ఉదయం ఏడుగంటలు కావస్తున్నది. తనతో ఉన్న వారిలో నుండి ఇద్దరిని తీసుకుని ఊళ్లోకి బయలుదేరింది. అది నాలుగు గడపలున్న కుగ్రామం. పేరు మాకడిచూవ్వ.  గడ్చిరోలీ జిల్లా చాముర్షి తాలూకాలో ఉన్నది. రాయగఢ్‌ నుండి వలసవచ్చిన ఉరావ్‌ ఆదివాసులవి రెండు ఇళ్లు.  స్టానికులవి రెండు గడపలు.

వర్షాలు జోరుగా కురుస్తూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలం. ఎడ్ల భుజాల మీదికి కాడిని ఎక్కించిన రైతులు పొలానికి పోవటానికి తయారవుతున్నారు. ఆడ‌వాళ్లు  వంటపని ముగించుకుని అన్నం డొప్పల్లోకి సర్దేశారు.  దానికి విడిగా ఆకు మూత వేసి గంపలో అన్ని డొప్పలనూ పెట్టుకున్నారు. పొలానికి పోవటానికి సిద్ధమవుతున్నారు.

 రణితను దూరం నుండే గుర్తుపట్టారేమో లాల్‌ సలాం చేయటం కోసం ఇళ్లల్లో నుండి బయటికి వచ్చారు. న‌వ్వుతూ  ఆప్యాయంగా చేతులు కలుపుతున్నారు. ఆమె పలకరిస్తున్నది అందరినీ. తెల్లని రంగు, చక్కని రూపు రేఖలు, నవ్వు ముఖం బక్కపల్బని శరీరం. మరీ పొట్టిగాని ఎత్తు. అడవి పూవులా స్వచ్చంగా పరిమళించే పలకరింపు.  రణిత చాద్‌గాం ఏరియా జనతన సర్కారు అధ్యక్షురాలు. కొత్త ఆర్‌పేసిల నిర్మాణం కోసం, ఉన్న వాటిని పటిష్టం చేయ‌డం కోసం పొట్టెగాం ఏరియాకు వచ్చింది.

సూర్చాగఢ్‌ కొండల చివరి కొస అది. అక్క‌డ‌ ఇనుప గనులను ప్రారంభించటానికి ప‌నులు జ‌రుగుతున్నాయి.  రోడ్ల ప‌నులు  ముమ్మరం చేశారు. గనుల ప్రభావం ఉన్న  గ్రామాలలో మాకడి చువ్వ కూడా ఉన్నది.

రణిత నడి బజార్జో ఆగింది. పిల్లలూ, ఆడ‌వాళ్లు చుట్టుముట్టారు. ఒక ముసలి అవ్వ మెటికలు విరుచుకుంటూ వచ్చింది. “ఎన్నాళ్లకు  వచ్చినవ్‌ బిడ్డా’ అంటూ ఆమె గడ్డం పుణికింది. ఇంతలో కొస ఇంటి రైతు ఉరికి వచ్చాడు. ‘ఊళ్లోకి పోలీసులు వస్తున్నారు” అని చెప్పే వరకే వాళ్లు అక్కడికి అందనే అందారు.

 రోడ్డు పనుల్లో ఉన్న  టేకేదార్ల వాహనాలను రెండు రోజుల కింద తగులబెట్టారు. దళం పోయే దిశను అంచనా వేసిన పోలీసులు ఉదయమే గ్రామాన్ని చుట్టుముట్టారు. దళం గ్రామంలోకి రావటాన్ని ఊరి చివరి నుండి గమనించిన పోలీసులు పారలల్‌గా అడ్వాన్స్‌ అవుతూ ఒక టీం ముందుగా వచ్చింది.

మొదటగా వాళ్లే ఫైరింగ్‌ ఓపెన్‌ చేశారు. రణిత టీం తాము వచ్చిన దిక్కు వెనుదిరిగింది. తనతో ఉన్న ఇద్దరు సభ్యులు తిన్నగా అడవి వైపు వేగంగా పరుగుతీశారు. వారిని తరుముకుంటూ కోబ్రాలు అడవి అంచులదాకా పోయినాయి.

వెనుకకు తిరిగిన రణిత వెంటనే మలుపు తిరిగి సందులోంచి జొన్న పెరట్లోకి దూరిపోయి నిశ్శబ్దంగా కవరు తీసుకుని ఉన్నది. రణిత తమ ఇంటి పెరటి వైపు రావటం చూసిన ఇంటి య‌జ‌మానురాలు  దగ్గరగా వచ్చి, ‘పోలీసులు ఎవరూ లేరు, తొందరగా బయటికి వెళ్లిపో దీదీ | అని చెప్పింది.

పోలీసుల‌ ఆనుపానులు ఖచ్చితంగా తెలియకుండా ఊరికే అటు ఇటు ఉరుకులాడ వద్దని గట్టిగానే నిర్ణయించుకున్నది. నడుముల ఎత్తు పెరిగిన జొన్న పెరట్లో  కేమోప్లేస్  అయి టెర్రెయిన్‌కు అనుగుణంగా తనను తాను మలచుకున్నది. ముందే ఆఫ్‌ కాక్‌లో ఉన్న తన .303 తుపాకీని పుల్‌ లోడ్‌ చేసింది. ట్రిగ్గర్‌పై వేలుపెట్టి నిశ్శబ్దంగా బ్రీతింగ్‌ కంట్రోల్‌ చేస్తూ వేచి చూస్తున్నది.

పిఎల్‌జిఎ సభ్యులను తరిమి వాపసు వచ్చిన కోబ్రాలు ఊల్లో గుమిగూడాయి గుంపుగా… హిందీ, మరాఠీలు కలగా పులగంగా వినిపిస్తున్నాయి. ఒక కోబ్రా విరుచుకుపడింది. నేలపై వెల్లకిలా పడి గుడ్డు తేలేసింది.

“ఏమైంది …. క్యా హువా బే?”

“ఎవరి తుపాకి పేలింది?”

“తూటా గుండెకు పడింది. స్పాట్‌ డెత్‌.”

“నీదా… నీదా… ఎవరి తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది ?’ కకావికలయింది తోడేళ్ల గుంపు.

చుట్టూ వెదికారు. ప్రమాదం ఏమీ అగుపడలేదు.

తమలో ఎవరిదో తుపాకీ యాక్సిడెంటల్‌ ఫైర్‌ అయింది. కోబ్రా కమాండెంట్‌ తన  వైర్‌లెస్‌తో గడ్చిరోలీ హెడ్ క్వార్టర్స్కి సందేశం పంపాడు. శవాన్ని తీసుకపోవటానికి హెలికాప్టర్‌ వస్తుంది. శవాన్ని మైదానం వైపు తరలిస్తే పికప్‌ తేలికవుతుంది.

చెల్లా చెదురైన కోబ్రాలన్నీ ఒక దగ్గర గుమిగూడి శవాన్ని మోసే ప్రయత్నాల్లో మునిగాయి.

౦౦౦

ఢాం!ఢాం!
ఈ సారి రెండు తూటాలు పేలాయి వరుసగా…

ఒకని తొడలోంచి చీరుకు పోయింది. నేలమీద కుప్పకూలి తేనెటీగలు కుట్టిన గొడ్డులా వెర్రిగా అరుస్తున్నాడు.

మరొకడు నిశ్చేతనంగా భూమికి కరుచుకుపోయాడు.

ఈ సారి పేలుళ్ల దిశ స్పష్టంగానే తెలిసింది.

జొన్న పెరట్లో ఎవరో ఉన్నారు. శత్రువుకి స్పష్టం అయింది.

గుంపులో కలకలం మొదలయింది. గుంపు మల్లగుల్లాలు పడుతున్నది.

రెండు శవాలూ, గాయపడిన కోబ్రా తరలిపోయాయి హెలికాప్టర్‌లో.

రోడ్డున పోయే శవాలను అభద్రత… భూసారంగాల ఫోబియాకు గాలిలో ప్రయాణం భద్రతనిచ్చింది.

మొబైల్‌, వాకీటాకీలు బిజీగా అత్యవసర ఆదేశాలను జారీ చేస్తున్నాయి. గడ్చిరోలీ పోలీసు సూపరింటెండెంట్‌ ఆఫీసు అంతా కోలాహలంగా ఉన్నది. పెద్ద విపత్తు ఏదో మీద పడ్డట్లుగా ఆందోళనగా తిరుగాడుతున్నాయి క్రాక్‌-60 కమాండోలు. ఆగమేఘాల మీద బలగాలు చేరుకుంటున్నాయి మాకడి చువ్వకు.

మైన్‌ ప్రూఫ్‌ వాహనాలైతేనే కొంత భద్రత. మాకడి చువ్వ చుట్టుపక్కల అయిదారు గ్రామాలను బలగాలు చుట్టుముట్టాయి.  

మొత్తం పరిసరాలన్నీ ఉద్రిక్తంగా మారాయి. తుఫాను ముందటి ప్రశాంతత. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడుతున్నాయి కోరలు తీరిన కోబ్రాలు.

౦00

బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌… హెల్మెట్‌… అసాల్డ్‌ పెజిషన్‌లో కలష్షికోవ్‌తో “నక్సలైట్లు ఎట్టుంటరో చూస్తా అంటూ బోరవిరుచుకుని జొన్న పెరటివైపు అడుగులు వేస్తున్న కోబ్రా పెరటి దగ్గరికి చేరీ చేరకముందే ‘ఢాం’ అని తుపాకి పేలటం, బుల్లెట్‌ ప్రూఫ్‌ కోబ్రా ఎగిరి బొక్క బోర్జా పడటమూ ఒకేసారి జరిగి పోయాయి.

పరిసరాలన్నీ ఉద్విగ్నంగా మారాయి.

కోబ్రా, సి-60 ల ముఖాలు కందగడ్డలైనాయి.

పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లోపల గుండెలు పీచు పీచుముటున్నాయి. తర్వాత వంతు ఎవరికి వస్తుందో… అధికారుల ఆదేశాలు పాటించాల్సిందే కదా!

జొన్న పెరట్లో… పద్మ వ్యూహంలో చిక్కుకున్న రణిత. ఒంటరిగా… నిబ్బరంగా, నిశ్చలంగా. చివరి ఊపిరి వరకూ పోరాడాలి. ప్రాణాలతో శత్రువుకు దొరకకూడదు. తన తుపాకీని ధృఢంగా పట్టుకున్నది.

“పెరటి చుట్టూ వినవస్తున్న  బూట్ల శబ్దాలను నిశితంగా గమనిస్తున్నది. ఆచి తూచి ట్రిగ్గర్‌ను నొక్కుతున్నది.

వాచీని చూసుకున్నది. యుద్ధం మొద‌లై  నాలుగు గంటలకు పైగానే కావస్తున్నది.

కోబ్రాలు బుస్సు బుస్సుమంటున్నాయి. మాట‌లు వినిపిస్తున్నాయి. 

“తుపాకి వదిలేసి రెండు చేతులూ  పైకి ఎత్తి బయటకు వచ్చేయి… నిన్ను మేం ఏమీ చేయం.”

ఇంకాసేప‌టికి .. మ‌ళ్లీ “ప్రభుత్వం వైపు డబ్బులు దొరుకుతాయి. మంచిగా బతకొచ్చు.”

పెరట్లో ఉన్నది ఎవ‌రో తెలుసుకున్నారు.  

ఈ సారి పేరు పెట్టి మొత్తుకుంటున్నాడు, ‘రణితా! ధైర్యం ఉంటే ముందుకు రావే! దొంగచాటుగా ఏం లడాయి చేస్తవే?” ఛాలెంజి చేస్తున్నాడు పోలీసు భాషలో.

కానీ, ఇవన్నీ కిల్లింగ్‌ జోన్‌కు దూరం నుండే… దగ్గరికి పోవటానికి ఎవనికీ గుండె ధైర్యం సరిపోవటం లేదు.

 కె లాంఛర్లతో గ్రైనేడ్డు వేయటం మొదలు పెట్టారు. ఒకటి..రెండు..ఇరవై.. ముప్పై.. లెక్కలేదు. పచ్చగా ఏపుగా పెరుగుతున్న మొక్కజొన్న మొత్తం ధ్వంసం అయిపోయింది.

ఇన్ని బాంబులు పడినంక చచ్చిపోయి ఉంటదనే ధైర్యంతో పెరటి వైపు నుండి వచ్చారు.

తుపాకి గురి తప్పటం లేదు. ఒకని చేతినీ. మరొకని తుంటినీ చీరుకు పోయాయి తూటాలు.

కాసేప‌య్యాక‌.. పరిసరాలన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి.

 ౦౦౦

ఒంటి ఊపిరి ప్రాణం. పొద్దుట్నుండి పొట్టలో ఖాళీ. పోలీసులు రాకుంటే గ్రామంలో ఇంత అంబలి అడిగి తాగి ఉండేది. తన నీళ్ల క్యాను డేరాలోనే వదిలి వచ్చింది. తనతో వచ్చిన ఇద్దరు కామ్రేడ్స్‌ సురక్షితంగానే తప్పుకున్నారో! తన దళం వాళ్లు క్షేమంగానే ఉండి ఉంటారు.

ఒంట్లో శక్తి లేనట్టుగా, నిస్సత్తువగా అనిపిస్తున్నది.

గ్రైనేడ్డ శబ్దాలు, విస్పోటనాలతో చెవులు గళ్లు పడినట్లయినాయి.

౦౦౦

అర్థచేతనావస్థలోనే ఉదయం పోలీసులు తటస్థ పడిన దృశ్యం రీలులా తిరిగింది.

రణితకు అర్థం అయింది. పోలీసులు తనను గమనించలేదని. తన ముందు గుంపును చూసి కాసేపు అక్కడే మెదలకుండా ఉండి ఉంటే పోలీసులు వెళ్లిపోతారు. తను సురక్షితంగా తప్పించుకోవచ్చు.

తను ఒక్క తూటా ఫైర్‌ చేసినా తప్పించుకోవటం కష్టమే. ఆత్మ త్యాగానికి సిద్ధమయితేనే తూటా పేల్చాలి. కాసేపు ఘర్షణ పడింది.

అప్పుడు కూడా ఆమె ఆలోచ‌న‌ల ప‌టుత్వం త‌గ్గ‌లేదు.  ఈ క్షణంలో   ప్రాణం కాపాడుకోవటం గురించి ఆలోచిస్తున్నదేంటి? నేను నా వారసులకు ఏం అందించాలి?   

చేతికి వ‌చ్చిన  అవకాశాన్ని వదులుకోగూడదు. తను పార్టీలోకి వచ్చిన మరుసటి సంవత్సరం నుండి ప్రతి వేసవి కాలం మండుటెండల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగేవాళ్ళు. ఇవాళ కాలికి తగిలిన తీగను విడిచిపెట్టడం ఎలా? తను చనిపోయినా మంచిదే కానీ   అవకాశాన్ని విడవకూడదని అనుకుంది.  నిర్ణయించుకుంది.

000

కొంచెం తెలివిలోని వచ్చింది. తన చుట్టూ పరిసరాలను గమనించింది. దరిదాపుల్లో పోలీసుల అలికిడి లేదు. మళ్లీ మగతలోకి జారిపోయింది.

ర‌ణిత‌కు త‌ను ఉన్న ప‌రిస్థితి తెలుస్తోంది. మ‌గ‌త‌లో బాల్యం తోసుకొని గుర్తుకొస్తోంది. తోసేసుకోవ‌డం చేత కాలేదు. 

000

తన కలకత్తా ప్రయాణం గుర్తొచ్చింది. అప్పుడే చచ్చిపోయేది. ఎట్లనో బతికింది. సంవత్సరం గుర్తుకురావటం లేదు. 1998 వేసవి కాలం. సరిగ్గా ఆకులు కోసే కాలం. నక్సల్చరీ 30 సంవత్సరాల వేడుకల కోసం కలకత్తా షహీద్‌ మీనార్‌ కు పోయింది.   ఆ వేడుకలు ముగించుకుని ఇంటికి తిరిగి రాంగ హావడా స్టేషనులో దుర్గ్‌ అనుకుని గుజరాత్‌కు పోయే రైలుబండి ఎక్కేశారు. బండి కదిలే సమయానికి ఎవరో చెప్పారు. ఆదరాబాదరాగా దూకేశారు. ఒక కాలు ప్లాటు ఫాం మీద పెట్టింది, ఒక కాలు రైలు మట్టుపైననే ఉన్నది. దర్వాజ కడ్డీ గట్టిగా పట్టుకున్నది. బర బర ఈడ్చుకు పోతున్నది. కాళ్లూ చేతులూ కొట్టుకుపోయాయి. రైల్వే పోలీసులు కాపాడారు. ట్రాక్‌ మీదికి జారి ఉంటే అదే రైలు కింద నుజ్ఞు నుజ్జు అయిపోయి ఉండేది. ఈ పాటికి ఊరూ పేరూ అన్నీ మాసిపోయేవి.

ఇంటికొచ్చినంక కూడా కొద్ది రోజులు ఏ పనీ చేయలేకపోయింది.

“ఆకుల  కాలం బిడ్డా, ఆరుగాలం ఎదురుచూసే పంట. నాలుగు  పైసలు కళ్లకు అవుపడేది ఇప్పుడే. పోవద్దు బిడ్డా అని ఎంత చెప్పినా వినకుండా పోతివి. చేతికొచ్చిన పంటను చేజేతులా విడిచిపెడితివి. ఇప్పుడేమో కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకుని వచ్చినవ్‌. డాక్టరుకాడికి పోయి సూది ఏపించుకుంటానికి పైసలెవలిత్తరే? గా మీటింగులు నీ కడుపు నింపుతాయే.” తల్లి నిష్టూరాలను తలవంచుకుని వింటున్నది.  

జీవితంలో రైలుబండిని చూడటం అదే మొదటిసారి… చివరిసారి కూడా… అప్పుడు చ‌నిపోయి ఉంటే..?

అప్ప‌డు త‌న పేరు రాంకో. 

అమ్మ నాన్నల అయిగురు సంతానంలో నాల్లవది రాంకో.  తన తర్వాత మరొక ఆడపిల్ల పుట్టింది.   పొటావి వంశీకుల గ్రామం అయినా తమ హిచామి కుటుంబాలు కూడా సరికి సరిగానే ఉన్నాయి. అనీ ఆదివాసీ గ్రామాల్లాగే ఆ ఊరు కూడా తెగపెద్దల అదుపాజ్ఞలలో నడిచేది.

దళం గ్రామానికి వచ్చేనాటికి రాంకో పదేళ్ల పిల్ల, పాటలంటే చెవికోసుకునేది. దళం కబురు అందిందంటే తూనీగలా తుర్రుమని ఉరికి వచ్చేది. గొడ్డు కాయటానికి పోయినప్పుడు ఈల పాటతో తను విన్న పాటలను పునశ్చరణ చేసుకునేది. ఇంటి పనుల్లో చురుగ్గా ఉండేది. కష్టపోతు. నాగలి దున్నేది. కట్టెలు నరికేది. గట్టు పోసేది. బోరింగు నుండి కావడి వేసుకుని మోసేది. ఆడపిల్లలూ, ఆడ‌వాళ్లూ  బిందెలు నెత్తిన పెట్టుకుని మోయటం ఊళ్లో మామూలే. కానీ రాంకో మ‌గ‌వాళ్ల‌లాగా కావడి భుజాన వేసుకుని నీళ్లు మోసేది. కత్తితో వెదురు బద్దలను చీల్చి గంపలల్లేది.

మ‌గ‌వాళ్లే  చేయగల్లుతారా? ఆడపిల్ల ఎందుకు చేయలేదు అనేది. 

గొడ్డలి, కత్తి, ఉండేలు, విల్లు-బాణం, బర్మారు తుపాకీలు పురుషులవి. మ‌గ గుర్తింపు ఉండేవి. గంప, చీపురు, రోకలి, మూట, గడ్డపార ఇవి ఆడ‌వాళ్ల‌వి.  

రాంకో  మొద‌ట ఇంట్లో పోరు మొద‌లు పెట్టింది.  దళంలే చేరి గెరిల్హాగా మారిన తర్వాత తలకి టోపీ, కుడి భుజానికి తుపాకీ, ఎడమ భుజంపై గొడ్డలి వేసుకుని తిరుగాడుతుండేది. ర‌ణిత అయింది. ఆ కాలంలో ఆమెతో పరిచయమయిన సహచర కామ్రేడ్స్‌ మనోఫలకాలపై హత్తుకుపోయిన   రూపం త‌న‌ది. 

వయసుతో పాటు ఆలోచ‌న‌లు పెరిగాయి. రాంకో క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘంలో చేరింది.   ఇంటా బయటా వత్తిడి మొదలయింది. పిల్ల పెళ్లి చెయ్యమని ఇంటి వాళ్ల మీద ఊరి పెద్దలు  వత్తిడి తెచ్చారు. 

ఆడ‌పిల్ల‌కు పెళ్లి చేయ‌రా?

ఆడ‌పిల్ల‌యితే త‌ప్ప‌క పెళ్లి చేసుకోవాలా?

ముసల్లి అయినంక దాన్నెవరు పెళ్లి చేసుకుంటారు?

ఎద్దేవా చేశారు. వాటన్నిటినీ తట్టుకుంది. తోటి వాళ్ల‌ను నిల‌బెట్టింది.  అన్నీ తెలిసే వ‌ర‌కు  పెళ్లిళ్లు చేసుకోకూడ‌ద‌ని చెప్పేది. 

అప్ప‌టికి ఊళ్లో పెద్ద‌మ‌నుషుల  అధికారమే నడిచేది.   సంఘాలు ఇంకా బలపడలేదు.   చిన్న పిల్లలు, వయసుకొచ్చిన వాళ్లు  దళం వద్దకు పోవద్దనేవాళ్లు.  ఊరి విష‌యాలు ద‌ళానికి చెప్ప‌కూడ‌ద‌నే వాళ్లు.  మంత్రాలంటే అంద‌రికీ భ‌య‌మే. ఎవరూ నోరు మెదపరు. 

ఇవేవీ రాంకో  ఉత్సాహానికి ఏ అడ్డు క‌ట్టా  వేయలేకపోయాయి.

ఊరి బండారాన్ని దళం ముందు కుండ బద్దలు కొట్టింది. ఇంటి పోరు గెలిచింది. రచ్చ గెలవాల‌ని ఇట్ల చేసింది. 

పక్కూరిలో మహిళా సంఘం వాళ్లు అన్నీ వాళ్లే  చేసుకుంటున్నారు.  తమ ఊరి సంఘం వెనకపడిపోయిందని రాంకో తపన పడేది. తన తోటి యువతులను వెంటేసుకుని పక్కూరు కోయందూడ్‌కు పోయి వాళ్ల‌తో మాట్లాడి వచ్చేది.  ఏడాది తిరిగేసరికల్లా ఊళ్లో ఆమ్మాయిల‌ను క‌లిపింది.  .

ఏడాది తిరిగేసరికి     రేంజి కమిటీ  నాయకురాల‌యింది.   పొటావి జేవెల్లి మహిళా సంఘాన్ని కూడా ఆ ప్రాంతంలో నాయకురాలిగా నిలబెట్టింది.

తన పెదనాయన కడుకు రుషి సంఘంలో పనిచేస్తూ దళంలో చేరాడు. తను గ్రామానికి  వచ్చినప్పుడు దళం గురించి అడిగి తెలుసుకున్నది. తను నడవగలుగుతాను, పోలీసులు ఎదురైతే ప్రతిఘటించ గలుగుతాను, బరువులు మొయ్యగలుగుతాను – ఇంకెందుకు ఆల‌స్యం?    ఏటపల్లి దళ సభ్యురాలిగా మారింది.

చదువు నేర్చుకోవాలని చిన్నప్పటి నుండీ కోరిక బలంగానే ఉండేది. దళ సభ్యురాలిగా సెంట్రీలు చేయటం, గ్రామానికి పోయ రావటం, చాయ్‌ చెయ్యటం, మిగ‌తా  డ్యూటిలు చేస్తూనే సమయం దొరికిందంటే  పలక బలపం బట్టి అక్షరాలు దిద్దేది. పట్టు పట్టి చదువు నేర్చుకున్నది. దీంతో పాటు పార్టీ నడిపే మొబైల్‌ ఎకడమిక్‌ స్కూల్‌, మొబైల్‌. పొలిటికల్‌ స్కూల్‌లో  చేరింది.  

పాటలు రాసింది. లేఖల రూపంలో సహచరుల అనుభవాలను  పంచుకున్నది. తన ప్రాంతంలో పోరాట అనుభవాలను   పత్రికలకు రాసింది.  జనతన సర్కారు సమావేశాలకు ఎజండాలను రూపొందించింది. పనిని మదింపు చేసి సమీక్షలుగా రాసింది. వంద రూపాయల నోటును అబ్బురంగా ముడిచి కొంగుకు కట్టుకునే రాంకో  లక్షల అంకెలను పొల్లు  పోకుండా రాసింది. ఖర్చుల్లో తన పొదుపరితనం చూసి పిసినారి అని ఏడ్పించేవారు.  

ఏడాది పాటు ఏటపల్లి దళ పభ్యురాలిగా పనిచేసిన తర్వాత టి’ప్రాగఢ్‌కు మారింది. అక్కడ తనకు మహిళా సంఘాల   బాధ్యతను అప్పగించారు.  ఆ త‌ర్వాత‌ చాద్‌గాం దళ బాధ్యురాలైంది.  

ర‌ణిత‌కు కొద్దిగా స్పృహ వ‌స్తోంది. కూడ‌గ‌ట్టుకోవాల‌నుకుంటోంది. మ‌ళ్లీ గ‌తం గుర్తుకొస్తోంది. 

ఆమె నోటి వెంట “నా వల్ల కాదు, నేను చేయలేను” అనే మాట ఎన్నడూ  రాలేదు. ఆమె నీటిలో చేప అయింది.   ఒక అయస్కాంత కేంద్రం అయింది.  

టిప్పాగఢ్‌లో ఉండగా దళం ఒకరోజు బందూర్‌ వైపు పోతూ ప్రయాణం మధ్యలో విశ్రాంతి కోసం ఆగింది. మూత్రాలకూ, దొడ్డికీ పోయేవాళ్లు పోయారు. బీడిలు కాల్చే వాళ్లు ముట్టించారు. పొగ తినే వాళ్లు పొగను అరచేతిలో వేసి నలుపుతున్నారు.

వెనక నుండి తాము వచ్చిన తోవే పట్టుకుని వచ్చారు పోలీసులు. అప్పటికి దళలకు ‘ఫైరింగ్‌ల అనుభవం తక్కువే. ఎటుపోయిన వాళ్లు అటే చెల్లాచెదురయ్యారు. రణితకు ప్రత్యక్షంగా ‘ఫైరింగులో పాల్లొన్న అనుభవం లేదు. తను ఇంటి వద్ద ఉండగా ఊరి పక్కన ఒకసారి దళం వాళ్లకి ఫైరింగ్‌ జరిగినప్పుడు ఫైరింగ్‌ల శబ్దాలు విన్నది. ఈ రోజు అనుకోకుండా జరిగిందేమో మొదట సర్‌పైజ్‌కు గురి అయింది. ఎటు పోవాలో తోచక కొద్దిసేపు అలానే నిలబడిపోయింది. పోలీసులు దగ్గరకు వచ్చేశారు. ఒక పోలీసు పట్టుకోవటానికన్నట్టుగా మీదికి ఉరికివస్తుండు. తను ఉరికినా ముందు అంతా మైదానం, ఒక పెద్దబండ కనిపించింది. దాన్ని చాటు చేసుకుని తుపాకిని లోడ్‌ చేసి ఉరికొస్తున్న వాని మీదికి ఫైర్‌ చేసింది. వాడు అటే ఆగి పోయాడు. దొరికిన వెసులుబాటుతో తను క్షేమంగా రిట్రీట్‌ అయింది. ఆ మరుసటి సంవత్సరం నుండి టిసిఒసిలు చేపట్టడం తామే పోలీసులను వెంబడించటం మొదలయినంక ఇలాంటి ఘటనలు ఎదురుకాలేదు. 2009  నవంబరులో ఛత్తీస్‌గఢ్‌ విధానసభ ఎన్నికల సందర్భంగా సరిహద్దు ప్రాంతంలో పిఎల్‌జిఎ బలగాలు ఎంగేజ్‌ అయినాయి. తాము ఉన్న చోటు నుండి రెండుగంటల దూరంలో శత్రువు ఆచూకీ తెలిసింది. చాలా వేగంగా పోతేగాని దొరకరు. సుమారు 8 కిలోమీటర్ల దూరం. రోల్‌కాల్‌ చేశారు. వేగంగా పోగలిగే బ్యాచ్‌ను ఎంపిక చేశారు. ఆ ఎంపికలో మహిళా కామ్రేడ్స్‌ పేరు రాలేదు. శారీరకంగా బలహీనంగా ఉండే ముగ్గురు మహిళా కామ్రేడ్స్‌ పోవటానికి సిద్దపడి ముందుకు వచ్చారు. ఆ ముగ్గురిలో కా. రణిత ఒకరు. పంతానికి పరుగులు తీస్తున్నారు. ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని లక్ష్యం చేరారు. తాము పాల్లొన్న ఆ ఘటనలో ఇద్దరు పోలీసులు చావటం, మరో ఇద్దరు గాయపడటం వారి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.

౦౦00

రణితకి తెలివి పడింది. శ‌బ్ద ప్ర‌పంచంలోకి వ‌చ్చింది. అవ‌తలి మాట‌లు వినిపిస్తున్నాయి. జ్ఞాప‌కాలు చెదిరిపోయాయి.  లొంగి పొమ్మని అసహనంగా పిచ్చిగా అరుస్తున్నారు.  

ఆ స్థితిలో కూడా  వాళ్ల  వెర్రిని చూసి రణితకు నవ్వొచ్చింది. తన ముందు రెండు మార్గాలు స్పష్టంగానే ఉన్నాయి. ఒకటి లొంగిపోవటం, రెండవది పోరాడుతూ చనిపోవటం. ధైర్యస్థులు పోరాడుతూ చనిపోతారు.  

నా పార్టీ నాకు  లొంగుబాటును ధిక్కరించే ఆత్మాభిమానాన్ని పెంచింది… అని ఒకే ఒక మాట అనుకుంది. 

తన శరీరాన్ని ఎలర్ట్‌ చేసింది. వాచీ చూసుకున్నది. వర్షాకాలం పొద్దుగుంకటానికి గంటే మిగిలింది. కొంచెం చీకటి పడితే ఎంతటి దిగ్బంధ‌న‌ల‌యినా  తనను అడ్డగించలేవు.  తప్పించుకు పోగలుగుతుంది.

ఇంతలో తనకు దగ్గరగా గడ్డిని కోస్తున్న శబ్దం వినిపిస్తున్నది. కొంచెం తల పైకెత్తి చూసింది. ఇంటాయన చేతిలో కొడవలి పట్టుకుని జొన్న చేను కోస్తున్నాడు. ఈ టైంలో ఇదెలా సాధ్యం? బయటి నుండి ఎవరో గదమాయిన్తున్నారు. మొద‌లంటా  కొయ్యమని. తన లొకేషన్‌ తెలుసుకోవటానికి శత్రువు జొన్న చేసు కోయిస్తున్నాడని   అర్ధం అయింది.

చేతి సైగతో రైతును పిలిచింది. కోసిన జొన్న తన మీద వెయ్యమని చెప్పబోతుంటే “బయటికి రా” అంటూ గద్దరింపు వినపడ్డది.

రణిత తన పోచ్‌లో తూటాలను లెక్కపెట్టుకున్నది. పొద్దుటి నుండి 14 తూటాలు ఖర్చయినాయి. 17 మిగిలాయి. ఇదే స్థాయిలో యుద్ధం నడిస్తే ఈ రోజు రాత్రీ-రేపు పగలూ కూడా పోరాటం చేయవచ్చు. తూటాలన్నీ పోచ్‌లో సర్దుకున్నది.

చిన్నపాటి గుంతకు అనుగుణంగా తన శరీరాన్ని మలచుకుని చెవులతో చుట్టుపక్కల శబ్దాలను గమనిస్తున్నది. పై నుండి హెలికాప్టరు గిరికీలు కొడుతున్నది. మైన్‌’ప్రూఫ్‌ వాహనాల శబ్దం మధ్యాహ్నం వినవచ్చింది. అదనపు బలగాలు వచ్చి ఉంటాయేమో! ఊళ్లో మనుషుల సందడి బాగానే వినిపిస్తున్నది. కుక్కలు విరామం లేకుండా మొరుగుతూనే ఉన్నాయి.

కింది నుండి దగ్గరకు పోయి కాల్పులు జరిపే ధైర్యం లేని పోలీసు దగ్గరలో ఉన్న ఇప్ప చెట్టు ఎక్కటాన్ని రణిత గమనించలేదు. రైతును జొన్న కోయటానికి పురమాయించి చెట్టు ఎక్కి పెరటిని గమనిస్తున్న పోలీసు రణిత లొకేషన్‌ను గమనిస్తున్నాడు, లొకేషన్‌ అర్ధం అయిన తర్వాత గుళ్ల వర్షం కురిపించాడు.

ఈ సారి తూటాలు ఆమె శరీరంలోకి దిగబడినాయి. చేతిలో తుపాకి పట్టుకునే ఉన్నది.

తెరిచిన కళ్లు చూస్తున్నట్టుగానే ఉన్నాయి. అచేతనమైన ఆమె సమీపానికి రావ‌డానికి కూడా పోలీసులకు భ‌యంగానే ఉంది. 

పెరట్లోని  మృతదేహాన్ని గ్రామస్తులు  బయటికి తెచ్చారు.  అందులో ఆ రైతు కూడా ఉన్నాడు. 

గడ్చిరోలీ ఎస్‌పికి మాత్రం ఉత్కంఠగా ఉన్నది. ఇంత బక్కపల్చ‌టి  ఈ అర్భకురాలా?  పొద్దుటి నుండి  ముప్పుతిప్పలు పెట్టింది!   ఆమె కంబాట్‌ సామర్థ్యానికి డంగ‌య్యాడు.  600 జవానులు, హెలికాప్టర్డు, ఎంపివిలు, వేల తూటాలు, వందల గ్రైనేడ్లు .. నలుగురు పోలీసుల చావు.. మరో ముగ్గురికి గాయాలు. 

చుట్టూ వంద‌లాది పోలీసులు.  అయినా వాళ్లు అపురూపంగా ర‌ణిత శ‌వాన్ని తీసుకొని వ‌చ్చారు.   ర‌ణిత జ్ఞాప‌కాల్లో మిగిలిపోయిన‌వ‌న్నీ ఆ రైతులో మొద‌ల‌య్యాయి. ఆయ‌న ర‌ణిత‌ను ద‌గ్గ‌రిగా చూసిన‌వాడు. ఆయ‌న రాంకో గురించి కూడా ఆలోచిస్తున్నాడు. 

Leave a Reply