చదువేలేని తరంలోంచి వచ్చాను. మా జేజబ్బ ఏటవతల తాండ్రపాడు. నాన్నకు చదువు లేదు. అప్పట్లో పిలిచి కోర్టులో తోటమాలి పని ఇచ్చారు. ఆ తరువాత బిల్లజవానుగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాకు చదువు మీదకన్నా సినిమాలు కథలమీద మోజు . అందుకే చదువు అబ్బలేదు. కర్నూలు లో పుట్టాను. అది 1990 కవిత్వజ్వరం బాగా పట్టుకున్న కాలం. నాకు కవులంటే పిచ్చి మోహం. వాళ్ళ ఫోటోలు తెల్లపుస్తకం లో అతికించి, ఫోటోలకింద వారి చిరునామాను, ప్రచురితమైన కవిత్వం సంకలనాల్ని రాసి దాచుకునే వాణ్ణి. ఇప్పటికీ ఆపుస్తకం ఉంది. ఆశారాజు రాసిన రెండవపుస్తకం 'దిశ ' నాకు రంగుల సీతాకోకలా అనిపించింది.