కొన్ని పుస్తకాలు మనుషుల జీవిత గాథల్ని వినిపిస్తే,  మరికొన్ని పుస్తకాలు వాటిని వ్యాఖ్యానిస్తాయి. కానీ గీతాంజలి గారు రాసిన ‘స్టోమా’ పుస్తకం స్త్రీల విషాద లైంగిక గాథల్ని ఒక చలనచిత్రం వలె పాఠకుల కళ్ళముందు దృశ్యమానం చేస్తుంది. బయటకు కనబడని వికృత పురుష మానసికతను, అమానుష లైంగికతను లైవ్ గా చిత్రిస్తుంది. మన సమాజంలో స్త్రీల అనంత విషాదానికి ప్రత్యక్షంగా పురుషుడే కారకుడుగా కనిపించినప్పటికీ, పరోక్షంగా పురుషులను (స్త్రీలను) కూడా నడిపించే దుష్ట పీడక సంప్రదాయాలు, దోపిడి సామాజిక వ్యవస్థ ఉన్నాయనే వాస్తవాన్ని మనం పట్టించుకోకుండా ఉండలేము.

ఇందులో చిత్రించిన 13 కథలకు ఎంతో వైవిధ్యపూరితమైన సామాజిక నేపథ్యం ఉంది. వీటిలో బ్రాహ్మణ, ముస్లిం, దళిత శ్రామిక బహుజన జీవిత పార్శ్వాలు ఉన్నాయి. మత, కుల సంప్రదాయాలు, తత్సంబంధిత భావజాలాల విశ్వాస వ్యవస్థలు స్త్రీల జీవితాలనెలా నిలువునా దహించి కూల్చివేస్తున్నాయో ఈ కథలు ఘోషిస్తాయి.

ఉదాహరణకు ‘కర్ర’, ‘చచ్చిన పాము’, ‘ఆక్సిజన్’ లాంటి కథల్లో భర్తలు తాగుబోతులై చెడు తిరుగుళ్లు తిరుగుతూ రోగాలనంటించుకున్నవాళ్లు. ఒంటి మీద పుండ్ల రసి కారుతున్నా భార్యల్ని  భయంకరమైన కట్టడి చేసే వాళ్ళు. నానారకాల తిట్లు తిడుతూ, అనుమానిస్తూ వేధించేవాళ్ళు. తమ అసహజమైన సెక్స్ కోరికలను తీర్చడం లేదంటూ చేతి(కర్ర)తో కొట్టేవాళ్ళు. కొరుకుళ్ళు, గాట్లు,   సిగరెట్ కాల్చివేతలతో అమానుషంగా హింసించేవాళ్ళు. ఒకడేమో పెళ్ళాం సహకరించడంలేదని ఊరు ఊరంతా కంప్లైంట్ చేస్తూ తిరిగితే, మరొకడేమో సెక్సాలజిస్టుల దగ్గరికి భార్యను తిప్పుతూ తిప్పలు పెట్టేవాడు. ఇంకొకడేమో పక్షవాతంతో సగం దేహం చచ్చుపడిపోయి ఆక్సిజన్ లేనిదే ఊపిరాడని స్థితిలో ఉన్నప్పటికీ,  భార్యను తిడుతూ తన్నుతూ ఆమెతో సేవలు చేయించుకోవడం తన హక్కన్నట్టుగా జులుం ప్రదర్శించే వాడు మనకు కనిపిస్తాడు.

‘అనెస్థీషియా’ కథలో ఒక మగ నర్సు మత్తు మందు ఇచ్చిన ఆడ పేషెంట్ల శరీరాల్ని చెడుగా తాకుతూ ఆనందించేవాడు ఒకడైతే,   ‘ ది కిస్-2′ లో పసి పాపలపై లైంగిక అత్యాచారం చేసే మగవాడు మరొకడు. 

‘స్టోమా’ కథలో నైతే భర్త తన సుఖం కోసం భార్యకు కోయకూడని చోట వజైనోప్లాస్టీ ఆపరేషన్ చేయించి, తీరా అది ఫెయిలవడంతో ఆమె పొట్ట దగ్గర స్టోమాబ్యాగ్ (మలం సంచి) రావడానికి కారకుడయ్యాడు. పైగా ఒకానొక శ్రీరామనవమి నాడు ఒక పంతులును పిలిపించి సావిత్రి, అనసూయల పాతివ్రత్యపు కథలు చెప్పించాడు. కొడుకూ, కోడళ్ళతో ఇల్లంతా కళకళలాడుతుండగా అందరూ భక్తిగా కూచుని పంతులు చెప్పే కథలు వింటున్నారు. వాళ్ళ మధ్యలో మలంసంచీతో ఉన్న తానొక బహిష్కృత, మైలది, అంటరానిదై పోయింది. ముగ్గురు ఆడపిల్లల్ని, ఇద్దరు మగ పిల్లల్ని కని, పెంచి, పెళ్ళిళ్ళు చేసింది. మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటే  మనవలు, మనవరాళ్ళకు చాకిరీ చేసిన తన  ముప్పావల జీవితంలో దేహమంతా శుష్కించి నీరసపడి పోయింది. ఇప్పుడు తనను గదికే పరిమితం చేసి మిగతా ఇంటిని నిషిద్ధం చేసారు. అందరిలాగే తానూ మలాన్ని మోస్తున్నది, కాకపొతే దేహానికి బయటా. భర్త చేసిన పాపానికి తానొక  భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నది. నవరంద్రాలకు తోడుగా తన శరీరానికి భర్తే పదో రంధ్రాన్ని కూడా చేసి, బతికుండగానే తనకు చావు రాసేశాడు. తన దేహాన్ని మలం మోసే ఒక మరుగుదొడ్డిగా మార్చి, తన బతుకులో అంతా  దుర్గంధాన్ని నింపి, 68 ఏళ్ల వయసున్న తన భర్త ఎవతితోనో కులకడానికి వెళ్ళిపోతే, తులసి హృదయం భగ్గుమని మండిపోయింది. ఏ రాత్రికో ఇంటికి తిరిగొచ్చి నిద్ర పోతున్న భర్త ముఖంపై, ఛాతీ, పొట్ట, కాళ్ళపై తన స్టోమా బ్యాగును పూర్తిగా పిండి, కుమ్మరించి, అతని ముఖం మీదికి విసిరికొట్టి ‘థూ నీ బతుకు చెడ’ అంటూ తన కోపాన్నంతా కక్కేసుకుని భర్త గదిని దాటింది.      

‘మా నాన్నెందుకు మంచోడంటే’, ‘పెద్ద బాలశిక్ష’ అనే రెండు కథల్లో రచయిత్రి బ్రాహ్మణ కుటుంబాల జీవితం గురించి రాసారు. 

 ఒక బ్రాహ్మణ యువకుడు దళితురాలిని ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబంలో ఎలాంటి కల్లోలం చెలరేగిందో, అతని తల్లి మనసులో ప్రేమ(మారి)పోయి ద్వేషం చోటుచేసుకోవడానికి ఆమెలోని కులతత్వం ఎలా కారణమైందో, పిల్లలు లేని కారణంగా ఒక అనాథ(గా మారిన) ముస్లిం బాలికను దత్తత తీసుకోవడం వల్ల ఆమెలోని మతతత్వం కూడా ఎలా ప్రకోపించిందో ‘మా నాన్న ఎందుకు మంచోడంటే…!’ కథలో మనం చూడవచ్చు. కొన్నేళ్లపాటు చైల్డ్ ట్రాఫికింగ్ లో చిక్కుకుపోయి ఉండడంవల్ల ఆ బాలిక తీవ్రమైన ట్రామాలో ఉంటుంది. శారీరకంగా, మానసికంగా గాయపడ్డ ఆ అమ్మాయి  విచిత్ర ప్రవర్తన మనల్ని చాలా బాధిస్తుంది.

మరో కథ ‘పెద్ద బాలశిక్ష’. ఆ పుస్తకం పేరుకే బాలలకు శిక్షణ గాని, నిజానికి పితృస్వామ్యమనే  విషంతో నిండిన శిక్షణా పుస్తకమది. అంతిమంగా అది బాలల పాలిట, స్త్రీల పాలిట ఘోరమైన శిక్షగా ఎలా పర్యవసించిందో ఈ కథలో మనం చూడవచ్చు. ఇందులో అలేఖ్య కుటుంబం నియమ నిష్ఠలతో కూడిన ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబం. ఆమె అమ్మ ఎప్పుడూ మడి, పూజలు, వ్రతాలు, ఉపవాసాలలో మునిగితేలేది. నాన్న కూడా అంతే నిష్ఠగా ఉండేవాడు.  వృత్తిరీత్యా ప్రైవేట్ స్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటికీ అతడు పొద్దున పూజారిగా, మిగతా సమయాల్లో పెళ్ళిళ్ళు చేసే పురోహితుడిగా, జ్యోతిష్యుడుగా,  శని పూజలు చేసే బ్రాహ్మడిగా ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఇంట్లో ఆడవాళ్ళు బైటి  మగాళ్లతో మాట్లాడకూడదు. అన్నదమ్ములైనా, నాన్నైనా సరే వాళ్ల పక్కన కూర్చొని మాట్లాడకూడదు. భూమిలోకి తల గుచ్చి నడవాలి. ఎవరితోనైనా  కన్నెత్తి చూడకుండా మాట్లాడాలి.

నాన్న లేడు కదా అని ఒక రోజు తను వాకిట్లో పిల్లలతో ఆడుకుంటూ ఉంటే, వాళ్ళ అమ్మేమో ఇరుగుపొరుగు అమ్మలక్కలతో అరుగు మీద ముచ్చట పెడుతుంది. అనుకున్నరోజు కాకుండా ఒక రోజు ముందే సాయంత్రం తిరిగి వచ్చిన నాన్న  దృష్టిలో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. కోపంతో ఊగిపోతూ ఇంట్లోకి  వెళ్ళిన తర్వాత భార్యకీ,కూతురికీ అట్లకాడ కాల్చి వాతలు పెట్టాడు. ఎప్పుడన్నా కూతురైనా, భార్యైనా గుమ్మంలోనో, డాబా పిట్టగోడ పక్కనో, నిలబడితే చాలు ‘ఏమిటే.. భోగం ముండల్లా అలా నిలబడ్డారు. లోపలికి తగలడండి’ అంటూ వారి  వీపులు వాయించేవాడు.ఇన్ని కఠినమైన ఆంక్షలతో అలేఖ్య బాల్యం గడిచిపోయింది.

ఒకరోజు తమ మేనత్త సుమనత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. నాన్న గురించి అలేఖ్య ఆమెనడిగింది. ఊరందరికీ మంచివాడైన నాన్న ఎందుకు తమను నరకయాతన పెడుతున్నాడని అడిగింది. అప్పుడు ఆమె అలేఖ్య నాన్న గురించే  కాదు, వాళ్ల నాన్న నాన్న (తాతయ్య) గురించి కూడా చెప్పుకొచ్చింది. వాళ్ళ  తాతయ్య చాలా దుర్మార్గుడని, వాళ్ళ నానమ్మను, పిల్లలను అంటే తనను, అలేఖ్య వాళ్ళ నాన్నను చావ బాదేవాడని అత్తయ్య చెప్పింది. ఒంటి మీద, కాళ్ల మీద వెంట్రుకలున్న ఆడదానికి కామం ఎక్కువ ఉంటుందని ఎవరో పంతులు చెప్పాడని, అదే విషయం పెద్దబాలశిక్ష లో కూడా ఉందని చెప్పడంతో తాతయ్య ఆడవాళ్లను అనుమానిస్తూ, నిత్యం కట్టడి చేయడం మొదలు పెట్టాడని మేనత్త చెప్పింది. అదే మానసిక రోగం అలేఖ్య నాన్నకు కూడా సోకిందని, అందుకే వాళ్ళనలా వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. చూస్తే నిజంగానే తన తల్లి కాళ్ళ మీద కూడా నల్లని వెంట్రుకలు ఉన్నాయి. అందుకేనేమో నాన్న ఇలా తమను వేధిస్తున్నాడని అలేఖ్య అర్థం చేసుకోసాగింది.

అందుకే  అలేఖ్యకు మగాళ్ళను చూస్తేనే వణుకు, భయం కమ్మేస్తాయి. అందుకే పెళ్లి సంబంధం వస్తే ససేమిరా పెళ్లి చేసుకోనని చెప్పింది. చివరికి మేనత్త మెల్లగా బుజ్జగించి అందరు మగాళ్ళు తన తాతయ్య లాగా, నాన్న లాగా ఉండరని, ఆదిత్య చాలా మంచివాడని చెప్పి అలేఖ్యను పెళ్లికి ఒప్పించింది. పెళ్ళైతే జరిగింది గాని, ఆదిత్యను ఏడాదైనా  అలేఖ్య దగ్గరకు రానీయలేదు. ఆదిత్య సెక్సాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ ల దగ్గరికి తీసుకెళ్లి అలేఖ్యని చూపించాడు. వాళ్ళు ఏవేవో మందులు రాశారు గాని లాభం లేకపోయింది.

చివరికి వాళ్ళకొక మంచి డాక్టరు దొరికింది. అలేఖ్యతో అనునయంగా మాట్లాడి  ఆమె విషయమంతా తెలుసుకుంది. ఒంటి మీద వెంట్రుకలున్న ఆడదానికి  కామం ఎక్కువుంటుందని చెప్పేటటువంటి  అనేకానేక మూఢ విశ్వాసాలను  పితృస్వామిక సమాజం సృష్టించిందని, వాటి ప్రభావం వల్లే తన తాత, నాన్న అలా అమానుషంగా ప్రవర్తించారని ఆ డాక్టర్ చెప్పింది. ఇందులో అలేఖ్య తప్పు ఎంత మాత్రం లేదని, ఆమెకసలు ఏ జబ్బూ లేదని నొక్కి చెప్పింది. మూఢనమ్మకాలతో, అర్థంపర్థంలేని కట్టడులతో పెరగడం వల్ల ఆమె అలా తయారయిందని చెప్పింది. క్రమక్రమంగా కౌన్సెలింగ్ ద్వారా అలేఖ్య మామూలు మనిషిగా మారడం మొదలైంది.

‘దోఝక్’,  ‘ఖత్నా’ అనే రెండు కథలు ముస్లిం జీవితాలపై రాసినవి.

‘దోఝక్’ కథలో ఒక ముస్లిం కుటుంబ దారిద్ర్యంపై  ఒక షేక్ గాడు వలవిసిరి, జన్నత్  బేగం అనే  అమ్మాయితో నిఖా(పెళ్లి) చేసుకొని బొంబాయి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి గర్భం ధరించగానే, ఆమెను అమ్మేసి వాడు  దుబాయ్ వెళ్లి పోతాడు.జన్నత్ ను షేక్ మోసం చేసి వెళ్ళిపోయాడన్న వార్త తెలిసి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు తీసుకువచ్చి గర్భం తీయిస్తారు. కాని ఎటువంటి శిక్షణ లేని మంత్రసానిచే  గర్భాన్ని తీయించడం వల్ల గర్భసంచికి రంధ్రం పడి, రక్తం విషపూరితమై సెప్టిసీమియా వ్యాధితో ఆమె మరణిస్తుంది. నిజంగానే దోఝక్  దునియా (నరకప్రాయం అయిన ప్రపంచం) నుంచి జన్నత్ విముక్తమైనట్లనిపిస్తుంది.

అలాగే ‘ఖత్నా’  అనే కథ  దావూదీ బోహ్రా ముస్లిం మతానికి చెందిన ఒక దుర్మార్గమైన స్త్రీ  సున్తీ(ఖత్నా) ఆచారాన్ని, దాని పర్యవసానాన్ని వివరిస్తుంది. ఆ సంప్రదాయం ప్రకారం ఖత్నా చేయిస్తేనే  ముస్లిం అమ్మాయిలు సంపూర్ణ స్త్రీలవుతారు. పవిత్రులవుతారు.నిఖా(పెళ్లి)కి అర్హులవుతారు. అలా యాస్మిన్ కు ఖత్నా చేయించి నిఖా చేసుకున్నారు. తదనంతరం ఆమె బిడ్డను కన్న ఐదారేళ్ల తర్వాత ఆమెతో తనకు సుఖం లేదని భర్త పర్వేజ్ తలాఖ్  ఇస్తానంటాడు. అత్త మునీరా కూడా  మగాడు ఏం చేసినా సర్దుకుపోవాలి అని చెప్తుంది. ఎక్కువకాలం  భర్త వేధింపులు భరించలేక యాస్మిన్ తన తల్లి దగ్గరికి వెళుతుంది. తనకూ  అలాగే చేశారని ఆమె ఎన్నో సార్లు కూతురికి చెప్పుకుంది. యాస్మిన్ కు ఖత్నా వద్దన్నందుకు అబ్బా కొట్టిన దెబ్బల గుర్తులు ఇంకా ఎలా మచ్చలై  మిగిలాయో తన పొట్ట  చూపించి ఏడ్చింది. చివరకు లాయర్ దగ్గరికి వెళ్లి మాట్లాడి యాస్మిన్ భర్తపై, అత్తపై కేసు వేయడానికి వారు సిద్ధమవుతారు. 

చివరగా పాలమూరు వలస కార్మికుల కథ ‘చావు’. నీళ్లు లేక భూములన్నీ పడావు పడి వ్యవసాయం బంద్ అయితే ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్న బహుజన కులాల రైతు కూలీలకు వలసే గతయ్యింది. వలసెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే గాని వారికి బతుకుదెరువు ఉండదు. అలాంటి వలస కార్మికుల స్థితిని ఆసరా చేసుకునే కాంట్రాక్టర్ మేస్త్రీలు పుట్టుకొచ్చారు. వాళ్ళు బిల్డింగులు, రోడ్లు, కాలువల పనులు కాంట్రాక్ట్ కు  మాట్లాడుకుని, పాలమూర్ నుంచి  వేలాదిమంది లేబరర్లను  మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్ర తదితర  ప్రాంతాలకు తీసుకెళ్లి పని చేయిస్తారు. లేబర్ ను సప్లై చేసే ఈ కాంట్రాక్టు వ్యాపారంలో మేస్త్రీలు లక్షలు సంపాదిస్తుంటారు. అట్లా పని చేస్తూ చేస్తూ కార్మికుల ఆరోగ్యం క్షీణించి చనిపోయిన వాళ్ళు ఎందరెందరో. పనిస్థలంలో గాయాలపాలై రోగాల బారిన పడి చనిపోయిన వాళ్ళు మరెందరో. పనిచేసే స్త్రీలపై, ముఖ్యంగా పడుచు ఆడవాళ్లపై మేస్త్రీల  లైంగిక వేధింపులు కోకొల్లలుగా ఉంటాయి.

ఈ కథలో ఎల్లమ్మ మనవరాలు  పుష్ప పై చిన్న మేస్త్రి విజయ్ కుమార్ రెడ్డి లైంగిక అత్యాచారం చేస్తాడు. ఫలితంగా ఆమె గర్భం ధరించి, పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఆమెను కింద పడేసి కడుపులో తన్నడం వల్ల, దుడ్డు కర్రతో  తీవ్రంగా కొట్టడం వల్ల కడుపులో పిండంతో పాటు పుష్ప మరణిస్తుంది.

ఇలా రాసిన యీ కథలను రచయిత్రి గీతాంజలి ‘కేవలం పురుషుల కోసమే’ అనన్నారు. నిజంగానే పురుషులు ఈ కథలను చదివి తమ వికృత పార్శ్వాన్ని తప్పక  తెలుసుకోవలసిందే. కానీ అంతటితోనే  పురుషులు మారిపోరు.  బాధిత స్త్రీల తరఫున రచయిత్రి  ఎలా అయితే  ఫేస్ ఆఫ్ కు  సిద్ధమయిందో, పీడిత, తాడిత స్త్రీలందరూ పితృస్వామ్యం పై ఫేస్ ఆఫ్ (ముఖా ముఖిగా తలపడడం) కు దిగవల్సిందే. అప్పుడే తమ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుంది.

Leave a Reply