కథలు

నా కథల్లో నేనుంటాను

తెలంగాణ నేల  మీద నేను పుట్టి అడుగులు వేసే సమయానికి ఈ మట్టి మీద  ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుకూలి ఉద్యమాలు, కమ్యూనిష్టు పోరాటాలు, నక్సలైట్ ఉద్యమం, బతుకుదెరువులేక ఎడారి దేశాలకు, ముంబై, షోలాపూర్, సూరత్, బీవండి వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రాలకు నేత కార్మికుల వలసలు ఇలా తెలంగాణ నేలంతా తనలో తాను తొక్కులాడుకుంటున్న కాలం. అలాంటి గడ్డుకాలంలో జన్మించి సర్కారు బడిలో చేరి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని ఇన్నాళ్ళకు నావైన కథలేవో కొన్ని రాసుకొని వాటిని ‘పుంజీతం’ పేర ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను. ఈ ప్రయాణమంతా ఎన్నో గతుకులతో కూడినది.