భర్త చనిపోయిన దశలో పూర్తిగా నిరాశామయ  వాతావరణంలో నుంచి బయటపడి , నూతనోత్సాహంతో జీవితాన్ని పునః ప్రారంభించిన ఒక సాధారణ మనిషిలోని చైతన్యమే ఈ కథ. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక  2015 సెప్టెంబర్ సంచికలో ఈ కథ ప్రచురితమైంది.

ఊర్లో అతడి పేరు చిలకాయన. తిరుపతిలో పేరు మునీంద్ర. ఊర్లో వాళ్లతో అతడికి ఎలాంటి అనుబంధం ఉన్నట్లు కనిపించదు. ఇస్త్రీనలగని తెల్ల బట్టలతో నిద్ర లేచి లేవంగానే తయారై తిరుపతి టౌన్ క్లబ్  కి వెళ్ళి పోతాడు. ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒంటి మీద గుడ్డలు నలగకుండా చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ తో తిరిగి ఊర్లోకి వస్తాడు. మడత నలగని అతని బట్టలు చూసి అతడి ఠీవిని చూసి, వీధిలో ఎవరైనా అడ్డుతొలగాల్పిందే. బస్సులో ఎవరైనా లేచి నుంచుని అతడికి సీట్ ఇవ్వాల్సిందే.

అతడి భార్య కూడా అంతే. ఊర్లో ఎవరితో మాట్లాడదు. ఆమె ఇల్లేమో ఆమె ఏమో  అంతే. ఆమె‌ పేరు సుమతి అంటే ఊర్లో ఎవరికీ తెలియదు. తాటాకు చేప అంటారు ఆమెని.

ఆ ఊర్లో మునీంద్ర అంటే ఎవరికీ తెలియదు, సుమతి  అంటే ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరినీ  ఊర్లో వాళ్లు పిలుచుకునేది మాత్రం చిలకాయన, తాటాకు చేపామె..అనే! ఆమె చాలా బక్కగా ఉంటుంది. పెళ్లయిన చాలా కాలం తర్వాత అసలు పిల్లలు పుట్టరు అని ఊర్లో వాళ్లు అందరూ నిర్ణయించుకున్న తర్వాత, వాళ్లకు పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత ఒక పిల్లవాడు పుడతాడు. ఇప్పుడు వాడు ఊర్లోనే ప్రభుత్వ పాఠశాలలో ఏడో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లవాడు కూడా అంతే సిగ్గు సిగ్గుగా దోవన పడి పోతుంటాడు. వాళ్లు ముగ్గురూ అంతే ఊర్లో ఎవరితో మాట్లాడరు, ఎవరితో కలవరు.వీళ్లు ఏం తిని ఎట్లా బతుకుతారు? వీళ్ళ భవిష్యత్తు ఏమిటి ఎలా ఉండబోతుంది అనేది ఊర్లో వాళ్లకు అది పెద్ద ప్రశ్న. అలాంటి పరిస్థితిలో ఉన్నట్లుండి గుండెపొటు కారణంగా అతడు తిరుపతిలో  మరణిస్తాడు. తిరుపతి నుండి ఇన్నోవా కారులో అతడి మృతదేహం ఊరికి వస్తుంది. 

అక్కడి నుండి నామిని చిత్రించిన కథాప్రపంచం… ఇలా మొదలవుతుంది.

*

ప్రతిరోజు చక్కగా తయారై ఇస్త్రీనలగని బట్టల తో తిరుపతి టౌన్ క్లబ్ కు వెళ్లి వస్తుంటాడు అతడు. అక్కడ అతడు ఏం పని చేస్తాడో, అంతమంది ఆత్మీయులను ఎలా సంపాదించుకున్నాడో తెలియదు.హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి అక్కడే చనిపోతాడు. ఆ టౌన్ క్లబ్  కు చెందిన తిరుపతి వాళ్ళు అతడిని ఇన్నోవా కారులో వాళ్ళ ఊరికి తీసుకు వస్తారు

మునీంద్రా వాళ్ళ ఇల్లు ఎక్కడ పెద్దాయన అని అడుగుతారు  తిరుపతి వాళ్ళు.

ఆయనకు మునీంద్ర అంటే ఎవరో గుర్తుకు రాదు.తల గోక్కుంటాడు. ఆయనకు తెలియదు గానీ ఆయన కూతురు జవాబు చెబుతుంది.పుత్తూరులో ఇంజనీరింగ్ చదువుతున్న  రజని అప్పుడు చెబుతుంది..  మునీంద్రా అంటే సుమతి అక్క వాళ్ళ భర్త కదా అని. అప్పుడు కూడా ఆ పెద్దాయనకు సుమతి అంటే ఎవరో తెలియదు. సుమతక్క ఎవరమ్మా మన ఊర్లో అని అడుగుతాడు కూతురిని. “సుమతక్క అంటే ఊళ్ళో అందరూ తాటాకు చేప అనంటారే ఆ అక్క” జవాబుగా  చెబుతుంది రజని.

ఆ చిలకాయన శవాన్ని దించి పెడదామంటే ఆ రేకుల ఇంట్లో బెంచీ కూడా వుండదు.నిముషాల్లో  ఊర్లో వాళ్ళు ఎవరో బెంచి తెచ్చి రేకుల ఇంటి ముందు ఉండే పందిట్లో వాల్చి పీనుగని  పండబెడతారు.

*

కథ..

చిలకాయన మంచి నిద్రలో వుండినట్టుండాడు గాని చచ్చినోడున్నట్టు యూడుండాడు! ఆయన గద్దొచ్చి ఆయన్ను తన్నక పొయ్యేటట్టుగా యెల్లాలకల పడుండాడు. కేళీవిలాసంతో, ఎంత నాణ్ణిగోడు చిలకాయన! తిరుప్తిలో సావాసకోవులకు మునీంద్ర గాని వూళ్లోవోళ్లకు చిలకోడు గదా. మనిసి నున్నంగా గడ్డం గీస్కోనుండాడు. తలకు రంగేసి పది పదైద్దినాలు గూడా అయినట్టు లేదు. తలెంటికలు గానీ, కోడికత్తుల మాదిరిగా వుండే మీసాలు గానీ సవాలేసి మాట్లాడుకున్నట్టుండాయి. చిలకాయనేమన్నా ముసిలోడా, మొన్నమొన్నటోడే గదా. యాబై యాబై అయిదు గూడా వుండవు. 

ఇన్నోవా కార్లో వొచ్చిన తిరష్తోళ్లు పీనిగిని బెంచీ మీంద ఎంటేసేసి ‘మా పనింకై పొయ్యిందనేసి’ బుర్రమంటా కారెక్కి తిరప్తికి పూడవలేదు. వొకందాన వాళ్లే మేలు. మాటిమాటికీ యీదిలో నుంచి పందిట్లోకొచ్చి, చిలకాయన కాళ్లకాడ నిలబడుకోని వాళ్లల్లో వాళ్లే ముఖానికడ్డంగా చేతి గుడ్డలడ్డం బెట్టుకోని ఎగదీసుకుంటుండారు. వాళ్ల సావాసం అట్లాంటి దేమో!మొదటసలికి చిలకాయన ఊళ్ళో ఉండిందెప్పుడు?  నిద్దర పడక లెయ్యంగానే, అది వాన గానీ వొంగుడుగానీ తెల్లంగా పంచ అదీ ఎనిమిది మూర పంచ గట్టుకొని దాని మీదికి పక్క జేబీలుండే  జుబ్బా వేసుకుని   చేతులు గించుకుంటా తిరప్తకి ‌పయానమైపోతాడు. అదే మాదిర్తో నూరు అరుగానీ, ఆరు నూరుగానీ రేత్రి ఎనిమిదిన్నరా తొమ్మిదిన్నరకంతా వొంటి మింద గుడ్డలు అట్ట నలక్కుండా చేతిలో ఏదో వొక ప్లాస్టీకు కవరుతో  ఊర్లోకొచ్చేస్తాడు. అది పూరంటక పోతున్నా స్సరే యింట్లేకి పొయ్ నాయన  మళ్ల ఈదిలోకి గూడా తొలగి చూడడు. 

 పెండ్లయిన కొత్త కొత్తల్లో వొక ఇస్త్రీ  పెట్టి – మంచి ఇనపది – కొనక్కొచ్చి యింట్లో పెట్టేసినాడంట. దాన్ని వురంతా అప్పట్లో వొక కతగా చెప్పుకున్నారు గూడా.

 చిలకోడి గొంతన్నా చిన్నప్పుడెప్పుడో వూళ్లో‌వాళ్లు యిన్నారేమో గానీ ఆయన పెళ్లాం కూత యిన్నోళ్లు ఆది ఆడగానీ, మగగానీ లేరు.

. చిలకోడు ఏమి తెచ్చిస్తాడో, ఆడ  మనిసి ఏమి కాంచి కొడుక్కంత పోసి, ఆమె గొంతులో పోసుకుంటాడో దేముడికి తెలవాల, కొంతమంది చెప్పుకునేది ఏమంటే, యీ యిరైయ్యేండ్లల్లో మూటలు మూటలుగా యిస్ట్రీ పెట్టి, బొగ్గులకే నది వేలు చలవ జేసుంటారని, తిరస్తిలో యింతమంది యిన్ని రకాలుగా తిరగతానే వుంటారు. గదా: యాడగానీ చిలకాయన్ని చూసినోళ్లు గూడా లేదు. .టవును క్లబ్బులో పెద్దపెద్దోళ్లతో సావాసమని అంటారు. కొందరు చెప్పేదేమంటే క్లబ్బులో చీట్లపేకాట ఆడేవాళ్లకు కోర్టర్లు కోర్టర్లుగా మొందు బాటళ్లు తెచ్చిస్తా పడతా వుంటాడని గూడా. అయితే అది జవాను జేసే పని. ఒక జవాను అంత వొగలైన గుడ్డలు కడతాడా!  ఇంకొకటి ఏమిటంటే ఈ రోజు కట్టిన పంచ రేపు పట్టడంకంటే రోజు కట్టిన పంచ రేవు కట్టడనీ యీ రోజేసిన జుబ్బా మరసట్రోజు యెయ్యదనీ! అయినా యింట్లో వోళ్ల కథ చెప్పేడానికి వెళ్లిపురే గానీ నోరు తెరిచి మాట్లాడితే, వాళ్లల్లో వుండే సూక్షాన్ని చెప్పచ్చు. ఈడ అది లేకనే అగోరిడ్చాల్సొస్తా వుండాలి. ఒకటి మాత్రం నిజ్జం. కొత్త కరుకు మాయకుండా గుడ్డలేస్కోని అమ్మంగా తిరిగినాడే గానీ రూక చేతిలో అడేది నిజమే అయితే కయ్య అమ్మిన డబ్బు వడ్డీల మింద తిరిగేది నిజమే అయితే పెళ్లం తాటాకు చేసామె. యీ పొద్దనంగా ఆమె పేరు సుమతి అని గూడా కొత్తగా రజనీ చెప్పంగా యినబడింది – ఆరో ఆ తాటాకు దాని చెవల్లో గానీ ముక్కలల్లో గానీ గురుగింజంత బంగారం వుండుండాల గదామ్మరి.

*

వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ లేదా వాస్తవమే, వాస్తవ జీవితమే కథావస్తువుగా కలిగిన కథ కాబట్టి, ఈ కథలో ఎలాంటి అతిశయాలు ఆడంబరాలు ఊహలు కల్పితాలు భ్రమలు లేవు. మునీంద్రా వాళ్ళ అత్త- ఎల్ఐసి చేసాడా లేదా పది లక్షల రూపాయల కన్నా ఎల్ఐసి చేసి చచ్చాడా లేదా అని బాధపడుతూ  శవయాత్ర వెంబడి గుండెలు బాదుకుంటూ ఎల్ఐసి గురించి మాట్లాడుతుంది. అరుస్తుంది ఏడుస్తుంది.

తిరుపతి నుండి వచ్చిన పెద్ద మనుషులు పెద్ద మనసుతో ధారాళంగా శవయాత్ర తతంగం, ఆ తర్వాత దినకర్మలు  అన్నీ దగ్గర ఉండి ధారాళంగా జరిపిస్తారు ఖర్చులకు వెనకాడరు. కనీసం వెయ్యి మందికి తిరుపతి నుండి  మాంసాహార భోజనం తెప్పించి వడ్డిస్తారు.

చావు తదంగంలో ఆమె ఎక్కడా ఏడ్వక పోవడం ఊరందరికీ వింత. ఆమె ఎట్లా ఏడుస్తుందా అని కుతూహల పడిపోతారు ఊరి వాళ్ళు.కానీ ఆమె ఎంతకూ ఏడ్వదు.

*

ఊర్లో ఆడపిల్లలకు మూడో తరగతి నుంచి కాలేజీ చదువులు చదివే వాళ్ళకి‌ ఉదయాన్నే తల దువ్వి జడలు వేసి పంపే ఆమె అంటే ఆ వూరి ఆడపిల్లలందరికీ చాలా ఇష్టం.అందుకే ఆడపిల్లలందరి సపోర్టు ఆమెకు ఉంటుంది.

40 -45 ఏళ్ల ప్రాయంలో ఒక ఆడ మనిషి నుంచి తాళి  తెంపతా వుంటే చూద్దామని పది గంటల సమయంలో వస్తే పొద్దు పోక ముందే ఆమె తాళి తెంపేసి ఉంటుంది. ఆమె అంతట ఆమె పసుపు కుంకాలు తుడుపుకునేసి ఉంటుంది.

శవం మీద పడి ఆమె ఏడుస్తుందని అందరూ అనుకుంటారు ఏవిధంగా ఏడుస్తుందో అని ఊహించుకుంటారు, కానీ ఆమె అలా చేయదు, ఏడవదు. వాళ్ళ అమ్మ అయినా ఏడుస్తుంది- అదీ అల్లుడు ఇన్సూరెన్స్ కట్టినాడా లేదా అనే ఆదుర్దా అత్తది.

ఆమెను బలవంతంగా పాడి మిందకు తోస్తే మొగుడికళ్లా కడచూపు కూడా చూడకుండా కండ్లకు అడ్డంగా చేతులు పెట్టేసుకుంటుంది. పాడె వెనుక కదలదు.

*

కథలో జీవితం…

 బోడింబాయి నుంచి తాటాకు చేపామె అందమ్ముడూ అమ్మా గూడా వాచ్చేసినారు. బోడింబాయి నుంచి వొచ్చిన ఆయమ్మ గూడా సరైనదే. వొచ్చీ రాంగానే, పీనిగ మింద బడి, “నా కూతుర్ని కిల్లా ముంచేసి పోతుండావా చిలకాయనా? నా అల్లుడా. ఇంటికీ తిరప్తికీ తెల్లంగా గుడ్డలేస్కోని తిరగతా వుంటివే, ఎల్లంచీ ఏమాత్రం కట్టినావు నాయినా? పెళ్లానికి చెప్పినావా! వది లచ్చిల కన్నా కట్టినావా?” అని చిలకాయన్ని పూగించి. వూగించి అడగతా వుంటే కడుపుమంట పొయ్ నవ్వు వొస్తుందా రాదా! ఆ తల్లి తాటాకామె కొడుకునైనా తండ్రి దగ్గరికి తొడకొచ్చి పీనిగి మింద పడెయ్యలా, వూళ్లో అమ్మలక్కలు చుట్టూ పక్క వూళ్లల్లో వాళ్లూ తిరప్తోళ్లూ  నవ్వుకుంటారనిజెప్పి- తాటాకు చేపది గొంతు కుచ్చోనుంటే జవురుకోనొచ్చి పాడి మిందికి తోస్తే మొగుడి కల్లా కడచూపు గూడా చూడకుండా కండ్లకడ్డంగా చేతులు పెట్టుకునేసింది. మామూలుగా అయితే బొరోమని ఏడస్తా యీది దాటుకునే దాకా పెళ్లామైంది పాడెనకాన్నే వొస్తాది పడతా లేస్తా. తాటాకామె యించి కదల్లా. కొడుక్కి తలగొరివి పెట్టక తప్పదు గాబట్టి కొడుకును మాత్రం కావిలించుకోని వోడి నొష్టన ముద్దుబెట్టి ‘తలగొరివి పెట్టేసి బయపడకుండా యింటికొచ్చి నన్ను చేరుకో కొడకా!’ అంటా ఏమో పాడెనకాన సాగనంపినట్టుంది. చిలకాయన అత్త మాత్రం ‘ఎల్లంచి ఎంత కట్టినావు నా యల్లుడా!’ అంటా వూరి గెమిని దాటేదాకా పాడెనకాన బడి ఏడస్తా వొస్తా వుంటే వూళ్లో ఆడా మగా అందరూ కసిరి పారేసినారు, “ఎల్లయిసీ వోళ్లు పది లచ్చిల రూపాయల చెక్కెత్తుకోని నీ కూతురికీ నీకూ యిచ్చేదానికి తిరుప్తిలో ఎలబారి కార్లో వస్తుండార్లే పదపద” అంటా. చావుకొచ్చిన తాటాకామె అందమ్ముడేమో చావుకర్చు నేను పెట్టుకుంటానంటే తిరప్లోళ్లు మూతిమింద కొట్టినారంట. తిరప్తిలో చిలకాయనకింత మతింపుండదని వూళ్లో ఎవురికీ తెల్దు. గుంతలో పెట్టి పూడ్చేదాకా తిరప్తోళ్లెవురు గానీ కార్లెక్కలేదు. ఇంకా చిలకా అన్న దినానికి కూడా అన్ని కార్లు అన్ని బండ్లు వచ్చినాయి. తాటాకామె ఏమి గాడిపొయ్యి తొవ్వి దినం కూడొండలేదు.

*

కొంతమంది ఆడవాళ్ళు భర్త మరణం తర్వాత పూర్తిగా మారిపోతారు వాళ్ళ లో ఉండే శక్తి చైతన్యం హరించుకుపోతాయి.భర్త మరణం తర్వాత వాళ్ల చైతన్యం ఆవిరైపోతుంది. చాలామంది ఏమి చేతకాని వాళ్లు లాగ మిగిలిపోతారు. వాళ్ళ చూపు మందగిస్తుంది. వినికిడి శక్తి తగ్గిపోతుంది, వాళ్లలో చెప్పలేని అసంతృప్తి అనాసక్తి ఏర్పడుతుంది.

ఇందుకు భిన్నంగా కొందరు  భర్త మరణం తర్వాత మేల్కొంటారు. జడత్వం వదిలించుకుంటారు.వాళ్ల

చూపులో మాటలో స్పష్టత వస్తుంది. వినికిడి శక్తి బాగా పెరుగుతుంది.ఉన్నట్టుండి వాళ్లకు నూతనోత్తేజం కొత్త శక్తి వస్తాయి. కొత్తగా రెక్కలు వస్తాయి. ఆలోచనా శక్తి చైతన్య స్థాయి పెరుగుతుంది. కనపడని సంకెళ్ళు విడిపోతాయి.

భర్త మరణానికి ముందు భర్త మరణం తర్వాత వాళ్లు స్పష్టంగా మారిపోతారు. వాళ్ల ప్రవర్తన లో వాళ్ళ ఆలోచనా తీరులో వాళ్ళ మాట సరళిలో, వాళ్ళ జీవిత విధానంలో స్పష్టమైన మార్పు కనబడుతుంది. ఈ మార్పు వాళ్లను ఎటువైపు తీసుకువెళుతుంది వాళ్ళ జీవితాలు ఏ విధంగా మార్పుకు లోనవుతాయి అనేది కాలం నిర్ణయిస్తుంది.

కొందరు కాల ప్రవాహంలో కొట్టుకు పోతారు. కొందరే కాలానికి ఎదురు నిలుస్తారు. కొందరిలో జీవితోత్సాహం కొరవడుతుంది. ఆ కొందరిలో జీవితోత్సాహం కొత్తగా పుట్టుకు వస్తుంది.

ఈ కథలో కూడా ఆమెలో మార్పు స్పష్టంగా వస్తుంది. 

భర్త మరణించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివే తన కొడుకుని అక్కడ బడి మాన్పించి, తనతో పాటు రోజు తిరుపతికి తీసుకువెళుతుంది. అక్కడ ప్రైవేటు పాఠశాలలో ఆ పిల్లవాడిని ఎనిమిదో తరగతి లో ఇంగ్లీష్ మీడియం లో చేరుస్తుంది. ఆమె భర్త లాగే ఆమె కూడా ఉదయాన్నే వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంది. ఊరందరికీ నోట్లో మాట రాదు. ఒక విచిత్రాన్ని చూసినట్టు ఆమెను చూస్తూ ఉండిపోతారు.

బైరాగి పట్టెడ దగ్గర ఆర్చ్ వద్ద నెలకు మూడు వేల రూపాయల బాడుగతో ఒక రూము తీసుకుని దాంట్లో మూడు పూటలా ఒక హోటల్ నడపాలని ఉన్నట్టు తెలుస్తోంది.. ఊర్లో వాళ్లకి.

*

ఈ కథ ముగింపు చూడండి ..

ఇది కథలో మాత్రమే ముగింపు కానీ ,

ఒక కొత్త జీవితానికి ఇది ప్రారంభం.

కథా ముగింపు… జీవితం.. పునఃప్రారంభం..

మళ్లొక దినం తిరప్తికి పొయ్ సన్నజాజి పట్టీలమ్మే సరళా గుండా యింగొక మాట యినకడయ్యింది: ‘చిలకాయన గుంత మింద యింగా గెరిక మొలిచిందో లేదో గానీ తాటాకక్క మాత్రం బాగ చిగిరించేసింది. నా తాగుబోతు | మొగుడు గూడా ఎగిరిపడి చస్తే నేం గూడా తాటాకక్క మాది మేలుపడిపోతా’, అంటే వోటలు జమ్మంగా జరుగుతుందన్న మాట. అట్టయితే తిరుప్తిలోనే వొక రేకులిల్లు దీస్కోని కాపరం పెట్టి కొడుకుని ఆడనే చదివించుకోవచ్చు గదా. ఈ రావాటం పోవాటం ఏంది అనే మాటొగటి అడ్డం పడుతుంది. తిరుప్తిలో జలం మలం వొగిటి. ఆ నాశినంలో నేనుండలేను. నా మొగుడు దినమూ యిల్లు జేరలేదా! నేనూ అంతే. నా యింట్లో నా మొగుడు దొల్లిన మంచం మింద తప్ప నాకు మరొక తావన కంటిమింద రెప్ప పడదూ అని తాటాకామె మనసులో వుండొచ్చునో ఏమి కరమ్మో ఎవురికి దెలుసూ!

ఈ పొద్దే, అగో యిప్పుడే, యీ మద్దెనం పూటే రజిని, సిద్దార్తాలో ఇంజనీరు కోర్సు చదివే రజినీనే, తిరప్తి నుంచి స్కూటీలో వొచ్చి దిగీ దిగంగానే, యింట్లోకొస్తా వొస్తా వాళ్ల సుమతక్క సెల్లుకు ఫోను జేసి, “అకా, పది గెంటలకాడ స్కూటీలో హోటలు కాడికి వొచ్చినానక్కా, | నువ్వు మసీదు కాడికి గెటక్కాళ్లు తెచ్చే దానికి మటను మార్కెట్టుకు పొయ్నావంట గదా. అకా, కేక కా, కేక! నిజ్జంగా కేకే! ఆర్టిస్టు చేత హోర్డింగు బలే రాయించినావకా! హోటలుకు బలే పేరు పెట్టినావు సుమతక్కా – మునీంద్రా ఫుడ్ కోర్టు!” అని మాట్లాడిన మాటలు అచ్చులు పచ్చుల్తో సఖా వూరికంతా నకడయినాయి.

*

ఆమె నిరక్షరాస్యురాలు కాదు, నిజమైన సంపూర్ణ అక్షరాస్యురాలు.పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సుమతి జీవితంలో  ఉత్తీర్ణత చెందకుండా ఉంటుందా?  తనదైన సొంత వ్యక్తిత్వంతో ఆమె సొంత వెన్నెముకతో నిటారుగా నిలబడటమే ఈ కథ.

ఈ కథలో జీవితం నగ్నంగా కనబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. ఉంటున్నది ఉంటున్నట్లుగా ఉంటుంది. ఈ కథలో జీవితం తప్ప ఇంకేమీ లేదు.

శైలి శిల్పం కొస మలుపు కొసమెరుపు రచయిత కంఠస్వరం అంటారా.. ఇవేమీ నాకు తెలియదు. జీవిత వాస్తవికత తెలిశాక, వాస్తవ జీవితం తెలిశాక, కథలో ఇంకా వాటితో పనేం ఉంది? అంటారా??

నిజమే!

Leave a Reply