస్తృతమయ్యాయి. ఆ చలనాలన్నీ పరిమాణాత్మక మార్పు  స్థాయిలోనే ఉండి, అవి అసలైన ఆధునికతను ప్రతిఫలించేలా లేవు. అందుకు కారణం ఆధునికత ముసుగులో ఇక్కడ రాజ్యం చేస్తున్నది సామ్రాజ్యవాదమే. ప్రజాస్వామ్య ముసుగులో ఇక్కడ పాలిస్తున్నది అర్థ భూస్వామ్య వలస పాలకులు కావడమే.కనుకనే ప్రజా పోరాటాల ఫలితంగా పొందుపరచబడిన రాజ్యాంగ హక్కులు, ఆధునిక ప్రజాస్వామిక విలువలు మన దేశంలో  ఏ మాత్రం అమలు కావడం లేదు. మొత్తంగా రాజ్యాంగ వ్యవస్థే  పాలకుల స్వార్థ రాజకీయాల క్రీడాప్రాంగణం అయిపోయి ప్రజల పాలిట దోపిడీ పీడక  వ్యవస్థగా పరిణమించింది.

      ఏదేమైనప్పటికీ, ఇంటి బయట ఉన్న సంతానానికి పీకివేయబడి చిందర వందరగా  ఉన్న ఇంటిలో సైతం తమ జాగా కోరడం ఎంత న్యాయమైన హక్కో, ఆధునికతకు దూరంగా నెట్టివేయబడి  ఉన్న దళితులు  ముసుగు  ఆధునికతలోనైనా సరే తమ వాటా కోరడం అంతే న్యాయమైన హక్కు. ఆ హక్కుకు  ఈ వ్యవస్థ ఏ మేరకు వీలు కల్పిస్తుందో  స్వయంగా దళితులే స్వానుభవపూర్వకంగా తెలుసుకొనగోరడం ఎవరికీ  అభ్యంతరకరం కానక్కరలేదు. పైగా ఆ హక్కును వాస్తవీకరించుకోవడంలో, వాస్తవికత పై కప్పబడిన ముసుగును తొలగించుకుని నేటి ఆధునికతా స్వరూప స్వభావాలను స్వయంగా అర్థం చేసుకునే క్రమాన్ని  బైపాస్ చేయడం కూడా చరిత్రలో సాధ్యం కాదు.

     మొత్తంమీద, ప్రప్రథమంగా అదీ ఇంగ్లీష్ లో  బహుముఖీనమైన దళిత జీవిత వాస్తవికతను సజీవంగా చిత్రించిన ఘనత ఈ పుస్తకానికి దక్కుతుంది. ఆధునికతా  ఫలాలు అందుకోవడం కోసం వర్తమానపు నిర్దిష్ట స్థల, కాలాల్లో పోరాట (పరిణామ)శీలత్వంతో జీవించడానికి దళిత సమాజం మున్ముందు కాలంలో  మరింత ముందుకు రావడానికి, అందరితో సమానంగా విద్యను అందుకని నిజమైన అర్థంలో విద్యా(జ్ఞాన)వంతులై తమ సంపూర్ణ విముక్తి  కోసం వెలుగు దారిని వెతుక్కోవడానికి నిస్సందేహంగా ఈ పుస్తకం ఎంతో ప్రేరణనిస్తుంది. ఇది ఆత్మకథాత్మక దళిత జీవిత చరిత్రే  అయినప్పటికీ  రచయిత ఎక్కడా  ఆత్మాశ్రయతలో కూరుకపోకుండా దళిత జీవిత వాస్తవికతను అత్యంత వస్తుగతంగా  చిత్రించాడు. స్వానుభవాన్నే  పరమ ప్రమాణం అని భావించకుండా రచన చేశాడు కనుక రచయిత నేటి కాలపు (20వ శతాబ్దపు) అస్తిత్వవాదిగానూ లేడు. పైగా ఎటువంటి స్వాతిశయానికి  పోకుండా ఆత్మగౌరవమే ప్రాణ సమానంగా భావించి దళిత విముక్తే  లక్ష్యంగా దృఢంగా పోరాడిన చరిత్రను ఆయన అక్షరీకరించాడు. ఆ రకంగా ఈ పుస్తక రచయిత ఎంతో చరితార్థుడని చెప్పవచ్చు.

Leave a Reply