‘ప్రజలను కాపాడండి- దేశాన్ని రక్షించండి’ అన్న ప్రధాన నినాదంతో కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల సార్వత్రిక సమ్మెతో దేశ కార్మికవర్గం సమర శంఖం పూరించింది. బిజెపికి అనుబంధంగా ఉన్న బి.ఎం.ఎస్‌ తప్ప మిగిలిన పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు, సంఘాల సంయుక్త వేదికలు పిలుపునిచ్చిన రెండురోజుల సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం ‘ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనీయం… దేశాన్ని కాపాడుకుంటాం.. ప్రజల్ని రక్షించుకుంటాం… కార్మిక కోడ్‌లను తిప్పికొడతాం… కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయాలి, ఏ రూపంలో నైనా ప్రైవేటీకరణ చేయడాన్ని గానీ,  జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ఉపసంహారించుకోవాలని డిమాండు చేశాయి. ప్రతి కర్మాగారంలో సంఘం పెట్టుకుని తీరుతాం’ అంటూ గర్జించింది. దేశవ్యాప్త ప్రదర్శనల్లో కోట్లాది మంది భాగస్వామ్యమయ్యారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్‌, ఆదాయపు పన్ను, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ వంటి వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు తమ సంస్థలను రక్షించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు కదిలారు.

మార్క్సు పెట్టుబడి గ్రంథంలో విశ్లేషించినట్లు ఇవాళ మన దేశంలో పెట్టుబడి దారీ దోపిడీ వికృత రూపం మన కళ్లేదుట కనిపిస్తోంది. దోపిడీకి గురయ్యే బాధితులు ఏ ప్రాంతానికో, ఏ రంగానికో, ఏ సమూహానికో పరిమితం కారు. 140 కోట్ల ప్రజల కన్నీళ్లకు పెట్టుబడిదారీ విధానమే కారణంగా మారిన నేటి పరిస్థితి నేపథ్యంలోనే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే పోరాటం సాగింది. దేశ ప్రజల సకల కష్టాలకి, సమస్త సమస్యలకి కారణమైన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి చరమగీతం పాడే రాజకీయ సదవకాశం కార్మిక వర్గానికే ఉంది. అది దానికి చరిత్ర కల్పించిన బాధ్యత. పెట్టుబడిపై సమరం సాగించకుంటే, గతంలో పోరాటాల ద్వారా సాధించుకున్న ఏ హక్కు మిగలదని గ్రహించే కాలం ఆసన్నమైంది. ఈ నూతన అవగాహన ఉద్యమించే శక్తుల ఐక్యతను పెంచుతుంది. ఇవాళ కార్మిక వర్గం ఇచ్చిన పిలుపునకు రైతాంగం స్పందించింది. అసంఘటిత రంగ కార్మికులు సైతం సమ్మెలో తమ నిరసనలు తెలిపాడు.

ఈ నేపథ్యంలో దేశంలోని కార్పొరేట్‌, మతోన్మాద పాలన నుంచి దేశాన్ని రక్షించుకోవాలని కార్మికవర్గం నిర్ణయించుకుంది. దేశ పరిరక్షణకు సంబంధించిన 12 డిమాండ్లను సర్కార్‌ ముందుంచింది. 10 కేంద్ర కార్మిక సంఘాల రెండ్రోజుల దేశవ్యాప్త సమ్మె పిలుపునకు అసంఖ్యాక రాష్ట్రస్థాయి కార్మిక, ఉద్యోగ సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఎస్మా, బెదిరింపులు, అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొని సమ్మెలో పాల్గొన్నవారి సంఖ్య 20 కోట్లు దాటింది. ఈ సమ్మెకు 80 దేశాలలోని భారతీయ నావికులు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్య్లూఎఫ్‌టియు) మద్దతు ప్రకటించింది. దేశంలో రెండు రోజులు జరిగిన సమ్మెపై అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు రాశాయి. ఈ చారిత్రాత్మక సమ్మె పిలుపు కేవలం కార్మికుల తక్షణ డిమాండ్లే కాకుండా కేంద్ర ప్రభుత్వ దేశ వ్యతిరేక విధ్వంసక విధానాలకు వ్యతిరేకంగా జరుగడం విశేషం.

తిమ్మిని బమ్మి చేసే కార్పొరేట్‌ మీడియా టక్కుటమార ప్రచారానికి, క్షేత్రస్థాయి లోని వాస్తవ పరిస్థితులకు పొంతనలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కాటుకు తోడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్యుల బతుకులు చితికిపోయాయి. ఉన్న ఉద్యోగాలు ఊడుతుండగా, కొత్త ఉద్యోగాలు రావడం లేదు. ఉపాధి అవకాశాలూ మృగ్యమౌతున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్‌తో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటాయి. విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు సామాన్యులకు ఎండమావులుగా మారాయి. రెక్కలు ముక్కలు చేసుకున్నా బతుకులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కష్టకాలంలోనూ కార్పొరేట్లు మరింతగా సంపదను పోగేసుకున్న తీరును కార్మికలోకం అర్థం చేసుకుంది.

ఇంతకాలం దేశాభివృద్ధికి దోహదం చేసిన ఎల్‌ఐసి, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పడానికి మోడీ ప్రభుత్వం పడుతున్న తపనను అర్థం చేసుకుంది. ఏడాది పాటు అప్రతిహితంగా సాగిన రైతాంగ సమ్మెకు బూటకపు వాగ్దానాలతో మోడీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన తీరు పట్ల ఆగ్రహించింది. అందుకే, కార్పొరేట్‌ మీడియా సృష్టించిన మీడియా మానియాను బేఖాతరు చేసి మరీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెను జయప్రదం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతాంగం కార్మికులతో కలిసి కదం తొక్కింది. కుట్రలను, కుతంత్రాలను, ఆంక్షలను, నిర్బంధాలను అధిగమించి సమ్మె పతాకాన్ని దిగ్విజయంగా ఎగురవేసి కొత్త చరిత్రను సృష్టించింది. కార్మికలోకం  సృష్టించిన ఈ విజయం అపురూపాలకు భవిష్యత్‌ పోరాటాలకు ప్రేరణ.

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారానికి వచ్చింది మొదలు నెమ్మదిగా మొదలిడి ఇప్పుడు తీవ్రస్థాయికి చేర్చిన ఆశ్రిత పెట్టుబడిదారీ ఆర్థికవిధానం, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు (స్వదేశీ, విదేశీ తేడా లేదు) కారుచౌకగా విక్రయించి (అది వాటాల విక్రయం కావచ్చు. ద్రవ్యీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తుల యాజమాన్య నిర్వహణను ప్రైవేటువారికి కట్టబెట్టటం కావచ్చు, పూర్తి విక్రయం కావచ్చు) వారిని ప్రసన్నం చేసుకునే దుర్మార్గపు విధానాన్ని బరితెగించి అనుసరిస్తోంది. మోడీ ప్రైవేటీకరణ విధానాలకు పరాకాష్ట పాడి ఆవులాంటి ఎల్‌ఐసి ప్రైవేటీకరణ. ఏమిటీ దుర్మార్గం అంటే లాభాలార్జించే వాటిని అమ్మకానికి పెడితేనేగదా ఎక్కువ ప్రతిఫలం వచ్చేది అనే మొరటు సమాధానాలొస్తాయి. ప్రభుత్వ రంగమంటే ప్రజల స్వేదంతో నిర్మించిన ఆస్తులు. అవి ప్రజలందరి ఉమ్మడి సొత్తు. కాబట్టి ప్రైవేటీకరణ అంటే ప్రజలసొమ్ము దోపిడీదార్లకు కట్టబెట్టడం. దీన్ని ఎదిరించటం యావన్మంది ప్రజల కర్తవ్యం. రాజకీయంగా చైతన్యవంతమైన కార్మికవర్గం ముందు నిలబడి ఈ పోరాటం సాగిస్తోంది. దానికి మద్దతు తెలపడం ప్రజల బాధ్యత.

దేశం కరోనా విపత్తుతో (తొలిదాడి) కొట్టుమిట్టాడుతుండగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లకు పార్లమెంటుచే ఆమోద ముద్ర వేయించుకుంది. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన 4 లేబర్‌కోడ్‌లు కార్మిక హక్కులను హరించి కార్పొరేట్‌లకు కార్మికులను బలిపశువులను చేయతలపెట్టాయి. అటు వ్యవసాయ చట్టాల్లోగాని, ఇటు కార్మిక చట్టాల్లో గాని పూసలో దారంలా కనిపించేది ప్రైవేటీకరణ, కార్పొరేట్‌ల ప్రయోజనాల రక్షణ. కాంగ్రెస్‌ పాలనలో 1991లో ప్రవేశించిన సరళీకరణ ఆర్థిక విధానాలతో మొదలైన ఈ దిగజారుడు, తిరోగమనం ఇంతింతై వటుడింతై అన్నట్లు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ పాలనలో పరాకాష్టకు చేరింది. ఇటీవల ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యాన్ని ప్రైవేటువారికి అప్పగించే ద్రవ్యీకరణ (మానిటైజేషన్‌ పైప్‌లైన్‌) విధానాన్ని తెచ్చింది ప్రభుత్వం. అంటే ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించే దుష్ట విధానమని అర్థం చేసుకోవాలి.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు మారుమ్రోగడం వంటి అంశాలు విదేశీ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి. కార్మికవర్గ ప్రతిఘటన కారణంగా సంస్కరణల అమలు విషయంలో భారత్‌లో అయోమయ వాతావరణం నెలకొందన్న అర్థం వచ్చే శీర్షికతో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం ప్రచురించింది. సంస్కరణల గురించి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న తీరును ఈ కథనంలో వివరించారు. కార్మికుల కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమించడం ఇదే మొదటిసారి కాదు. సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుండి కార్మికలోకం ఏదో ఒక రూపంలో గళం విప్పుతూనే ఉంది. దేశ సంపదను, ప్రజల కష్టార్జితాన్ని కొద్ది మందికి దోచి పెట్టే విధానాలను మానుకోవాలని నినదిస్తూనే ఉంది. హర్తాళ్లు, ధర్నాలు, నిరాహార దీక్షల వంటి నిరనసలు అటుంచితే, తాజాగా 21వ సార్వత్రిక సమ్మె, దీనికి ముందు 20 సమ్మెలను దేశ కార్మిక వర్గం చేసింది. ఒక్క నరేంద్రమోడీ హయంలోనే నాలుగు సార్వత్రిక సమ్మెలు జరిగాయి. ప్రతిసారీ సమ్మెను నీరుగార్చడానికి, కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి పాలక వర్గాలు ఎన్నో ప్రయత్నాలు చేయడం, కార్మికులు సంఘటితంగా వాటిని తిప్పికొట్టడం పరిపాటిగా మారింది. అయితే, ఈ సారి జరిగిన సమ్మె వాటికన్నా ప్రత్యేకమైనది.

రైల్వే, నౌక, రోడ్డు రవాణా, బ్యాంకింగ్‌, బీమా తంతి తపాలా వంటి సేవా రంగాల ఉద్యోగులు విశాల ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములయ్యారు. కళాకారులు, రచయితలు, మేధావులు కూడా తమ వంతు పాత్ర నిర్వర్తించారు. బొగ్గుగనులున్న ప్రాంతాలైన జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. అస్సాం, హర్యానా, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బీహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గోవా, ఒరిస్సాలో కూడా సమ్మె కట్టిన వారి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి. బిజెపి అధికారంలో ఉన్న హర్యానాలో అయితే రోడ్డు రవాణా రంగంలోని వారు కూడా సమ్మెకారులతో కలిసి పోయారు.

గోవా, కర్ణాటక లాంటి చోట్ల కూడా భారత్‌ బంద్‌ లాంటి పరిస్థితి కనిపించిందంటే ప్రజాకంటక పాలకుల గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే వాస్తవాన్ని గ్రహించి తీరవలసిందే.

సిక్కింలో అయితే భద్రతా కార్మికులు కూడా సమ్మెలో భాగస్వాములయ్యారు. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కడకు జమ్మూ-కశ్మీర్‌లో కూడా రెండు రోజులూ సమ్మె ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. అత్యవసర సేవల చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తాళలేని వారు సమ్మె పిలుపునకు స్వచ్ఛంధంగానే స్పందించారు. భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. రైల్వే కార్మికులు, రక్షణ రంగంలో పని చేసేవారు కూడా వివిధ ప్రాంతాలలో దేశమంతటా సమ్మెకు మద్దతుగా నిలిచారు. సంయుక్త కిసాన్‌ మోర్చా సమ్మె పిలుపునకు మద్దతు ఇవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోనూ నిరసన గళాలు వినిపించాయి.

ఈ సారి అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధుల్లో తిరిగి వివిధ వస్తువులో, కూరగాయలో అమ్ముకునేవారు, ఆశావర్కర్లు, ఇళ్లల్లో పని చేసుకుని బతికే వారితో పాటు రకరకాల పద్ధతుల్లో బతుకీడ్వలేక సతమతమవుతున్న వారంతా ఉద్యమబాట పట్టారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యంగా కర్ణాటక లాంటి చోట్లతో పాటు సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో కూడా సమ్మె ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ సమ్మె కేవలం ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకమైందే కాదు బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దేశాన్ని తెగనమ్మే వికృత విధానాలకు, హిందూత్వ మతతత్వ ఫాసిస్టు  విధానాలకు  నిరసనగా అని ఈ రెండు రోజుల పరిణామాలు నిరూపించాయి. ఈ రెండు రోజుల సమ్మె కార్మిక వర్గంలో ఉత్తేజాన్ని నింపాయి. 

కేరళ లాంటి చోట్ల న్యాయస్థానాలు కలగజేసుకుని ప్రభుత్వ సిబ్బంది సమ్మె కట్టడానికి హక్కు లేదు అని హుంకరించినా అనేక చోట్ల కడకు బిజెపి అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వ సిబ్బందీ కార్మికవర్గంతో భుజం భుజం కలిపి అడుగేయడం జన సమైక్యతకే కాక ప్రజలు ఎంత నిస్సహాయ స్థితిలో బతుకుతున్నారు అనడానికి సంకేతం. పరిశ్రమల సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు మాత్రమే కాకుండా వస్తూత్పత్తి రంగంలో పని చేస్తున్నవారు. అనేకానేక ప్రభుత్వ వ్యవస్థల్లో పని చేసేవారు, వ్యవసాయ రంగానికి చెందినవారు, రేవులు మొదలైన వాటిల్లో పని చేసేవారు కూడా సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగం ధ్వంసంతో పాటు కార్మిక హక్కులను హరిస్తున్న చట్టాలు వాస్తవరూపం దాల్చిన నేపథ్యంలో తాజా సమ్మెకు విశేష ప్రాధాన్యత ఉంది.

హిందూత్వ కార్పొరేట్‌ ఎజెండాతో మోడీ ప్రభుత్వం దాడి చేస్తుంటే కష్టజీవులు లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తితో కుల, మత, ప్రాంతీయ బేధాలను అధిగమించి ఐక్యంగా దేశ స్వావలంబనను, ఆహార భద్రతను, ప్రజా సంపదను పరిరక్షించుకునే ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రతిఘటనకు దిగారు. మోడీ ప్రభుత్వం ప్రపంచీకరణ ఆర్థిక  విధానాలతో ద్రవ్య పెట్టుబడి తన గరిష్ట లాభాలను పెంచుకోవడానికి రైతాంగంపై, కార్మికవర్గంపై దోపిడీని తీవ్రతరం చేసింది. అందువల్ల పెట్టుబడి అనుకూల ప్రభుత్వానికి-శ్రామిక శక్తికి మధ్య జరుగుతున్న ఈ పోరాటం నిరవధికం. ప్రజలను చైతన్యపరచటం కూడా దీని పరమావధి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరువకుంటే, తన విధానాలను మార్చుకోకుంటే, కార్పొరేట్‌ రాబంధులపై ముఖాముఖి పోరాటానికి కార్మికవర్గం సిద్ధం కాక తప్పదు. 

Leave a Reply