“పూలు రాలిన చోట

పుప్పొడి వెదజల్లబడే ఉంటుంది

పుప్పొడి నెత్తురులోంచి

పిడికిలి

తేటగా తేరుకునే ఉంటుంది”

            2016లో రామడుగు అమరత్వం నేపథ్యంలో రాసిన ఈ కవిత “పూలు రాలిన చోట” అనే నా రెండవ కవితా సంకలనం లోనిది.

            కలం పిడికిలి పట్టుకొని కవిత్వం దారి గుండా ఇవాల్టి వరకు నడిసొచ్చాను. నడిచానా? నన్నెవరైనా నడిపించారా? అని నన్ను నేను ప్రశ్నిచుకొని కాస్త వెనుదిరిగి జ్ఞాపకాల రుచి చూస్తూ పోతే కొన్ని తీపిగా ఇంకొన్ని చేదుగా మరికొన్ని వగరుగా ఇలా …

            మాది వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పేదకుటుంబం. ముగ్గురు అన్నదమ్ముల్లో రెండోవాడిని.నాన్న కులవృత్తి మంగలి పనిచేసేవాడు. తీరిక సమయాల్లో రకరకాల కూలీ పనులు చేస్తూ మా ముగ్గురిని ప్రభుత్వ బడుల్లో చదువగలిగేంతవరకు చదివించాడు.నాన్న బడిమొఖం ఎరుగలేదు. కాని ఏకలవ్యుడు. స్వతహాగ తెలుగు, హిందీ భాషల్లో పట్టు సాధించాడు. వీధి బాగోతాలు ఆడేవాడు. ఇంట్లో ఖాళీ సమయాల్లో వాటికి సంబంధించిన తత్వాలు కంఠత చేసేవాడు. నాన్న లేని సమయాల్లో కాటుక, పౌడర్, కుంకుమ లాంటివి ముఖానికి పూసుకొని… నోట్ బుక్కుల అట్టలతో కిరీటాలు చేసుకొని… విల్లు, బాణాలు, గదలు తయారుచేసుకొని వాటిని ధరించి నాన్న పాడిన పాటలను పాడుతూ నాన్నను అనుసరిచేవాడిని. ఇది నా మెదడు బీడులో మొలిసిన మొదటి కళలు-సాహిత్య బీజం.

            అట్లాగే పండుగల సంధర్భంలో ముఖ్యంగా వినాయకచవితి ఊరేగింపుల్లో అందరితో పాటుగా పాల్గొని…

గణ గణ నాథుడవు… గణనాథ

గౌరీ కుమారుడవు… గణనాథ

ఎలుక వాహనుడ… గణనాథ

ఏనుగు దంతం… గణనాథ … లాంటి పాటలు పాడేవాడిని. ఇది కూడా నాలో పాటలు అంటే మక్కువ ఏర్పడేలా చేసింది.

            నేను ప్రాథమిక విద్యను అభ్యసించే సమయంలో మాఇంటికి దగ్గర్లోనే ట్యూషన్ కు వెళ్ళేవాడిని. రాత్రి వేళల్లో అక్కడే పడుకునేవాడిని. నాతోపాటుగా అనేకమంది. మాకు ట్యూషన్ చెప్పే టీచర్ దగ్గరికి ఏ రాత్రో పగలో అతను వస్తూ ఉండేవాడు. కోరమీసం… బలమైన శరీరం… చామన ఛాయ రంగు… మా భుజాలను తడుముతూ “పులులు కావాల్రా తమ్ముడు మేకలు కావొద్దు” అనేవాడు. మమ్మల్ని పులులు అన్నందుకు సంతోశంతో పాటుగా మాలో ఏదో తెలియని ధైర్యం నిండేది. అప్పుడప్పుడు పాటలు పాడేవాడు. ఒకరిద్దరు కోరస్ ఇచ్చేవారు. నేను లోలోపల కోరస్ ఇచ్చేవాడిని. అలా ప్రాథమిక విద్య నుండి హైస్కూల్ విద్యలో అడుగు పెట్టే సమయానికి బహుశా 1984 అనుకుంటాను మా గ్రామానికి దగ్గర్లోని చంద్రగిరి తండాలో అతడిని, కప్పలు పట్టేవాళ్ళుగా మారువేషంలో వచ్చిన పోలీసులు కాల్చి చంపినట్లుగా తెలిసింది. ఆ రోజు రోజంతా మా గ్రామంలో అతని గురించే చర్చ. రాడికల్… నక్సలైట్ అనే పదాలు మొదటిసారి విన్నాను. అతని పేరు హరిభూషణ్ అని తెలుసుకున్నాను. ఆ రోజూ మా ఊరంతా ఏడ్చింది. నేనూ ఏడ్చాను. నాలో అతని పాటల ప్రవాహం…

            అతని తర్వాత మా గ్రామంలోకి రాత్రి వేళల్లో నలుగురైదుగురు చొప్పున వచ్చేవారు. వారిలో ఒకరిద్దరు మహిళలు కూడా ఉండేవారు. వారోతో మాకు తెలిసిన మా ఊరి యువకులూ  కలిసి తిరిగేవారు. ఒకరోజు చీకటి పడ్డాక మూడు బాటలా కాడ మీటింగ్ పెట్టారు. చాలా మండి జనం పోగయ్యారు. వచ్చిన వాళ్ళు…

                              కత్తులు నూరండిరో కమ్మారోళ్ళ ఈరన్న

                             బరిసెలు ఎత్తండిరో బైండ్లోళ్ళ బాలన్న…… అని నాట్యం చేస్తూ పాటలు పాడారు. ఇంకా అనేక పాటలు పాడి ఏవేవో మాట్లాడి వెళ్లారు. రెండు రూపాయలకు జన నాట్యమండలి పాటల పుస్తకాలు అమ్మితే నేను కూడా ఒకటి కొనుక్కున్నాను. అందులోని పాటలు కంఠత పట్టేవాన్ని. ఆ పాటల  ప్రేరణ తోనే మా గ్రామంలోని పెత్తందారీ, రాజకీయ నాయకుడు అనుముల యాకూబ్ రెడ్డి మీద…

                                    అన్నలక్కల పాట వింటే గుండెలదరాలి

                                    దోపిడి దొంగలదరాలి  అనుముల యాకడదరాలి……. అని ఆనాడు నాకున్న అవగాహన మేరకు తోసింది రాశి పాడుకునేవాడిని. అదే సమయంలో మాకు తెలుగు భోదించే ఉపాధ్యాయుడు దేవుడి ప్రస్తావన వచ్చినప్పుడు “ ఎక్కడున్నాడు దేవుడు… చింతాకు చిగురులో ఉన్నాడా? మర్రి తొర్రలో దాగున్నాడా?” అని ఆవేశంగా చెప్పేవాడు. అట్లాగే శ్రీ శ్రీ రాసిన దేశ చరిత్రలు పాఠం భోధిస్తూ “ఏ దేశ చరిత్ర చూసినా  ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం. పరపీడన పరాయణత్వం” అని చెపుతుంటే రోమాలు నిక్కపొడిచేది. వీటిని కంఠస్తం చేసి పాడుకునేవాన్ని. పాడుకున్నప్పుడల్లా ఏదో ఆలోచన… ఆ ఆలోచనలోంచే ఏదో రాయడం…చించేయడం…మళ్ళీ రాయడం… మళ్ళీ చించేయడం… ఇలా పెన్ను పేపర్ రెండింటికి ఎప్పుడు పని పెడుతుండేవాడిని.

            అట్లాగే మొదటినుంచి కూడా నేను మా ఇంట్లో ఎడ్డెo అంటే తెడ్డెo అనేవాన్ని. ఈరోజు పండగ, తొందరగా లేచి స్నానం చేయండి అంటే ఎందుకు చేయాలి అని ఎదురు ప్రశ్న వేసి ఆరోజు స్నానానికి ఎగనామం పెట్టేవాన్ని. దేవుడింట్లోకి చెప్పుల కాళ్లతో వెళ్ళొద్దు అంటే, వెళ్ళి చూసేవాన్ని. దేవుడికి పెట్టిన తర్వాతే నైవేద్యం అందరూ తినాలి అంటే, పొయ్యిమీద ఉండగానే ఎంగిలి చేసేవాడిని. ఇంకా నన్నేమైనా తిట్టినా కొట్టినా దేవుడి ఫోటోలు…త్రిశూలాలు చేదబావిలో వేసేవాన్ని. ఇవన్నీ వేసవిలో నీరు అడుగంటినప్పుడు పూటిక తీసేటప్పుడు నా జ్ఞాపకాలు పురావస్తువులుగా బయటపడేవి. వీటితోపాటుగా మా తెలుగు టీచర్ దేవుడి గురించి చెప్పిన వాక్యాలు అప్పుడప్పుడు గుర్తుకొచ్చేవి. ఆక్రమంలోనే గతంలో వినాయక చవితి ఊరేగింపుల్లో పాడుకున్న పాటలకు పేరడీగా…

                                    ఎరోప్లేన్ ఎక్కరాక… గణనాథ

                                    నువ్వు ఎలుక మీద ఎక్కినావు… గణనాథ 

                                    చాటా చెవ్వులోడ… గణనాథ 

                                    లొట్టా చెంపలోడ… గణనాథ 

                                    ఉండ్రాళ్ళు తిన్నావు… గణనాథ 

                                    గుండ్రాయోలె బలిసావు… గణనాథ  …… అని రాసుకొని పాడుకునేది. అందరూ నన్ను దేవున్ని తిడితే కండ్లు పోతాయి అనేవారు. నిజంగానే కండ్లు పోతే దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను అనేవాన్ని. ఈవిధంగా పేరడీల రూపంలో కూడా సాహిత్య బాట పట్టాను.

             హైస్కూల్ విద్యా అనంతరం సమీపంలోని పట్టణంలో కాలేజీలో ప్రవేశించాక సినిమాలు, షికార్లు, స్నేహాలతో గడిచింది. శివరంజని, సితార, జ్యోతిచిత్ర లాంటి సినిమా పత్రికలు విపరీతంగా చదివేవాడిని. వీటి ప్రేరణతో 1987 మొదలు 94 వరకు సినిమా పాటలు, ప్రేమ కవిత్వం నా తీరని దాహం. ఒకదశలో మిత్రుల సలహా మేరకు నా సినిమా పాటలతో దర్శకుడు దాసరి నారాయణరావుని కలవాలని నిర్ణయించుకున్నాను. సాధ్యం కాలేదు. ఇలా ప్రేమ గాలిలో కొట్టుకుపోయే సమయంలో గుండెల్లో కొండలు పేలిన చప్పుడయ్యింది…

   కొండలు పగిలేసినం

   బండలను పిండినం  

   మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం

   శ్రమ ఎవడిదిరో… సిరి ఎవడిదిరో  …….. రాడికల్ విధ్యార్థుల నృత్య ప్రదర్శన నన్ను ఆవహించింది. నన్ను ఆహ్వానించింది. మళ్ళీ ట్యూషన్ మాస్టారు… హరిభూషణ్…జన నాట్యమండలి పాటలు… నాలో జ్ఞాపకాల ఊటలు. అట్లాగే గ్రామానికి వచ్చినప్పుడల్లా అన్నలు అనే సన్నిహితులెవ్వరో నన్ను పిలుస్తున్నట్లుగా ఉండేది. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా ఎ చిన్న ప్రోగ్రాం జరిగినా “ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా…” అనే పాట వినిపించేది. అదే సమయంలో మా గ్రామంలో హిందీ టీచరుగా పనిచేసిన నర్సింహారెడ్డి అనే ఉపాధ్యాయుడి కూతురు సునీతను ఆమె భర్త దీపావళి పండగ కట్నం విషయంలో గొడవ పెట్టి బావిలోకి నెట్టి చంపేశాడు. ఈ విషయం పేపర్లో చదివి నా మనసు చలించింది. ఆ సంఘటన ప్రేరణగా…

                        చిన్నారి చిరునవ్వుల చెల్లీ

                        విరిసే నవ్వుల నిండు జాబిల్లీ

                        కారుమబ్బులోన కలిశావే… కట్నాల చితిలోన కాలావే

                                                  ***

                        కట్నాలు కానుకలు ఇచ్చావే ..వాని పెంకుటిల్లు మేడ చేశావే

                        పండుగలు పబ్బాలు అన్నాడే… వాడు టీవీలు స్కూటర్లు అడిగాడే

                        తొలుసూరు మలుసూరు అన్నాడే… ప్రతిసారికి కట్నాలు అడిగాడే

                        దీపావళి పండుగ అన్నాడే… నిన్ను దిగుడు బావిలోకి నెట్టాడే

                                                 ***

                        భర్తనే కొన్నా యజమానివే… ఈ బానిస బతుకింక చాలించే

                        చిన్నారీ ఓ చెల్లెల్లారా… చీకటిలో చిరు దివ్వెల్లారా

                        మార్పుకొరకు మీరు పోరాలి… ఆ పోరాటంలో ముందుండాలి   …… అనే పాటను వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా రాసిచాలాచోట్ల పాడాను. మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన నన్ను ఆలోచింప చేసింది. ప్రేమ కవిత్వం రాసుకొని దాసుకొని నాకు నేనే మురిసిపోయేదాని కన్నా సామాజిక సమస్య పట్ల నేను రాసిన పాటకు వచ్చిన స్పందన నన్ను క్రమంగా సమాజం వైపు ఆలోచించేలా చేసింది. ఇక్కడే వ్యక్తి ప్రేమ కన్నా వ్యవస్థ మీది ప్రేమ గొప్పది అనేది నాకు అనుభవంలోకి వచ్చింది. నా కలం “ ప్రేమ” దారితప్పి పూర్తిగా సమాజం వైపు అడుగులేసింది. ఇక వెనుదిరిగి చూడలేదు కూడా.

            క్యాంపస్ లో అడుగు పెట్టాక “ అతడు” పరిచయమయ్యాడు. పరిచయమయ్యాడు అనడం కన్నా నన్ను పరిచయం చేసుకున్నాడు అనడం సబబుగా ఉంటుంది. నా లోలోపలికి తొంగి చూశాడు. రాసుకుంటూ… దాసుకుంటూ ఎవరికీ చూపెట్టకుండా మొహమాటపు ముడి వేసుకుంటున్న నన్ను ముడివిప్పేలా చేశాడు. సలహాలు, సూచనలు చెప్పాడు… చెప్పించాడు. విధ్యార్థులుగా చర్చలు… ప్రయాణాలు… ఉద్యమాలు… నిద్రలేమిలు… కలుసుకోవడాలు… విడిపోవడాలు… అరెస్టులు… చిత్రహింసలు… జైళ్ళు… బెయిల్ లు… కడకు…

దారిలో జారిపడ్డాను

తప్పుకోలేదు

జారిపడ్డవాడు

వొడుపుగా అడుగుల్నిఅతుక్కొని

తిరిగి ప్రయాణిస్తాడు…

తఃప్పుకున్నవాడు

దూరంగా

చెత్తకుప్పల్లోకి విసిరేయబడతాడు…

నేను జారిపడ్డాను… తేరుకొని నిటారుగా నిలబడి 96 లో రవీందర్ సార్ కన్వీనర్ గా ఉన్న కాలంలో “విరసం”లో అడుగుపెట్టాను. విరసంలో చేరాకే కవిత్వమంటే ఏంటో తెలుసుకోగలిగాను. ప్రజల వైపు నిలబడి నిబద్దతతో రాయగలిగాను. ఆ సమయంలో క్రమం తప్పకుండా యూనిట్ మీట్ లు జరిగేవి. భాధ్యతగా భావించి అందరం హాజరయ్యేవాళ్లం. రచనలపై చర్చ తెవ్రంగా వేడివేడిగా జరిగేది. రాసుకున్న పది కాగితాల్లో ఒకటి అరా మాత్రమే మిగిలేవి. మా మీట్ ను కొలిమి అని పిలుసుకునేవాళ్లం. ఆ కొలిమిలో సాన పెట్టుకున్న వాళ్ళం గనుకనే ఈ మాత్రం రాయగలుగుతున్నాను. అలలు… పూలు రాలిన చోట… గద్దొచ్చే కోడిపిల్ల పేర్లతో మూడు కవితా సంకలనాలు వెలువరించాను. విరసం నాకు అనేక అవకాశాలు ఇచ్చింది. అందిపుచ్చుకోవడంలో నేనే వెనుకపడ్డాను.

            అతడిప్పుడు లేడు. అతని అమరత్వం చూపిన మార్గం మాత్రం ఉంది. అతని జ్ఞాపకాలు నా మది గది నిండా పర్చుకున్నాయి. ఆ జ్ఞాపకాలే అతని గురించి నన్నిలా రాయించగలిగాయి.

అతడు సూర్యుడే

ఓరోజు

నా అద్దె గది ఆకాశంలో

వెన్నెలై కురుస్తున్నప్పుడు

శత్రువు

తూర్పు ద్వారం తడుతూ మొరిగాడు

అతడు

పడమటి ద్వారం గుండా జారుకున్నాడు

అతడు

ఒక్కోరోజు

వేకువ చేతులతో

నా కనురెప్పల తలుపులు తెరిచేవాడు

          స్వయంగా నేను కవిని కాదు. కవి కావాలని కలగనలేదు. కవి పండితుల కుటుంబంలో పుట్టలేదు. కాలం సుత్తెతో కొట్టిన దెబ్బకు కవిగా మారాను. పరిస్థితులు నన్ను ప్రజల వైపు నిలపెట్టాయి. అతడు కాల పరిస్థితులను నా మెదట్లో వెలిగించాడు. ఆ వెలుగులోనే  నా కవిత్వం నడుస్తోంది.

          2017 జనవరి “పూలు రాలిన చోట” సంకలనం తర్వాత సుమారుగా 40 కవితలకు పైగా రాశాను. పరిస్థితులు నన్ను రాసేలా చేశాయి. కరోనా కట్టడికి తగిన నివారణ చర్యలు తీసుకోకుండా చప్పట్లు… దీపాలు వెలిగించాలని మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇలాంటి ప్రజల మనసుల్ని మరల్చి… ప్రజల్ని ఇంకా మూఢత్వంలోకి నెట్టేసే చర్యలను నిరసిస్తూ “ఇగ పెట్టాల్సిన దీపమొక్కటే” అనే పేరుతో కవిత రాశాను.

 అందులో …

మేము దీపాలు వెలిగిస్తూనే ఉన్నాం

దీపాలను

దీపాలైన మనుషులను

నువ్వే ఆర్పేస్తున్నావు

ప్రాణదీపాలు ఆర్పుతూ

నూనె దీపాలు వెలిగించే ఆట బాగుంది

గోద్రా మొదలు

కాశ్మీర్ మీదుగా ఢిల్లీ దాకా

నీకు మనుషుల్లోని రోగులకన్నా

రోగుల్లోని మతం ముఖ్యం కదా

శభాష్

రేపు మరిన్ని దీపాలు ఆర్పడానికి

నీ ముందస్తు ప్రణాళిక బాగుంది

మై డియర్ పాలకా

మేము దీపాలు పెడుతూనే ఉన్నాం

నువ్వే ఆర్పేస్తున్నావ్

ఇగ మేము

నీ తలాపున పెట్టాల్సిన దీపమొక్కటే మిగిలింది …… అని రాశాను.

          రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గత సంవత్సర కాలానికి పైగా  ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా కార్పోరేట్ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని కారు చౌకగా అమ్మే రేటు నిర్ణయించే పనిలో మునిగిపోయింది. అందుకే …..

బువ్వకుండలో చల్లుతున్న

కార్పోరేట్ విష గుళికల మెలికల పాముల్ని

కాడెద్దు గిట్టల తొక్కిడిలో

నలిపెసే ప్రయత్నమొకటి జరుగుతుంది…

చెలకల్లో మొలుస్తున్న

పాలక పాపాముల పుట్టల్ని

నాగటెడ్లు ఇరువాలు దున్నాల్సిందే……. అని దోపిడీ పాలకవర్గాల అంతమే అంతిమ పరిష్కారంగా చెప్పాను.

          కవిత్వం కవిత్వంగా ఉన్నంత వరకు ఏ ఇబ్బందీ లేదు. కానీ  ఆ కవిత్వం ప్రజా కవిత్వం అని చెప్పుకున్నప్పుడు తప్పకుండా సరళత్వం…సూటిదనం…వాడుక భాషలో రాస్తే బాగుంటుంది. కవిత్వం పలుచబడుతుంది. చిక్కబడాలి అనేవారూ ఉన్నారు. చిక్కబడడం తప్పుకాదు కానీ, ఆ ముసుగులో చక్కగా అర్థం కాకుండా రాయడం సరికాదు.

          అట్లాగే, ప్రజా సాహిత్యం  ఏదైనా సమస్యను ఎత్తి చూపడం వరకే పరిమితం కాకూడదు. పరిష్కారం చూపించాలి. స్కానింగ్ సెంటర్ కి వెళితే రోగ నిర్థారణ మాత్రమే జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళితే రోగ నిర్థారణ ఆధారంగా పరిష్కారం దొరుకుతుంది. అట్లాగే ప్రజా సాహిత్యం ముఖ్యంగా విప్లవ సాహిత్యం అనేది స్కానింగ్ సెంటర్ వద్దే ఆగి పోకూడదు. డాక్టర్ వద్దకూ వెళ్లగలగాలి.

          చివరగా…

          అతడు, అతని లాంటి మిత్రులు వెలిగించిన దారిలో నడుస్తూ… మనువాద బ్రాహ్మణీయ కార్పోరేట్ శక్తుల చీకటి పాలన నుండి విముక్తి కోసం నిన్నటి ఆంధ్ర-తెలంగాణా నల్లమల ఆకాశానికి ఆహ్వానం పలుకుతున్నాను. అందుకే…

సూర్యుడు చుక్కలు

పల్లె ఇల్లొదిలిపెట్టి

ఊరి పొలిమెరలు దాటినప్పటి నుండి

ఖద్దరు చొక్కా నిద్రలేసిన పులై గాండ్రిస్తోంది

అధికారం ఏనుగుపాదం జనంగళం మీద కాలేసి నిల్చుంది

చీకటికి వెలుగు భయం లేకుండా పోయింది

రాత్రికి తూర్పు చురక అంటకుండా పోయింది

అందుకే మా ఊరికో సూర్యుడు కావాలి మా పల్లెలో కొన్ని చుక్కలు పొడవాలి

….. అని ఆహ్వానిస్తూ నాగేశ్వర్

                         ఆగష్టు31, 2021

Leave a Reply