మనమింకా బతికే వున్నామా? ఇదేదో భేతాళుని భుజాన వేలాడే రాజు ప్రశ్న కాదు వాదనలు ముగిసిన వేళ వాడొక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టేసే వేళ అటూ ఇటూగా సరిపెట్టుకుంటే నువ్వూ నేనూ కోల్పోయేదేమీ లేదు వాడి తుపాకీ మొన ముందు వారి మానం ఛిద్రమైన వేళ కోర్టుల ముందు నగ్నంగా నిలబడిన తల్లులను వంచించిన నీ న్యాయం నీకు నైతిక విజయమా? కోల్పోయిన మానానికి కళ్ళు లేని న్యాయం ధర కడుతుందా? తాను రుజువు చేయలేని ఆ పదముగ్గురినీ వాకపల్లిలో నిలబెడితే న్యాయమేదో బిగ్గరగా వినబడేది కదా? పదారేళ్ళ నీ విచారణకు తమ కొంగు చివర కట్టుకున్న
దేహమంతా సూదిపోట్ల సలపరం పాదాలు ఏనుగేదో తొక్కిపెట్టినట్లు లోలోపల కరకరమమంటూ బాధ తనువంతా రెండు ముక్కలయినట్లుగా భారంగా వేలాడుతుంది కను రెప్పలనెవరో పిన్నులతో ఎక్కుపెట్టినట్లు నిదుర ఎక్కడికో తనను మరచి పారిపోయినట్లుంది రక్తాన్ని తోడుతున్నదెందుకో ఎన్ని పరీక్షలు చేసినా చివరాఖరికి ఏదీ కొత్తగా చెప్పారో తెలియని అయోమయం చికిత్స తెలిసినట్లే వున్నా దేహమెందుకో మొరాయిస్తుంది ఈ తెలవారని రాత్రి మరో ఉదయాన్ని మాత్రమే హామీనివ్వగలుగుతోంది పున్నమి వెన్నెల రాజి గూడులా తన కంటి చుట్టూ వలయాలు అయినా తను పగలబడి నవ్వినప్పుడు అడవి చుట్టూ వెలుతురు పూల కాంతి!!! (కామ్రేడ్ సహోదరికి ప్రేమతో)
1. ఆశ ఎవరో ఒకరు నీ తలపై గురిపెడుతూనే వుంటారు ప్రతి క్షణం నీ చుట్టూ నిఘా పెడుతూనే వుంటారు నీ ఆలోచనలు సీతాకోకచిలుకలుగా మారి ఎగరక ముందే నీ రెప్పలపై ఇనుప తెర వేస్తారు నీ గొంతుపై ఉక్కుపాదం మోపుతారు నీ కాళ్ళకు సంకెళ్లు చుట్టుకుంటాయి ఎవరూ నీ వెంట రాని కాలంలో నువ్వే ఒక ఆకాశం కావాలి నువ్వే ఒక సంద్రం కావాలి నువ్వే ఒక సమూహం కావాలి 2. ఆకాశం వర్షించే వరకూ అతడు లేచి వస్తాడు ఆమె తోడుగా రక్తం చిందించిన వారెప్పుడూ తిరిగి వస్తారు అదో భరోసా నీకూ నాకూ అతడు