అమెరికాలోని పూర్వపు స్పానిష్ సన్యాసులవంటి మత ప్రచారకులకు ఈ ఆచారాలు ‘పరమ అసహ్యం’గా కనిపించాయి. అందుచేత వాటిని తోసేశారు. అలా కాక వారు కొంచెం విమర్శనా ద్రుష్టితో పరిశీలించి ఉన్నట్లయితే, ఈ మాదిరి క్రైస్తవేతర కుటుంబ రూపానికి నిదర్సనలు ‘పోలినీషియా’ అంతటా కనబడి ఉండేవి. [అంటే, మనం అసహ్యించుకున్నా, ఇష్టం లేకపోయినా చరిత్రను కాదనలేం. అన్నది ఎంగెల్స్ అభిప్రాయం. ఈ అవశేషం మన భారతంలో కూడా వుంది కదా! ద్రౌపదికి అయిదుగురు భర్తలు అన్నదమ్ములే]

గుంపు పెళ్లి ఉన్నంత వరకు సంతానాన్ని తల్లి వైపునుంచే పరిగణిస్తారు. అందుచేత ‘ఆడ పరంపర’ మాత్రమే లెక్కలోకి వస్తుంది. అటవిక కాలం లోనూ, అనాగరిక కాలపు మొదటి దశలోనూ వున్న ప్రజలందరిలో ఇది ఇంతే. ఈ విషయాలు మొదట కనుగొన్న వాడు ‘బాహోఫెన్’ ఇది ఆయన సాధించిన గొప్ప విషయాల్లో రెండవది. తల్లి వైపు నుంచే సంతానాన్ని గుర్తిస్తారని సూచించడానికీ, ఆ కాలంలో గ్న్యాతి బాంధవ్యం తల్లి వైపునుంచే గుర్తిస్తారని సూచించడానికి ఆయన ‘తల్లి హక్కు’అనే మాటను ఉపయోగించారు. క్లుప్తత కోసం నేనూ అదే పదం వాడుతున్నాను. కానీ, ఈ పదం సరైనది కాదు. ఏమంటే, ఈ దశలో వున్న సమాజంలో చట్టపరమైన అర్ధం లో ‘హక్కు’ అనే మాటకు అర్ధం లేదు.

స్త్రీ, పురుష సంబంధాలు స్వేచ్చగా సాగుతున్న దశ అనేది లేకపోతే, తరగతులు ఏర్పడేనాటికి తలిదండ్రులకీ, పిల్లలకూ మధ్య అది వరకే లైంగిక సంబంధం నిషేధించి, ఒక ఆచారంగా పాటించివుండాలి. అదే నిజమైతే, రక్త సంబంధ వ్యవస్థ లోనించి ఈనాటి తరగతుల వ్యవస్థ పుట్టి ఉందనాలి. దాని తర్వాత వచ్చినదే మొదటి దశ అనుకోవాలి. ఈ ఊహే మరింత సముచితమని నా అభిప్రాయం.” [ఇక్కడ చూడండి. స్త్రీ పురుష సంబంధాలు స్వేచ్చగా సాగుతున్నదశ అనేది లేకపోతే….అంటున్నాడు ఎంగెల్స్. అంటే, అది వరకు అందరూ ఒకే తెగగా విచ్చలవిడిగా ఉన్నారనీ, తరువాత కాలంలో సమాజం గణాలుగా మారి కొత్త నిబంధనలు వచ్చాయని అంటున్నాడు. నిజమే ఒక కొత్త నిబంధన వచ్చింది అంటే, అంతకు ముందు ఆ పద్ధతి లేదు అనే అర్ధం. కట్నం తీసుకోవడం నిషేధించారు అంటే, అంతకుముందు అందరూ తీసుకుంటున్నారనే కదా! ఇదంతా మరీ పూర్వకాలపు చరిత్ర. వీటికి లిఖిత పూర్వకమైన ఆధారాలు వుండవు. గత చరిత్ర పరిశోధకులు ఆనాటికి వున్న ఆచారాలూ, కట్టుబాట్లూ లాంటి ఆధారాలతో కొంత వరకు పరిశోధన చేస్తే, తరువాత వారు తమ తర్కంతో, మరింత సరైన సమాచారాన్ని అందిస్తారు. లేదా వాళ్ళ విశ్లేషణలలో కొన్ని తప్పులు కూడా దొర్లవచ్చు. కొన్ని కొన్ని అంచనాలు తప్పవు. ఉదాహరణకు మన దేశంలో ఎవరైనా చనిపోతే, ఆ ఇంటి పేరుగల వాళ్ళు ‘మైల’ను పాటిస్తారు. అంటే, వాళ్ళంతా ఒకే గణానికి లేదా ఒకే గుంపుకీ చెందినవారు అన్నదానికి అవశేషం అనుకోవచ్చు. ]

దక్షిణ ఆష్ట్రేలియాలోని, మౌంట్ గాంభీర్ ప్రాంతాలలోనే కాక, తూర్పు డార్లింగ్ నదీ ప్రాంతాలనూ, ఈశాన్యంగా క్వీన్‌లాండ్ లోనూ కూడా తరగతుల వ్యవస్థ అమలులోవున్నట్లు కనబడుతున్నది. ఈ విధంగా, ఇది బాగా వ్యాప్తి చెందింది. ఈ వ్యవస్థ, అన్నా చెల్లెళ్ళకూ, అలాగే తల్లి వైపు అన్నదమ్ముల పిల్లల మధ్య, అక్కచెల్లెళ్ళ పిల్లల మధ్య వివాహాలు కూడా నిషేధిస్తున్నది. వారంతా ఒకే తరగతికి చెంది ఉండడమే దానికి కారణం. కానీ, అన్నదమ్ముల పిల్లలూ, అక్కచెల్లెళ్ళపిల్లలూ ఒకరినొకరు వివాహం చేసుకోవచ్చు.[మేనరికం అన్నమాట]

ఈ గుంపు పెళ్లి సాని కొంపల రంగు కళ్ళద్దాలతో చూసే అల్ప సంస్కారుల ద్రుష్టిలో వట్టి వ్యభిచారం. నిజానికి దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే అంత వికటంగా కనిపించదు. పై పెచ్చు ఇలాటి పద్ధతి అమలులో ఉన్నదనే అనుమానం కూడా ఎన్నో సంవత్సరాల దాకా కలగలేదు. ఈనాడు కూడా ఇదంతా పొరపాటు నిర్ధారణ అనే వాళ్ళు లేకపోలేదు. పై పై ద్రుష్టి తో చూస్తే, ఈ గుంపు పెళ్లి అస్థిరమైన దంపతీ వివాహంగా కనిపిస్తోంది. బహు భార్యత్వానికే, అడపాదడపా వ్యభిచారానికి ఒక రకమైన మారు రూపం అనిపిస్తోంది.”

ఆ వివాహ సంబంధాలను నియంత్రించే సూత్రాలను తెలుసుకోవడానికి ‘ ఫైసోన్, హోవిట్’ ల మాదిరిగా సంవత్సరాల తరబడి క్రుషి చేయాలి. చాలామంది భార్యలున్నవాడు, ఆ రాత్రికి తన భార్యలలో ఒకామెను అతిధికి ఇవ్వాలనేది వీరి ధర్మం. ఈ ఆచారం యూరోపియనులకు అవినీతి గానూ, అధర్మం గానూ కనపడవచ్చు. కానీ, ఆస్త్రేలియన్ నీగ్రోలలో అమలులో వున్న ధర్మం అది. ఆ స్త్రీలు ఆగంతకుని వివాహ తరగతికి చెందినవారు. అందుచేత జన్మతః వారు అతనికి భార్యలు. వారిలో రాక్షస వివాహ పద్దతి కూడా కొన్ని చోట్ల వుంది. [అంటే, వచ్చిన అతిధి వేరే గుంపుకు చెందిన మనిషి అయితే, ఈ గుంపులో ఆ గుంపుకు చెందిన స్త్రీ ఉంటే,ఆమెను ఆ అతిధి దగ్గరకు పంపించాలి. అది చాలా మామూలు విషయం ఆరోజుల్లో. అలాగే ఈ రాక్షస వివాహ పద్ధతి కూడా మన భారతంలో కూడా వుంది కదా! భీముడు, హిడింబిని రాక్షస వివాహమే చేసుకుంటాడు. రాక్షస వివాహన్ని ఇప్పటి భాషలో చెప్పాలంటే ‘ఇనిస్టెంట్ పెళ్లి’. ]

ఒక పడుచు వాడు, తన మిత్రుల సాయంతో ఒకపడుచుని ఎత్తుకు పోయి, వారందరూ ఒకమారు ఆమెను అనుభవిస్తారు. ఆ తరువాత ఆ ప్రయత్నం ప్రారంభించిన వాడికి ఆమె భార్య అవుతుంది. ఆ విధంగా పట్టి తెచ్చిన ఆమె తన మగడినుంచి పారిపోయి, మరొకడికి పట్టుబడితే, ఆమె రెండోవాడికి భార్య అవుతుంది. మొదటి వాడికి ఆమె మీద హక్కు వుండదు. [ఇక్కడ భర్త కావడానికి అర్హత వీరత్వమే. అర్జనుడు, ద్రౌపదిని గెలిచి, పెళ్ళిచేసుకున్న స్వయంవరంలో మత్స్య యంత్రం వీరత్వమే. ఇలాంటివన్నీ గతకాలపు అవశేషాలు.] ఆ విధంగా ఒకమూల గుంపు పెళ్లి వున్నా, దాని పక్కనే దానితో పాటు పరిమిత, ప్రత్యేక సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయి. కొద్ది కాలమే కలసి వుండనీ, దీర్ఘ కాలమే కలసి ఉండనీ జంటలుగా వుండడం ఏర్పడుతూవున్నది. రెండో వైపున ఆ గుంపులలోనూ, వాటి సరసన బహు భార్యత్వం కూడా కొనసాగుతూంది. ‘గుంపు పెళ్లి’ పద్దతి క్రమక్రమంగా అంతరించిపోతున్నదన్నమాట. [ఒక పద్ధతి అనేది మంచిది అని అనుభవం ద్వారా గ్రహించిన తర్వాత, పాత పద్ధతులు కొన్నాళ్ళు కొనసాగుతాయి. కొన్ని సంవత్సరాలకి తగ్గుతాయి. క్రమంగా కొత్త పద్ధతులే స్థిరపడతాయి. అంత కంటే మంచి పద్ధతులు వస్తే, అది పూర్తిగా అమలులోకి వచ్చేసరికి మరి కొన్ని సంవత్సరాలు పడతాయి. మొదటి పద్ధతి అవశేషంగా మారిపోతుంది. భారతంలోని ఘట్టాలన్నీ అవశేషాలే. అతిధికి భార్యను అప్పజెప్పడం, వీరత్వంతో పడుచుపిల్లను ఎత్తుకు రావడం. అలాగే ఉత్సవాలకు వచ్చిన స్త్రీల రవికలు అన్ని పోగుపోసి, వచ్చిన మగవాళ్ళు తీసుకుంటారు. ఎవరికి ఏ రవిక వస్తే ఆ రవికగల స్త్రీ అతనితో కలుస్తుంది. దీన్ని”రవికల పండగ” అంటారు. ఇలాంటివి మనదేశంలో కూడా వున్నాయని ‘తాపీ ధర్మారావు గారి “పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు” పుస్తకంలో వుంది]

3. జంట పెళ్లి కుటుంబం: గుంపు పెళ్లి కాలంలోనూ, అంత క్రితమూ కూడా స్త్రీ పురుషులు అల్ప కాలమో, అధిక కాలమో జంటలుగా కలిసి జీవించకపోలేదు. అసంఖ్యాకంగా వుండే భార్యల్లో ఒకామె ముఖ్య భార్యగా వుండేది. ముద్దుల భార్య అనడానికి తగిన పరిస్థితులు అప్పటికింకా లేవు. ఇదే క్రిస్టియన్ మత భోదకుల్ని కంగారు పెట్టిందని చెప్పవచ్చును. “గుంపు పెళ్లి అంటే ఇష్టం వచ్చినపుడు, ఇష్టం వచ్చిన ఆమెను అనుభవించే భార్యల సమూహం అనీ, హద్దూ, పద్దూ లేని వ్యభిచారానికి ఆటపట్టని” భావించారు.[ ఇక్కడ క్రిస్టియన్ మత భోదకుల అభిప్రాయాలు ఎలా వున్నాయో చూడండి. మత ప్రచారకులు ఎప్పుడూ చరిత్రనూ, చరిత్ర చెప్పిన దానినీ వ్యతిరేకిస్తారు. అంతా మతంలోనే వున్నదనీ, మానవ సంబంధాలూ, వివాహ సంబంధాలూ మతం నిర్దేశించిన ప్రకారమే జరగాలనీ, అదే మంచిదనీ చెబుతుంటారు. ఇది మనదేశంలో కూడా వుంది. వివాహ వ్యవస్థ భారతదేశానికే ప్రత్యేకం అనీ, ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదని చెబుతుంటారు]

కాలిఫోర్నియా ద్వీప కల్పంలోని ఆదిమ తెగలవారు కొన్ని ఉత్సవాలు జరుపుకొంటారనీ, ఆ సందర్భంలో అనేక తెగలవాళ్ళు ఒకచోట చేరి స్వేచ్చా సంగమం జరుపుతారని’బాంక్రాఫ్ట్’ రాస్తున్నాడు. ఈతడు ‘తెగలు’ అని పేర్కొన్నవి ‘గణాలు’మాత్రమే. ఆ ప్రాచీన యుగపు గణాల ఆచారాల స్మ్రుతి చిహ్నాలే ఈ ఉత్సవాలు. ఇదే ఆచారం ఈనాటికీ ఆస్ట్రేలియాలో వుంది. కొన్ని తెగలలో కుల పెద్దలూ, నాయకులూ, మంత్ర గాళ్ళయిన పురోహితులూ ఈ వుమ్మడి భార్యల ఆచారాన్ని స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారు. కొన్ని ఉత్సవ దినాల్లోనూ, తెగంతా సమావేశం అయిన కాలంలోనూ, వెనుకటి కాలపు సమిష్టి అనుభవానికి ఒప్పుకొని, తమ భార్యలను పడుచువాళ్ళతో సుఖం అనుభవించగల అవకాశం కలిగించ వలసి వుంటుంది. ఏ కొద్ది రోజులపాటో ప్రాచీన కాలపు స్వేచ్చా సంగమ పద్ధతి అమలులోకి వస్తుందంటూ’ వెస్ట్ ర్మార్క్’ తన పుస్తకంలో ఉదాహరణలు ఇచ్చాడు.

ఇండియాలోనూ, కొన్ని ఆఫ్రికన్ తెగల వారిలోనూ ఈ ఆచారాలు కనిపిస్తున్నాయి. ‘వెస్ట్ ర్మార్క్’ గుంపు పెళ్లి ఆచారం ఉందనడానికి నిరాకరిస్తూ, ఈ ఆచారం దాని అవశేషం కాదనీ, ఇతర పశువుల మాదిరిగా ఆదిమానవుడికి కూడా సంగమకాలం ఉండేదనీ, దాని అవశేషమే ఈ ఆచారమని అన్నాడు” [వెస్ట్ ర్మార్క్ ఏం అన్నాడో చూడండి. కొన్ని జంతువులలో, పక్షులలో సంవత్సరంలో కొన్ని రోజుల పాటు సంగమ కాలం వుంటుంది. అంటే, అవి ఆరోజుల్లోనే సంగమిస్తాయి. మిగతా రోజుల్లో జత కట్టడం వుండదు. ఉదాహరణకు కుక్కలు ‘చిత్తకార్తె’ అని సంవత్సరంలో ఒక కాలం వుంటుంది.అవి ఆ నెలలో మాత్రమే సంగమిస్తాయి. అలాగే మనుషుల్లో కూడా ఆ ఉత్సవాలు జరిగే కాలం ‘సంగమ కాలం’అంటున్నాడు. అది తప్పని ఎంగెల్సు వ్యతిరేకిస్తున్నాడు. ‘వెస్ట్ ర్మార్క్ ‘ కి సైన్స్ పరిజ్ఞ్యానం లేక అలా భావించి ఉండవచ్చు. మత పెద్దలలాగా స్వార్ధ పరుడు కాదు. ]

గుంపు పెళ్ళికీ, జంట పెళ్ళికీ నడుమ వుండే సంధి దశ ’బాహోఫెన్’ కనిపెట్టిన నాలుగో మహత్తర విషయం. ప్రాచీనకాలపు భర్తల సమూహాన్ని వదల్చుకొని ఏ ఒక్కనితోనో వుండే హక్కును ఆమె కొనుక్కునే పద్ధతిని తాంత్రిక రూపంలో కనపర్చడం తప్ప వేరు కాదు. ఆమె పరిమితంగా లొంగుబాటుకు ఒప్పుకోవడంతో ప్రాయశ్చిత్తం చేసుకొంటుంది.[ఎక్కువమంది మగవాళ్ళతో కలవడం కొంతమంది స్త్రీలకు ఇష్టం లేదన్న మాట. అందుకే పరిమితంగా లొంగుబాటుకు..(కొందరితో సంబంధానికి మాత్రమే ఒప్పుకుంది.] బాబిలోనియన్ వనితలు ఏడాదికోమారు ‘మిలిట్టా’ దేవాలాయంలో దేహార్పణ చేసుకునేవారు. ఆసియా మైనరు లోని ప్రజలు తమ స్త్రీ సంతానాన్ని’అనాయిటీస్’ దేవాలయానికి ఏళ్ళ తరబడి పంపేవారు. అక్కడ, వారు తమకు నచ్చిన వారితో స్వేచ్చా సంగమం చెయ్యాల్సి వచ్చేది. పెళ్ళికి ముందు ఆడపిల్లలు ఈ విధంగా కొంత కాలం ‘గడపడం అవసరం’ అని భావించేవారు. మధ్యధరా సముద్రానికీ, గంగా నదికీ మధ్య ప్రదేశంలో ఆసియా వాసులలో చాలామంది మతాచారాల పేరుతో ఈ విధంగా ఆచరిస్తూనే వున్నారు. ప్రాయశ్చిత్తం రూపంలో స్త్రీ చెయ్యవలసిన త్యాగం క్రమేణా తగ్గిందని బాహోఫెన్ రాశాడు. [ఇక్కడ ఏం జరిగివుంటుందో ఊహిస్తే, ఆనాటి స్త్రీలు జంట వివాహానికి ముందు మగవాళ్ళతో జత కలవడానికి వ్యతిరేకించి ఉండవచ్చు. దానికి మతాన్ని అడ్డం పెట్టుకొని, పెళ్ళికి ముందే స్త్రీలను అనుభవించేవారు. అది అవసరం అని చెప్పి ఉండవచ్చు. అంటే ట్రైనింగ్ అవసరం అని మభ్య పెట్టి ఉండవచ్చు. కొద్ది పాటి మార్పులతో ఇలాంటివి మనదేశంలో కూడా వున్నాయి. దేవదాసీలు దాదాపు అలాంటిదే.)

ఇంక ఇతర తెగల విషయం చూద్దాం. పెళ్లి కొడుకూ, స్నేహితులూ, బంధువులూ, పెళ్ళికి వచ్చిన వారూ పెళ్లి సమయంలోనే ముందు పెళ్లి కూతుర్ని అనుభవించాకనే పెళ్ళికొడుకు వంతు వస్తుంది. ఆదిమ కాలంలో బలెరిక్ దీవుల్లోనూ, ఆఫ్రికా లోని జెగిల్లాలలోనూ ఈ ఆచారం ఉండేది. ఇథియోపియాలోని ‘బారెయా’ లలో ఆ ఆచారం ఇప్పటికీ వుంది. ఇంక ఇతరులలో, అధికారి అయిన వాడు- అతడిని తెగపెద్ద అనండి, గణ పెద్ద అనండి, వారు లేకపోతే మంత్ర వేత్త, పురోహితుడు, రాజు ఎవరో పేరు ఏదయితేనేం అధికారి – మొదటి రాత్రి పెళ్లి కూతురు తో గడుపుతాడు. ఈ ఆచారానికి ఎవరు ఎన్ని పై మెరుగులు పూసి మరుగు పరచబోయినా, మొదటి రాత్రి హక్కు ఈనాటికీ గుంపు పెళ్లి పద్ధతికి చిహ్నంగా అలస్కా ప్రాంత వాసుల్లో వుంది. [బాంక్రాఫ్ట్ ‘దేశీయ తెగలు పేజి.81] ఉత్తర మెక్సికో లోని తాహౌల లోనూ ఇతరులలోనూ కూడా వుంది. [అదే పుస్తకం పేజి.584, ఎంగెల్సు పుస్తకంలోనివే ఈ పేజి నంబర్లు]

హెటెరిజం[ విశ్రుంఖలత్వం] స్థితి నుంచి, ఏక భార్యా, ఏక భర్త పద్ధతికి మార్పు తెచ్చినది ముఖ్యంగా స్త్రీ యేనని బాహోఫెన్ రాశాడు. అది ముమ్మాటికీ సత్యం. జీవితంలో ఆర్ధిక పరిస్థితులు అభివ్రుద్ధి పొందడంతో, ప్రాచీన కాలంలో నుంచి ఆచారంగా వస్తున్న దాంపత్య సంబంధాలలో అమాయక, ఆదిమ స్వభావం తొలగిపోయింది. ప్రాచీన సామూహిక జీవిత పద్దతి అంతరించడమూ, క్రమంగా జనాభా పెరుగుతుండడంతో స్త్రీలకు వెనకటి కాలపు దాంపత్య సంబంధాలు పీడాకరంగానూ, అవమానకరంగానూ తోచి వుంటాయి. దాని నుంచి బయటపడడానికి తాత్కాలికంగానో, శాశ్వతంగానో ఒకే మగవానితో ఉండగల ఏకపత్నీత్వ హక్కుకోసం వాళ్ళు ఎంతో ఆదుర్దాపడివుంటారు. ఈ ముందడుగు మగవాని నుండి వచ్చినది మాత్రం కాదు. అతడికి ఈ భావం కలిగికూడా వుండదు. ఏమంటే, మగవాడు ఈ నాటికి కూడా గుంపు పెళ్లి లో వున్న సౌఖ్యాన్ని కలలో సైతం వదులుకొనే స్థితిలో లేడు. [ఇది చాలా ముఖ్యమైనది. ఇంత వరకూ జరిగిన చరిత్రలో మగవాడు స్వేచ్ఛా జీవి. పిల్లలు పుట్టడానికి కారణం ఏ మగవాడో తెలియని స్థితి నుంచి ఖచ్చితంగా తండ్రి గుర్తింపు కు రావడం స్త్రీ, పురుషుల ఇద్దరికీ అభివ్రుద్ధే. కానీ, పురుషుడు దాన్ని స్త్రీ ప్రతిఘటన తోనే స్వీకరించాడు అన్నది చరిత్రలో వున్న సత్యం. అయితే, ఈనాటి బూర్జువా స్త్రీలు ఆనాటి స్థితినే స్వేచ్చ పేరుతో కోరుకుంటున్నారు] అటవిక కాలానికి గుంపు పెళ్లి. అనాగరిక కాలానికి జంట పెళ్లి. నాగరిక కాలానికి దంపతీ వివాహం కుటుంబం యొక్క ముఖ్య లక్షణం.

జంట పెళ్లి నుండి సుస్థిరమైన దంపతీ వివాహ రూపం అభివ్రుద్ధి చెందాలంటే ఇంత వరకూ మనం చూసిన వాటికంటే భిన్నమైన కారణాలు వుండాలి. జంటల ఫలితంగా గుంపు అనేది అంతరించి, దాని చివరి రూపం అవతరించింది. ఇప్పుడున్నది ఒకస్త్రీ –ఒకపురుషుడు మాత్రమే జంట. ఈ జంట రెండు అణువుల కలయికతో ఏర్పడిన కణం వంటిది. ప్రాక్రుతిక వరణం అనేది ఎప్పటికప్పుడు సామూహిక వివాహ వలయాన్ని పరిమితం చేస్తూ వచ్చింది. ఇక్కడితో దాని పని పూర్తి అయింది.[ఈ మాటల్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. విచ్చలవిడి సంబంధాలు….అనేవి పరిమితమవుతూ…. కుంచించుకు పోయినట్లు దగ్గరగా చేరి, మొనోగమికి చేరి ఆగిపోయాయి. అంటే, ‘కుటుంబం’ అనేది సంపూర్ణం గా అభివ్రుద్ధి చెందిన తర్వాత ఇక చెయ్యవలసింది ఏమీలేదు. “ఇక్కడితో దాని పని పూర్తయింది.” అంటే, ఇప్పుడున్నఒక పురుషుడికి ఒకే స్త్రీ, ఒక స్త్రీకి ఒకే పురుషుడు అనే, దంపతీ వివాహ వ్యవస్థ ఇక మారవలసినది ఏమీలేదు అని . ఇక ఇప్పుడు చూస్తున్న దంపతులు కానీ, బయట వాళ్ళతో సంబంధాలు అనేవి “అనైతికం”అనే నిబంధన స్థిరపడిపోయింది. మార్పు అనేది ఎలా వచ్చిందో గమనించాలి గతంలో ఏది నైతికమో, ఏది సహజమో అదిప్పుడు అనైతికం అయింది. ఇక మారవలసినది అందులో వున్న అంతర్గత వైరుధ్యాలే. అంటే, ఇద్దరి మధ్యా వున్న శ్రమవిభజనలో మార్పులు]

ఇంత వరకూ కుటుంబంలో వచ్చిన మార్పులు చూసాము. ఇప్పుడు ఉత్పత్తి సంబంధాలలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం. అనాగరిక కాలపు మొదటి దశవరకూ ప్రజలకున్న సంపద-ఇళ్ళూ, బట్టలూ, మోటురకం ఆభరణాలూ, తిండి సంపాదించు కొనేందుకూ, వండుకునేందుకు పనికి వచ్చే పరికరాలూ, పడవలూ, ఆయుధాలూ, అతి సాధారణ రకం వంట పాత్రలూ వంటివే. ఏరోజు కారోజు తిండి తడుముకోవాల్సిందే. ఇప్పుడు గుర్రాలూ, గాడిదలూ, ఎడ్లూ, గొర్రెలూ, మేకలూ, పందులూ మొదలైన వాటిని మందలుగా పెంచుతున్న గోపాలక జాతులు వ్రుద్ధి పొందాయి. యూఫ్రిటిస్, టైగ్రిస్ నదీ తీరాలలో సెమైట్లు ఇలాగే వ్రుద్ధిపొందారు. ఇండియా లోని నీరు సమ్రుద్ధిగా గల కొన్ని ప్రాంతాలలో ఆర్యులు కూడా ఈవిధంగా అభివ్రుద్ధి పొందినవారే. కొద్ది పాటి శ్రద్ధ చూపిస్తే చాలు. పశువుల మందలు పెరుగుతాయి. మంచి పుష్టి కరమైన పాలూ, మాంసమూ లభిస్తాయి. అంత వరకూ ఆహారానికి అవలంబించిన పద్ధతులన్నీ పాత బడిపోయాయి. వెనకటి రోజుల్లో వేట తప్పనిసరి అయ్యేది. ఇప్పుడు అది వినోదంగా మారింది. [ఇంకా పంటలు పండించడం తెలియదు]

అయితే, ఈ సంపదలు ఎవరివి? మొదట్లో గణానివే. కానీ, చాలా ప్రాచీన కాలంలోనే మందలు సొంత ఆస్తిగా మారిపోయి వుండాలి. “మోసెస్ ఆది గ్రంధం”లో ఫాదర్ అబ్రహంకు మందలు వున్నాయని రాసి వుంది. కానీ, ఆస్తికి యజమాని అనేది ఈనాడు మనం ఉపయోగిస్తున్న అర్ధంలో ఆయనకు చెల్లదు. అనాగరిక కాలంలో లోహ పాత్రలూ, విలాస సామగ్రీ, బానిసలూ, మందలూ కుటుంబ పెద్దలవి అయిపోయినట్లే కనిపిస్తూ వుంది.

ఈ రోజులనాటికి బానిసత్వం అమలులోకి రావడమే దానికి కారణం. అనాగరికపు మొదటి దశలో బానిస వలన ఉపయోగం లేదు. మొదట్లో ఓడిపోయిన వాళ్ళని చంపెయ్యడమో, తమ తెగలోకి దత్తు తీసుకొని సోదరులుగా ఆదరించడమో చేసేవారు. స్త్రీలను భార్యలుగా చేసుకునేవారు. వాళ్ళ పిలల్ని కూడా దత్తత తీసుకునేవారు. ఈ దశలో మానవుని శ్రమ శక్తి అతని పోషణకు అవసరమైన దాని కన్నా అదనంగా ఉత్పత్తి చేయగల స్థితిలో లేదు. పశువుల్ని పెంచడం, లోహాల్ని ప్రాసెస్ చెయ్యడం, నేత నేయ్యడం, వ్యవసాయం చేయడం వచ్చాక ఏర్పడ్డ పరిస్థితులు వేరు.[ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. గతంలో యుద్ధాలలో ఓడిపోయిన అవతలి తెగ మనుషుల్ని చంపడమో, దత్తత తీసుకొని సోదరులుగా భావించి కలుపుకోవడమో చేసేవారు. తరువాత పరిస్థితులు మారాయి. ఎందుకంటే, అప్పటికి మనిషి తన శ్రమ శక్తి కి మించి ఉత్పత్తి చేయగల స్థితి లేదు. అప్పటికి వున్న ఉత్పత్తులు ఏవి? వేటా, పశువుల్ని పెంచడం. వాటివలన వచ్చే ఉత్పత్తి, ‘నిలవ’ వుండదు. వేట వలన మాంసం వస్తుంది. పశువుల పెంపకం వలన పాలూ, మాంసమూ వస్తుంది. ఇవి ఒకటి, రెండు రోజులకన్నా ఎక్కువ నిలవ వుండవు. తెగలో పట్టుబడిన వాళ్ళని పశువులకి సంబంధించిన కొన్ని పనులు చేయించినా, అందువల్ల వచ్చే ఉత్పత్తి వాళ్ళు బ్రతకడానికి కూడా అవసరం. ఆ మాత్రం పనులు వున్న తెగ వాళ్ళే చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి వాళ్ళను ఉంచితే తిండి దండగ. అందుకని చంపెయ్యవచ్చు. ఈ విధంగా ఆలోచించి ఉండవచ్చు. అలా ఎంతవరకూ…. ఉత్పత్తులు ఇంకా పెరగాలి. వ్యవసాయం చెయ్యడం లాంటి గ్న్యానం తెలియాలి. శ్రమదోపిడి అనేది ఎలా ప్రారంభం అయింది అన్నదానికి ఇది అర్ధం చేసుకోవడం చాలా అవసరం. దానికి మరి కొంత కాలం ఆగాలి. ]

అంతవరకూ అడిగితే లభించే భార్యలకు ఇప్పుడు మారకం విలువ ఏర్పడి కొనబడుతున్నట్లే, శ్రమ శక్తికీ అదే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పశువుల మందలు కుటుంబ ఆస్తిగా మారాక మరీను. పశువుల మంద పెరిగినంత వేగంగా కుటుంబం పెరగదు. మందల్ని కాయడానికి మంది అధికంగా వుండాలి. ఈ పనికి యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు ఉపయోగ పడ్డారు. పశువుల మాదిరిగానే వాళ్ళూ పిల్లల్ని కంటారు. పెరుగుతారు.[ క్రమంగా పనులు ఎక్కువ అవుతున్న కొద్దీ అవసరాలు పెరిగాయి. అవసరమైన కొద్దీ సోదరులుగా భావించి దత్తత తీసుకోవడం అనే మానవత్వపు అంశం పోయి, దాని స్థానంలో పనులు చేయించుకోవడం అనే బానిసత్వం మొదలయ్యింది]

ఈ పశుసంపద కుటుంబాల సొంత ఆస్తిగా మారాక, వేగంగా వ్రుద్ధి పొందింది. దాని ఫలితం, జంట పెళ్లి. మాత్రు ప్రాధాన్యత గట్టి దెబ్బతింది. జంట పెళ్లి కుటుంబంలో ఒకనూతన పరిస్థితిని తెచ్చింది. ఇప్పుడు కుటుంబంలో అసలు తల్లితో పాటూ, అసలు తండ్రి కూడా స్పష్టంగా కనబడుతున్నాడు. ఈ నాటి ‘తండ్రుల’కన్నా, ఆనాటి ‘తండ్రి’ తన సంతానానికి నిజమైన తండ్రి అని చెప్పవచ్చు.ఆనాటికి కుటుంబంలో తిండి సంపాదించడం, దానికి కావలిసిన పనిముట్లు చూసుకోవడం మగవాని బాధ్యత. శ్రమ విభజన అలా వుండేది. అందు చేతనే తిండి సంపాదించు కోవడానికి అవసరమైన పనిముట్లు అతని స్వంత ఆస్తిగా ఉండేవి. ఒకవేళ ఆ జంట విడిపోతే, ఇంట్లో సామాను ఆమెకి వుండిపోయేది. మగవాడు తన పనిముట్లు తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఆనాటి సమాజపు ఆచారం ప్రకారం పశువులూ, పని పరికరాలూ, బానిసలూ మగవాడి ఆస్తి. అతని పిల్లలకి వారసత్వపు హక్కు లేదు. అది ఎందుకంటే….ప్రారంభంలో తల్లికే హక్కు. స్త్రీ పరంపరనే వంశ క్రమంగా గుర్తించేవారు. అలాగే చనిపోయిన వ్యక్తి ఆస్తి, గణం లోనే వుండాలి. ఆస్తి గణం లోనుండి బయటకు పోరాదు. ఆదిలో ఆస్తి చాలా తక్కువ.(ఆస్తి అంటే ఏమీలేదు. వేట పరికరాలు లాంటివే ) దానిని తల్లి వైపు బంధువులకు అప్పజెప్పేసేవారు.

చనిపోయినవాని సంతానం, వారి తల్లి గణానికి చెందుతారు. ప్రారంభంలో తల్లి తాలూకా రక్త బంధువులతో సమంగా వారికీ తల్లి వస్తువులు సంక్రమిస్తూ ఉండేవి. తర్వాత బహుశా ఆమె ఆస్తికి వారే ప్రధమ వారసులుగా గుర్తించి వుంటారు. కానీ, వారికి తండ్రి నుంచి వారసత్వం ఏమీ లభించదు. ఏమంటే, వారు అతని గణానికి చెందరు. అతని ఆస్తి అతని గణం లోనే వుండిపోవాలి. అందుచేత, యజమాని చనిపోయినపుడు అతని మందలు అతని సోదరీ సోదరులకు, సోదరి సంతానానికి, వారెవ్వరూ లేకపోతే, అతని చెల్లెళ్ళు, వారి సంతానానికి పోవలిసిందే. అంతే గానీ, అతని సంతానానికి మాత్రం వెళ్ళదు.

ఈ విధంగా సంపదలు వ్రుధ్ధి పొందుతున్న కొద్దీ, ఒకవైపు స్త్రీ కన్నా, పురుషుడి ప్రాముఖ్యత వచ్చింది. రెండో వైపు ఆ ప్రాముఖ్యాన్ని ఉపయోగించుకొని అనూచానంగా వస్తున్న ఆచారానికి విరుద్ధంగా తన సంతానానికి వారసత్వం కలిగించాలనే ప్రయత్నాలకు ప్రేరణ కలిగించింది. కానీ, తల్లి హక్కు గుర్తిస్తున్నంత వరకూ అది సాధ్యం కాదు. అందుకోసం ఆ హక్కును తొలగించాలి. తొలగించారు కూడా. ఆ పని చేయడం, ఈనాడు మనం అనుకునేటంత కష్టం కాదు. మానవజాతి చూసిన మహత్తర విప్లవాలలో అదొకటి. గణాలలో ఒక్క వ్యక్తిని కూడా నష్ట పరచకుండా ఇది సాధించారు. కుటుంబ సభ్యులందరూ ఎవరి హోదాల్లో వారుంటారు. భవిష్యత్తులో గణంలోని మగవాళ్ళ సంతానం గణంలోనే ఉండాలనీ, ఆడ పడుచుల సంతానం వారి తండ్రి గణానికే చెందాలని ఒక్క నిర్ణయం చేస్తే చాలు. వంశ క్రమాన్నీ, వారసత్వాన్నీ స్త్రీ వైపు నుండి గుర్తించడం ఒక్క దెబ్బతో కూలదోసారు. వాటి స్థానంలో వంశ క్రమాన్ని పురుషుడి వైపునుండి గుర్తించడమూ, వారసత్వం తండ్రి వైపు నుంచి సంక్రమించడమూ నెలకొల్పారు. నాగరీక ప్రజలలో ఈ విప్లవం ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో మనకేమీ తెలియదు. చరిత్రకు అందని కాలంలోనే అది జరిగిపోయింది. కానీ, అది జరిగిందనడం లో మాత్రమూ సందేహం లేదు. తల్లి హక్కుకు సంబంధించిన చిహ్నలెన్నిటినో ‘బాహోఫెన్’ సేకరించాడు. [గత కాలంలో తల్లి హక్కు వుండేదనడానికి గుర్తులున్నాయి. తరవాత కాలంలో ఇప్పుడున్న తండ్రి హక్కు వచ్చింది. మధ్యలో ఎప్పుడో మార్పు జరిగింది. ఒక నైజీరియా నవల, రచయత చిచువా అచ్ బే, “చెదిరిన సమాజం”. అందులోని కధానాయకుడు ఒకతప్పు చేస్తే ఆ ఊరి నుండి వెలి వేస్తారు. అప్పుడు అతని మేనమామ తన వూరికి తీసుకు వెళ్తాడు. తన గ్రామ ప్రజల్ని సమావేశపరచి తన మేనల్లుడిని ఎందుకు తీసుకు వచ్చానో కారణాలు చెబుతాడు. “ఇతని తల్లి, మన వూరి మనిషి. అతనికి ఏ కష్టం వచ్చినా మనమే ఆదుకోవాలి. అది మన బాధ్యత….”ఇలా చెబుతాడు. సాహిత్యంలో ఇలాంటి సందర్భాలన్నీ మాత్రు స్వామ్యపు అవశేషాలుగా అనుకోవాలి]

మార్పు జరిగిందనడానికి అదే పెద్ద నిదర్సనం. ఈ మార్పు యెంత సులువుగా జరిగిందీ చూడాలంటే అమెరికాలోని ఇండియన్ తెగలనెన్నిటినో మనం పరిశీలించవచ్చును. వారిలో ఈ మార్పు వచ్చినదీమధ్యనే. ఇంకా కొన్ని తెగలలో ఈ మార్పు జరుగుతూంది.[ఎంగెల్స్ ఈ వ్యాసం రాసే సమయానికి ఈ మార్పు జరుగుతున్నదన్నమాట] సంపదలు వ్రుద్ధి పొందాయి. వారి జీవిత పధ్ధతులు మారాయి. అడవుల నుండి ‘పచ్చిక బయళ్ళ’లోకి నివాసం మారింది. నాగరికతా సంపర్కం, మత ప్రచారకుల నైతిక పలుకుబడి, ఇవన్నీ వారిలో ఈ మార్పును తీసుకువచ్చాయి. ‘మిస్సూరి’ నదీ ప్రాంతంలోని తెగలలో ఎనిమిదిలో ఆరు మగవాని నించి వంశ క్రమాన్ని గుర్తించడమూ, మగవాని వారసత్వాన్ని గుర్తించడమూ అమలులో వుంది. మిగిలిన రెండూ స్త్రీ వైపునుంచే గుర్తిస్తున్నాయి. షౌనీ, మియామీ, దెలవారే తెగలలో ఒక ఆచారం స్థిరపడింది. సంతానానికి తండ్రి ఆస్తి సంక్రమించేటట్లు చేయడానికై వారు తండ్రి గణానికి సంబంధించిన ఏదో ఒక పేరును వారికి పెట్టేవారు.”

తల్లి హక్కును రద్దుచేయడమనేది స్త్రీ జాతికి సంబంధించి ప్రపంచ చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఘోర పరాజయం అని చెప్పాలి. ఇంట్లోకూడా మగవాడే పెత్తనం దొరకపుచ్చుకున్నాడు. స్త్రీ ప్రభావం పొందింది. మగవాని కామానికి బానిసను చేశారు. పిల్లల్ని కనే యంత్రంగా మార్చారు. వీరయుగం నాటి, ముఖ్యంగా పురాణ యుగం నాటి గ్రీకులలో ఇది స్పష్టంగా కనపడుతుంది. క్రమంగా దానిని కప్పిపుచ్చడానికి మెరుగులు పెట్టారు. మేలి బురఖాలు తగిలించారు. మ్రుదువైన రూపం ఇచ్చారు. ఇక్కడ పిత్రుస్వామిక కుటుంబం ఒక మెట్టుగా ఏర్పడింది. ఈ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం బహు భార్యాత్వం కాదు. అది మరొకచోట వస్తుంది.[ఈ కాలానికి బహుభార్యత్వం కాదు. ఇక్కడ కుటుంబానికి స్త్రీ గుర్తింపు అనేది, బదిలీ అయ్యింది.]

ఈ కుటుంబం యొక్క ప్రధాన లక్షణం అధికారం నెలకొల్పడం. పరాధీనులను కూడా చేర్చుకోవడం. దీనికి రోమను కుటుంబం మంచి ఉదాహరణ. ప్రారంభంలో రోమనులు familia అనే పదాన్ని బానిసల గురించి చెప్పేటప్పుడే ఉపయోగించారు. వివాహితులైన భార్యాభర్తలు, వారి సంతానం దానిలోకి రానే రారు. [familia అంటే ఒకవ్యక్తికి చెందిన బానిసల మొత్తం] కొత్తగా ఏర్పడిన ఈ నిర్మాణానికి రోమనులు ‘ఫామిలీ’ అనే పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ యజమాని అధీనంలో భార్యా, పిల్లలూ, బానిసలు కూడా వుంటారు. తన అధీనంలో ఉన్నవాళ్ళను చంపేసే హక్కు కూడా వుంటుంది. [మొదట్లో కుటుంబంఅనే దాంట్లో,బానిసలే వున్నారు. భార్యా, పిల్లలూ లేరు)

ఇలాంటి కుటుంబ రూపం ‘జంట పెళ్లి కుటుంబం’ నుండి, దంపతీ కుటుంబానికి రూపాంతరం చెందడాన్ని సూచిస్తుంది. భార్య పాతివ్రత్యాన్ని ధ్రువపరచడానికీ, బిడ్డల పిత్రుత్వం స్థిరపరచడానికీ, స్త్రీని ఏవిధమైన షరతులూ లేకుండా భర్తకు స్వాధీనపరిచారు. పిత్రు స్వామిక కుటుంబ కాలం నుండి మనకు లిఖిత చరిత్ర లభిస్తుంది.

ఇలాంటి సమిష్టి కుటుంబం ఉండేదనడానికి దక్షిణ స్లావులలో వున్న జాద్రుగా ప్రత్యేకమైన ఉదాహరణ. ఒకమూల పురుషుని సంతానం కొన్ని తరాల నుండి తమ తమ భార్యా బిడ్డలతో కలసి ఒకే ఇంట నివసిస్తారు. వారు సమిష్టి గానే కుటుంబ భూముల్ని సాగు చేస్తారు. కుటుంబం సమిష్టి నుంచి, తమకు కావలిసిన బట్ట, పాతా తీసుకుంటారు. అదనపు వస్తువులు అందరి వీను. గ్రుహ స్వామి [పెద్ద] పర్యవేక్షణలో కుటుంబ వ్యవహారాలన్నీ నడుస్తాయి. కుటుంబానికి వెలుపల ఆయన కుటుంబానికి ప్రతినిధి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటాడు. కుటుంబపెద్ద, వయసులో పెద్ద కావాలనే నియమం ఏమీలేదు.[మాత్రు స్వామ్యంలో వయసులో పెద్దదయినామె, గణపెద్ద. ఇక్కడ అలాంటి నియమం లేదు]ఇక స్త్రీలంతా ‘గ్రుహ స్వామిని’[ కుటుంబపెద్దకి భార్య అన్నమాట] అధీనంలో వుంటారు. ఆమె సాధారణంగా పెద్ద భార్యే అయివుంటుంది. కుటుంబంలోని ఆడపిల్లల పెళ్ళిళ్ళలో ఆమె మాటే చివరి నిర్ణయం. కానీ, సర్వాధికారం సమితిది. అందరూ దానిలో సభ్యులు. భూములు కొనడం, అమ్మడం లాంటి వన్నీ దాని ద్వారానే జరుగుతాయి.(భూములు కొనడం, అమ్మడం ఇంకా కుటుంబాలకు రాలేదు. ఇంకా సమితి చేతిలోనే వుంది )

రష్యాలో కూడా ఇంకా ఇటువంటి కుటుంబాలు వున్నాయని పదేళ్ళ క్రితమే తెలిసింది. గ్రామ పంచాయతీ మాదిరిగానే ఈ సమిష్టి కుటుంబం రష్యనులలో ఒక ఆచారంగా వుంది. అతి ప్రాచీనమైన రష్యన్ న్యాయ సూత్రాలలో ఇది కనిపిస్తుంది. ఈ సమిష్టి కుటుంబాలలోని జీవిత పద్ధతుల గురించి, ఇతరత్రా ఎలా వున్నా రష్యాలో మాత్రం గ్రుహ స్వామి తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఇంట్లో వున్న పడుచు పిల్లల తో సంబంధాలు పెట్టుకునేవాడు. ఈ విషయాల్ని తెలిపే జానపద గేయాలు రష్యాలో చాలా వున్నాయి.

Leave a Reply