కథలు

మనసుడికి పోతే…

రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు.