ఆకు నేను
పువ్వు నేను
చెట్టు నేను
జీవి నేను

ఈ గాలి నాదే
ఈ నీరు నాదే
ఈ భూమి
ఈ అడవి నాదే

అడవి దేహం
నేనో చెయ్యి
నేనో కాలు

నేనే
నోరే లేని నోరు
నేనే అడవి

అడవి
కడుపు నేను
నా కడుపు
అడవి

నన్ను
వనం ఖాళీ చేయమంటే
అడవినే
అడవి ఖాళీ చేయమన్నట్టు

బతుకు కాలి బాట
జీవితం
నడిచి పోతూనే ఉంటుంది

అడవింత తినిపించగా మిగిల్న
ఆకలంటారా ?
వాన మబ్బుల వెనకే నడిపిస్తాం

కారు మేఘాల ఖడ్గాలు
కళ్ళల్లో
చొర బడినా
చినుకు పరిమళాలే
బతుకు దీపమౌతాయి

ఇంటిముఖం
పట్టడాని కేముంది ?
నేనే
నా అడవి ఇల్లు !

నే నింకెవర్ని ?

నేను
రోహింగ్యానా ?
నేను
శరణార్ధినా ?
నేనో వలసనా ?

మైదానమా!
నువ్వెక్కడైనా బతికి నట్టు
అడివిని
నేనెక్కడైనా బతకాలి క దా !

ఈ వాగు
ఈ జీవి
ఈ గాలి
ఈ ఆకాశం
ఈ అడవి చెట్టు హక్కెంతో
నాకూ
అంతే!

మేం సహోదరురులం !!

నన్ను
వాసన చూస్తూనే
నా కళ్ళ లోంచి
పులి నడిచి పోతుంది
నేనూ
పులి కళ్ళ లోంచి
జారి పోతాను

బాగున్నావా ?
అనుకున్నామే కాని
భయం ఛద్దరు కప్పుకున్నదిలేదు

నా అడవి అందాల్ని
నరికి
నయవంచనల
అద్దాల మేడెవడు కట్టాడు ?
నా అడవి కడుపు గాల్చి
ఎర్ర కోట
జనహనన జెండెవడెత్తాడు ?

పొట్ట తిప్పల
పోడు తప్ప !
పుడమి పొట్ట
చీల్చిందెపుడు ?
నా కాళ్ళ
శరణు జొచ్చిన
సంపద శరణార్ధిని
నా ప్రాణం కావలి పెట్టి
కాయడం తప్ప !

చెట్లల్లో
పిట్టను !

కోళ్ళూ గొర్లూ మేకలూ
తిన్నట్టు
నన్నూ
తినాలని చూడొద్దు !

ఆకాశం వంతెన కింద
కాలం ప్రవహిస్తున్న
ఆకుపచ్చ సముద్రం నేను !

పాట
నాభాష
పోరు
నా జీవితం

మనిషి
కనిపించని
నాగరికమవ్వాలని లేదు

మనిషి
జీవన సుగంధం
నేను

పాల రొమ్ము చీకి
ప్రపంచానికి
ప్రాణం పోసింది నేను

నాప్రాణం
ప్రాణాపాయానికి
అంకితమిచ్చి
ప్రతి రుచి
నీ నాలుక
రాసింది
నేను

మెతుకు
పుట్టించింది నేను
బతుకు జీవన కాండను
కాలం తెర
చిత్రిక పట్టింద నేను

ఆకు పసరు
ఆరోగ్యం ఇచ్చింది నేను

నేను
ప్రకృతిని
మానవ పరిణామ కృతిని !

పక్షులాకాశం
పరశంలో
పాటల చెట్టునై
సూర్యుణ్ణి పాడ్తూనే ఉంటాను

ముడతల ముడతల పొగల పొదల
చుక్క పిట్ట గూళ్ళ
వెన్నెల గింజల గొల్సు
వేలాడ దీస్తూనే ఉంటాను

దూదిపింజ గాలి
ఒళ్ళు
దువ్వు తుంటే
ఖాళీ కడుపు కంచం
ఇప్పపువ్వు రాల్తుంది
వాగు
దోసిలి లోంచి
జలజలా
గొంతు జార్తుంది

పరిమళాల ధారాల్తో
కట్టేసిన
వేల రంగుల సీతాకోక చిలుకల
నృత్య సమీరాల్లో
ఊయలైతాను

చెరువు
చేప
ఒడ్డున పడితే
మరణం నోరు తెరిచి మింగుతుంది
నేను
అడవి చేపను !

నీ ప్రాజెక్టు
మునిగింది నేను
నీ రాష్ట్ర జిల్లా విభజన కుతంత్రాల్లో
ముక్కలు ముక్కలైంది నేను
నీ రాజకీయ స్మగ్లర్ల కు
నీఅరాచకీయ గనులకు
నీ లాలూచీ పరిశ్రమలకు
నడి బజార్ల దొరికిన
రూపాయి బిల్ల ను

ఆకాశాన్ని తొడుక్కున్న
ఆకారంలో
నీరు
ఒంపు జారుడు బండ జారిన
అమాయకంగానే
నిగర్వంగా

నీ కింకా
ప్రకృతి రహస్యాల ముల్లె
పంపాలనే ఉంది

నేను హత్తుకు పోతున్నా
నువ్వు
అర్ధాంతరంగా
అలవిగాని ఆలోచనలా
నన్ను
నిరాకరిస్తున్నా

ఎప్పుడైనా
ఎక్కడైనా
ఎట్లైనా
ఉండేవాడా !

నన్నిక్కడే ఉండనియ్యి

నీ బతుకు గాయాలకు
పసరు మందు
పంపుతాను

అడవి లేకుంటే
నేను అనాధ
నేను లేకుంటే
అడవి అనాధ

ఎన్ని
ఉదయాలు రాలినా
ఎన్ని
చీకట్లు విరిగి పడినా
సౌందర్య సార మంచు తెరల్ని
చీల్చుకొని
ఆకు పచ్చ జలపాతమై
తల
ఎగరేయడమే తెల్సు !

వెన్నెల పూల పందిరి
కింద
పురా పాద ముద్ర
పరవళ్ళ పాట
నేను .

One thought on “అడవి నేను

Leave a Reply