మా గురించి

అసమ్మతి కోసం..
“వసంతమేఘంగా” తిరిగి వస్తున్నాం

అసమ్మతే మన జీవితం కావాలి. భిన్నాభిప్రాయమే వ్యక్తీకరణ కావాలి. ప్రశ్నించడమే గీటురాయి కావాలి. సృజనాత్మకతను నిలుపుకోవడమే కనీస పోరాటం కావాలి. మనుషులు నిలబడతారని చెప్పడమే మన ఆశావాదం కావాలి. సకల విధ్వంసాల మధ్య కూడా ప్రజలే సర్వ శక్తిసంపన్నులని చాటి చెప్పాలి. ఎన్ని అర్థ ఛాయల్లోనైనా సరే మానవ ఆకాంక్షలను వినిపించాలి. మానవులను గానం చేయడమే మనందరి ఏకైక ఇతివృత్తం కావాలి.

ఫాసిజమంటేనే భయపెట్టడం.
వేల ఏళ్ల నాగరికతలో ప్రజలు ప్రోది చేసుకున్న ధైర్యాన్ని ఎత్తిపట్టడమే దానికి సమాధానం.
ఫాసిజమంటే మనసుల్లో విషం నింపడం.
పీడన, దోపిడీల మధ్యనే వసంతకాలపు వెన్నెల కురిసే ప్రజా జీవితమే దానికి పరిష్కారం.
ఫాసిజమంటే మనుషుల్ని ముక్కలు ముక్కలు చేయడం.
మహాద్భుతమైన మానవ సంబంధాల జీవధారను కాపాడటమే నిర్మాణాత్మక ధిక్కారం.
వ్యక్తి స్వేచ్చ, తార్మికత, మానవత, ప్రజాస్వామ్యం, భవిష్యదాశ మన ఆలంబన.

తెలుగు సమాజ, సాహిత్యాలకు ఉన్న సంపద అదే. దీన్ని ఇనుమడింపజేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విరసం విరసం.ఆర్ల్‌ పక్ష పత్రిక 2016 మే 15న మొదలైంది. 2020 ఆగస్ట్‌ నెలలో సైబర్‌ దాడులతో పూర్తిగా ఆగిపోయింది. హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా కశ్మీర్‌ స్వేచ్చ్భాకాంక్షలను, దండకారణ్య యుద్ధ సమయాలను, మావోయిస్టు ఉద్యమ వెలుగు రేఖలను, పీడిత అస్తిత్వాల విముక్తి గానాలను, కార్మిక వర్గ పోరాటాలను వినిపిస్తున్నందుకే “వాళ్లకు” కోపం వచ్చింది. ఈ రాతలు మానుకోమని హెచ్చరించారు. విననందుకు పదే పదే దాడులు చేశారు.

విరసం. ఆర్గ్‌ ఆగిపోయింది.

మళ్లీ కొత్త పత్రికను సిద్ధం చేసుకొనేదాకా విరసం.ఆర్ట్‌ పేరుతో ఒక బ్లాగ్‌ను నడుపుతున్నాం. దానికుండే సహజ పరిమితుల కారణంగా సహజంగానే అది అనుకున్నంతగా పాఠకులకు చేరువ కావడం లేదు.

అందుకే ‘వసంత మేఘం’గా రాబోతున్నాం. 1 ఏప్రిల్ 2021 నుండి సాహిత్య, రాజకీయార్థిక ఆన్‌లైన్‌ పక్ష పత్రిక ఆరంభమవుతోంది. వసంతమేఘం అనే మాట తెలుగు కవిత్వంలో అనేక పర్యాయ పదాలుగా, భావచిత్రాలుగా, ఉత్తేజ స్వరాలుగా విస్తరిస్తోంది. సృజనాత్మకతకు, అసమ్మతికి, ధిక్కారానికి, ప్రత్యామ్నాయానికి సాటిరాని పదబంధం. మేధో రంగంలో నిత్య విద్యుత్తేజం. మన నిరసనలో వసంతమేఘ గర్జనలు పిక్కటిల్లాలి. మన కాల్చనికతలో వసంత మేఘపు వాన చినుకులు కురవాలి.

విరసం. ఆర్గ్‌లాగే వసంత మేఘం ప్రగతిశీల భావజాలాలన్నిటికీ వేదిక. నియంతృత్వంగా మారిపోతున్న “ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే గొంతుల కూడలి. నిజమైన అర్ధంలో ప్రజాస్వామ్యాన్ని కలగంటున్న వాళ్లందరి లోగిలి. మనందరి రచనలు, ఆలోచనలు, చర్చలతోనే వసంతమేఘం వర్షిస్తుంది. అందరి సాయం కోరుతున్నాం. అందరి భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాం. అందరినీ స్వాగతిస్తున్నాం.

వసంతమేఘం టీం
విరసం