ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం వారి మునుపటి పాలన జ్ఞాపకాలను తాజా చేసింది. ఆ సమయంలో తాలిబాన్లు షరియాకి తమ సొంత పద్ధతిని, మహిళలపై భయంకరమైన అణచివేతను అమలు చేశారు. వారు  పురుషులను కూడా విడిచిపెట్టలేదు. పురుషులకు ప్రత్యేక దుస్తులు, గడ్డం తప్పనిసరి చేసారు. బమియాన్‌లోని గౌతమ్ బుద్ధ భగవానుని పురావస్తు ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలను కూడా తాలిబాన్లు కూల్చివేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లను భారతీయ ముస్లింలలో ఒక చిన్న విభాగం స్వాగతించింది. వారి దృష్టిలో ఇది విదేశీ ఆక్రమణదారులపై ఇస్లాం విజయం. ఈ పరిణామంతో చాలా మంది ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం మహిళా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి, చింతిస్తున్నాయి. తాలిబాన్ భావజాలాన్ని తీవ్రంగా ఖండించాయి.

ఈ నేపథ్యంలో, దేశంలోని ఇద్దరు ప్రముఖ ముస్లిం వ్యక్తుల ప్రకటనలు కలకలం సృష్టించాయి. ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆచరిస్తున్న ఇస్లాం కంటే భారతీయ ఇస్లాం వేరుగా ఉందని, తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన ముస్లింలను నసీరుద్దీన్ షా ఖండించారు. ఇస్లాం సంస్కరణ అవసరం, దానిని ఆధునీకరించాలి, గతంలోని అనాగరికతకు తిరిగి మళ్లకూడదు. అతని ప్రకటనను హిందూ మితవాద సంస్థలు స్వాగతించాయి. తాలిబాన్లను ప్రశంసిస్తూ, ఇస్లాంను సంస్కరించడం, ఆధునీకరించడం అవసరం అని చెప్పినవారిని విమర్శించడాన్ని ముస్లింలలో అధిక భాగం సమర్థించారు, అయితే పూర్వ శతాబ్దాల ముస్లింలు అనాగరికులు అని నసీరుద్దీన్ షా చేసిన ప్రకటనతో వారు విభేదించారు.

గత ఒక శతాబ్దంలోని ముస్లింల తరాలను రాజులు, నవాబుల పాలనలో ఉన్న ముస్లింలతో పోల్చలేమని చాలా స్పష్టమైన విషయం. ఒకవైపు ముస్లిం పాలకులు రాక్షసత్వం వహిస్తుండగా, వారి పాలనలో, దేశంలోని సాధారణ సంస్కృతిని నొక్కిచెప్పే ఉద్యమాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయన్నది కూడా నిజం. ఈ కాలంలోనే భక్తి, సూఫీ సాధువులు మతాల నైతిక అంశానికి తగిన ప్రాముఖ్యతను ఇచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వారి అనుచరులయ్యారు.

జావేద్ అక్తర్ ముస్లిం ఛాందసవాదం పట్ల తన అసహ్యానికి పేరుగాంచాడు. రాజ్యసభలో ఆయన పదేపదే వందేమాతరం జపించడం దీనికి ఉదాహరణ. అతను అన్ని రకాల మత మౌలికవాదం, అస్పష్టతలను వ్యతిరేకించాడు. అతను మత ఆధారిత రాజకీయాలు, మత సనాతనధర్మాలను బహిరంగంగా ఖండిస్తున్నాడు. అతను తాలిబాన్లను భారతదేశంలోని సంఘ్ పరివార్‌తో పోల్చాడు. ఇది చాలా గందరగోళానికి కారణమైంది. శివసేన ముఖపత్రిక ఆర్‌ఎస్‌ఎస్‌ని సమర్థించింది. ఒక బిజెపి ఎమ్మెల్యే అయితే క్షమాపణ చెప్పే వరకు వారి చిత్రాల ప్రదర్శనకు అనుమతించబోమని బెదిరించాడు.

జావిద్ అక్తర్ తాలిబాన్లను ఆర్‌ఎస్‌ఎస్‌తో పోల్చినప్పుడు అతని మనసులో ఏముంది? గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో హిందూ మితవాద రాజకీయాలు పెరుగుతున్నాయి. కేంద్రంలో బిజెపి స్వయంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ జాతీయవాదం ప్రభావం బాగా పెరిగింది. గొడ్డు మాంసం, ఆవు సాకుతో ముస్లింలు, దళితులను చంపిన సంఘటనలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులను (కన్హయ్య కుమార్, రోహిత్ వేముల) బోనులో నిలబెట్టారు, సీఏఏ-ఎన్ ఆర్ సీ  సాకుతో ముస్లింలను భయభ్రాంతులను చేసే ప్రయత్నాలు జరిగాయి (శంభులాల్ రేగర్ చేసిన అఫ్రాజుల్ భీభత్స హత్య). లవ్ జిహాద్ సాకుతో ముస్లిం యువకులను లక్ష్యంగా చేసుకున్నారు. వీటన్నింటి వల్ల  ముస్లింలు తాము రెండవ తరగతి పౌరులుగా మారినట్లు భావించడం మొదలైంది. ఫాదర్  స్టెయిన్ హత్య, కంధమాల్ హింస మొదలైనవి క్రైస్తవులను భయపెట్టాయి.

ఈ సంఘటనలన్నింటిలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యక్ష ప్రమేయముందని ఆధారాలు లేనప్పటికీ, ఇవి హిందూ జాతీయవాదం, మతపరమైన మైనారిటీలను అణిచివేసే దాని సిద్ధాంత ఫలితం అని స్పష్టమవుతుంది. సంఘ్, బిజెపి, ఎబివిపి, విహెచ్‌పి, వనవాసి కల్యాణ్ ఆశ్రమం వంటి డజన్ల కొద్దీ సంస్థలను రూపొందించింది, ఇవి అధికారిక, చట్టపరమైన దృక్కోణంలో భిన్నంగా ఉంటాయి, కానీ వాస్తవానికి దాని భావజాలాన్ని ప్రచారం చేసే విస్తారమైన యంత్రాంగంలో భాగం. ఆర్‌ఎస్‌ఎస్ శాఖలో శిక్షణ పొందిన నాథూరామ్ గాడ్సే నుండి ఇప్పటి వరకు, సంఘ్‌తో తమకు ప్రత్యక్ష సంబంధం లేదని చెబుతూ వివిధ నేరాలలో పాల్గొన్న వ్యక్తులను సంఘ్ దూరంగా ఉంచుతోంది. దీనికి తాజా ఉదాహరణ ‘పాంచజన్య’లో ప్రచురితమైన కథనం, ఇది భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్రలో భాగమని ఇన్ఫోసిస్‌ని విమర్శిస్తోంది. ఈ కథనాన్ని విమర్శించిన వెంటనే, పాంచజన్య ఒక స్వతంత్ర ప్రచురణ సమూహం, మాకు దానితో మాకేమీ సంబంధం లేదు అని సంఘ్ అన్నది.

తాలిబాన్లు, ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాలు ఒకటేనని జావేద్ అక్తర్ చెప్పడం సరైనది. తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్‌ను, ఆర్ ఎస్ ఎస్  హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుకుంటుంది. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ హిందువులని, అన్ని మతపరమైన గుర్తింపులను హిందూ మతంలో భాగం చేయాలని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. మరొక సారూప్యత ఏమిటంటే, రెండూ కేవలం పురుషుల సంస్థలు మాత్రమే. ఇస్లాం, హిందూ మతాలు తమదైన రీతిలో అర్థం చేసుకుంటాయి.

కార్యపద్ధతికి సంబంధించినంతవరకు రెండింటి మధ్య సారూప్యత లేదు. తాలిబాన్ల క్రూరత్వానికి హద్దులు లేవు. వారు తమ క్రూరత్వాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తారు. పాలసీ తయారీ నుండి రోడ్లపై తమ పాలసీలను అమలు చేయడం వరకు స్వయంగా పని చేస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ నిర్మాణం ఏమిటంటే, లాఠీ లేదా తుపాకీని పట్టుకునే వ్యక్తి దాదాపుగా ఎల్లప్పుడూ సంఘంలో సభ్యుడు కాదు. సంఘ్ భావజాలం అనేక కన్వేయర్ బెల్ట్‌ల ద్వారా ప్రయాణించి రోడ్డుపై కార్యక్రమం చేయాల్సిన వ్యక్తికి చేరుతుంది. సంఘంలో దీర్ఘమైన గొలుసు ప్రక్రియ వుంటుంది. ఇది పూర్తిగా అనధికారికమైనది. ఒక లింక్‌ను మరొకదానితో జోడించడం సాధ్యం కాదు.

గత శతాబ్దంలో, ప్రపంచంలోని అనేక దేశాలలో రాడికలిజం, మతతత్వం పెరిగాయి. పూర్వ వలసలలో ఇది జరిగినప్పటికీ, సామ్రాజ్యవాద దేశాలు కూడా వీటికి అతీతం కాదు. ఆధునిక చరిత్రలో క్రైస్తవ ఛాందసవాదం  మొదటిసారిగా అమెరికాలో ఉద్భవించింది. మహిళలు, ఆఫ్రికన్-అమెరికన్లు సామాజిక జీవితంలో ముందుకురావడం ప్రారంభించిన 1920 ల కాలమది. పశ్చిమ ఆసియాలో వలసరాజ్యాల పాలన, పారిశ్రామికీకరణ, ఆధునిక విద్య ప్రక్రియ ద్వారా వర్గం, కులం (భారతదేశంలో), జెండర్ సోపానక్రమం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు అతీతంగా ఉండేట్లుగా  చేసింది.

ఛాందసవాదులు, మతవాదుల వ్యూహాలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. కానీ వారందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం విలువలను వ్యతిరేకిస్తారు. వారిని ‘విదేశీయులు’ గా అభివర్ణిస్తారు. వారందరూ పుట్టుక ఆధారంగా ఉన్నత, నిమ్న స్థాయిలను నిలబెట్టుకోవాలని, తమ మతాలను లేదా ‘గతాన్ని’ కీర్తించాలని కోరుకుంటారు. స్వేచ్ఛ, సమానత్వం మొదలైన విలువలు వలసవాద శక్తుల కానుకగా చెప్పబడ్డాయి. ఈ విలువలను వలసవాద మనస్తత్వం నుండి స్వేచ్ఛ పేరుతో వ్యతిరేకిస్తారు.

నసీరుద్దీన్ షా పరిస్థితిని చాలా సాధారణీకరిస్తున్నారు. అతను ముస్లిం సమాజంలో సంస్కరణ, ఆధునీకరణకు మద్దతుదారులు, కానీ భూస్వామ్య సమాజం నుండి పారిశ్రామిక సమాజానికి మారే ప్రక్రియ నుండి ఉత్పన్నమయ్యే సంక్లిష్టతలను పట్టించుకోరు. జావేద్ అక్తర్ మతం దుస్తులు ధరించిన ఇలాంటి సంస్థల ఎజెండా పునరుజ్జీవనం అవుతుందని  సరిగా చెబుతున్నాడు, కానీ ఇలాంటి ప్రతి సంస్థ ఇతర సంస్థల నుండి భిన్నంగా ఉంటుందని, వాటిని పోల్చలేమని మర్చిపోయాడు.

అనువాదం: పద్మ కొండిపర్తి

జన్‌చౌక్ వెబ్ సైట్ సౌజన్యంతో

Leave a Reply