సాహిత్యం వ్యాసాలు

ఏది సంస్కృతి?

(చలసాని ప్రసాద్‌ 5,6 జనవరి 2008 గుంటూరులో జరిగిన విరసం మహా సభల ప్రసంగ పాఠం పునర్ముద్రణ - వసంతమేఘం టీం) సంస్కృతి అంటే ఏమిటి? నాగరికత అంటే ఏమిటి? కులానికి, సంస్కృతికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు వసంతకాలపు సరస్సులో పద్మాలలాగా నా మనస్సులో వున్నాయి. ఎంత సందేహ పూరితమైన అభిప్రాయాలున్నాయో అంత సమాచారము ఉన్నది, అన్ని ఆలోచనలూ ఉన్నాయి. ఇవన్ని ఈ సందర్భంలో మీతో పంచుకొని ఒక చిన్న ప్రయత్నమే ఇది. సంస్కృతి అనగానే సంఘపరివార్‌ గుర్తుకు వస్తుంది. బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు జాతీయ సంస్కృతిని, సాంస్కృతిక జాతీయ వాదమని చెపుతుంటాడు. అందులో జాతీయవాదమనేది ఒక ప్రత్యేకమైన అంశం.