ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప తనకుంటుందనే భరోసా కావ‌చ్చు. 

ఇప్పుడు మరోసారి  ప్రజాసేవా రంగాన్ని కార్పోరెట్ల కభంధ హస్తాలకప్పగించే ప్రయత్నం మొదలయింది. ఈ నేఫధ్యం లోనే మనం జాతీయ నగదీకరణ ప్రతిపాదన పరిశీలించాలి.

కొన్ని ప్రాంతాలలో పొలాన్ని గుత్త (కౌలు)కివ్వడం పరిపాటి. భూ యజమాని తన భూమిని మరొకరికి సేద్యం చేసుకునేందుకు కొంత మొత్తానికి అనుమతిస్తాడు. ఆ కాలం తర్వాత ఆ భూమిని గుత్త దారుడు భూయజమానికప్పగిస్తాడు. మోడీ వ్యవసాయ చట్టాలలో కార్పోరేట్లకు భూమినప్పగించడం లో ఇదో పద్ధ‌తి. గుత్తకు తీసుకున్నవారు ఆ భూమిని రూపం లో అలానే వుంచి,  సారమంతా పీల్చేసి నిస్సారమైన భూమిని యజమానికి అప్పగిస్తారు. ఇదీ కార్పోరెట్ల వ్యవసాయం లో కుప్పం రైతులు పొందిన అనుభవం. అలాంటిదే ఈ నగదు బదలీకరణ. తాకట్టు అంటే మనం తీసుకొనే రుణానికి హామీ. తాకట్టు పెట్టిన వస్తువుపై రుణ‌మిచ్చినవారికి వినియోగపు హక్కు వుండదు. అందువల్ల మానిటైజేషణ్ ను తాకట్టు అనడం సరికాదు.

ప్రభుత్వరంగ సంస్థలను  ప్రభుత్వం  తనకనుకూలమైన కార్పోరేట్లకప్పగించే విధానం నూతన ఆర్ధిక విధాన అమలుతో ప్రారంభమయ్యింది. 1980 దశకం చివరికంతా అంతవరకూ వినిమయరంగం లోనే పెట్టుబడులు పెట్టగలిగే దేశపెట్టుబడిదారులు, మౌలికరంగ ప్రవేశానికవసరమైన సంపదను సమకూర్చుకున్నారు. దానికనుగునంగానే ప్రభుత్వాలు తమ విధానాలలో మార్పులు తెచ్చాయి. ప్రైవేటీకరణను మూడు తరహాలలో అమలుజేస్తున్నారు. మొదటిది- ప్రభుత్వరంగ సంస్థలను గుండుమొత్తంగా పెట్టుబడిదారులకమ్మడం. రెండవది- ప్రభుత్వరంగ సంస్థల వాటాలనమ్మడం. ఇక మూడవది జాతీయ నగదీకరణ ముసుగులో వచ్చిన విధానం. దీనీ మనం ఆస్తుల నవీకరణ( assets recycling)అనవచ్చని కొంతమంది ఆర్థికవేత్తల భావన. దీనిలో ప్రైవేట్ వ్యక్తులకు/సంస్థలు  ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విధులు,  రెవెన్యూ హక్కులు పొందుతాయి. ఇప్పటికే పై విధానం వివిధ రూపాల్లో అమలుతోంది. నిర్వహణ-కొనసాగింపు-బదిలీ(operate-maintain-transfer) , టోల్  నిర్వహణ-బదిలీ(TOT), నిర్వహణ-కొనసాగింపు-అభివృద్ధి (OPERATION-MAINTENENCE-DEVELOPMENT).రూపాలు వేరైనా వాటి సారం ఒక్కటే .ప్రజల సొమ్ముతో మౌలిక సదూపాయ కల్పన, ప్రైవే వ్యక్తులు/సంస్థలు వాటి నిర్వహణ పేరుతో అమ్ముకోవ‌డం. 

దీనికి రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ట్రాక్ లు, ఇంధనపు లైన్లు, టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్, గిడ్డంగులు,స్టేడియంలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు  ప్ర‌భుత్వం గుత్తకు ఇస్తుంది.  2021-25దాకా 4 సంవ‌త్స‌రాలు గుత్తకివ్వడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయలనార్జించి, ఆ సొమ్ముతో కొత్త మౌలిక సదూపాయాల కల్పనతో కొత్త ఉద్యోగాల సృష్టించడం తమ లక్ష్యమని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. నష్టాల్లోవున్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడాన్నే ప్రైవేటీకరణ. నగదీకరణ లేక గుత్తకివ్వడం కు ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులు/సంస్థలు మరింత సమర్థవంతంగా నడుపుతాయని ప్రభుత్వం భావిస్తే చాలు. దీన్ని ఒకరకంగా ప్రభుత్వ*ప్రైవేట్ భాగస్వామ్యం(PUBLIC PRAIVATE PATNERSHIP)అనవచ్చు.పెట్టుబడి ప్రభుత్వాని(ప్రజల)ది, లాభాలు ప్రైవేట్ వ్యక్తులవి. అయితే ప్రైవేట్ నిర్వహణపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. ఈ విధానాలు బిజెపి ప్రభుత్వం తోనే మొదలు కాలేదు. 2008 లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం న్యూ డిల్లీ రైల్వేస్టేషన్ నగదీకరనకై ప్రతిపాదనలు జేసింది. నాటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంకూడా ముంబై-పూనే ఎక్స్ ప్రెస్ మార్గాన్నిరూ.8 వేల కోట్లకు గుత్తకివ్వడం గమనార్హం. అయితే అందరికన్నా ప్రైవేటీకరణకై ఏకంగా పెట్టుబడుల ఉపసంహరణ కై ఒక మంత్రిత్వ శాఖను ఏర్పరిచిన ఘనత వాజ్ పేయిదే అని చెప్పవచ్చు. ఇక,2019లో జాతీయ వసతుల కల్పనకై కేంద్రం రూ.111 లక్షలకోట్ల తో ఒక ప్రణాళికను ప్రకటించింది. దాని అమలుకై తనవద్ద 85% నిధులున్నాయని చెబుతూ మిగతా 15% కై ఆస్తుల గుత్త విధానం ప్రకటించింది. అయితే ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులలో ప్రభుత్వం చెప్పిన 85%నిధులు(94.35 లక్షలకోట్ల) లభ్యమయ్యేది కాదని కేంద్రానికి తెలుసు. అది ఆశిస్తున్న 6 లక్షలకోట్లు లభ్యమయ్యే పరిస్థితీ లేదు. ఎందుకంటే ప్రైవేట్ పెట్టుబడిదారులు మౌలికరంగాలపై ఆశక్తి చూపడం లేదని రిజర్వుబ్యాంక్ 2020-21 నివేదిక తెల్పుతూంది. గత ఆరు సంవ‌త్స‌రాలలో ప్రభుత్వం 80 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వరంగ వాటాలను అమ్మజూస్తే, దానికి వచ్చినది కేవలం 3.38 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు(offers)  మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వం ప్రజల ఆస్తుల కారుచౌకగా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించక తప్పదని విదితమవుతుంది. ప్రభుత్వ ఉద్దేశ్యం కూడా అదే. దానికై ,మౌలికవసతుల కల్పనా, అభివృద్దికి నిధుల బ్యాంక్(National Bank for Financing Infrastructure and Development )ఏర్పాతిజేసింది కూడా..

వివరాల్లోకేల్లితే,

1)400 రైల్వేస్టేషన్లు, 90 ప్యాసెంజర్ రైళ్ళు,1,400 ట్రాక్ లు, రూ.1.52 కోట్ల ఇతర రైల్వే ఆస్తులు , 741 కి.మీ ల కొంకన్ రైల్వే, 15 రైల్వేస్టేడియంలు, కొన్ని ఎంపికజేసిన రైల్వే కాలనీలు, 265 రైల్వే గూడ్స్ షెడ్లు.

2)విమానాశ్రయాలు-వారణాసి, చెన్నై, నాగపూర్,  భువనేశ్వర్ విమానాశ్రయాలతో సహా ఇతర ఆస్తులు. అంతేగాక ఇప్పటికే పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలోవున్న ముంబాయ్, డిల్లీ , హైదరాబాదు విమానాశ్రయాలలే గాక,అన్ని చిన్న విమానాశ్రయాలు. 

3)విద్యుత్ రవాణా (POWER Transmission)-  ఈ రంగానికి చెందిన  ఆస్తులను- 400కెవి లకు పైగా పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ తో సహా, 26,60౮ సర్క్యూట్ కి.మీ గుత్తకివ్వడం ద్వారా రూ.45వేల కోట్లు పొందవచ్చని ప్రభుత్వ అంచనా. మొత్తం పైన ఈ రంగం నుండి తాననుకున్న  6 లక్షల కోట్ల రూపాయలలో 6% ఆర్జించవచ్చని ప్రభుత్వపు ఆశ.

4) నౌకా రంగం- 12 ప్రధాన ఓడరేవులకు గాను 9 ఓడరేవుల మరి 30 ప్రాజెక్తుల ద్వారా రూ. 12,828 కోట్లను పొందవచ్చని ప్రభుత్వ భావన.

5) గిడ్డంగులు.(WAREHOUSES)- 412 లక్షలటన్నుల ఆహారధాన్యాల నిలువ జేయగల భారత ఆహార సంస్థ(FCI) గిడ్డంగులు,  343 లక్షల టన్నుల ఆహారధాన్యాల నిలువజేసుకొనే సామర్థ్యం గల కేంద్ర గిడ్డంగుల సంస్థ ల నగదీకరణ ద్వారా   రూ. 28,900  కోట్లను పొందవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. 

6)రియల్ ఎస్టేట్ , హోటళ్ళ ఆస్తులు.(Realty and Hotel Assets)-న్యూ డిల్లీ గిటొర్నిలోని 240 ఎకరాల 7 కాలనీలు , భారత పర్యాటక అభివృద్ధి శాఖ కార్పోరేషన్ కు చెందినా అన్ని(8) హోటళ్ళను ప్రైవేట్ పెట్టుబడిదారులకు గుత్తకివ్వడం ద్వారా రూ.15 వేల కోట్లు లభిస్తాయని ప్రభుత్వ అంచనా.

7) స్టేడియంలు-జవహర్లాల్ నెహ్రూస్టేడియం తో సహా ఇతర 30 స్టేడియంలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు నిర్వహణకు అప్పగించడం ద్వారా రూ.11,450 కోట్లు వస్తాయని అంచనా.

    కేంద్రప్రభుత్వ వాదనలు.

 తాము  గుత్తకిచ్చేది కేవలం నిరర్తక ఆస్తులలేనని, వాటి నిర్వహణలో సామర్థ్యం పెంచేందుకు, వాటి విలువ పెంచేందుకే నిర్దిష్ట కాలానికి మాత్రమె తాము కౌలుకివ్వడం జరుగుతుందని, ఆ కాలంలో కూడా అవి ప్రభుత్వ ఆస్తులుగా ఉంటాయని చెబుతోంది. 

ప్రభుత్వంది సదుద్దేశ్యమనుకున్నా ప్రభుత్వమనుకున్న స్థాయిలో ఆ కౌలు విలువ ఉండదని గత కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్రభుత్వంరంగా సంస్థలను అమ్మే ప్రయత్నం,లేక వాటి వాటాలను అమ్మే ప్రయత్నంలలో ప్రభుత్వం ఆశించినంత మేరకు, కనీసం ఆ దరిదాపుల్లోకి  కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులు రాకపోవడం తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలను గుత్తకివ్వడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయలనార్జించాలనుకోవడం దురాశే అవుతుంది.

ఇక, వాటి ధరలు నిర్ణయించేది ప్రైవేట్ పెట్టుబడిదారులే కాబట్టీ వారికి ప్రభుత్వపు నేటి ఆర్ధిక దుస్థితి తెలుసు కాబట్టి వారి మాటనే చెల్లుబాటవుతుంది. పై సంస్థలను దక్కించుకున్న కార్పోరేట్ గుత్తేదారుడు, వాటిపై తక్కువ సమయం లో ఎక్కువ లాభాలను ఆర్జించాలనుకోవడం సహజమే. మరి లాభార్జనకు ఏమిజేస్తారు?  ఒకటిః వినియోగదారులపై మరింత భారం వేయడం,రెండుః ఖర్చులు తగ్గించుకోవడం.

మొదటిదానికి పరిమితులున్నాయి. పరిధులు దాటితే అసలుకు మోసం వస్తుంది. రెండవ మార్గం -సిబ్బంది వేతనాల తగ్గింపు,సిబ్బంది తొలగింపు, వినియోగదారుల సౌకర్యాలపై ఖర్చు తగ్గింపు- అంత సమస్యకాదు. ఇప్పటికే రహదారులపై టోల్గేట్ వ్యవస్తతో అదనపు భారం ప్రజలు భరిస్తూనే వున్నారు. అసలు ఆ ప్రజల సొమ్ము (బ్యాంక్,ఎల్ ఐ సి లాంటి సంస్థల రుణాల) తోనే రహదారుల నిర్మాణం జరిగిందనే వాస్తవం గ్రహించాలి.

ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళ లో రూ.111 లక్షల కోట్ల.తో కొత్తగా జాతీయ మౌలిక సదూపాయల కల్పనా చేస్తుందని చెబుతుంది.కానీ ప్రభుత్వం గుత్తేదారులనుండి ఆశిస్తున్నది కేవలం 6 లక్షల కోట్ల రూ.మాత్రమే. ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తుల కప్పగించి, మరల కొత్తవాటిని నిర్మించడం , వాటిని మరల ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికే తప్ప మరో లక్ష్యం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియేతప్ప మరోటి కాదు. పాడిగేదను ప్రజలసొమ్ముతో పెంచి, పోషించి దాని పాలు పితుక్కొనే హక్కును మాత్రం ప్రైవేట్ వ్యక్తుల/సంస్థల కివ్వడమే ఈ ప్రక్రియ. 

 ప్రైవేట్ పెట్టుబడిదారులు సంస్థలను సమర్థవంతంగా నడుపగలరనే ప్రభుత్వ వాదన అర్థరహితమే గాక అసత్యమూ కూడా.అదే నిజమైతే  బ్యాంకులలో ఎనిమిది ట్రిలియన్ రూపాయల నిరర్థక ఆస్తులన్నీ (Non Performing Assets),వారి పేరిటే ఎందుకున్నట్లు?

టెలికాం రంగం లో ఎయిర్ టెల్ లాంటి సంస్థలు సమర్థవంతంగా ఎందుకు నిర్వహించక పోతున్నాయి? ఒక్క అదాని, అంబాని లాంటి వారు తప్ప మిగతా సంస్థలు వాటి వాటి రంగాలలో ఎందుకు నిలబడలేక పోతున్నాయి? దానికి వాటి అసమర్థతే కారణం కాబోదు. సమర్థత/ అసమర్థత అనే వాటిని విశ్లేషనకై,కేంద్రప్రభుత్వం పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ, కార్పోరేట్లకు అందించే సహాయం పరిగణలోనికి తీసుకోవలసి వుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ, భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) సంస్థను దెబ్బతీసే ప్రభుత్వవిధానాల వల్లే జియో లాంటి సంస్థలు లాభాలార్జించ గలుగుతున్నాయ నే దాన్ని ఎవరు కాదన గలరు.

ఉదా: 2020 లో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ చైనా వస్తువులను కొనకూడదని ఆజ్ఞలు జారీచేసిన ప్రభుత్వం, ప్రైవేట్ టెలికాం రంగసంస్థలకు ఆ నిబంధ‌న వర్తింపచేయకపోవడంలో పై ఉద్దేశ్యం దాగి వుందనేది నిష్టురసత్యం. అదేవిధంగా, విమాన తయారీ రంగం లో విశేష అనుభవం గల హిందూస్తాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ను కాదని, రాఫెల్ విమానాల తయారీని ఏమాత్రం అనుభవం లేని ఆదానీకి కట్టబెట్టడం లో ఆంతర్యమేమిటి? విమాన రంగం లో కేవలం ఎయిర్ ఇండియా నే కాదు, ప్రైవేట్ సంస్థలయిన ఇండిగో, కింగ్ ఫిసర్ లాంటివి నష్టాల్లో నడుస్తున్నాయి. అంటే, ఇక్కడ అనుభవం, సమర్థత ప్రాధాన్యం కాదు,ప్రభుత్వరంగ సంస్థలను వివిధ రూపాలలో  ప్రైవేట్ పె ట్టుబడిదారుల సంస్థలకప్పగించడమే ఈ విధానపు ఏకైక లక్ష్యం. దానికి, ప్రభుత్వరంగసంస్థలకు “నిధులివ్వ వద్దు, వాటిని పనిచేయకుండా చూడు, ప్రజలు ఆగ్రహిస్తారు, నీవు వాటిని పెట్టుబడిదారుల సంస్థలకప్పగించు” అనే సూత్రాన్ని ప్రభుత్వాలు పాటిస్తున్నాయని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త నొం చామ్స్కీ అంటారు.

ఇక్కడ మనం ప్రధానంగా గమనం లోకి తీసుకోవలసినదేమంటే, ప్రభుత్వరంగసంస్థల ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం లాభార్జన కాదు. అది ఒక సేవారంగం. ప్రజలకు మౌలిక సదూపాయలను అందుబాటులోనుంచడమే వాటి ప్రధాన కర్త్యవ్యం. వాటినిర్వహణను పెట్టుబడిదారులు సంస్థలకప్పగిస్తే, వాటి సేవలు యింకెంత మాత్రం ప్రజలకు అందుబాటులో వుండవు.  HDFC లాంటి బ్యాంక్ ల సగటు నెల బ్యాలెన్స్ రూ.10,౦౦౦/ వుండగా,స్టేట్ బ్యాంక్ ఆ పరిమితిని విధించలేదు.  మరి, ఏ బ్యాంక్ సామాన్యులకు అందుబాటులో వుంటుంది? ఈ నగదీకరనతో రైలు చార్జీలు, ప్లాట్ ఫారం చార్గీలతో సహా పెరుగుతాయి. విద్యుత్ రేట్లు ఇబ్బడిముబ్బడి గా పెరిగే అవకాశం వుంది.  దానికి మన ప్రభుత్వాలు తమ ఆర్ధికవిధానాలకు నమూనాగా భావించే అమెరికా లోని ఒక రాష్ట్ర అనుభవం  ఒక ఉదాహరణ. అమెరికాలోని న్యూ సౌత్ వేల్స్ లో విద్యుత్ స్తంభాలు, తీగల నిర్వహణ  ప్రైవేట్ కప్పగించిన 5 సంవ‌త్స‌రాల‌ లోనే విద్యుత్ ధరలు రెట్టింపు అయ్యాయి.  దాంతో ప్రజల ఆందోళనలకు తలొగ్గి ప్రభుత్వమే ఆ ఖర్చును భరించాల్సి వచ్చింది. మన ప్రభుత్వాలకు అలా చేయూతనందించే స్థోమత వుందా?

 పెట్టుబడిదారులు సంస్థల ఏకైక లక్ష్యం లాభార్జనే.  దానికి వారు వివిధ పద్దతుల నవలంభిస్తారు. వేతనాల తగ్గింపు, ఉద్యోగుల తొలగింపుతో పాటు నాణ్యమైన సేవలు అందవు. ఇక రిజర్వేషన్లు ఎండమావులే. కార్మికులపై BSNL తన ఆదాయం లో 70% వెచ్చిస్తే, రిలయెన్స్ తన ఆదాయం లో కార్మికులపైఖర్చుచేసేది కేవలం 3% మాత్రమె నని తెలుసు కుంటే ప్రైవేట్ నిర్వహణలో కార్మికుల పరిస్థితిని ఊహించవచ్చు..

అంటే , ప్రభుత్వం అమలుజేయబోయే విధానం వల్ల ప్రజల సొమ్ముతో స్థాపించిన ప్రభుత్వ సేవారంగ సంస్థలు, అటు ప్రజలకు చౌకగా సేవలన్దించక పోగా,కొత్త ఉద్యోగ కల్పనా అటుంచి ఉన్న ఉపాధికి ఎసరు పెట్టబోతోంది.బడుగు, బలహీన వర్గాల ఉపాధి అవకాశాలుండవు. కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభుత్వ ఆస్తులు పీల్చి పిప్పి చేయబడి, నిరర్థక ఆస్తులుగా కాక ఆస్తులే ఎలాంటి విలువలేకుండా పోయే ప్రమాదముంది.

రాష్ట్రంలో ప్రైవేట్ నిర్వహణకు గురయ్యే సంస్థల చూద్దాం-సికింద్రాబాద్ కేంద్రంగా ప్రైవేట్ రైళ్ళ  నిర్వహణతో పాటు, తిరుపతి, నెల్లూరు  రైల్వే స్టేషన్లు, విజయవాడ, తిరుపతి , రాజమండ్రి విమానాశ్రయాలు,కేజీ బేసిన్ గ్యాస్ లైన్లు,ఇక వాటితోపాటు BSN టవర్లు,FCI గోడౌన్లు .

కేవలం ప్రజల సొమ్మును కార్పోరేట్ గద్దలకప్పగించడంతోనే సరిపెట్టుకుంటే అది సంఘ్ పరివార్ ప్రభుత్వమెలా అవుతుంది?  ప్రతి విధానంలో దాని మరొకలక్ష్యం నిగూడంగా ఉంటుందది. అది రాజ్యాంగ ఫెడరల్ స్వభావాన్ని, దెబ్బతీస్తూ అధికార కేంద్రీకరణకు దారితీయడమే దాని నిగూడ లక్ష్యం..

గతం లో లాగానే,కమలనాథులు రాష్ట్రాల ఆర్ధిక దుస్థితిని అవకాశంగా మలుచుకొనే ప్రయత్నం జేస్తున్నారు. రాష్ట్రాలు కేంద్రం నుండి రుణాలు పొందాలంటే ఈ కింది షరతులకు అవి అంగీకరించాలి.

1)రాష్ట్రప్రభుత్వరంగ సంస్థలనుండి రాష్ట్రాలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి.

2)తమ యాజమాన్య హక్కులను ప్రైవేట్ సంస్థలకు బదిలీచేయాలి.

3) రాష్ట్రప్రభుత్వరంగసంస్థలను మార్కెట్ లో అమ్మకానికి లిస్టు చేయాలి.తద్వారా వచ్చే డబ్బుకు కేంద్రం 50% అదనంగా ఇస్తుంది.

4)తమ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకప్పగిస్తే, తద్వారా వచ్చే మొత్తానికి అదనంగా ౩౩% కేంద్రం ఇస్తుంది. 

 కేంద్రం తమ యజమానులైన కార్పోరెట్ల సేవకై ఎన్ని రాయితీలు ప్రకటించిందో చూసారా! అప్పటికీ రాష్ట్రాలు లొంగక పొతే రాష్ట్రాలకు కేంద్రం ఋణమివ్వదు.

ఇంతవరకు ఏ రాష్ట్రప్రభుత్వమూ తన సమ్మతం గానీ, వ్యతిరేకతను గానీ వ్యక్తంజేయలేదు. అయినా ఒప్పుకోక చస్తాయా! అన్ని పార్టీలు ఒకే తానూ ముక్కలే. కొద్దిగా,అటూ,ఇటూ,కార్పోరేట్లకు దాసులే. ఈ వ్యవస్థలో ఇంతకంటే  భిన్నంగా  వుండే అవకాశం ఉంటుందా? పై నేపథ్యం లో విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ఆపగలమా?ఈ వ్యవస్థను సంస్కరించాలనుకునే వారికి ఇదొక సవాల్.

ఎండమావిలో దాహం తీర్చుకుందాం పదండి.    

Leave a Reply