మూలం: చినువా అచ్ బె                        తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు                                                           

 “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart]  దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా, పిల్లలు అందరూఒక చోట చేరి ఆనందంగా గడిపే ఉత్సవాలు. అలాంటి అమాయకపు ప్రజలలో అలజడి రేగింది. అధికారం ప్రవేశించింది, మతం ప్రవేశించింది. మనసుల్నీ, మనుషుల్నీ చెదరగొట్టింది. అదెలా జరిగిందో తెలుసుకోవాలంటే కధలోకి ప్రవేశించాల్సిందే. 18oo సంవత్సరం నుండి 196o వరకూ బ్రిటీష్ వాళ్ళు నైజీరియను పరిపాలించారు. వాళ్ళు ఆ దేశంలో ప్రవేసించే తొలినాళ్లలో క్రమంగా వ్యాపారభివ్రుద్ది చేసుకోవడం, మాయ మాటలు చెప్పి, మభ్యపెట్టి ఎలా తమ మతంలోకి అక్కడ ప్రజల్ని లాక్కున్నారో, తద్వారా వాళ్ళ శ్రమని ఎలా దోచుకొన్నారోనన్నది ఇందులోని కధాంశం. కధానాయకుడి పేరు “ఒకోన్ క్యో”.  

 ఒకోనక్యో మల్లయోధుడు. ఒక రోజు ఉదయం సంత స్థలంలో దగ్గర అందరూ సమావేశం అయ్యారు.  పెద్ద మైదానం. దాదాపు పదివేల మంది హాజరు అయ్యారు. జనంలో నుండి ఒక వ్యక్తి లేచి, ‘మబైనో’ గ్రామం వైపు చూపించి అన్నాడు ”వాళ్ళు…ఆ అడవి పశువులు, మన వూరి ఆడపడుచును చంపారు” ఆ మాట వినగానే అందరూ కోపంతో ఊగిపోయారు. “అయితే, దాని ఫలితంగా యుద్దానికి సిద్దం కమ్మని, లేదా ఒక కుర్రవాడినీ, ఒక పడుచు పిల్లను గ్రామానికి బదులు ఇమ్మని” నిర్ణయించి, విషయాన్ని ఒకోనక్యో ద్వారా కబురు పెట్టారు. అసలు ఆ చుట్టుపక్కల గ్రామాలు ‘వుమ్యోఫియా’ గ్రామం అంటే చాలా భయపడతారు. ఎందుకంటే ‘వుమ్యోఫియా’ లో ఒక ఒంటి కాలి ముసలిది వుంది. ఆ వ్రుద్ద మహిళకు మంత్ర తంత్రాలు తెలుసు. ఆమె వూరి మద్యలోనున్న మైదానంలో ఒంటి కాలి మీద గెంతుతూ మంత్రాలు చదువుతుంది. ఆ భయంతో వాళ్ళు ఒక ఆడమనిషినీ, 15 ఏళ్ళ కుర్రవాడినీ పంపించారు. వాడి పేరు ’ ఇకేమి ఫ్యునా’. వాడిని తన ఇంటికి తీసుకువచ్చాడు ఒకోనక్యో. ఆ ఆడమనిషిని, వాళ్ళు చంపిన అమ్మాయి భర్తకు భార్యను చేసేశారు.

ఒకోనక్యోకు ముగ్గురు భార్యలు. 8 మంది పిల్లలు. ఇంటికి తీసుకువచ్చిన ‘ఇకేమిఫ్యూనా’ ను పెద్ద భార్యకు అప్పగించాడు.  ‘ఇకేమిఫ్యూనా’ ఇంట్లో సభ్యుడిగా కలసిపోయాడు. ఒకోనక్యో పెద్ద భార్య కొడుకు పేరు ‘న్వోయే’. వాడు ‘ఇకేమి ఫ్యూనా. వయసు వాడే. ఇద్దరూ కలిసిపోయారు. ఇకేమిఫ్యూనా, ఒకోనక్యో ఇంటికి వచ్చి 3ఏళ్ళు అవుతోంది.  అందరూ యామ్ విత్తనాలు జల్లారు. సకాలంలో వర్షాలు పడ్డాయి.  పంటలు బాగా పండాయి. . ఒక రోజు ఒకోనక్యో ఇంట్లో కల్లు తాగుతున్నాడు. అంతలో వయసులో పెద్దవాడైన ‘ఇజేయుడు’ చేతి కర్ర సాయంతో వచ్చాడు. ఒకోనక్యోను కాస్త దూరంగా తీసుకెళ్ళాడు. అక్కడ చెప్పాడు. “ఇకేమిఫ్యునాను చంపడానికి గ్రామం నిర్ణయించింది. ఆ విషయంలో నువ్వేమి కలగజేసుకోకు.” అన్నాడు. ఆ సంగతి తెలిసి అందరూ బావురుమన్నారు.

మర్నాడు కుల పెద్దలందరూ ఒకోనక్యో ఇంటికి వచ్చారు. అందరూ శుభకార్యానికి వెళుతున్నట్టు కొత్త బట్టలు కట్టుకొని వున్నారు. ఆడవాళ్ళందరూ ఇంటి వద్దనే వుండిపోయారు. అడవిలో చాలా దూరం వెళ్లారు. ఊరిలో పెద్దలందరూ ఒరల్లో పెద్ద కత్తులు వుంచుకొని నడుస్తుండగా, వారి మధ్యలో ఇకేమిఫ్యూనా కల్లుకుండ నెత్తిన పెట్టుకొని నడుస్తున్నాడు. ఏమి జరగబోతోందో తెలియని ఇకేమిఫ్యునా తన వాళ్లకు అప్పజెప్పడానికి తీసుకువెళుతున్నారని అనుకుంటున్నాడు. ‘అసలు తండ్రి ఒకోనక్యో కాదు’ అన్న ఊహే రావడంలేదు. ‘ఇక్కడ సంగతులన్నీ తల్లి తోనూ, చెల్లెలి తోనూ చెప్పాలి.’ అని అనుకుంటున్నాడు. కొంత దూరం తీసుకెళ్ళి ముందు కుండను  నరికేశారు. విషయం అర్ధమయి “నాన్నా! నన్ను చంపేస్తారే” అంటూ ఒకోనక్యో వైపు వస్తున్నాడు ఇకేమిఫ్యూనో. తన వైపు వస్తున్నవాడిని నరికేశాడు ఒకోనక్యో. ఇకేమిఫ్యూనో చనిపోవడం అందరి కన్నాఎక్కువ ప్రభావితం చేసింది అదే వయసు వాడైన ‘న్వోయే’ మీద. [ఇకేమిఫ్యూనో మరణం కలిగించే బాధ ఆ కుటుంబ సభ్యుల మీదే కాదు. ఆ సంఘటన చదివిన మన మీద కూడా.]                     

ఇకేమిఫ్యూనో మరణించిన తర్వాత రెండు రోజులు మెతుకు ముట్టలేదు ఒకోనక్యో.  స్నేహితుడు ఒబైరికా వచ్చాడు.“ఆ రోజు కుర్రవాడిని  చంపేందుకు నువ్వు మాతో ఎందుకు రాలేదు?” ఒబైరికాను ఉద్దేశించి అడిగాడు. “అది మంచి పని కాదు” అన్నాడు. ఆశ్చర్య పోయాడు.  ఆ వూరిలో అందరిలోకి పెద్ద వయసు వాడైన ‘ఇజేయుడు’ చనిపోతే,ఆ చావు ఊరేగింపులో పొరపాటున తుపాకీ గుండు తగిలి ఇజేయుడి కొడుకు చనిపోయాడు.ఫలితంగా ఒకోనక్యోను భార్యలూ, పిల్లలతో సహా ఊరి నుండి 7 ఏళ్ళ పాటు గ్రామ బహిష్కరణకు గురయ్యి తిరిగి గ్రామానికి వచ్చాడు. వచ్చేసరికి,  మిషనరీలు వచ్చాయి. చర్చి కట్టారు. మత ప్రచారం మొదలుపెట్టారు. కొందరు మతం మార్చుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యం  కొడుకు న్వోయే”వాళ్ళతో కనిపించాడు. కోర్టు కూడా వచ్చింది. తెల్లవాడి ప్రభుత్వం ఏర్పడిపోయింది. చాలా మంది వూరివాళ్ళు వాళ్ళ దగ్గర ఉద్యోగాల్లో చేరారు. వాళ్ళంతా మతం పుచ్చుకున్నారు. తెగ వాళ్ళు  అందరూ కలిసి చర్చిని పడగొట్టేసారు.   ఫలితంగా అందరి చేతులకూ సంకెళ్ళు వేసి చెరసాలలో పెట్టేశారు.

కమీషనరు వచ్చి అన్నాడు ” మీరు అన్యాయంగా చర్చిని ద్వంసం చేసారు. ఇళ్ళు తగలబెట్టారు. తక్షణం 25o సంచుల గవ్వలు జరిమానా చెల్లించాలి. లేదా మీ నాయకులను వుయ్యూరు తీసుకెళ్ళి ఉరి తీస్తారు” అని చాటింపు వేశారు. వూరి ప్రజలందరూ డబ్బుపోగేసుకొని చెల్లించారు.  డబ్బులు కట్టిన మరుక్షణం ఆరుగురినీ వదిలేశారు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ఒకోనక్యో ఆత్మహత్య చేసుకున్నాడు.

*******

ఒకోనక్యో  పాత్ర గురించి కొంత అనుకోవాలి. తన తెగ అంటే అంత అభిమానం వున్న ఒకోనక్యో కధ మొత్తంలో  రెండు సార్లు తెగ ఆగ్రహానికి గురయ్యాడు. ఒకటి: భార్యమీద చెయ్యిచేసుకోవడం. అది తప్పనీ, ఆ పవిత్రమైన రోజుల్లో కొడితే, తెగ ఆగ్రహిస్తుందని తెలుసు. అయినా కొట్టాడు. అంటే, ఇది తెలిసి చేసిన తప్పు. రెండు: తెగ అందరిలో పెద్ద వయసువాడైన ‘ఇజేయుడు’ అంతిమ యాత్రలో పాల్గొన్నప్పుడు అతని కొడుకును తుపాకీతో కాల్చి చంపడం. ఇది కావాలని చెయ్యలేదు. అనుకోకుండా పొరపాటున జరిగింది. 

ఆ విషయం అలా ఉంచితే…3 ఏళ్ళ పాటు తన కొడుకుతో సమానంగా, ఎంతో ప్రేమాభినాలు పెంచుకున్న “ఇకేమి ఫ్యూనో’ను నరికి చంపడం. అది తెగ కట్టుబాటే కావచ్చు, భవిష్యద్వాణి నిర్ణయమే కావచ్చు అయితే మాత్రం  వ్యతిరేకించలేడా? ”3 ఏళ్ళ పాటు నా బిడ్డలాగా ఎంతో ప్రేమతో పెంచాను. నా చేతులతో నేను చంపలేను. నేనే కాదు మీరు కూడా ఎవ్వరూ ఆ పని చెయ్యకండి.” అనలేడా? అనలేదు. ఎందుకంటే, అది తెగ కట్టుబాటుని వ్యతిరేకించడమూ కాదూ. భవిష్యద్వాణి అంటే భయమూ కాదు. అలా నరకపోతే, తనని “పిరికివాడు అంటుంది” అట. “తనని బలహీనుడనుకుంటారేమోనని అతడు భయపడ్డాడు”  తనని తెగ పిరికివాడు కింద జమకడతారని అభం శుభం ఎరుగని 15 ఏళ్ళ కుర్రవాడిని “నాన్నా! నన్ను చంపేస్తున్నారే” అని ఎంతో భయంతో, తనని రక్షిస్తాడని ఆశపడి దగ్గరకు వస్తున్న వాడిని నరుకుతాడా? [నవలలో ఈ సంఘటన చదువుతున్నప్పుడు మనకు కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి] జరిగిపోయన తరువాత తిండి మానేస్తే ఏమిటి?కల్లు తాగితే ఏమిటి? అంటే, ఎప్పుడు తెగ కట్టుబాటుని వ్యతిరేకించాలో అప్పుడు వ్యతిరేకించడు.ఎప్పుడు వ్యతిరేకించకూడదో అప్పుడు వ్యతిరేకించాడు. ఈ కధలో నాయకుడు ఒకోనక్యో కన్నా, అతని స్నేహితుడు ఒబైరికా ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తించాడు.”అదే నేనైతే ఆ పని చెయ్యను” అన్నాడు. సరిగ్గా అదే కారణం చేత క్రైస్తవ మతం తీసుకున్నాడు ఒకొనక్యో కొడుకు న్యోయే. ఇకేమి ఫ్యూనో చంపడంతో మొత్తం అతని కుటుంబసభ్యులంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. “మీ మతంలో హింసను ప్రోత్సహిస్తారు”అనే మత ప్రచారం బాగాపనిచేసింది న్యోయే’ మీద. అంతేకాదు కాకుండా తెగలో ఎవరికైనా కవల పిల్లలు పుడితే వాళ్ళను జీవం ఉండగానే ‘పాపిష్టి అరణ్యం’లో పారవేసే సంప్రదాయం కూడా వుంది. ఇవన్నీ చూస్తున్న న్యోయేకి క్రైస్తవమతంలో హింస వుండదు అనుకున్నాడు. కానీ, వాళ్లలోనూ హింస వుంది. “పరిహారం చెల్లించకపోతే 6 గురినీ వుయ్యూరు తీసుకెళ్ళి వురి తీస్తాం” అని చెప్పారు కదా! వాళ్లకు కావలిసింది మత మార్పిడి. అందుకోసం ఎలాంటి ఆశలైనా కల్పిస్తారు. ఉద్యోగాలు ఇస్తాననడం, ఇనప గుర్రాలు[సైకిళ్ళు] ఇస్తాననడం, చదువులు చెప్పిస్తాననడం. అసలు ఇంకా పరిచయం కాని ‘సైకిలు’ వింత గానే వుంటుంది. విద్యకూ, మతానికీ సంబంధం లేకపోయినా “మా మతంలో చేరితే…మా స్కూళ్ళలో చదువుకోవచ్చు” అనగానే ఆశపడతారు.        అసలు అంత కన్నా ముక్ష్యమైనది వ్యాపారం ద్వారా ‘శ్రమదోపిడీ’.” అప్పటికే అక్కడ శ్రమదోపిడీ లేదని కాదు. బానిసలూ, పేదలూ వున్నారంటే శ్రమదోపిడీ ఉన్నట్టే. కానీ, వందల, వేల ఎకరాల భూస్వాములూ, దుర్భరమైన పేదరికం మాత్రం ఈ కధలో ఎక్కడా కనిపించలేదు.  “వంట నూనెలూ, నూనె గింజలూ ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. అనేక వ్యాపారాలు వచ్చాయి. డబ్బు ప్రవాహం లాగా వచ్చింది” ఖరీదైన వస్తువులుగా  మారిపోవడానికి కారణం. అక్కడ పంట బయటకు ఎగుమతి అయితే, ఏం అవుతుంది? వున్న వాటికి గిరాకీ వచ్చి, ధర పెరుగుతుంది. అనేక వ్యాపారాలు వచ్చాయి అంటే, ఎన్నడూ చూడని కొత్త వస్తువులు వచ్చాయని అర్ధం. అమాయకంగా, ఒక పరిమితంగా వాళ్ళు ఉత్పత్తి చేసుకునే వస్తువులనే మారకం చేసుకొంటూ, స్వయం పోషకత్వం అనే అంతర్ సూత్రాన్ని వాళ్లకు తెలియకుండానే అమలు చేసుకుంటున్న మంచి పద్దతిని తెల్ల వాళ్ళు వచ్చి, నాశనం చేసారని అర్ధం. మామూలుగా జీవనం సాగిస్తున్న ప్రజలలో మతం, శ్రమదోపిడీ తోడుదొంగలై ఎలా కలుషితం చేసారో తెలియాలంటే ఈ నవల తప్పక చదవాలి.                            

Leave a Reply