కార్పొరేటమ్మా – రాజకుమారుడు.

భరించలేని వాస్తవాలు , ఒక్కోసారి తిరగేసి చెప్తూనే తప్ప సంతృప్తినివ్వనంత , వొత్తడికి గురిచేస్తాయి. నడుస్తున్న చరిత్ర  తలకిందులతనాన్ని  భరించడమెలాగో  తెలియనప్పుడు  మనం తలకిందులుగా  నడవడమే  ఏకైక మార్గంగా అనిపిస్తుంది. అప్పుడు కార్పొరేటమ్మా – రాజకూమారుడు లాంటి  అధివాస్తవిక కథలే  వస్తాయి.

అధివాస్తవికత , వ్యంగం , వాస్తవికత మూడూ ఒకే కథలో  కథనమై కన్పిస్తాయి. ఆ  కలగాపులగపు  కథనం , యేది వాస్తవమో , యేది అధివాస్తవమో తేల్చుకోమని  పాఠకులకు  సవాళ్ విసురుతుంది.

ఒక కథ   మొత్తం కథనం  ఒక రకమైన  ధోరిణిలో నడవడానికి , చదవడానికీ అలవాటు పడ్డాం కదా  , కార్పొరేటమ్మా – రాజకుమారుడూ , మూడు భాగాల కథ , మూడు (యేదో మేరకు) భిన్న కథనాలుగా , భిన్న దృశ్యాలుగా నిర్మాణమై వుంది. అయితే మూడింటినీ అనుసంధానం చేసే , కథ చెప్పేవాడైతే  ఒకడే. మొదటి భాగం లో  కథ చెప్పే జర్నలిస్టు , జైల్లో  రాజవైభోగాల మధ్యా  నిర్బంధం లో వున్న  , ఒక రాజకుమారుడు లాంటి  యువరాజకీయ్యున్ని  ముఖాముఖి  చేయడం .అతను తన  అవినీతి ఆధిపత్యమయమైన తాత తండ్రుల వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం. ఆ యువరాజకీయ్యుడెవడో  చదువుతున్నప్పుడే మనకర్థమై పోతుంది. వాళ్లు  తవ్వుకున్న  గనులసామ్రాజ్రం యెంత విశాలమైందో , యెంత సంపద పోగేసిందో కూడా , తెలిసిపోతుంది.ఈ భాగంలో వాస్తవమే వున్నా , విషయాన్ని రాజకుమారుడితోనే చెప్పించడంలో  వ్యంగ్యం ప్రధానంగా వుంది.

రెండో భాగం ,   అధివాస్తవిక కథనం. నీళ్లు లేని ఒకానొక రాయలసీమ మాలపేటలో  , నీళ్ల కోసం పాత బావిని తవ్వడంలో  , దిగుడు బావిలోపల    కార్పొరేటమ్మ  బయల్పడుతుంది. గునపం తగిలి రక్తాన్ని స్రవిస్తుండగా  , కోపంతో  , గద్దిస్తూ  , తనకు తన పుట్నిళ్లైన సముద్రానికి పడమటదిక్కు  గుడికట్టమంటుంది. దినానికి అర్ధనూట పదహార్ల ఎకరాల భూమిని నైవేద్యంగా పెట్టమంటుంది . అట్లా చేయకుంటే , దినానికి ఒక వూరిని బూడిద చేస్తానంటుంది. జనాలూ , అధికార యంత్రాంగం  మేలుకునేలోపు   , అన్నంతపని ( జనాల్ని వున్నదున్నట్టు   నీలుక్కొని చచ్చేలా ) చేసేస్తుంటుంది.జనాలకు యేమి చేయాలో అర్థం కాని స్థితిలో  వుండగా ,  రెండో భాగం అంతమవుతుంది. మూడోభాగం కథనం లో  పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ సదస్సు ఒక మహానగరంలో  జరుగుతుంటుంది.  దానిలోని విశేషాల కథనం , వాస్తవిక పద్ధతిలో చెప్తాడు  కథకుడు. ఈ సదస్సు నిర్వహించేదెవరంటే , కార్పొరేట్ సంస్థలే , వాటి తైనాతీ స్వచ్ఛంద సంస్థలే. అదీ మన అధికార యంత్రాంగపు  వత్తాసుతోనే. ఈ తంతును ఎదిరిస్తుంది ఒక ప్రజావుద్యమం . ఆ ప్రజా ప్రతిఘటన ముందు కథను ముగిస్తాడు కథకుడు.

మూడూ  , మూడు  వేర్వేరు దృశ్యాలను , చిత్రకళలో వుండే , కొల్లాజ్ అనే  టెక్నిక్  అనిపించే విధంగా మలిచబడిందీ కథ. ఫ్యూడల్  అవశేషాల ,ఆధిపత్య  వర్గాల , రాజకీయ నాయకుల వారసత్వం అధికారం కోసం యెంతగా అర్రులు చాస్తుందో , చెప్పే క్రమంలో , వనరుల విధ్వంసాన్ని సంకేతించిన మొదటి భాగం , పాశ్చాత్య కార్పోరేటీకరణ యీ నేల మూలుగులను పీల్చేస్తోందనే రెండో భాగాన్ని అందుకుంటుంది.ఇక మూడో భాగం ప్రజాప్రతిఘటన. అసంబధ్ధతను అల్లుకొని  , వర్తమాన రాజకీయ ఆర్థిక  పరిణామాలను

గుదిగుచ్చిన  కథగా నిలబడిందిది.దీని రచయిత  పాణి.

(కార్పొరేటమ్మా – రాజకుమారుడు కథను పాఠకులు ఇక్కడ చదువుకోగలరు)

Leave a Reply