ప్రపంచంలో చాలా దేశాలలో ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారి పేర్లను సాధారణంగా వారి మరణానంతరం ఆయా సంస్థలకో లేదా మరో రంగానికో వారి పై గౌరవంతోనో వారికి గుర్తింపు గానో పెట్టడం జరుగుతుంది. భారతదేశంలోను ఆ ఆనవాయితి కొనసాగుతున్నది. పాలక వర్గాలు మారినప్పుడల్లా వారి భావజాల ప్రతినిధుల పేర్లను ఎక్కడో ఒక చోట తగిలించడం అలవాటు చేసుకున్నారు. ప్రజాజీవితంలో ఉండి వారి ప్రయోజనాలకు పాటుబడిన వారిని అలా గుర్తుంచుకోవాలంటే పేచీ ఏమి ఉండదేమో గాని మొత్తంగా వారి జీవితకాల ఆచరణకు పొసగని లేదా విరుద్ధమైన రంగాలకు వారి పేరు పెట్టడం చాలా కాలం క్రితమే మొదలయింది. గత సంవత్సరం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లో కేంద్రం ఆధీనంలో ఉండే రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయో టెక్నాలజి మరో విభాగానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ‘గురూజీ’ గా పిలవబడ్డ M S గోల్వాల్కర్ పేరుతో ‘శ్రీ గురూజీ మాధవ్ సదాశివ గోల్వల్కర్ నేషనల్ కాంప్లెక్స్ ఫర్ డీసీజ్ ఇన్ క్యాన్సర్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్’ గా నూతనంగా నామకరణం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తింది. హిట్లర్ ఆరాదకుడు, పరమత ద్వేషి, మతోన్మాది అయిన గోల్వాల్కర్ పేరు ఎలా పెడతారన్న ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రి ‘గురూజీ’ గొప్ప దేశ భక్తుడని,జాతీయవాదని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో జంతు శాస్త్ర బోధకుడిగా పనిచేసాడని అంతకంటే అర్హులు మరెవరుంటారని ఎదురు ప్రశ్న వేసాడు. ఆ రంగంలో పనిచేసిన మరో శాస్త్రవేత్త పేరో, ప్రజారోగ్య రంగంలో కృషి చేసిన మరొక వ్యక్తి పేరో పెట్టవచ్చు కదా అని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఆయా రంగాల్లోని ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రమేమో అయ్యో అంత దేశభక్తుణ్ణి వద్దంటారా అనే ఎదురు దాడినే సమాధానంగా ఇస్తున్నది.

‘గురూజీ’ గా సంఘపరివార్ పిలుచుకునే మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ 1940 నుండి1973 వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి సర్ సంఘ చాలక్ గా పని చేసాడు. గాంధీ హత్య నేపద్యంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. హిట్లర్ వీరారాదకుడు. భారత ఉపఖండం నుండి బ్రిటిష్ వారు నిష్క్రమించిన పిమ్మట దేశానికి మనుస్మృతినే రాజ్యాంగం చేయాలని బలంగా వాదించాడు. హిట్లర్ ని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ హిందువులంతా మరో హోలోకాస్ట్(1941-45 రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలు యూదుల పై చేసిన మారణహోమం) సృష్టించి ‘మైనారిటీ’ ‘సమస్య’ను పరిష్కరించడం ద్వారా దేశాన్ని శుద్ధి చేయవచ్చన్నాడు. ఈ దేశానికి ముగ్గురు ప్రధాన శత్రువులు ముస్లింలు, క్రైస్తవులు మరియు కమ్యూనిస్టులు అని ప్రకటించాడు తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే గ్రంధంలో. 1960 డిసెంబర్17 న గుజరాత్ యూనివర్సిటీ లో ప్రసంగిస్తు తన ఫాసిస్టు బ్రాహ్మణ ఆధిపత్య భావాలను నగ్నంగా బయట పెట్టాడు. ఉత్తమ మనుషుల(ఆయన దృష్టిలో ఉత్తరాది బ్రాహ్మణులు) ఉత్పత్తి కోసం ఉత్తర ప్రాంత నంబూద్రి బ్రాహ్మణులు కేరళకు తరలి వెళ్లాలని కోరాడు. ప్రతి స్త్రీ మొదటగా నంబూద్రి బ్రాహ్మణుల చేత తొలి బిడ్డను కన్నాకే తన భర్తతో పిల్లల్ని కనాలని సెలవిచ్చాడు. వర్ణ, కుల వ్యవస్థ ఉండి తీరాలన్నాడు. వర్ణ వ్యవస్థ ఫలితంగానే వివిధ వృత్తులు కొనసాగుతాయని, వంశ పారంపర్య వృత్తులతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని ఆ వ్యవస్థ కొనసాగితేనే ప్రతి మనిషికి జీవనోపాధి రిజర్వు చేయబడుతుందని వాదించాడు. ఆయన వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలను చూసినప్పుడు పుట్టుకతోనే మనుషుల స్థానాలను నిర్ణయం చేసే దుర్మార్గమైన బ్రాహ్మణీయ ఆదిపత్య విలువల ప్రతినిధి అని అర్ధమవుతుంది. పలానా బ్రాహ్మణుల ద్వారా మాత్రమే ఉత్తమ మనుషుల ఉత్పత్తి జరుగుతుందనే పచ్చి ఆశాస్త్రీయ అభిప్రాయం ప్రకారం హిందూ మతంలో ఉత్తమ జాతి,అధమ జాతి ఉంటుందని ఉండాలని వాదించాడని అర్ధమవుతుంది. పెళ్ళైన ప్రతి స్త్రీ నంబూద్రి బ్రాహ్మణ పురుషుల ద్వారా తొలి బిడ్డను కనాలనే బ్రాహ్మణ పురుషోన్మాద భావజాలం స్త్రీలను ఎంత హీనంగా చూస్తున్నదో తెలుస్తున్నది. పెళ్ళైన స్త్రీలు మొదట అగ్రకులాల పురుషులతో తొలి రాత్రి గడపాలనే దుర్మార్గమైన భూస్వామ్య సాంఘీక విలువలను ఈ అభిప్రాయాలు బలపరుస్తున్నవి. సంకరీకరణం కోసం ఉత్తరాది బ్రాహ్మణులు దక్షణాదికి తరలి వెళ్లాలనడంలోనే ఉత్తరాది వారు ఉత్తమ తెగ అని దక్షిణాది వారిని అధములుగా చూసే ఉత్తరాది ఆధిపత్యం కనిపిస్తున్నది. ఇంత ఆధిపత్యపు బ్రాహ్మణ, ఫాసిస్టు భావజాలానికి ప్రతినిధి అయిన గోల్వాల్కర్ పేరు కేరళ నేల పైన ఉన్న పరిశోధనా సంస్థకు పెట్టడం ఏ విలువల్ని వ్యాప్తి చేయడానికి? ఆ నేలను, ఆ నేల మీది మనుషుల్ని అంతగా అవమానించిన ఓ ఫాసిస్టు పేరు ఓ సైన్స్ పరిశోధనా సంస్థకా? నిజానికి పైన చెప్పినవేవి ఆయన పట్ల వ్యతిరేకత ఉండి ఆపాదించినవి కావు.స్వయంగా స్వయం సేవకుల అధికార పత్రిక అయిన ఆర్గనైజర్ లో 1961 జనవరి 2 న ప్రచురించబడినవి. అంతకంటే ఒక సంవత్సరం ముందే విశ్వహిందూ పరిషత్ సభలో మాట్లాడుతూ సైన్స్ కంటే మతం ఉత్కృష్టమైనదని బల్లగుద్ది మరీ వాదించాడు. ఇవాళ ఏలుతున్న ఆయన వారసులే గతమంతా గణమని విదేశీయుల రాకతోనే గణమంతా గతమైందని ఆ గణమైన గతం కోసమే రామాలయం అని చాటుతున్నారు. గుడి కోసం ఎంత విధ్వంసం, మారణహోమం జరిగిందీ దేశంలో. వాళ్లే జోల పట్టుకొని ఇంటికొక ఇటుకపెరుతోనో, చందాల పేరుతోనో ఇంటి గుమ్మాలకు బ్రాహ్మణీయ ఫాసిస్టు హిందుత్వను వెళ్లాడదీస్తున్నారు. వీళ్ళే పాటుబడుతున్న ఏ అంబానియో, ఆదానియో భ్రహ్మాoడమైన రామాలయాన్ని కట్టివ్వగలరు కదా! వ్యవసాయ చట్టాల పేరుతో వ్యవసాయాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల్లో బందిస్తున్న ‘గురూజీ’ వారసులు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రోడ్డుకెక్కుతున్నారు.

అఖండ హిందు భారత నిర్మాణమే అంతిమ లక్ష్యం అని ప్రకటించుకున్న పరివార్ ఫాసిస్టు శక్తులు దళితుల, మైనారిటీల సాంస్కృతిక హక్కుల పై విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. గోవుల్ని రక్షించే పేరుతో మనుషుల్ని పాశవికంగా హత్య చేస్తున్నారు. దేశ బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని అనేక సమూహాల ప్రత్యేక హక్కుల్ని పరిహసిస్తూ లౌకిక విలువల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కుల్ని అణచివేస్తు, ప్రశ్నించే గొంతుల్ని దేశ ద్రోహులుగా ముద్రవేస్తు జైళ్లలో తోస్తు బెయిలు కూడా రాకుండా అడ్డుకుంటు ఉన్మాద క్రీడలాడుకుంటున్నారు. మనోభావాలు, జాతీయవాదం,దేశ భద్రత, భక్తి,సమైక్యత పేరుతో ఈ దేశాన్ని కాషాయ సైనిక రాజ్యంగా మార్చివేసే దుర్మార్గానికి తెగబడుతున్నది మో-షా ల ద్వయం.దేశంలోని స్వతంత్ర సంస్థలన్నింటిని నిర్వీర్యం చేయి తమ జేబు సంస్థలుగా మార్చుకొని ఒకే దేశం, ఒకే మతం,ఒకే భాష అంటున్నది. విద్యా రంగంలో జాతీయ భావాల పేరుతో కాషాయ కషాయాన్ని కొత్తతరం మెదళ్ళలో చొప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. జీవిత కాలంలో సైన్సు కు, ప్రజారోగ్యానికి ఏ దోహదం చేయకపోగా మతోన్మాద రోగాన్ని ఎల్లెడలా వ్యాప్తి చేసిన గోల్వాల్కర్ పేరు పెట్టడం ఎంత బరితెగింపు. వినాయకునికి ఏనుగు తల అంటించడం లాంటి అవయవ మార్పిడి వంటి ‘గొప్ప’ మెడికల్ సైన్స్ ఆనాడే ఉందని, ప్లాస్టిక్ సర్జరీ మనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నింటి గురించి మాట్లాడే మోడీ గారు సైన్స్ కాంగ్రెస్ లోనే సెలవిచ్చారు. వేదకాలంలోనే ఖండాతర మిస్సైల్స్, యుద్ధ విమానాలున్నాయని ప్రచారం చేసే కాషాయ పాలకులు గోల్వాల్కర్ పేరు తగిలించి సైన్స్ కు బలే సన్మానం చేశారు. సైన్స్ కావాలనుకునే వాళ్ళమంతా ప్రశ్నిద్దాం,నిలబడదాం, నిలదీద్దాం,నిలువరిద్దాం.

Leave a Reply