సాహిత్యం సంభాషణ

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.