(‘Fractured Freedom’: One Fractured Ideology )

(కోబ‌డ్‌గాంధీ జైలు ర‌చ‌న ఫ్రాక్చ‌ర్డ్ ఫ్రీడం. దీనిపై  మ‌నీష్ ఆజాద్  *ది కోర‌స్‌*లో స‌మీక్ష రాశారు. కోబ‌డ్ గాంధీ దానికి స్పందించారు. ఆయ‌న అభిప్రాయాల‌పై తిరిగి మ‌నీష్ ఆజాద్ రాశారు. ఈ మూడు ర‌చ‌న‌ల‌ను తెలుగు పాఠ‌కుల కోసం వ‌రుస‌గా ఇస్తున్నాం… వ‌సంత‌మేఘం టీం)

కోబాడ్ గాంధీ జైలు డైరీ చదువుతున్నంతసేపూ,  ఆయన జీవన సహచరి అనురాధ గాంధీ ఈ పుస్తకాన్ని చదివి వుంటే కనక ఆమె  స్పందన ఎలా ఉండేది అనే భావన వెంటాడింది. ‘బీహార్-జార్ఖండ్‌లోని నక్సలైట్ ఉద్యమం ఈ రోజు మాఫియా ఉద్యమంగా మారిపోయింది, [ఆమె 12 ఏప్రిల్ 2008 న మెదడుకు వచ్చిన (ఫాల్సిపేరమ్) మలేరియాతో మరణించే ముందు జార్ఖండ్‌లో ఆదివాసీ నక్సలైట్‌లకు అధ్యయన తరగతి చెప్పి వస్తూండింది]. బస్తర్‌లోని నక్సల్-మావోయిస్ట్ ఉద్యమానికి ఇప్పుడు ముందుకు వెళ్ళే మార్గం మూసుకుపోయింది, విప్లవం ఇకపై అనివార్యం కాదు, విప్లవం, సాయుధ పోరాటాలు ప్రపంచ యుద్ధాల సమయంలో మాత్రమే విజయవంతమవుతాయి, ఎన్నికల బహిష్కరణ ఎల్లప్పుడూ అభివృద్ధి నిరోధకులకు ప్రయోజనం చేకూరుస్తుంది కాబట్టి ఆ వ్యూహం పనికిరానిదైపోయింది,  వామపక్ష భావజాలంలో ఏ విధమైన సృజనాత్మకత లేకుండా పోయింది, భారతదేశంలోని  మొత్తం వామపక్ష-నక్సల్ ఉద్యమం సంకుచితత్వానికి బలైంది… అవుతూంది కూడా’ – ఈ అభిప్రాయాలను ఆమె అంగీకరించి ఉండేదా?

ఆర్థిక సమానత్వమనే మన లక్ష్యాన్ని సార్వత్రిక ఆనందంగా మార్చుకోవాలనే  పరిష్కారంతో అనురాధ గాంధీ అంగీకరిస్తారా? ‘గత 100 ఏళ్లలో కమ్యూనిజం క్షీణించడానికి నాయకత్వ సహచరులు కార్యకర్తలకు మంచి విలువలను అందించలేకపోవడమే ఏకైక కారణం’ అనే అతి సరళీకరణతో అనురాధ గాంధీ అంగీకరిస్తారా?

ఇక్కడ అనురాధ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏమంటే, కోబాడ్ బుద్ధుడిలాగే తన ‘రాజభవనాన్ని’ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నిద్రపోతున్న తన యశోధరను, అంటే అనురాధను విడిచిపెట్టి పోలేదు, కల్లోలభరిత 70 వ దశకంలో, ‘సత్యాన్వేషణ’ లో ఈ తిరుగుబాటుదారులిద్దరూ చేతులో చెయ్యేసి బయలుదేరారు. ఆ జీవన మార్గంలో సాక్షాత్కరింఛిన సత్యం వారిద్దరికీ చెందుతుంది. మూల కథలో బుధ్ధుడు తిరిగిరాలేదు. అనురాధ- కోబాడ్ కథలో అనురాధ తిరిగి రాలేదు. ఆమె తన అన్వేషణలో, తాను నిర్మించిన  సత్యంలో విలీనమైపోయింది.  కానీ కోబాడ్ తిరిగి వచ్చాడు. తన ‘వామపక్ష సంకుచితత్వం’ కారణంగా, తన ‘సముదాయ’ ప్రజల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయానని బాధపడుతున్నాడు కూడా. సరే, ఏ సత్యంతో అతను తిరిగి వచ్చాడో ఆ సత్యం వారిద్దరిదీ కాదు. కేవలం కోబాడ్‌ది మాత్రమే. అతని ‘భగ్నమైన  స్వేచ్ఛ’ లాగే అతని ‘భగ్నమైన సత్యం’.

వాస్తవానికి యిది కేవలం జైలు డైరీ మాత్రమే  కాదు. అతని మాటల్లోనే, పూర్తి జీవిత ప్రతిస్పందన. ఈ ప్రక్రియలో పది సంవత్సరాల వేదనాభరిత జైలు జీవితం కూడా వుంది. తన జైలు జీవితంపై చేసిన వ్యాఖ్యలు చాలా సరియైనవి. ‘ఫాలీ నారిమాన్, కోలిన్ గొంజాల్విస్, రెబికా జాన్, కె.డి.రావు లాంటి గొప్ప లాయర్లు, ప్రభావశాలురైన మొత్తం మానవ హక్కుల కార్యకర్తలు వెంట ఉన్నప్పటికీ, దేశంలోని విభిన్న ప్రదేశాల్లోని 7 జైళ్ళలో, ఏ శిక్ష పడకుండానే, విచారణ ఖైదీగా విలువైన 10 సంవత్సరాలు వృథా అయితే, ఈ దేశంలో సామాన్యుల లేదా సాధారణ ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుంది’ అని అంటున్నారు.

నేను కూడా నా జైలు జీవితంలో ఇంత  తీవ్రంగానే అనుభూతి చెందాను. తమ జీవితాన్ని ఎవరో పీల్చేసినట్లుగా, ఒక నీడలా సాధారణ ఖైదీలు బతుకుతున్నారు. చార్లెస్ డికెన్స్, అప్పటి అమెరికాలోని జైళ్ల గురించి  ‘శరీరాన్ని రక్షించుకుంటూ, ఆత్మను చంపుకుంటున్నారు’ అని అంటాడు.

జైలులో తనతోపాటు వున్న తోటి ఖైదీలగురించి కోబాడ్ రాసినవారిలో అఫ్జల్ గురు ప్రస్తావన తీక్షణంగా మనసుకు హత్తుకుంటుంది. ఈ వ్యవస్థ అఫ్జల్ గురు లాంటి అమాయక, అధ్భుత మానవుల రక్తరుణాన్ని ఎంతకాలం భరించగలదో చూడాలి. రాబోయే రోజుల్లో, ఎవరైనా అఫ్జల్ గురును కలవాలనుకుంటే , ఈ పుస్తకంలోని ఈ కొన్ని పేజీలు గొప్ప గవాక్షంగా  పనిచేస్తాయి.

కానీ జైల్లోని ఈ కిటికీ నుంచే, కోబాడ్ జార్ఖండ్, బీహార్, ఒరిస్సాలోని మావోయిస్టు ఉద్యమాన్ని కూడా చూసి, ఉద్యమం ప్రజల నుండి దూరమై ఒక ముఠాగా మారిందనే నిర్థారణకు వస్తాడు. ముఖ్యంగా జార్ఖండ్ జైళ్ళలో వున్న మావోయిస్టు ఖైదీలు లేదా మావోయిజాన్ని వదిలేసిన వారు చెప్పిన కథలు, వారి ఆచరణ నుంచి ఈ నిర్థారణకు వస్తాడు .

2013లో, సుధీర్ మిశ్రా నక్సల్ నేపథ్యంలో హజారో ఖ్వాహిషే ఐసీ అనే సినిమా తీసారు. ఈ చిత్రాన్ని సమీక్షించేటప్పుడు విమర్శకుడు విష్ణు ఖరే –  బెల్లం పాకాన్ని పొయ్యి మీద ఉడికిస్తున్నప్పుడు, పాకానికీ, పాకం మీద  తేలుతున్న మడ్డికి మధ్య వుండే తేడాని  సుధీర్ మిశ్రా చూడలేకపోయారని ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మిఠాయి తయారు చేసే వ్యక్తి నిరంతరం ఈ మడ్డిని నిరంతరం తొలగిస్తూ ఉంటాడనే విషయాన్ని వారు చూడలేకపోతారు. బెల్లం పాకం తయారీలో ఇది తప్పనిసరి ప్రక్రియ. లెనిన్ దీనిని ఒక సూత్రీకరణగా ఇలా వివరిస్తాడు – ఏదైనా శక్తివంతమైన విప్లవం శక్తివంతమైన ప్రతిఘాతానికి దారితీస్తుంది. అది బయటినుంచి మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా వస్తుంది. దేశంలోని, ప్రపంచంలోని విప్లవోద్యమాలన్నింటి గురించి బాగా తెలిసిన కోబాడ్, ఇక్కడ పాకానికీ,  పైన తేలే మడ్డికి మధ్య వుండే వ్యత్యాసాన్ని చూడలేకపోవడం చాలా విచారకరం. అనురాధ గాంధీ తన వ్యాసాల సంకలనం scripting the change లో,  2001 లో ‘పోరు మహిళ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో,  ‘బెల్లం పాకం ప్రక్రియ’ని ఆదివాసీ మహిళల సందర్భంలో చాలా చక్కగా వివరించారు.

బీహార్-జార్ఖండ్ ఉద్యమం గురించి వ్యాఖ్యానిస్తూ, ఆ ఉద్యమ పాత్రని పూర్తిగా నిరాకరించారు. బీహార్-జార్ఖండ్‌లో ‘సన్ లైట్’, ‘మూన్ లైట్’ వంటి అగ్ర-కుల ప్రతిఘాతుక శక్తులను తొలగించిన ఘనత అక్కడి నక్సలైట్స్-మావోయిస్టులకే చెందుతుందనే గొప్ప వాస్తవాన్ని కోబాడ్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు కూడా చూడలేకపోవడం ఆశ్చర్యకరం. జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్ తన జైలు డైరీ ‘కైద్‌ఖానే కా ఆయనా ‘ లో ఈ ముఖ్యమైన వాస్తవాన్ని వెల్లడించారు. అది కూడా జార్ఖండ్ జైలులో ఉన్న ఖైదీల ద్వారానే.

కోబాడ్‌కున్న మార్క్సిస్ట్ ‘జ్ఞానాన్ని’ ఎవరూ వేలెత్తి చూపలేరు. మార్క్స్ ‘కాపిటల్’ రాయడానికి  పూర్తి వివరాలు  (నోట్స్) రాసుకున్న బ్రిటిష్ మ్యూజియంలోనే, కోబాడ్‌ లండన్లో ఉన్నప్పుడు మార్క్సిజాన్ని అధ్యయనం చేసారు .

కానీ అశ్చర్యాన్ని కలిగించే విషయమేమంటే  స్వేచ్ఛలాంటి విలువ గురించి మాట్లాడుతున్నప్పుడు, కోబాడ్‌ సూఫీ సాధువు రూమితో సహా, భక్తి ఉద్యమంలోని కవులందరితో పాటు అస్తిత్వవాది అల్బైర్ కాము వరకు  ఉదహరించారు, కానీ స్వేచ్ఛకు సరైన మార్క్సిస్ట్ నిర్వచనాన్ని ఒక్కసారి కూడా ఉదహరించ లేదు. ఎంగెల్స్ వ్రాసినట్లుగా – ‘స్వేచ్ఛ అనేది అవసరాన్ని గుర్తించడం’. ‘స్వేచ్ఛ అనేది కేవలం అవసరాన్ని గుర్తించడమే కాదు, అందులో మార్పు ప్రక్రియ వుంది’ అని తరువాత మావో ఆ నిర్వచనాన్ని పూర్తి చేశారు. ఈ నిర్వచనం అనివార్యంగా స్వేచ్ఛను విప్లవోద్యమంతో కలుపుతుంది. కోబాడ్ పుస్తకంలో పేర్కొన్న స్వేచ్ఛ విలువను పుష్పగుచ్ఛాలతో మాత్రమే అలంకరించవచ్చు.

ప్రపంచంలోని మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమ ఓటమిని ‘కొన్ని విలువలు లేకపోవడంలోకి’ (దీనిని అతను ‘అనురాధ నమూనా’ అని పిలుస్తారు) కుదించిన విధానంలాంటి మేధో వ్యాయామాన్నే 1948లో ఫ్రాంక్‌ఫర్ట్ స్కూల్‌కు చెందిన అడోర్నో, హోకీహైమర్‌లు  చేశారు. ఫాసిజమూ, సోవియట్ నిరంకుశత్వాల మూలం ‘ తర్కపు సామర్థ్యం ‘ బలవంతంగా నిరూపితమైన యూరప్‌లోని ‘జ్ఞానోదయం’లో ఉందని అతను తన పుస్తకం’ డయలెక్టిక్స్ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్ ‘లో అతను నిరూపించాడు .

‘స్వేచ్ఛ-ఆనందం-మంచి విలువ’లకు మార్క్స్ ప్రారంభంలో కొంత ప్రాముఖ్యతనిచ్చాడు కాని తరువాత ఆచరణాత్మక ఉద్యమంలో అవి ఎక్కడో పోయాయి, ఈ నాడు వాటిని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కోబాడ్ స్పష్టంగా వ్రాశారు. ఇలా అనడంలో, కోబాడ్ పారిస్ కమ్యూన్-సోవియట్ విప్లవం-చైనీస్ సాంస్కృతిక విప్లవాలన్నింటినీ ఒకే గాటన కట్టేసారు. ఈ మూడు శ్రామికవర్గ మహత్తర, పెద్ద ఉద్యమాల నుండి ‘స్వేచ్ఛ-ఆనందం-మంచి విలువను’ వేరుచేసే ఈ చారిత్రక దృష్టి ఎలాంటిది?.

వాస్తవానికి, ఇలా ‘విలువల’ ను వాటి సందర్భం నుంచి విడదీసి, సమస్యకు పరిష్కారంగా చూపించడం, 1939 లో చైనాలో ప్రచురితమైన ‘మంచి కమ్యూనిస్టుగా ఎలా ఉండాలి’ అనే పుస్తకాన్ని గుర్తుచేస్తుంది. ‘లు షావో చి’ రాసిన ఈ పుస్తకం, సాంస్కృతిక విప్లవం సందర్భంగా తీవ్ర విమర్శలకు గురైంది. ఈ పుస్తకంలో కూడా ‘స్వీయ శుద్ధీకరణ’కు(self cultivation) చాలా ప్రాధాన్యత ఇచ్చారు.

వాస్తవానికి, ఒక అందమైన గులాబీ దాదాపు తన లాంటి అందమైన గులాబీల మధ్యనే  పుడుతుంది. తోటమాలి తన కోసం వాటిలోంచి ఒకదాన్ని ఎలా ‘ఎంచుకుంటాడో’,  అలాగే చరిత్ర కూడా అనేకమంది అనురాధలలోంచి ఒకరిని ‘ఎంచుకుంటుంది’. చరిత్ర చాలా మంది లెనిన్‌లలో ఒకరిని ఎంచుకుంది, ఆ లెనినే సోవియట్ విప్లవానికి ప్రధాన వ్యూహకర్త అయ్యాడు. కానీ విషాదమేమిటంటే, ‘అనురాధ నమూనా’ గురించి మాట్లాడుతూ, కోబాడ్ ఈ చారిత్రక ప్రక్రియను చూడడు. వద్దనుకున్నప్పటికీ , ఆమె శూన్యం నుండి పుట్టినట్లు, అనురాధ గాంధీని ఒక ‘ఉన్నతవర్గ నమూనా’ గా మారుస్తాడు.

సరే, ఏమైనప్పటికీ, కోబాడ్ మనిషి మంచితనం, భవిష్యత్తులపై నమ్మకాన్నికోల్పోలేదు అనేది మంచి విషయం. అమలు చేయాల్సిన ఒక ఊహాజనితమైనదాని (ఉటోపియా) గురించి పుస్తకం అంతటా మాట్లాడుతుంటాడు. కోబాడ్ చెప్పే ఈ ఉటోపియా, ఎంగెల్స్ ‘శాస్త్రీయ సోషలిజం’ కాకుండా, మార్క్స్ కంటే ముందు వున్న ఫ్యూరీ-సైమన్-ఓవెన్ లాంటి  కాల్పనిక సోషలిస్టుల యుటోపియా కావడం యిక్కడ బాధ కలిగించే విషయం.

40-50 సంవత్సరాల తరువాత తన సముదాయంలోకి  తిరిగి రావడాన్ని పండగ చేసుకుంటూ,  కోబాడ్ ఇలా అంటాడు – “ఈ కలవడంలో నా పరిధి చాలా పరిమితమైపోయింది అని గ్రహించాను. నూతన, తాజా ఆలోచనలతో నా సంబంధం తెగిపోయింది. పరిమిత, స్థగిత వామపక్ష వలయంలో వుండడం వల్ల, నేను బాధ, అల్పత్వం, సృజనాత్మకత లేమికి బలైపోయాను. అందువల్ల  ప్రాముఖ్యత లేని విషయాలలో శక్తి వృధా అవుతుంది, మానసిక ఒత్తిడి  పెరుగుతుంది, మనిషి  సృజనాత్మక సామర్థ్యం క్షీణిస్తుంది. ‘ఇప్పుడు నేను నా ఆలోచనలకు చలనశీలతనిచ్చే నూతన, విభిన్న ఆలోచనలకు సిద్ధంగా ఉన్నాను, అది కొత్త ఆలోచనల వికాసానికి సహాయపడుతుంది.’ ఒకవేళ కొత్త ఆలోచనలు ఈ విధంగా వస్తే, ఆ కొత్త ఆలోచనలకు కోబాడ్‌కు అభినందనలు. కానీ ఇందులో కొత్త ఏమిటో అర్థం చేసుకోవడానికి, శీర్షాసనం వేయాల్సి రావచ్చు.

తిరిగి వచ్చిన బుద్ధుడు తన సత్యాన్ని తనవరకే ఉంచుకొంటే బాగుండునని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. దాన్ని బహిర్గతం చేయకూడదు. ఎందుకంటే అతని ‘అంతిమ సత్యం’ అతని మునుపటి ‘క్రియాశీలక  సత్యాన్ని’ మరుగుపరుస్తుంది ఒక రకంగా సత్యాన్వేషణ ఆగిపోతుంది. మార్గం మూసుకుపోతుంది. ఇక స్వేచ్ఛ, ఆనందం, మంచి విలువలు కూడా కనిపించవు.

తెలుగుః కె. ప‌ద్మ

Leave a Reply