(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ)

1.కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా?

కథ ఒక జీవన శకలం. దానికి అనుభవమే పునాది. బాధితులు తమ అనుభవం నుండి రాసిన దానికి, సహానుభూతితో రాసినదానికి తేడా ఉంటుందనేది పాత చర్చే అయినా, అది కాదనలేనిదే. తెలుగు కథా సాహిత్యంలో సహానుభూతితో రచనలు చేయడం ఏనాటి నుండో ఉంది. అయినా అనుభవం నుండి వచ్చిన దానిలో తాత్విక గాఢత ఎక్కువ అనేది నా అభిప్రాయం.

2.     ఈ కోణంలో వర్తమాన కథను మీరు ఎలా చూస్తారు?

మానవ జీవనసంవేదనలకు సాక్షిభూతమైనది కథ. ఆధునిక జీవిత ప్రతిబింబం ఆధునిక కథ. ఆధునిక జీవనంలో ఉన్న కనిపించని హింసను ఇంకా కథ పట్టుకోలేకపోతున్నది. అంటే కాలాన్ని ఒడిసి పట్టుకుంటున్న కథలు ప్రతి యేటా పిడికడే.

3.     ఇవాళ మన చుట్టూ ఒక కొత్త కథా ఆవరణం ఉన్నది. చాలా మంచి కథలు వస్తున్నాయి. అందులోని అనుభవం వల్ల మనకు కొత్త కథలని అనిపిస్తోందా? లేక  దృక్పథం వల్ల కొత్త కథలని అనిపిస్తోందా?

కేవలం కథా ప్రక్రియలోనే కాదు, సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో ఇవాళ కొత్త గొంతుల సంఖ్య పెరిగింది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అనుభవం, దృక్పథాల మేలు కలయిక కొత్త కథ. చాలా మంది అనుభవం నుండి సమాజాన్ని చూసేతనాన్ని అలవర్చుకుంటున్నారు. కొద్ది మంది మాత్రమే ఏదో ఒక ఐడియాలజీ కోణం నుండి సమాజాన్ని కథల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు సాహిత్యంలో రికార్డుకాని జీవితాలు కథల్లోకి వస్తుండడం వల్ల అవి కొత్తగా అనిపిస్తున్నాయి. సాహిత్య ప్రజాస్వామ్య ఆవశ్యకత ఈ కాలం గుర్తించాల్సి ఉంది.

4.     అసలు జీవితానుభవానికి, దృక్పథానికి ఉమ్మడి క్షేత్రం ఎలా ఉంటుంది? తేడా ఎలా ఉంటుంది?

అనుభవంలో లేని జీవితం రాస్తే అది సహానుభూతే అవుతుంది. అనుభవాన్ని సరైన దృక్పథం నుండి రాసినప్పుడు తప్పకుండా అందులో సజీవత చేరుతుంది. అనుభవం లేకుండా ఎంత దృక్పథం ఉన్నా, ఎంతో అనుభవం ఉండి దృక్పథం లేకున్నా ఆ కథ కథగా కుదరదు. ఈ సమాజ గమనానికి అది ఏ విధంగాను దోహదం చేయలేదు.

5.     అనుభవానికి, కళకు ఉన్న సంబంధాన్ని వర్తమాన కథల ఆధారంగా ఎలా చెప్పవచ్చు?

అనుభవంలో నుండి జనించే కళకు సజీవత ఎక్కువ. అలా కాకుండా కళను ‘శాస్త్రీ’కరించే ప్రయత్నంలో ఏర్పర్చిన నియమాలకు లోబడి కళ ఉండాలనే ప్రయత్నాలు కృత్రిమత్వానికి దారి తీస్తాయి.  వర్తమాన కథలో  ఈ రెండు రకాల నేపథ్యాలు కనిపిస్తాయి. కథను కేవలం కళాత్మకంగా చూడాలనుకునే ప్రయత్నంలో అనుభవ ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారు. సహానుభూతినే స్వానుభవంగా చిత్రిస్తున్నారు. ఊహాజనిత కాల్పానికత మూలాలను పట్టుకోలేదని ఆధునిక కథా సాహిత్యం చాటిచెప్తున్నది.

6.     ప్రయోగం వల్ల కథ అనేక అర్థాలను సంతరించుకుంటుంది. అయితే ఇటీవలి కథల్లో  దృక్పథం వల్లనే మంచి ప్రయోగంగా మారిన కథలకు,  ప్రయోగం వల్లనే దృక్పథ సమస్య వచ్చిన కథలకు ఏమైనా ఉదాహరణలు ఇవ్వగలరా?  

తెలంగాణ మట్టి జీవితాలను కథల్లోకి ఒంపుతున్న పెద్దింటి అశోక్ కుమార్ వంటి వారి కథల్లో నాకు దృక్పథమే నచ్చుతుంది. అవి మంచికథలుగా పాఠక ఆదరణను పొందుతున్నాయి అని చెప్పగలను. కేవలం ప్రయోగం కోసమే కథలు రాసే వారి పేర్లు చెప్పడం అనవసరం కానీ, వారికి కథ ఒక కాలక్షేప పరికరమని మాత్రం అర్థమవుతుంది. కథను ఈ సమాజ విముక్తి కోసం అని భావించే వారి కథల్లో ప్రయోగాల పాలు తక్కువ.

7. ఒక కథ ప్రభావం పాఠకుల మీద శిల్పం వల్ల మిగిలి(గుర్తు ఉండటం) ఉంటుందా? లేక దృక్పథం అందించే  ఎరుక వల్ల మిగిలి ఉంటుందా?

ఎక్కువ సార్లు దృక్పథంతో కూడిన మంచి కథలే పాఠకుల మనసుల్లో నిలిచిపోతాయి. శిల్పాన్ని పట్టించుకోవద్దని నేను అననుగానీ, శిల్ప ప్రయోగం పేరుతో అసలు కథా ప్రయోజనాన్నే విస్మరించిన రచయితలకు తెలుగు నాట కొదువ లేదు. మనది సంఘజీవితమనే సోయి, అనుభవానికి కళాత్మక రూపమిస్తున్నమనే ఎరుక, అది సామాజిక ప్రయోజనం కోసమే అనే దృక్పథం ఉంటే ఎవ్వరైనా మంచి కథ రాయగలరు.

8. ఈ ప్రభావం వైపు నుంచి వర్తమాన కథను ఎలా చూడవచ్చు?

ముందే చెప్పినట్టు వర్తమాన కథ వర్తమాన జీవితానికి ప్రతిబింబంగా ఉండాలి. ఉంటుంది. కాకుంటే సామాజిక పరిణామాల కార్యకారణ సంబంధాలను అర్థం చేసుకోవడంలో రచయితలకు సరైన దృష్టికోణం ఉండడం లేదని మాత్రం అర్థమవుతున్నది. సామాజిక బాధ్యతగా భావించే రచయితలు పెరగాలి. కథ బాధిత సమూహాల విముక్తి దోహదం చేయాలి.

Leave a Reply