రాయలసీమ సమాజం ఆశలను, ఆకాంక్షలను సభ్య సమాజం ముందుంచడానికి రాయలసీమ సాగునీటి సాధన సమతి, రాయలసీమ ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల సారాంశాలను విస్తృతంగా సమాజం ముందుంచడంలో, వారికీ అవగాహన కల్గించడంలో, చైతన్యం కల్గించడంలో  పత్రికా రంగం  ప్రధాన పాత్ర వహించాల్సివుంది. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన, వెనుబడిన ప్రాంతాల సమస్యలతో పాటు వాటికీ నిర్దిష్ట పరిష్కార మార్గాలను  రాజకీయ వ్యవస్థకు ముందుంచడంలో కుడా  పత్రికా రంగం  బాధ్యతాయుత పాత్ర  వహించాల్సివుంది.  ఆ దిశగా “వసంతమేఘం’ సంపాదకులు, నిర్వహకులు క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికీ ముందుగా అభినందనలు. 

  1. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోస్తా ఆధిపత్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతి పక్షాలు  మద్దతు ఇస్తున్నాయి. దీనిని ఎట్లా చూడాలి?

జవాబు: ఈ అంశంలో రాజకీయ వ్యవస్థను అభినందించాలి. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు  అంటే సుమారు ఏడు దశాబ్దాలుగా వారు నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి వున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన కోస్తా అధిపత్యానికి మద్దునిస్తూ వారి స్వామి భక్తిని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు.

  1. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌డు ఏపీ రాజ‌ధానిని క‌ర్నూలులో ఏర్పాటు చేయాల‌ని  రాయ‌లసీమ వాళ్లు డిమాండ్ చేశారు. అదంతా ప‌క్క‌కుపోయి అమ‌రావ‌తి రాజ‌ధాని అనే ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ఇప్ప‌డు మూడు రాజ‌ధానులు అంటున్నారు. దీన్నంతా రాయ‌ల‌సీమ వైపు నుంచి మీరు ఎలా చూస్తున్నారు?

    జవాబు: రాజకీయ చదరంగంలో రాయలసీమ సమాజం ఆట బొమ్మ అయ్యింది. అట బొమ్మగా కాకుండా ఆడించే బొమ్మగా తయారవడానికి ప్రజా జాగృతి కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతున్నది.
  2. ఇప్ప‌డు తిరిగి తిరుపతి సభలో రాయలసీమ లో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ వ‌చ్చింది. దీని వెనుక ఉన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఏమిటి?

జవాబు: సమాజం చైతన్యవంతం అవుతూ, పాలకులను ప్రశ్నించే దిశగా రాయలసీమ సమాజం ముందుకు పోకుండా వారిని  తికమక పెట్టి నిరోధించే ప్రయత్నం ఒక వైపు చేస్తూ,  పాలకేతర రాజకీయ పార్టీలను అమరావతికి పరిమితం చేస్తూ, మిగిలిన జిల్లాలలో పాలకపక్షం తమ స్థానాన్ని సుస్థిర పరుచుకొనే ప్రయత్నం ఇంకొక వైపు చేస్తున్నది.

  1. ముఖ్య‌మంత్రి వైజాగ్‌లో రాజ‌ధాని అనే నిర్ణ‌యంతో ఉన్నట్లు స్ప‌ష్ట‌మైంది. తాజాగా రాయ‌ల‌సీమ‌కు రాజ‌ధాని అనే నినాదం  వెనుక వైసీపీ ప్ర‌భావం ఉన్న‌ట్ల‌నిపిస్తోంది. ఇది ఆ పార్టీకి, ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రం క‌దా? మ‌రి దేనికి ఇది ముందుకు వ‌చ్చింది?  దీన్ని కొంద‌రు రాయ‌ల‌సీమ మేధావులు కూడా అందుకున్న‌ట్లు క‌నిపిస్తోంది? దీన్ని ఎలా చూడాలి?

జవాబు: రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమ ప్రాజక్టులకు నికర జలాలను అందించడానికి దుమ్మగూడెం నాగార్జున సాగర్ ప్రాజక్టు నిర్మాణం చేపట్టాల్సివున్నా అడగని ప్రతిపక్ష పార్టీకి 2019 ఎన్నికలలో వెన్నుదన్నుగా నిలిచింది రాయలసీమ సమాజం.  వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి కింద 30 వేల కోట్ల రూపాయల సహాయం అందాల్సివున్నా జిల్లాకు 50 కోట్లు ఇవ్వండని  మొక్కుబడిగా అడిగిన  ప్రతిపక్ష పార్టీకి  2019 ఎన్నికలలో  సంపూర్ణ మద్దతును ఇచ్చి అధికారం లోనికి తెచ్చింది రాయలసీమ సమాజం.  రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమ ఏర్పాటు చేయాలని అడగిని ప్రతిపక్ష పార్టీకి 2019 ఎన్నికలలో బాసటగా నిలబడింది రాయలసీమ సమాజం. రాయలసీమ అమ్మాయిలకు రావాల్సిన తిరుపతి  వైద్య కళాశాలలో సీట్లను కోస్తా ప్రాంత అమ్మాయిలకు పాలకులు  కేటాయించిన ప్రశ్నించని నాటి ప్రతిపక్ష పార్టీని అందలం ఎక్కించింది రాయలసీమ సమాజం. ఇలాంటివి ఎన్నో వున్నా రాయలసీమ సమాజం తమవైపే అన్న ధీమా పాలక పక్షానికి ఉన్నపుడు మీ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవలసిన అవసరం పాలక పక్షానికి లేదు.

  1. ఈ నినాదంతో రాయ‌ల‌సీమ ఓడిపోయే పోరాట మ‌లుపు తీసుకున్న‌ట్లు కాదా?

జవాబు: ఉద్యమ పోరాటంలో ఒడిదుడుకులు సహజం. ఈ దశలో చరిత్ర నుండి పాటలు నేర్చుకొని సమాజాన్ని జాగృతం చెయ్యడం అత్యంత కీలకం. ఈ మలుపు రాయలసీమ ప్రజా సంఘాల భాద్యతను మరింత పెంచింది.

  1. నిజంగానే రాజ‌ధానిని  ఏర్పాటు చేస్తే  సీమకు ఎంత మేలు జ‌రుగుతుంది? 

జవాబు: ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కూడా రాయలసీమ నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర రాజధాని ఏర్పాటుతో ముందుగా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుంది. ఒక రాష్ట్ర పాలనా కేంద్రం అన్నది ఆ ప్రాంత అభివృద్ధికి తప్పక ఒక అభివృద్ధి చోదకంగా వుంటుంది. ముందుగా ఈ ప్రాంత వాసుల కనీస అవసారలైన  త్రాగు, గృహ అవసరాల  నీటి అవసరాల గురించి  పట్టించుకోని  పాలక పక్షాలు, పాలనా కేంద్రంలో వుండే రాజకీయ నాయకుల, అధికారాల అవసరాలకైనా అటువైపు దృష్టి పెడతారు. ఇది చిన్న విషయం కాదు; ఏ ప్రాంత అభివృద్ధికైనా కీలకమైన నీటి లభ్యత అన్ని రంగాల అభివృద్ధికి ఊతం ఇస్తుంది.

  1.  క‌ర్నూలులో  హైకోర్టు ప్రధాన కేంద్రం (Principle Seat)  ఏర్పాటు,  కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు,  రాష్ట్ర విభజన చట్టం లో పేర్కొన్న సాగునీటి ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో సవరించాల‌నే డిమాండ్ల భ‌విత‌వ్యం ఎలా ఉండ‌బోతోంది?

జవాబు: మీరు మొట్టమొదట ప్రశ్నలో పేర్కొన్నట్లుగా కోస్తా ఆధిపత్యంతో నడిచే రాజకీయ పార్టీలు పై అంశాలను తమ రాజకీయ అజండగా చేపట్టేలాగా ఒత్తిడి పెంచడానికి  రాయలసీమ సమాజం జాగృతం అవడంపైనే,  పై న్యాయమైన డిమాండ్లు  భవిష్యత్తు ఆధారపడి వుంది.

  1. రాజ‌ధాని పేరుతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల కుమ్ములాటలో మొత్తంగానే  రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల కోసం సాగే ఉద్య‌మం త‌న‌దైన ప్ర‌త్యేక వైఖ‌రిని ఏం చెబుతుంది?

జవాబు: రాజకీయ నేపధ్యంలో జరుగుతున్న కేంద్రీకృత అభివృద్ధి, చట్టబద్దమైన ఇబ్బందులు లేని పాలనా వికేంద్రీకరణ అంశాలను చేపట్టని పాలకపక్ష పాలనా వికేంద్రీకరణ ఏవి కుడా  రాయలసీమ సంక్షేమ దృష్టితో చేపట్టినవి కావు అని రాయలసీమ ప్రజా సంఘాలు విజయవాడ నది బొడ్డున డిసెంబర్ 13, 2021 న విష్పస్టంగా ప్రకటించాయి. ఈ సంధర్భంగా రాజకీయ పార్టీల, నాయకుల వీరాభిమానులు మినహాయించి మొత్తం రాయలసీమ సమాజం, ప్రజా స్వామిక వాదులు  రాయలసీమ ప్రజా సంఘాల  నిబద్ధతను గుర్తిస్తున్నాయి.

  1. ఇటీవ‌ల  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ధ‌ర్మ దీక్ష‌కు  ఆంధ్రా మేధావుల నుంచి, ఉద్య‌మ‌కారుల నుంచి రాయ‌ల‌సీమ‌కు మ‌ద్ద‌తు వ‌చ్చిందా?  తిరుప‌తి స‌భ త‌ర్వాతి ప‌రిణామాల దృష్ట్యా ఇప్ప‌డు కోస్తా ప్రాంత మేధావుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి మీరు ఎలాంటి సంభాష‌ణ కొన‌సాగిస్తారు?

జవాబు: విజయవాడలో జరిగిన కార్యక్రమంలో  కోస్తా మేధావుల, ప్రజా సంఘాలమద్దతు లభించింది. అయితే కోస్తా ప్రాంత మేధావుల, ప్రజా సంఘాల నుండి విస్తృత స్థాయిలో మద్దతు పొందడానికి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించాము. ఆ దిశగా భవిష్యత్తు కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తున్నాము.


బొజ్జా దశరథ రామి రెడ్డి

అధ్యక్ష్యులు

రాయలసీమ సాగునీటి సాధన సమితి

98480 40991

Leave a Reply