మా పోలేరమ్మ కాడ
నరికిన దున్న
పోలేరమ్మ తినదని ఎరుకే
పోగులు వేసి
దండేలపై వేలాడే ఎర్ర గులాబీలు
వాటికి ముల్లుండవ్
ముక్కల పులుసు కుతకుత వుడుకుతా వుంటే
వాడంతా ఘుమఘుమ
మీకేం నొప్పి
దున్న మీది కాదు
నరికింది మీరు కాదు
సాకింది సవర తీసింది మీరు కాదు

కట్ట మైసమ్మ కాడ
ఒక్క వేటుకి యాటనేసినం
యాతలన్నీ బోవాలని
మా మైసమ్మ ని మా యాసలో నే మొక్కుతాం
బాగా అర్థమైతది ఆమెకీ మాకూ
వూర్లన్నీ జన సందోహం తో
చెర్లన్నీ అలుగులు దుంకుతాయని
తెగిన యాటల కుప్పలు
మా పొట్టలు నింపు

అదేందో
మా గంగమ్మ తల్లి కీ
మా మల్లన్న కీ
మా కాటమయ్యకి
మా ఎల్లమ్మ ఉప్పలమ్మ ముత్యాలమ్మ మారెమ్మలకి సైతం
జంతు మాంసమే ఇష్టం
మాకూ అదే ఇష్టం
సిన్నప్పట్నుంచి మా అయ్య గదే పెట్టిండు
మా అయ్య కి మా తాత
మా పిల్లలకి నేనూ అదే పెట్టా
తరాల ఆహారం మాది
వేట మా వృత్తి
కాల్చి రుచిని కనుగొన్నది మేమే
వేషాలు మాకు చేత కాదు
మీ నిషా మాకెక్కదు

మా నాలుక కి అదే కావాలి
మా కండ బలానికి అదే
మా బండ చాకిరికి అదే ఆసరా
మా ఒళ్లంతా హూనం
సల్ల కదలక చేసే పని మేమెరుగం
మా మెదళ్ళకు పదును పెట్టేది అదే
మేం మాంసాహార ప్రియులం ఖరాఖండిగా

బాజాప్తుగా
యాడైనా మా తిండి మేం తింటం
మీ తిండి జోలికి మేం రాం
మీరేం తింటారో మీ ఇష్టం
కయ్యానికి కాలు దువ్వితే
మా దూడలు కుమ్ముతై
మా కోళ్ళు పొడుస్తై
మా పొట్టేళ్ళు ఢీ కొడతై
యాడ బడితే ఆడ!! ఐటంక మాకెరుకలే!!
మా పట్టు ఉడుము పట్టు యాది మరువకు!!
కోరేగావ్ చరిత్ర!!!


(జె ఎన్ యు లో మాంసాహారులపై దాడికి నిరసన గా)

Leave a Reply