తెలుగులో ఆధునిక కథకు ఆరంభం 1910 లో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు అని చాలాకాలంగా అనుకొంటూ వచ్చాం. కానీ భిన్న సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలలో చరిత్ర అంచులకు నెట్టివేయబడిన స్త్రీలను వెతికి కేంద్రంలోకి తీసుకువచ్చే పూనిక పెరిగిన క్రమంలో 1901 నాటికే కథలు వ్రాసిన భండారు అచ్చమాంబను తెలుసుకోగలిగాం. 1879 నుండి ఆధునిక స్వరూప స్వభావాలను సంతరించుకొంటూ తెలుగు కథ ప్రయాణం ప్రారంభం అయితే ఆ ప్రయాణంలో అడుగులు కలిపిన తొలి మహిళ భండారు అచ్చమాంబ. స్త్రీల జీవిత చైతన్య వికాసాలకు కేంద్రమైన సంఘ సంస్కరణోద్యమ ఆశయ ప్రచార నిబద్ధత నుండి ఆమె కథలు వ్రాసింది.