అది వేదిక కాదు. ఒక ఆడిటోరియం కాదు. అక్కడున్న వాళ్ళందరు సమాజం నుండి బహిష్కరణకు గురైన వారే.  వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు  కూడా పేదరికంలో జీవిస్తూనే వున్నారు.

వృద్ధుల సమూహంతో కూడిన ఒక పెద్ద గుంపు అక్కడ చేరింది. సాధారణ ప్రజలు అస్యహించుకునే బంకాటి కుష్ట్ కాలనీ అదే. ధన్బాద్ నుండి 8 కిమీ దూరంలో ఆ కాలనీ ఉంటుంది. ఫాదర్ స్టాన్ స్వస్థలమైన రాంచీ నుండి 145 కి.మీ దూరంలో వుంది.

జెసూట్ పూజారి  ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ ఒక మేకు నుండి చెట్టు కాండం పైన వేలాడదీయబడింది. దాని చుట్టూ ఉన్న బంతి పువ్వుల దండ  నిర్వాహకుల నిధుల కొరత గురించి మాట్లాడుతోంది. దాని ముందు ప్రకాశవంతమైన సూర్యుని వెలుగులో కుష్ఠు వ్యాధి గ్రస్తులు, ఇతరులు అస్తవ్యస్తంగా నిలబడి వున్నారు.

ఆ గుంపులో నుండి ఒక వృద్ధుడు పటం పక్కన నిలబడ్డాడు. వేళ్లు రాలిపోయిన తన మొండి అరచేతితో నుదుటకు పట్టిన చెమటను తుడుచుకున్నాడు. అతను గొంతులో నుండి స్వరం బయలు దేరింది.

“తండ్రి స్టాన్ స్వామి ఎప్పుడూ ఇక్కడకు రాలేదు. కానీ మనం అతని గురించి విన్నాము. చాలా మంది ఆహారం, డబ్బును దానం చేస్తారు. కానీ అతను  పేదల కోసం ఎలా చనిపోవచ్చో నేర్పించాడు”

లేప్రసీ కాలనీలో 35 కుటుంబాలకు చెందిన దాదాపు 200 మంది ఉన్నారు. వీరి పూర్వీకులు కుష్టు రోగులు. కొంతమంది నివాసితులు ఇప్పటికీ వ్యాధిని కలిగి ఉన్నారు. కొంతమంది చికిత్సలో ఉన్నారు. చాలా మంది నివాసితులు ఇప్పుడు కూడా మతపరమైన ప్రదేశాలు,  మార్కెట్‌ల దగ్గర భిచ్చ మెతుకుంటారు. దాతలు,  సామాజిక సంస్థలు రేషన్ అందించడానికి తరచుగా కాలనీని సందర్శిస్తాయి.

వృద్ధుని మాటలు కొనసాగుతున్నాయి.

“ప్రజలు దానంగా భావించి మాకు ఆహారం,  కొన్నిసార్లు భిక్ష ఇస్తారు. అయితే మాకు న్యాయం జరిగేలా ఎవరైనా నిలబడటం చాలా అరుదు.  మా కోసం హింసను, మరణాన్ని కూడా ఎదుర్కోవడానికి ఒకప్పుడు సిద్ధంగా వున్న వ్యక్తి స్థాన్ స్వామి”

ఎండకు ఎండిన పెదాలను నాలికతో తడుపుకుంటూ, 

“అధికారంలో ఉన్నవారి ఇష్టానికి లొంగిపోవడం ద్వారా ఫాదర్ స్వామి సులభంగా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలరని మేము విన్నాము. కానీ అతను పేదలు, అణగారిన వర్గాల కోసం చనిపోవడానికే జీవితాన్ని ఎంచుకున్నాడు. అందుకే మేము అతని పటానికి పూలమాల వేసాము. అతని మరణం  మాకు, రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది”

అందరూ మౌనంగా సరే స్వామికి నివాళులు అర్పించారు.

మరోచోట గిరిజన ప్రాంతంలో  స్వామి సంస్మరణ  సభ జరుగుతోంది. అక్కడికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వ్యక్తి బాగైచా చర్చి ఇన్‌ఛార్జ్ ఫాదర్ టోనీ మాట్లాడాడు.

“జార్ఖండ్‌లోని గిరిజన సంఘాలు, ఇతర అణగారిన వర్గాల హక్కులను కాపాడటానికి ఐదు దశాబ్దాలు ఫాదర్ స్టాన్ కృషి చేశారు. 52 మంది గిరిజన అమరవీరుల పేర్లు రాతి పలకపై ఇప్పటికే వ్రాయబడ్డాయి. ఆదివారం ఫాదర్ స్టాన్ పేరు జోడించబడుతుంది” 

2017 లో ప్రారంభమైన గిరిజన యువత పఠల్‌గాడి ఉద్యమంలో భాగంగా రాతి పలకలను ఏర్పాటు చేశారు. పంచాయితీలు (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 సారాంశంతో రాయబడిన రాతి పలకలను అమర్చిన యువకులు గ్రామం నుండి గ్రామానికి ప్రయాణించారు. సాంప్రదాయ గ్రామసభల ద్వారా స్వయం పాలనను ప్రచారం చేశారు.  గిరిజనేతరులు గిరిజన భూమిని కొనుగోలు చేయడానికి వీళ్లేదని వాళ్ళు వాదించారు.

ఈ ఉద్యమం వారి పూర్వీకుల పేర్లతో చెక్కిన రాతి పలకలను గ్రామ సరిహద్దులపై నిలబెట్టేవారు.  వారి పూర్వీకుల స్వంత స్థలాలను గుర్తించే గిరిజన కుటుంబాల పురాతన సంప్రదాయం అది. వారి కోసం పోరాడిన స్వామికి వాళ్ళు ఆ విధంగా నివాళి ఇవ్వాలని తీర్మానించుకున్నారు. ఆ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ కోసం పోలీసు స్టేషన్ కి వెళ్లిన గిరిజన నాయకుడు సి ఐ కు ఎదురుగ్గా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. కోపాన్ని పెదవుల కింద అనుచుకుంటూ సి ఐ

“ఏం కావాలి” విసురుగా అడిగాడు.

“సంస్మరణ సభకు అనుమతి కావాలి. మీరు ఇవ్వకపోయినా పెడతాం. మీ గౌరవాన్ని కాపాడుకుంటారో,  లేదో  తెలుసుకుందామని వచ్చా” సూటిగా మాట్లాడాడు నాయకుడు.

“మావోయిస్టు స్వామికి మద్దత్తుగా సభ పెడుతున్నారా. సభకు మావోయిస్టులూ వస్తారా? అయినా స్వామి గురించి నీకేం తెలుసు?” సి ఐ ప్రశ్నించాడు.

“స్టాన్ స్వామి అతి నిరాడంబరంగా ఉండే వ్యక్తి. అతను తోటి సహచరులను పలకరించే పద్ధతి ప్రేమపూర్వకంగా ఉండేది. పేదలు గడుపుతున్న దుర్భర జీవితాన్ని గూర్చి స్వామి నిరంతరం చలించే వాడు. అందులో భాగంగా ఆహారం చాలా తక్కువ తీసుకునే వాడు. యాభై ఏళ్ళుగా అలా తక్కువుగా తినడం వల్ల తన పొట్ట కూడా అంటుకుపోయి ఉంటుంది. జార్ఖండ్ లో ఉన్న గిరిజన కుటుంబంతో కలిసి జీవిస్తున్నప్పుడు వారిలాగానే తాను కూడా అర్ధాకలితో ఉండాలని స్టామి  నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి. ఆయన మావోయిస్టా? ఎక్కడ మందుపాతర పేల్చాడు?” గిరిజన నాయకుడు సీరియస్ గా అన్నాడు.

“మరి ఉపా కేసు అతనిపై ఎందుకు పెట్టారు” సి ఐ వెటకారంగా అన్నాడు.

“క్రీస్తు జీవితం ప్రభావంతో స్టాన్ స్వామిలో నిరాడంబరత ఏర్పడింది. స్టాన్ స్వామి దృష్టిలో జీసెస్ అంటే భవిష్యత్తుకు సంబంధించి కాకుండా, వర్తమానానికి సంబంధించింది. పీడనకు గురైన వారి, తిరస్కారానికి గురైన వారి పట్ల ప్రేమను చూపాలి. తిరుగులేని రోమన్ సామ్రాజ్యంపట్ల, దాని ధర్మాలను అనుసరించడంపై జీసెస్ చెప్పిన మాటలను తరుచూ స్టాన్ చెప్పేవాడు. సమాజమూలాలను, సామాజిక సారాంశాన్ని అర్థం చేసుకోవాలని చెప్పాడు. ప్రజా పోరాటాల కేంద్రీకృత వ్యవస్థకు, సామాజిక పరివర్తనకు మార్కిస్టు విశ్లేషణే నిజమైన మార్గమని స్టాన్ స్వామి తుది దశలో విశ్వ‌సించాడు.  బెంగుళూరులోని ఇండియన్ సోషల్ ఇస్టిట్యూట్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి. సామాజిక చర్యల్లో పాల్గొనేలా యువతను చైతన్యపరిచిన వాడు. ప్రజల కోసం నిలబడ్డాడు. కాబట్టే అతను మీ దృష్టిలో దేశ ద్రోహి అయ్యాడు” నాయకుడు తగ్గకుండా సమాధాన మిచ్చాడు.

“చర్చి ఫాదర్ ముసుగులో ఆయన విప్లవ పాఠాలు నేర్పుతున్నాడు. ఆ విషయం నీకు తెలుసా?” సి ఐ తన వాదనను వదులుకోలేదు.

“స్టాన్ స్వామి అత్యుత్తమ మానవుడు. ఆయన ఆస్తిక వాదం, మతవాదం, విప్లవం, రాజకీయాలు, గిరిజన సమాజం,  క్యాథలిక్ చర్చి వంటి అనేక విషయాలపైన చర్చలు, గోష్టులు  జరిపాడు. వాస్తవాలు చెపుతున్నప్పుడు చాలా సరళంగా, నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండాలని చెప్పేవాడు. అది తప్పా. ఈ అంచనాల ప్రపంచంలో స్టాన్ స్వామి ఒక మనిషిగా జీవించదలుచుకున్నాడు. తాను రాసినా, మాట్లాడినా ఎంతో నిశిత దృష్టి సారించేవాడు. అతని మాటలు అతని అభిప్రాయాలకు ప్రాతినిథ్యం వహించేవి. అతని మరణింంచినా మిమ్మల్ని ఇంకా భయపెడుతున్నాడంటే అర్థం చేసుకోండి. వుంటా” గిరిజన నాయకుడు విసురుగా వెళ్లి పోయాడు. అతని పొగరు చూసి సి ఐ కోపంగా అతను వెళ్లిన వైపు గుర్రుగా చూస్తుండి పోయాడు.

స్థాన్ జైలులో వున్నప్పుడు తన తోటి ఖైదీలతో మాటా మంతి కలిపే వాడు. తోటి ఖైదీ స్వామిని అనేక ప్రశ్నలు అడిగేవాడు. అయినా అతను ఓపికగా, నెమ్మదిగా సమాధానాలు చెప్పేవాడు.

“సార్ రాజద్రోహం కేసు మీ మీద ఎందుకు పెట్టారు.  అది ఉగ్రవాది కసబ్ మీద పెట్టిన కేసు కదా “తోటి ఖైదీ అడిగాడు.

“1837లో లార్డ్‌ మెకాలే ఐపిసి ముసాయిదాను రూపొందించాడు. ఆ ముసాయిదాలో 113వ సెక్షన్‌గా రాజద్రోహం (సెడిషన్‌) విషయం ఉంది. ఈ ముసాయిదాను 1860లో ఆమోదించారు. అయితే ఆ ఆమోదిత శిక్షాస్మృతిలో ఈ సెక్షన్‌ లేదు. సాక్ష్యాధారాల చట్టాన్ని రూపొందించిన జేమ్స్ స్టీఫెన్‌ చొరవతో ఈ సెక్షన్‌ను 1870లో స్వాతంత్ర సమరయోధుల్ని నిరోధించటానికి 124(ఎ)గా చేర్చారు. బ్రిటిష్‌ ప్రభుత్వం తమ వ్యతిరేకులను అణిచివేయటానికి దీనిని చేర్చింది. అయినా 1891 దాకా ఉపయోగించలేదు. 1891 ‘ఏజ్‌ ఆఫ్‌ కన్సెంట్‌ బిల్‌’ను సమర్ధించినందుకు ‘బందోవాసి’ పత్రిక సంపాదకుడు యోగేంద్ర చంద్రబోస్‌పై ఈ సెక్షన్‌ కింద తొలిసారి కేసు దాఖలు చేశారు. లోక్‌మాన్య తిలక్‌, మహాత్మాగాంధీ కూడా దాని బాధితులే. కసబ్ పైన, చివరకు నా పైన ఆ కేసు పెట్టారు. నేను చేసిన నేరం, గిరిజనులతో కలిసి ఉండటమే” స్వామి చెప్పాడు.

“అసలు సెక్షన్‌ 124(ఎ)లో ఏముంది సార్?” ఖైది అడిగాడు.

“చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా శత్రుభావనను, అసంతృప్తిని ప్రేరేపించటం దేశద్రోహంగా పరిగణించబడుతుందని ఆ సెక్షన్ చెపుతుంది. కాని నేను  ప్రభుత్వం చేసే చర్యలను సవరింపచేయాలనే సంకల్పంతో, చట్టబద్ధంగా  వ్యాఖ్యలు చేశాను. నిజానికి నా వ్యాఖ్యాలు ఈ సెక్షన్‌ కింద దేశద్రోహంగా పరిగణింపబడవు. అయినా నన్ను ప్రభుత్వం దేశద్రోహి అని ప్రకటించింది” తనకు ఇష్టమైన శనగపప్పులను తింటూ స్వామి చెప్పాడు.

“ప్రభుత్వం దృష్టిలో మీలాంటి దేశ ద్రోహులు ఎంతమంది వున్నారు” ఖైదీ మాటల్లో ఎక్కడా వెటకారం కనిపించ లేదు. 

“మోదీ హయాంలో దేశద్రోహం కింద నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. వ్యవసాయ చట్టాలపై నిరసనల కాలంలో, సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భంలో, హత్రాస్‌ గ్యాంగ్‌రేప్ తర్వాత, పుల్వామా దాడి తర్వాత వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి ఈ సెక్షన్‌ కింద 11,000 మందిపై కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి ఈ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ఆలోచించు” స్వామి చెప్పాడు.

“అయినా సార్ మీ కేసు అంత పెద్ద కేసా” ఖైదీ ఆయనకు మంచి నీళ్లు అందిస్తూ అడిగాడు.

“చాలా పెద్దదిగా చేశారు. నాతో పాటు  ఆనంద్‌ తేల్తుండే, వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్‌, గౌతం నవలఖా, స్టాన్‌స్వామి, సుధా భరద్వాజ్‌, రితుపణ్‌ గోస్వామి, వెర్నిన్‌, రోనా విల్సన్‌, షోమాసేన్‌, మహేష్‌ రౌత్‌ తదితరులు ఉన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అతి పెద్ద కేసుగా ఉన్న పార్వతీపురం కుట్ర కేసును అధిగమించి 10,000 పేజీల ఛార్జిషీటును దాఖలు చేశారు” స్వామి మంచి నీళ్లు తాగారు.

“భీమా కోరేగావ్ కుట్ర కేసు కథ ఏంది సార్” ఖైదీ ఆసక్తిగా అడిగాడు.

“బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా దళితుల్ని సమైక్యపరచారని వారి బాధ. హింసకు పాల్పడేట్టు చేశారని కేంద్రం చెపుతోంది. మావోయిస్టుల కార్యక్రమాన్ని ఎల్గార్‌ పరిషత్‌ అమలు పరుస్తోందని వారు ఆరోపించారు. దానితో ఆగకుండా ప్రధానమంత్రిని హత్య చేయటానికి పథకం పన్నారని మరో ఆరోపణ చేశారు. వరవరరావు మావోయిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడని, నేపాల్‌ మావోయిస్టు నేత వసంత్‌తో ఆయుధాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని అబద్దాలు ప్రచారం చేశారు. ఇంత కన్నా ఘోరం వుంటుందా” స్వామి అన్నాడు.

“సార్ బెయిల్ ఇవ్వడం లేదా మీకు” ఖైదీ అడిగాడు.

 “ఇవ్వడం లేదు. సుధా భరద్వాజ్‌ గత రెండు సంవత్సరాల్లో 60 సార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు”  స్వామి ఆవలించడంతో ఖైదీ మౌనంగా బ్యారక్ లో మరో ఖైదీ దగ్గరకు వెళ్ళాడు.

“పెద్దాయనతో తెగ మాట్లాడుతున్నావ్. ఏందీ కత. అయినా ఏం చేయకపోతే పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు చెప్పు” ఖైదీని మరో సహచరుడు అడిగాడు.

“అలా ఏమీ లేదు. 84 సంవత్సరాల పెద్దాయన ఏం తప్పు చేస్తాడు. నీ పిచ్చి గాని” ఖైదీ అన్నాడు. ఈ ఖైదీ ఒక వ్యాపారస్తుడు . ఇతను ఇచ్చిన చెక్కు,  బౌన్స్ అవడం వల్ల అరెస్టు చేయబడి, రిమాండ్ కు పంప బడ్డాడు.

“ఇంతకీ ఈ పెద్దాయన బ్యాక్ గ్రౌండ్ ఏందీ” కుతూహలంతో సహచరి ఖైదీ అడిగాడు.

“భీమా-కోరేగావ్ కుట్రకేసులో పెద్దాయన్ని ఇరికించారు. ఆయన చర్చి ఫాధర్. పేరు ఫాధర్ స్టాన్ స్వామి. చర్చి ఫాధర్ గా ఉండి కూడా సోషల్ వర్కు చేస్తుంటాడు. ఇతని స్వస్థలం తమిళ నాడులోని తిరుచ్చి. ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశాడు.12 సంవత్సరాల పాటు కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో సోషల్ సైన్సెస్ రిసెర్చు ఇనిస్టిట్యూట్ లో పనిచేశారు. సుమారు అయిదు దశాబ్దాల క్రితం ఝార్ఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆదివాసీల మద్య జీవిస్తూ గోండీ బాషను నేర్చుకున్నాడు. సమాజంలో మేధావిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. తాను 2015 లో ఓ దినపత్రిక లో ఝార్ఖండ్ రాష్ట్రంలో షుమారు ఆరు వేల మంది ఆదివాసులు అండర్ ట్రైలర్స్ గా పద్దెనిమిది జిల్లాలో ఉన్నారనే వార్త చూసారు. వారి డేటాను మొత్తం ఆయన పని చేసే రిసెర్చు వింగ్ ద్వారా సేకరించారు. వీరందరికీ తానేవిధంగా సహయపడగలను అని ఆలోచించి వారిపై లోత్తైన పరిశీలన జరిపాడు. వాళ్ళని విడుదల చేయించటానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా జైళ్ళకు వెళ్ళి దాదాపు 200 ప్రశ్నలను తయారు చేసి వాటికి సమాధానాలు రాబట్టారు. ఆ సమాచారాన్ని రాష్ట్ర డి.జి.పి.కి ఇచ్చారు. వారు సేకరించిన సమాచారం మేరకు జైళ్లల్లో 100 కి ముగ్గురు మాత్రమే మావోయిస్టులుతో సంబంధాలు కలిగిన వున్నారని తెలిసింది. మిగిలిన వారు అమాయకులు. ఏ హక్కుల సంఘాలు చేయలేని పనిని ఫాదర్ స్టాన్ స్వామి చేశారు. ఇది కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు కంటగింపైంది” ఖైదీ కొంచెం సేపు ఆగి మళ్ళీ కొనసాగించాడు.

“ఆదివాసుల భూమి హక్కులు గురించి మాట్లాడేవాడు. అడవుల్లో వుండే ఖనిజాలను కాపాడటానికి ఎంతో కృషి చేశాడు. అప్పటికే 209 ఒప్పందాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్పోరేట్ కంపెనీలతో చేసుకున్నాయి. ఆ ఒప్పందాల విలువ సుమారు ఐదు లక్షల కోట్లు. ఆ ఒప్పందాల అమలు కోసం ఆదివాసులపై మావోయిస్టులనే ముద్ర వేశారు. పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వారిని భయపెడుతోంది ప్రభుత్వం. వారిని ఫాధర్ స్టాన్ స్వామి  విడిపించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి వ్యవహారం. అందుకు సులువైన మార్గం ఫాధర్ స్టాన్ స్వామిని మావోయిస్టుగా ప్రకటించటమే. ఈ తతంగం అంతా మహరాష్టృ, ఝార్ఖండ్ రాష్ట్రలలో బి.జే.పి అధికారంలో ఉన్నప్పుడే జరిగింది” ఖైదీ మాట్లాడాడు.

“అబ్బో చాలా విషయాలు రాబట్టావే” సహచర ఖైదీ ఆశ్చర్యంగా అడిగాడు.

“పోలీసులు ఎంత అన్యాయంగా స్వామి పట్ల ప్రవర్తించారో తెలుసా” ఖైదీ రహస్యం చెప్తున్నట్టు చెప్పసాగాడు. సహచర ఖైదీ చెప్పమన్నట్టు దగ్గరికి వచ్చాడు.

“2018 లో స్టాన్ స్వామి ఇంటిపై నాగపూర్ పోలీసులు పెద్ద సంఖ్యలో దాడిచేశారు. ఫాధర్ లాప్ టాప్, టాబ్లాయిట్, కెమెరా, సెల్ ఫోన్ లను  సీజ్  చేశారు. ఆ సమయంలో ఫాధర్ స్టాన్ స్వామి రాష్ట్ర హైకోర్టులో  ‘క్వాష్’ పిటీషన్ దాఖలు చేశారు. స్వామి అనుమానితుడే కాని,  ముద్దాయి కాదని కోర్టుకు మహరాష్ట్ర ప్రభుత్వం స్వయానా తెలిపింది. అప్పటికి సీజ్ చేసిన వస్తువులలో లేని సమాచారం తర్వాత మళ్ళీ స్వామి కేసులో చొప్పించారు.  పోలిసులు స్వామి వస్తువులు సీజ్ చెసేనాటికి బెదిరింపులు తోనే సరిపుచ్చుదాం అనుకున్నారు. స్వామి పోలీసుల  బెదిరింపులకు లోంగలేదు. అందుకే  భీమా-కోరేగొవ్ కేసులో మద్దాయిని చేశారు. ఫాధర్ స్టాన్ స్వామి గూర్చి స్వయానా అ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రముఖులు డాక్టర్ ఎం.డి. ధామస్, ఢిల్లీకి చెందిన సాంఘీక శాస్త్ర అధ్యాపకులు డెంజల్ ఫెర్నాండెజ్, సామాజిక కార్యకర్త పాల్ దివాకర్, ఫాధర్ మిధున్ ఫ్రాన్సిస్, ఎమ్. ఎస్. సఫ్దర్ హష్మీ మొదలగు వారు  స్వామిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు” పేపర్లో రాసుకున్న ఆ పేర్లను చదివి మరీ ఖైదీ చెప్పాడు.

అప్పిటికే బాగా రాత్రి అవడంతో ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. నిజానికి సహచర ఖైదీ కూడా విషయాలు తెలుసుకున్న తర్వాత స్వామికి ఫిదా ఆయిపోయాడు.

 స్టాన్ స్వామి ఆలోచనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

అతనిలో ఉన్న హాస్యప్రియత్వం క్రమంగా మాయమవుతోంది. ఏప్రిల్ 26వ తేదీన అతని పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన లెక్కలేనన్ని శుభాకాంక్షలు కూడా అతని పరిస్థితిని మెరుగుపరచ లేకపోయాయి. అతనిలో పెరిగిన బలహీనత అతనికి నరాల సమస్యను తెచ్చింది. వినికిడి సమస్య పెరిగింది. 

స్వామిని తప్పుగా దోషిగా నిర్ధారించి జైలులో పెట్టారని జైల్లో అందరికి తెలిసిపోయుంది.

జైలులో 8-10 నెలల తరువాత ఖైదీలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. వాళ్ళు రోబో మాదిరి యాంత్రికంగా తయారు అవుతారు. ఖైదీల చర్మం ఇన్ఫెక్షన్లతో నిండి ఉంటుంది. మెదడు చురుకు తనం క్షీణిస్తుంది. సంస్కృతి, వినోదం, మానవ బంధాల గురించి ఆలోచనలు మారిపోతాయి.

 ఈ పీడకల ఎక్కడ ముగుస్తుందో స్వామికి ఇంకా తెలియదు. వాస్తవాలు విస్మరించ బడ్డాయి. దర్యాప్తు ఎక్కడా నాణ్యతతో కొనసాగడం లేదు. ప్రభుత్వ తెలివితక్కువ, అక్రమ ఆరోపణలను తిరస్కరించడానికి స్వామి దగ్గర మార్గం లేదు. వయసు సహకరించడం లేదు

అతని మరణానికి రొండు నెలలు ముందు స్వామి ఓ విలేకరి కలిశాడు. అతనితో ఇంటర్వ్యూ కోసం విలేకరి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేశాడు.

“సార్, మీ ఇంటర్వ్యూ కోసం నేను చాలా కష్ట పడ్డాను. మిమ్మల్ని అరెస్టు చేయడాన్ని చాలా మంది ఖండిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు చివరి దశలో ఉన్నట్టు అనిపిస్తోంది. మీకు అభ్యంతరం లేకపోతే నా ఇంటర్వ్యూ మొదలుపెడతాను” విలేకరి వినయంగా మాట్లాడాడు.

స్వామి చిరునవ్వుతో తలూపాడు. నీరసం అతని శరీరం అంతా ఆవహించి ఉంది.

“మీరు మానవతా వాదిగా ఎప్పుడు మారారు” విలేకరి ఇంటర్వ్యూని రికార్డ్ చేస్తూ అడిగాడు. అతనికి ఆడియో రికార్డింగ్ కు మాత్రమే అవకాశం ఇవ్వబడింది.

“నేను 26 ఏప్రిల్ 1937న, తమిళనాడులోని తిరుచ్చిలో పుట్టాను. నేను వేదాంతశాస్త్రం అధ్యయనం చేశాను.  ఫిలిప్పీన్స్లో సామాజిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందాను.  తర్వాత బ్రెజిలియన్ కాథలిక్ ఆర్చ్ బిషప్ హోల్డర్ కామారాతో స్నేహం నా జీవితాన్ని అర్ధవంతం చేసింది. పేద ప్రజల కోసం పనిచేయడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో అప్పటి నుండే నాకు తెలియడం మొదలైంది. నేను 1975 నుండి 1986 వరకు బెంగళూరులోని జెసూట్ నడుపుతున్న ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాను” స్వామి తన చురుకైన చూపులతో చెప్పాడు.

“ఎందుకు మీ మీద ప్రభుత్వం కక్ష కట్టింది” విలేకరి సూటిగా అడిగాడు

“ఇండియన్ స్టేట్ నా పై యుద్ధం ప్రకటించింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ అమలు చేయకపోవడాన్ని నేను ప్రశ్నించాను. నా అరెస్టును,  నా పనితో ముడిపెట్టాలని వాళ్ళు ప్రయత్నించారు.  నేను చేసే పని  ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అసమ్మతిని కలిగి ఉందని వారు భావించారు. నాకు ఏమి జరుగుతుందో నాకు తెలుస్తోంది. ఇది నాకు మాత్రమే సంభందించిన ప్రత్యేకమైన విషయం కాదు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విస్తృత ప్రక్రియ. ప్రముఖ మేధావులు, న్యాయవాదులు రచయితలు, కవులు, కార్యకర్తలు, విద్యార్థులు, నాయకులు, వీరందరినీ జైలులో పెడుతున్నారు. ఎందుకంటే వారు తమ అసమ్మతిని వ్యక్తం చేశారు.  భారతదేశ పాలక శక్తులపైన  ప్రశ్నలు సంధించారు. అసమ్మతి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఒక విధంగా నేను ఈ ప్రక్రియలో భాగం కావడం సంతోషంగా ఉంది. నేను నిశ్శబ్ద ప్రేక్షకుడిని కాదు”  స్వామి నింపాదిగా చెప్పాడు. 

“జైలు జీవితం ఎలా వుంది” విలేకరి ప్రస్తుత విషయాన్ని అడిగాడు

“తలోజా సెంట్రల్ జైలు ఎలా వుందో మీరే చూస్తున్నారుగా. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడే, ఖైదీల దుస్థితి గురించి తెలుస్తోంది. ఇక్కడ పేద ఖైదీలు చాలామంది వున్నారు. వారిపై ఎలాంటి ఆరోపణలు చేశారో వారికే తెలియదు. వారి చార్జిషీట్ కూడా వారు చూడలేదు.   ఎటువంటి చట్టపరమైన  సహాయం లేకుండా సంవత్సరాలు పాటు జైలులో నరకం అనుభవిస్తున్నారు. పంజరంలో బందీ అయిన పక్షి మళ్ళే మేము నిరసన పాట పాడుతాం”

“మీరు ఎలా అరెస్టు అయ్యారు” విలేకరి ఉక్కపోతను భరిస్తూ అడిగాడు.

“ఎల్గార్ పరిషత్ కు మావోయిస్టులతో సంబంధం ఉందని ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేసింది. ఆ కేసులోనే నన్ను అరెస్టు చేశారు. మావోయిస్టులుగా ముద్రవేయబడి జైలు శిక్ష అనుభవిస్తున్న సుమారు 3 వేల మంది అక్రమంగా జైల్లో మగ్గుతున్నారు.  ఉపా కింద అరెస్టు చేయబడ్డ వారికి బెయిల్ నిరాకరించబడుతుంది. నా కేసును మొదట పూణే పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ తరువాత ఎన్ఐఏకు అప్పగించారు. ఇలాంటి ఆరోపణలపైనే నన్ను ఇంతకుముందు జూన్ 2018 లో రాంచీలో అరెస్టు చేశారు.   వెర్నాన్ గోన్సాల్వ్స్,  అరుణ్ ఫెర్రెరాను నాతో పాటు తలోజా జైలులో ఉంచారు” ఓపిక లేకపోవడం వల్ల స్వామి చాలా నిదానంగా మాట్లాడాడు.

“మీరు బెయిలు కోసం ప్రయత్నించారా” విలేకరి అడిగాడు.

“పార్కిన్సన్ వ్యాధికి బాధితుడిని అనే కారణంతో 2020 అక్టోబర్‌లో నేను బెయిల్ కోసం దాఖలు చేశాను. బెయుల్ ఇవ్వలేదు. 6 నవంబర్ 2020 న, పార్కిన్సన్ కారణంగా కప్పు పట్టుకోలేకపోతున్నానని చెప్పాను.  ఒక  సిప్పర్‌ను కోరుతూ ప్రత్యేక కోర్టుకు ఒక దరఖాస్తును సమర్పించాను. ఇతర వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నాను.  ఈ జైలులో  నేను చాలాసార్లు పడిపోయాను. నా రెండు చెవులు వినికిడి సామర్థ్యాన్ని  కోల్పోయాయి. ఎన్నో   శస్త్రచికిత్సలు నా శరీరానికి చేశారు. నా బెయిల్ పిటిషన్లు చాలాసార్లు తిరస్కరించబడ్డాయి” నీరసంతో స్వామి మాట్లాడారు.

“మీరు చర్చిని నమ్ముతారు. కాని హక్కుల గురించి మాట్లాడతారు. ఇదెలా సాధ్యం” విలేకరి స్వామికి వినిపించడానికి కొంచెం గట్టిగా అడిగాడు.

“నా దృక్కోణంలో, చర్చి ఎదుర్కొంటున్న గొప్ప సమస్య ఐక్యత లేకపోవడం. యేసుక్రీస్తు ఈ భూమిని విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు, అతను తన శిష్యుల కోసం ప్రార్థించాడు.  వారు ఐక్యంగా ఉండాలని ప్రత్యేకంగా అడిగారు ( యోహాను 17: 20-21). తన అనుచరులు ఐక్యతతో వ్యవహరించినప్పుడల్లా, తండ్రి తనను పంపించాడని ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు ( యోహాను 17:23 ). ఏదేమైనా, యేసుక్రీస్తు తన శిష్యులతో పంచుకున్న ఐక్యత, ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ఆందోళన చెందడమే ఆయన భోధించింది.

యేసు క్రీస్తును నిజంగా ప్రేమించే వారు ఒకరినొకరు ప్రేమిస్తారు.   ఇలా చేస్తే చర్చి  శక్తివంతమైన శక్తిగా మారుతుంది.  చర్చి ఐక్యతను సాధించగలిగితే, అది సమాజంలోని రాజకీయ,   సామాజిక నిర్మాణాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్చగలదు. చర్చిలు కలిసి ఉంటే ప్రపంచం నివసించడానికి ఒక అందమైన ప్రదేశం అదే అవుతుంది. దేవుని ఆత్మ ప్రజలకు ఐక్యతను ఇస్తుంది” స్వామి నీరసంతో కళ్ళు మూసుకున్నాడు. విలేకరి అతనికి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకున్నాడు.

84 సంవత్సరాల వయస్సులో పార్కిన్సన్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి అతను.  జైలులో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఆరోగ్యం క్రమంగా క్షీనించడం మొదలుపెట్టింది. అప్పటికి జైలుకి వచ్చి 9 నెలలు అయింది. మే 28 న బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి స్వామిని 15 రోజుల పాటు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించింది. అతన్ని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్, ముంబైలో చేర్పించారు.   కోవిడ్ టెస్ట్ లో అతనికి పాజిటివ్  వచ్చింది. జూలై 4, 2021 న, స్వామి ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్ సహాయంతో ఉంచారు. స్వామి శరీర అవయవాలు ఒక్కొక్కటిగా ఆగిపోవడం ప్రారంభించాయి. ఊపిరి అంతకంతకు ఆగి పోతూ వుంది.

స్వామి మెదడు మాత్రమే అతి నీరసంగా పనిచేస్తూ వుంది. స్వామి అనుభూతి చెందుతున్నాడు.

అత్యంత పరిపూర్ణమైన ప్రశాంతత. అత్యంత అల్లకల్లోలమైన అనుభూతి. అలాగే  ఎలాంటి శారీరక నొప్పి కలగలేదు. దానికి విరుద్ధంగా, అతని అనుభూతులు ఇప్పుడు ఆహ్లాదకరమైన తారాగణంగా ఉన్నాయి. ఇంద్రియాలు  చనిపోయినప్పటికీ, అతని ఆలోచన చనిపోలేదు. దాని కార్యకలాపం అన్ని వర్ణనలను ధిక్కరించే స్థాయికి ప్రేరేపించబడింది.  ఆలోచన తర్వాత ఆలోచన పెరిగింది. ఇది వర్ణించలేనిది.  బహుశా ఊహించలేనిది కూడా. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఎవరికైనా ఈ ఆలోచనల గమనం అలానే ఉంటుందని చెప్పలేం. అతని ఆలోచనలు వెనకకు ప్రయాణించడం మొదలుపెట్టాయి. వెనక్కు ప్రయాణిస్తూ,   జీవితంలోని ప్రతి గత సంఘటనను  స్మరణకు తెచ్చింది.  అస్తిత్వ కాలమంతా ఒక రకమైన విశాల దృశ్యంలో అతని ముందు ఉంచబడింది. హటాత్తుగా చీకటి ఆవరించింది. ఒక చిన్న చీకటి రంద్రం అనంత విశ్వాన్ని మింగేస్తోంది. అందులోకి అతని ఆలోచన లాక్కోబడింది.

కాలమంతా ఒక రకమైన విశాల దృశ్యంలో అతని ముందు ఉంచబడింది. హటాత్తుగా చీకటి ఆవరించింది. ఒక చిన్న చీకటి రంద్రం అనంత విశ్వాన్ని మింగేస్తోంది. అందులోకి అతని ఆలోచన లాక్కోబడింది.

 బొంబాయి హైకోర్టులో బెయిల్ విచారణకు ముందు  జూలై 5, 2021 న స్వామి మరణించాడు.

Leave a Reply