అసలు ఈ నడక ఎక్కడ మొదలైంది.?

ఎప్పుడు మొదలైంది..?

దారి ఎక్కడ మారింది…?

పల్లెటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను పదోతరగతి వరకు అక్కడే పెరిగాను. స్నేహితులు, బంధువులు అంతా ఆధిపత్య కులాల వాళ్ళే, నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను అదే వాతావరణంలో ఉంచింది. ఆ వయసులో ఆ ఆధిపత్య ప్రవర్తన తప్పుగా కానీ లేదా అన్యాయంగా ఎప్పుడూ అనిపించలేదు. పదోతరగతి తరవాత మొదటిసారి డిప్లొమా చదవడానికి ఊరు నుండి బయటకు వచ్చాను, అక్కడ కూడా కులం నన్ను కలుపుకుని పోయింది. అక్కడ కూడా నా చుట్టూ అదే మనుషులు చేరారు. నాలో ఉన్న ఈ ఆధిపత్య కుల భావజాలం బలపడుతున్న క్రమంలో  నవీన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు నా జీవితంలోకి. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, కుల వివక్ష ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే నాలో పాతుకుపోయిన భావాలు వల్ల వాటిని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను, పైగా అవన్నీ తప్పులని, రిజర్వేషన్లు వల్ల దేశానికి ప్రమాదమని వాదించే వాడిని. రోజూ గంటల తరబడి సాగేది మా చర్చ, అప్పటి నా మూర్ఖత్వం తలచుకుంటే ఇప్పటికీ నా మీద నాకు జుగుప్స కలుగుతుంది.

అది మే 2010 డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ లో అడుగు పెట్టిన కాలం, ట్రైనీ ఇంజినీర్ గా మొదలు పెట్టిన ప్రయాణం ఒక సంవత్సరంలొనే ముగించి మళ్ళీ ఇంజినీరింగ్ లో చేరాను. అక్కడ కూడా నన్ను కులం వదలలేదు నా చుట్టూ మళ్ళీ అదే మనుషులు, నవీన్ వల్ల బీటలు పడ్డ ఆధిపత్య భావజాలాన్ని వీళ్ళు బలమైన వెల్డింగ్ చేశారనే చెప్పాలి. మరింత బలపడిన భావాలతో ఇంజినీరింగ్ లో అడుగుపెట్టిన నాకు అక్కడ కూడా అదే ఆ కోవకు చెందిన మిత్రులే పరిచయమయ్యారు, కాకపోతే ఇక్కడ స్వకుల మిత్రులు కాదు, అయినా వాళ్లలో నా ఆలోచన విధానం పట్ల ఎక్కడా వ్యతిరేక లేకపోవడంతో స్నేహం సాఫీగానే సాగింది, ఇది 20 ఏళ్ల పాటూ సాగిన నా జీవితం.

మార్పు ఎక్కడైనా, ఎప్పుడైనా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. నా జీవితం కూడా అంతే…  2013 చివరలో ఎల్. బీ నగర్ బస్ స్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అక్కడ ప్లేట్ ఫారం మీద ఉన్న పాత పుస్తకాలు షాప్ లో ఒక పుస్తకం టైటిల్ నన్ను ఆకర్షించింది. అది అప్పటికే చాలా సార్లు విన్న పేరు అది. కొత్తగా శవ యాత్రల బండ్ల పైన కూడా రాస్తున్నారు, అదే మహాప్రస్థానం. ఆసలేముంది ఈ పుస్తకంలో అనే కుతూహలంతో ఆ పుస్తకం తీసుకున్నాను. ‘శ్రీ శ్రీ’ నా జీవితంలో ఆ పేరు వినడం అది మొదటిసారి కాదు. చిన్నప్పుడే తెలుగు పాఠ్య పుస్తకంలో మార్కుల కోసం చదువుకున్న శైశవ గీతం రాసింది కూడా ఈ శ్రీ శ్రీనే. మొదటి సారి 30రూపాయలు ఇచ్చి ఒక పుస్తకం కొన్నాను అంటే అది మహాప్రస్థానం. ఆ పుస్తకంలో భాష ఇంతకు ముందు ఎన్నడూ నా జీవితంలో లేదు. ఆ పదాలు నాకు అంత సులువుగా అర్థం కాలేదు. ఆ పదాలు అర్థాలు వెతుక్కుంటూ చాలా చరిత్ర తెలుసుకున్నాను. అప్పటికే అందుబాటు లో ఉన్న ఇంటర్నెట్ పనిలో కొంత సహాయం చేసింది. నిజానికి అక్కడే చదవడం అలవాటయ్యింది అని చెప్పాలి. చరిత్రకి ఒక్కటే కోణం ఉండదు, ఒక్కో వ్యాసం ఒక్కో తీరు. ఎన్నో ప్రశ్నలు మరెన్నో అనుమానాలు సమాధానం చెప్పగలిగే వాళ్ళు నా పక్కన లేరు. నా చుట్టూ ఉన్న జనం ఈ విషయాలపై మాట్లాడానికి ఆసక్తి చూపించే వారు కాదు.

సమాధానాల వెతుకులాటలో పెరియార్ అనే మరో పెద్ద ప్రశ్న నా ముందు వాలింది. అప్పటి వరకు నాకున్న భావజాలానికి పూర్తి విరుద్ధంగా ఉన్న వాడు పెరియార్. అలాంటి పెరియార్ ని చదవడం మొదలు పెట్టాను. తెలుగులో చాలా తక్కువ సమాచారమే ఉండేది. ఎవరిని అడిగినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఇంగ్లీష్ లో దొరుకుతుంది అని ఒక ఫేస్బుక్ మిత్రుడు ఇచ్చిన సలహాతో పెరియార్ కలెక్టెడ్ వాల్యూమ్స్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. ఈ పుస్తకం నాలోని పాత ఆధిపత్య భావజాలాన్ని పూర్తిగా బద్దలుకొట్టింది, ఈ లోపు ఇంజినీరింగ్ పూర్తయింది.

ఇంజినీరింగ్ లో తీసిన షార్ట్ ఫిల్మ్ ప్రభావమో, సహజంగా కోస్తా జిల్లాల్లో వాళ్ళకి సినిమా మీద ఉన్న ఆసక్తో  తెలియదు కాని అడుగులు సినిమా వైపు పడ్డాయి. ఒక సినిమా యూనిట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను అటు నుండి గోస్ట్ రైటర్ గా నా ప్రయాణం మారింది. ఎక్కడా ఎక్కువ కాలం నిలబడలేకపోయాను, ఎటు పోయినా కులం వెంటాడేది.

ఈ ప్రయాణంలో కులం, మతం అనే రెండు పర్వతాలు అడ్డంగా నిలబడ్డాయి, వాటిని బద్దలుకొట్టే క్రమంలో ఎన్నో సున్నితమైన బంధాలు తెగిపోయాయి, మరెన్నో స్నేహాలు తెగిపోయాయి. నా దారి పులా బాట కాదు, నడక అంత సులువుగా సాగలేదు.

29 సెప్టెంబర్ 2015 అఖ్లాక్ దారుణ హత్య వార్త నా మనస్సుపై పిడుగులా పడింది, బీఫ్  తన ఇంట్లో ఉందనే అనుమానంతో అతి దారుణంగా ఒక మనిషిని చంపేశాయి మతోన్మాద మూకలు. అప్పటి వరకు బీఫ్ అనేది నాకు పరిచయం లేని ఆహారం, ఈ వార్త విన్న తరవాత ఎల్. బీ నగర్ లింమ్రా వెత్తుకుంటూ వెళ్లి ఒక ప్లేట్ బీఫ్ బిర్యానీ ఆర్డర్ చెప్పాను, ఇదే నా జీవితంలో నేను చేసిన మొదటి ధిక్కార ప్రకటన, శ్రీ శ్రీ మహాప్రస్థానంతో మొదలైన నా మలిదశ ప్రయాణం, ఈ సంఘటనతో మరో మలుపు తిరిగింది. ఆ తరవాత కొద్ది కాలానికే రోహిత్ వేముల ఆత్మహత్య, అది ఆత్మహత్య అనడం సరికాదు అది కులోన్మాద హత్య. అప్పటి వరకు నాతో నా చుట్టూ ఉన్న మనుషులతో మాత్రమే చర్చించే అంశాలు ఫేస్ బుక్ లో రాయడం మొదలు పెట్టాను.  ఈ రాతలే క్రమంగా కవిత్వంగా మారాయి.

2016 demonetisation మొదలు, UAPA చట్ట సవరణ, మతోన్మాదం, హక్కుల కార్యకర్తలు అక్రమ నిర్బంధం, లాంటి చాలా అంశాలపై నేను రాసిన కవిత్వం కొంత నా ఫేస్బుక్ లో ఉంది, మరి కొంత virasam.orgలో ఉంది. 2018 ఏప్రిల్ లో ” ఆమెలో నేను” 2022 ఏప్రిల్ లో “పెన్సిల్ పూలు” అనే రెండు  కవిత్వ సంపుటాలు వచ్చేయి. వీటిలో సామాజిక అంశాలపై వచ్చిన కవిత్వం లేదు. ఆ కవిత్వం ఇంకా ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నం చేయలేదు. త్వరలోనే ఆ పని కూడా చెయ్యాలని ఆలోచిస్తున్న.

ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ శక్తులు విజృంభిస్తున్న వేళ, మెజార్టీ ప్రజలు అర్ధసత్యాల అబద్ధాల మాయలో పడి కొట్టుకుపోతున్నారు. ఇలాంటి కాలం నా ముందు ఒక ప్రశ్న విసురుతుంది, నా దారెటో తేల్చుకోమంటుంది. పాము పడగ నీడ కిందైనా పదునైన కవిత్వమే రాయాలి అంటాడు కవి ఆశరాజు. ఇప్పటివరకు అలాంటి కవిత్వమే రాయడానికి ప్రయత్నించాను, అంత పదును లేకపోయినా నా జీవితంలో ఆచరణకు సంబంధం లేని ఒక్క అక్షరం కూడా రాయలేదు.

నా దారి పులా బాట కాదు, నడక అంత సులువుగా సాగలేదు. కులం, మతం అనే రెండు పర్వతాలు అడ్డంగా నిలబడ్డాయి, వాటిని బద్దలుకొట్టే క్రమంలో ఎన్నో సున్నితమైన బంధాలు తెగిపోయాయి, మరెన్నో స్నేహాలు తెగిపోయాయి.

6 thoughts on “నా దారి పూల బాట కాదు

  1. ఈ దారి ప్రభావమే అంత. స్నేహాలు బంధుత్వాలు పోతాయి. పోతే పోనీ… ఎవ్వరూ కడ దాకా వుండరు

  2. మహాప్రస్థానమే నా వెతుకులాటకూ దారులు తెరిచింది. చాలా బాగుంది శేషూ

Leave a Reply