సుప్ర‌సిద్ధ మార్క్సిస్టు లెనినిస్టు మేధావి సునీతికుమార్ ఘోష్ రాసిన పుస్త‌కం *భార‌త బ‌డా బూర్జువా వ‌ర్గం.పుట్టుక -పెరుగుద‌ల‌-స్వ‌భావం*.  ఈ పుస్త‌కం తెలుగు అనువాదం పిడిఎఫ్ మీ కోసం. విప్ల‌వాభిమానులు, కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ అర్థ శాస్త్ర విద్యార్థులు త‌ప్ప‌క చ‌ద‌వాల్పిన పుస్త‌కం ఇది. కా. సునీతి దీన్ని 1985లో రాశారు. 2012లో మ‌రింత తాజా స‌మాచారంతో రెండో కూర్పు విడుద‌ల చేశారు. దానికి ఆయ‌న ఒక సుదీర్ఘ‌మైన ముందుమాట రాశారు. ఇప్ప‌డు మీకు అందిస్తున్న‌ది ఆ ముందుమాటే. కా. ఆశాల‌త ఈ పుస్త‌కాన్నిచ‌క్క‌గా తెలుగులోకి అనువ‌దించారు. 2018లో విప్ల‌వ ర‌చ‌యితల సంఘం  ప్ర‌చురించింది. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాలు, భార‌త బూర్జువా వ‌ర్గ స్వ‌భావం,  విప్ల‌వ ద‌శ గురించి శాస్త్రీయ వైఖ‌రి అల‌వ‌ర్చుకోడానికి ఈ పుస్త‌కం దారి చూపుతుంది.  పుస్త‌కంలోకి వెళ్ల‌డానికి రెండో కూర్పుకు సునీతి రాసిన ముందుమాట సాయం చేస్తుంది. ఈ ముందుమాటను,  పుస్త‌కాన్ని కూడా చ‌దివండి,  చ‌ర్చించండి – వ‌సంత‌మేఘం టీం 

 ముందుమాట‌

బడా బూర్జువా వర్గంలో జాతీయ బూర్జువా వర్గం, దళారీ బూర్జువా వర్గం అనే రెండు సెక్షన్లు ఉన్నాయా లేదా అనేది ముల్లులాంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన సమాధానమే భారత రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం.విదేశీ సామ్రాజ్యవాద పెట్టుబడితో బూర్గువావర్గ సంబంధాల స్వభావం ఆధారంగా జాతీయ, దళారీ బూర్జువా వర్గాలు అనే రెండు సెక్షన్లుగా విభజించబడి వుంది అనే దృష్టికోణాన్ని పార్లమెంటరి రాజకీయ పార్టీలు, రాజకీయ శాస్త్రజ్ఞులలో అత్యధికులు, అర్ధక చరిత్రకారులు అంగీకరించరు. వలస పాలనలో దాని పై శ్రేణి తో సహా మొత్తం భారత పెట్టుబడిదారీ వర్గానికీ సామ్రాజ్యవాద పెట్టుబడికీ శత్రు వైరుధ్యం వున్నది అనేది వారి దృష్టిలో స్వయం సిద్ధ సత్యం. వారి మధ్య కొన్ని సమయాలలో కొంతమేర సహకారం ఉన్నప్పటికీ సామ్రాజ్యవాద పెట్టుబడికీ భారత బడా బూర్జువా వర్గానికీ మధ్య సంబంధం ప్రాథ‌మికంగా శత్రుపూరితమైనదే ననేది, కనీసం 1930లనుండి, వారి వాదన.పై అభిప్రాయాన్ని సమర్ధించటానికి వాస్తవాలను ఆధారంగా చూపలేదని   ఈ పుస్తకంలో వాదించాను. భారతదేశంలో పెట్టుబడి దారీ రంగం, భారత సమాజంలోపల అ వైరుధ్యాలు పదునెక్కిన కారణంగా కాక ఒక విదేశీ అభివృద్ది చెందిన పెట్టుబదారీ విధానపు ప్రభావంతో తలెత్తింది, దానికి ఒక ఆధారపడిన పెట్టుబడిదారీ పూర్వ సమాజపు రాజ్యాధికారం మద్దతు వుంది. భారత పెట్టుబడిదారీ విధానం వలసపాలన కోటు తొడుక్కుంది, అది ఎంతమాత్రమూ తనంతట తాను స్వతంత్రంగా అభివృద్ది చెందలేదు. భారత దేశంలో పెట్టుబడిదారీ వర్గం ఆ వెంటనే జాతీయ, దళారీ అనే రెండు సెక్షన్లుగా విభజింపబడింది అనేది నా వాదన. జాతీయ బూర్జువావర్గపు ప్రయోజనాలు సామ్రాజ్యవాద పెట్టుబడితో ముడిపడి లేవు, అది స్వతంత్రంగా అభ్రివృద్ది చెందటానికి ప్రయత్నించింది. సామ్రాజ్యవాదంతో దానికి శత్రుపూరిత వైరుధ్యం వుంది, అందుకే దానిని సామ్రాజ్యవాద పెట్టుబడి అణచివేసింది.

మరొకవైపు దళారీ బూర్జువావర్గం సామ్రాజ్యవాద పెట్టుబడికి ఏజెంటుగా పనిచేసింది, వాటి మధ్య స్వల్ప వైరుధ్యాలున్నప్పటికీ దాని ప్రయోజనాలు సామ్రాజ్యవాద ప్రయోజనాలతో కలగలసిపోయాయి. అది సామ్రాజ్యవాద సంరక్షణలో బలంగా పెరిగి ప్రజలపై జరిపే పోరాటాలలో అది ఎల్లప్పుడూ సామ్రాజ్యవాదంతో చేయి కలిపింది. దళారీ బూర్జువా వర్గం దేశంలోపల ‘దేశ ద్రోహి’ గా నిలిచింది. ఈ ముందుమాటలో బారతదేశంలో జాతీయ బూర్జువా వర్గానికీ దళారీ బూర్జువావర్గానికీ మధ్య తేడాను ఇంతకు ముందుకంటే మరింత స్పష్టంగా వివరించాలని అనుకుంటున్నాం. ‘‘భారత బడా బూరువావర్గం సామ్రాజ్యవాదం’’  అనే నా వ్యాసంలో నేను జాతీయ బర్జువావర్గ సంస్థలు, వాటిని స్థాపించినవారి గురించి ఉదాహరణలు క్లుప్తంగా ఇచ్చాను(ఆ వ్యాసంలోని కొన్ని భాగాలు ఈ పుస్తకం చివరలో అనుబంధంగా వున్నాయి). అవి ఎక్కువగా బెంగాల్‌ కు చెందిన ఉదాహరణలు, కానీ అటువంటి జాతీయ బూర్జువావర్గ ఉదాహరణలు భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. వారు బూర్జువావర్గంలో ప్రాబల్యం గల సెక్షన్‌ కానప్పటికీ సంఖ్యాపరంగా (ఇప్పటికి కూడా) పెద్ద సెక్షన్‌. పైన చెప్పిన వ్యాసంలో సాధారణ ఉదాహరణలుగా ఉదాహరించిన జాతీయ బూర్జువావర్గ సంస్థలు మాత్రమే వారి జాబితాలో వున్నాయి అనుకోవటం హాస్యాస్పదం అవుతుంది.

నేను ఇంతకుముందే చెప్పినట్లు దేశంలోని అన్ని ప్రాంతాలలో అటుంటి సంస్థల అనుభవాలు వున్నాయి, నేను ఉదహరించిన సంస్థల సంఖ్యను అనేక రెట్లు గుణించ వచ్చు. అయినా కూడా ‘‘ఇండియా అండ్‌ ది రాజ్‌ 1919 -1947’’ అనే నా పుస్తకం మొదటి భాగాన్ని సమీక్షిస్తూ ఒక పండితుడైన ఆర్థిక శాస్త్ర, ప్రొఫెసర్‌ బూర్జువార్గపు ఒక విడి సెక్షన్‌ గా ఏర్పడటానికి అవి చాలా కొద్ది సంఖ్యలో వున్నాయి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయన దళారీ సెక్షను ఉనికిని గుర్తించడు, దళారీ వర్గానికీ జాతీయ బూర్జువా వర్గానికీ మధ్య తేడాను గుర్తించడు.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సోదరుడు జ్యోతిరింద్రనాథ్‌ ఠాగూర్‌ 1884లో ఇన్లాండ్‌ రివర్‌ స్టీం నావిగేషన్‌ సర్విస్‌ అనే షిప్పింగ్‌ కంపెనీని స్థాపించాడు. ఆ కంపెనీకి చెందిన ఓడలు ఖుల్నా బరిసాల్‌ మధ్య ప్రయాణీకులను, కలకత్తా వరకు సరుకులనూ చేరవేసేవి. ఇది బ్రిటిష్‌ యాజమాన్యంలోని ఫ్లోటిల్లా షిప్పింగ్‌ కంపెనీతో తీవ్ర పోటీనీ, వ్యతిరేకతను ఎదుర్కొంది. అతడి తాత ద్వారకానాథ్‌ ఠాగూర్‌ బ్రిటిష్‌ వ్యాపారులతో కలసి స్థాపించిన కార్‌ ఠాగూర్‌ అండ్‌ కంపెనీతో దానిని పోల్చి చూసినప్పుడు జాతీయ బూర్జువా వర్గానికీ దళారీ బూర్జువావర్గానికీ మధ్య తేడా స్పష్టంగా బయటకి వస్తుంది.2బి జ్యోతిరింద్రనాథ్‌ కంపెనీ బ్రిటిష్‌ కంపెనీతో క్రూరమైన రేటు యుద్ధంలో(ఉచితంగా చేరవేయటం, బహుమతులు ఇవ్వటం వంటివి కూడా) నిలవలేక ఓడిపోయింది. ఆ తర్వాత ఈస్ట్‌ బెంగాల్‌ రివర్‌ స్టీం సర్విస్‌, ఈస్ట్‌ బెంగాల్‌ మహాజన్‌ ఫ్లోటిల్లా కంపెనీ, బెంగాల్‌ స్టీం నావిగేషన్‌ కంపెనీ, కో ఆపరేటివ్‌ నావిగేషన్‌ లిమిటెడ్‌ వంటి అనేక బెంగాలీ షిప్పింగ్‌ కంపెనీలను నెలకొల్పారు, కానీ అవన్నీ బ్రిటిష్‌ షిప్పింగ్‌ కంపెనీలనుండి ఎదురైన తీవ్రమైన పోటీని తట్టుకోలేక మూతబడ్డాయి. బ్రిటిష్‌ కంపెనీలు బెంగాలీ కంపెనీలను ఉనికిలో లేకుండా చేయటానికి రేట్లు తగ్గించి కొంతకాలం నష్టాలు అనుభవించేవి.

బిర్లా యాజమాన్యంలోని జనపనార మిల్లుతో సహా జనపనార మిల్లులన్నీ భారత షిప్పింగ్‌ కంపెనీలు(అంటే బెంగాలీ కంపెనీలు)3 చేరవేసే సరుకును నిరాకరించటం అనేది బెంగాలీ కంపెనీలు పతనమవటానికి మరొక కారణం. ట్యూటి కార్న్‌ కు చెందిన స్వదేశి స్టీం నావిగేషన్‌ కంపెనీ కూడా శక్తివంతమైన బ్రిటిష్‌ కంపెనీలతో యుద్ధంలో బలైంది.పైన పేర్కొన్న అర్దికశాస్త్ర ప్రొఫెసర్‌ లాంటి వారి ప్రయోజనం కోసం ఇప్పటికే చెప్పిన జాతీయ బూర్జువావర్గ కంపెనీల జాబితాకు మరికొన్ని ఉదాహరణలు చేర్చవచ్చు. భిన్నమైన పారిశ్రామిక రంగాలలో వున్న అటువంటివే మరి కొన్ని కంపెనీలు – శ్రీనాథ్‌ మిల్‌ (నూలు వస్త్రాల మిల్లు), ధాకేస్వరి కాటన్‌ మిల్స్‌, నేషనల్‌ టానరీస్‌, బెంగాల్‌ పాటరీస్‌, నేషనల్‌ సోప్‌ ఫ్యాక్టరి, పబ్నా శిల్పా సంజీబని కంపెనీ, బెంగాల్‌ హోసియరి కంపెనీ, బందే మాతరం మాచ్‌ ఫాక్టరీ, ఓరియంటల్‌ మాచ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ, బెంగాల్‌ సిగరెట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ, రంగపుర్‌ టుబాకో కంపెనీ, మనోరమా కాండిల్‌ ఫాక్టరీ, నేషనల్‌ ఆయిల్‌ మిల్‌, స్టాండర్డ్‌ ఫార్మసూటికల్స్‌, ఓరియంటల్‌ మెటల్‌ ఇండస్ట్రీస్‌, న్యూ ఇండియా మెటల్‌ వర్క్స్‌, మాయా ఇంజినీరింగ్‌ వర్క్స్‌, అట్లాస్‌ వెయింగ్‌ మెషిన్స్‌, భారత్‌ జూట్‌ మిల్స్‌, బెంగాల్‌ ఎలెక్ట్రిక్‌ లాంప్‌ వర్క్స్‌, సాధన ఔషధాలయ్‌. జాతీయ బూర్జువా వర్గం కొన్ని బ్యాంకులను, ఇన్సూరెన్స్‌ కంపెనీలను కూడా స్థాపించింది. బెంగాల్‌ నేషనల్‌ బ్యాంక్‌, కొమిల్లా యూనియన్‌ బ్యాంక్‌, కొమిల్లా బ్యాంకింగ్‌ కార్పోరేషన్‌, దాస్‌ బ్యాంక్‌, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఈస్టర్న్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, ఇండియా ఈక్విటబుల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, హిందూస్తాన్‌ కోఆపరేటివ్‌ ఇన్సురెన్స్‌ వంటివి వాటిలో వున్నాయి. నేను ఇక్కడ చాలా వరకు బెంగాల్‌ సంస్థలకే పరిమితమయ్యాను, కానీ అటువంటి సంస్థలు దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలలోనూ వున్నాయి. వాటి గురించి తెలియకపోవటం వల్ల నేను వాటిని ఉదహరించలేదు.అటువంటి మధ్య తరహా సంస్థలతో పాటు అనేక చిన్న పెట్టుబడి గల సంస్థలు భారతదేశ వ్యాప్తంగా విస్తరించి వున్నాయి. 1951 పరిశ్రమల(అభివృద్ది క్రమబద్దీకరణ)చట్టం క్రింద 50 మంది కంటే తక్కువ కార్మికులను నియమించి విద్యుచ్చక్తితో నడిచే కర్మాగారాలు, 100 మంది కంటే తక్కువ కార్మికులతో విద్యుచ్చక్తి లేకుండా పనిచేసే ఫ్యాక్టరీలకు పారిశ్రామిక లైసెన్స్‌ అవసరం లేదు, వాటిని చిన్న తరహా పరిశ్రమలుగా పరిగణించారు. దేశంలో అటువంటివి 20 లక్షలవరకు ఉన్నాయనీ, వాటిలో మాన్యుఫాక్చరింగ్‌ రంగంలోని మొత్తం పారిశ్రామిక కార్మికులలో 80% ఉపాధి పొందుతున్నారనీ 1993 మే 29 బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక ప్రకటించింది. ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ వ్యాసం ప్రకారం ‘‘సుమారుగా తయారయ్యే వస్తువులలో 50% చిన్న తరహా పరిశ్రమలనుండి వస్తున్నాయి’’. ఈ రోజున ప్రభుత్వ ప్రోత్సాహంతో సామ్రాజ్యవాద దళారీ బడా పెట్టుబడిదారులు ఈ రంగాన్ని ఆక్రమించుకుని అనేక చిన్న తరహా పరిశ్రమలను నియంత్రిస్తున్నాయి.

వారి ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమలలో పెట్టె పెట్టుబడి గరిష్ట పరిమితిని ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చింది. అతి పెద్ద పారిశ్రామిక సంస్థల అదుపులో అనేక లైసెన్స్‌ లేని చిన్న తరహా పరిశ్రమలు వున్నట్లు’’ అంతకుముందు పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధాన విచారణ కమిటీ కనుగొన్నది. . అయితే వలసకాలంలోనూ, వలసానంతర కాలంలోనూ ఈ చిన్న తరహా పరిశ్రమలలో అత్యధిక శాతం జాతీయ బూర్జువావర్గ యాజమాన్యం, నిర్వహణలో ఉండేవి(వున్నాయి) అనటంలో సందేహం లేదు. ‘‘భారత బూర్జువావర్గం సామ్రాజ్యవాదం’’ అనే వ్యాసంలో నేను హౌరాలోని చిన్న తరహా ఇంజినీరింగ్‌ పరిశ్రమల గురించి క్లుప్తంగా వివరించాను. ఇక్కడ   పంజాబ్‌ లో పరిశోధకులు ఉటంకించిన వాటిని ప్రస్తావించదలచాను. మంజిత్‌ సింగ్‌ ఇలా రాస్తాడు: ‘‘ఔత్సాహికులైన రాంగార్హియాలు చిన్న రిపేరు షాపులుగా ప్రారంభించిన లుధియానా లోని సైకిల్‌ మరియు కుట్టు మెషిన్‌లు చిన్న తరహా పరిశ్రమల స్థాయికి పెరిగాయి. చెక్క, ఇనుము పనులు చేసే సాంప్రదాయ చేతివ్రుత్తులవారైన రాంగార్హియాలు తమ చిన్న వర్క్‌ షాపులను విస్తరించి మొదట వస్తు తయారీ కర్మాగారాలుగా ఆ తర్వాత చిన్న తరహ ఫ్యాక్టరీలస్థాయికి తీసుకొచ్చారు. .. లుధియానా ఇంజనీరింగ్‌ పరిశ్రమపై 1960లలో వచ్చిన ఒక నివేదిక దాదాపు 50% పరిశ్రమ యజమానులు దశాబ్దం క్రితం వరకు కమ్మరి పనిచేసిన రాంగార్హియాలేనని చెప్పింది.’’ మంజిత్‌ సింగ్‌ ఇంకా ఇలా రాస్తాడు: ‘‘పంజాబ్‌ లోని చిన్న తరహా పరిశ్రమల ప్రత్యేక లక్షణం ఏమిటంటే వాటిలో అత్యధికం సాంప్రదాయ చేత్రివ్రుత్తుల వారి చిన్న సైజు వర్క్‌ షాపులనుండి ‘మాన్యుఫ్యాక్టరీలు’గా , వాటినుండి ఇటీవల ఫ్యాక్టరీలుగా పరిణామం చెందటం. మరమగ్గాల నేత పరిశ్రమలో కర్మాగారాల సైజు చాలా చిన్నది, ఒకొక్క దానిలో సగటున 10 నుండి 15 మంది కార్మికులు పనిచేసేవారు. వాటిలో చాలా వరకు ఎదో ఒక సమయంలో నేత పరిశ్రమలో కార్మికులుగా పనిచేసినవారి యాజమాన్యంలో వున్నాయి.

ఇదే రకమైన పరిణామ అభివృద్ది క్రమం పంజాబ్‌ లో జవుళి పరిశ్రమలోనే గాక సైకిల్‌, సైకిల్‌ విడి భాగాల పరిశ్రమలో కూడా గమనించారు. వ్యవసాయ పనిముట్ల ఉత్త్పత్తి రంగంలో పంజాబ్‌ లో సాంప్రదాయ చేతివృత్తులవారి పాత్ర చాలా కీలకమైనది, ఇందుకు జలంధర్‌ లోని గోరయ పట్టణంలో రాంగార్హియాల ఉదాహరణ చెప్పుకోవచ్చు.’’ దీనినే మార్క్స్‌ పెట్టుబడిదారీ విధానానికి ‘‘నిజమైన విప్లవకర మార్గం’’గా పేర్కొన్నాడు, ఈ మార్గాన్నే పి సి రే(బెంగాల్‌ కెమికల్‌ అండ్‌ ఫార్మసూటికల్‌ వర్క్స్‌ స్థాపకుడు), బి డి అమీన్‌(అలెంబిక్‌ కెమికల్స్‌)నరేంద్రనాథ్‌ దత్‌ బెంగాల్‌ ఇమ్మూనిటి), సురేంద్ర మోహన్‌ బసు(బెంగాల్‌ వాటర్‌ ప్రూఫ్‌), అలమోహన్‌ దాస్‌(ఇండియా మెషినరి ఇంకా అనేక సంస్థలు), ఇంకా హౌరా కు చెందిన నైపుణ్యం గల మేస్త్రీలు, లుధియానా, జలంధర్‌ లకు చెందిన రామ్గార్హియాలు మొదలైనవారు అనుసరించారు. టాటాలు, పెటిట్‌ లు, బిర్లాలు, గోయెంకాల వంటి బడా దళారుల మార్గం లాగా కాకుండా వారిది స్వతంత్ర అభివృద్ది మార్గం. దళారీల కంపెనీల మాదిరిగా కాక ఈ కంపనీలు చిన్న స్థాయిలో మొదలయ్యాయి. దళారీల మాదిగిరిగా వారు విదేశీయుల నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయటం గాక తామే కనిపెట్టిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి దానిపై పట్టు సాధించారు. భారతదేశంలో కెమికల్‌ అండ్‌ ఫార్మసూటికల్‌ కంపెనీలను ప్రారంభించింది ఈ చిన్న తరహా ఔత్సాహిక సంస్థలే. వారి సంస్థలు దాదాపు అన్ని వినిమయ వస్తువుల పరిశ్రమలను ప్రాతినిధ్యం వహించాయి, సామ్రాజ్యవాద పెట్టుబడితో చేతులు కలిపి దళారీలు పరిశ్రమలోకి ప్రవేశించడంకంటే చాలా ముందే ఈ చిన్న తరహా సంస్థలే యంత్ర పరికరాలను తయారు చేయటం మొదలుపెట్టాయి. ‘‘ఈ చిన్న తరహా పరిశ్రమలు చాలా వాటిలో యజమానులు మధ్యతరగతికి చెందినవారు, వారికి తమ వ్యాపారం సాగించేందుకు సరిపడిన ఆచరణాత్మక శిక్షణ వుంది, పరిశ్రమలలోని సాంకేతిక పద్ధతుల గురించి వారికి బాగా తెలుసు’’ అని 1949 -50లో ఆర్థిక కమిషన్‌ అభిప్రాయపడిరది.జాతీయ బూర్జువావర్గం అనేక ఆవిష్కరణలు, కొత్త పద్ధతులను పరిష్కారాలను కనుగొన్నది. ఉదాహరణకు డాక్టర్‌ యు ఎం బ్రహ్మచారి 1921లో కాలాజార్‌ అనే భయంకరమైన వ్యాధికి మందు కనిపెట్టాడు, అతడి ప్రయోగశాలలో ఆ మందును వాణిజ్య స్థాయిలో ఉత్త్పత్తి చేసిన తర్వాత ఆ జబ్బు దేశం నుండి మాయమయింది. దురదృష్టవశాత్తూ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ జబ్బు మళ్ళీ కనిపిస్తున్నది.1949కి ముందు చైనా గురించి చెబుతూ మవో సే టుంగ్‌ జాతీయ బూర్జువా వర్గం ‘‘సామ్రాజ్యవాదం చేత అణచివేయబడింది, భూస్వామ్య విధానం దానిని సంకెళ్ళలో బంధించింది’’ అని అన్నాడు. భారతదేశ బూర్జువా వర్గానికి కూడా ఇది వర్తిస్తుంది, ఈ నాటికీ దాని పరిస్థితి అదే. భారతదేశపు విశాల గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య సంబంధాలు ప్రబలంగా వుండటం వల్ల భారతదేశంలో మార్కెట్‌ కుంచించుకుని వుంది. భారత ఆర్థిక వ్యవస్థ, స్వదేశీ విదేశీ వాణిజ్యం పరిశ్రమలు సామ్రాజ్యవాద పెట్టుబడి, దాని దళారుల గుప్పెటలో వుండటం చేత, వలస ప్రభుత్వపు హానికరకమైన విధానాల వల్ల జాతీయ బూర్జువా వర్గం ఏ విధంగానూ పెరిగి విస్తరించలేకపోయింది, కనీసం మనలేకపోయింది.

బెంగాలీల యాజమాన్యం లోని షిప్పింగ్‌ కంపెనీలను సామ్రాజ్యవాద పెట్టుబడి ఏ విధంగా తన అపారమైన వనరులతో చంపేసిందో ఇంతకుముందు చూసాము. భారత కెమికల్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, అలెంబిక్‌ కెమికల్‌ వర్క్స్‌ యజమాని అయిన బి డి అమీన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జవహర్లాల్‌ నెహ్రుని సంబోధిస్తూ కాంగ్రెస్‌ నియమించిన ప్లానింగ్‌ కమిటీకి 1938 డిసెంబర్‌ 16వ తేదీన ఒక విజ్ఞాపన పత్రంలో ఇలా రాసాడు: ‘‘ఈ దేశంలో భారత పరిశ్రమలకు విదేశీ పరిశ్రమలకు మధ్య వివక్ష చూపే విధానం చాలా సంవత్సరాలుగా అమలులో వుంది అనే విషయం అందరికీ తెలిసిన వాస్తవమే, అది స్థానిక పరిశ్రమలకు తీవ్రమైన హాని కలిగించింది’’. ఇందుకు ఉదాహరణగా అతడు ‘‘విశ్వాసాల ద్వారా చికిత్స చేసే ఔషధాలు, పారిశుద్ధ్య, సుగంధ పదార్ధాలను అనేక రకాల కఠినమైన తనిఖీకి గురిచేస్తారు, విదేశాలనుండి దిగుమతి అయ్యే అదే రకమైన ఉత్పత్తులకు అవి వర్తించవు’’ అని ఉటంకించాడు. జాతీయ బూర్జువా వర్గానికి సామ్రాజ్యవాద బూర్జువావర్గం తోనే కాక దళారీ బూర్జువా వర్గంతో కూడా శత్రుపూరిత వైరుధ్యాలు వున్నాయి. (9వ అధ్యాయంలోని ‘‘శతృత్వ అంశాలు’’ చూడండి).ప్రత్యక్ష వలస పాలన అంతమయిన తర్వాత జాతీయ బూర్జువా వర్గం అనుభవించిన ప్రతికూల పరిస్థితులు కనపడకుండా పోలేదు  పైగా అవి వలసానంతర ప్రభుత్వ విధానాల వల్ల మరింత దారుణంగా తయారయ్యాయి. 1948 ఏప్రిల్‌లో జరిగిన అఖిల భారత సబ్బుల తయారీదారుల సంఘం 14వ మహాసభలో కలకత్తా కెమికల్‌ వర్క్స్‌ ప్రతినిధి ప్రవేశపెట్టిన తీర్మానంలో ఇలా పేర్కొన్నాడు: ‘‘కొన్ని విదేశీ కంపెనీలు స్వతంత్రంగా గానీ లేక భారత పెట్టుబడి సహాయంతోగానీ భారతదేశంలో సబ్బుల ఫాక్టరీలను ప్రారంభించాలనుకుంటున్నట్లు వచ్చిన వార్తలు మాకు చాలా ఆందోళన కలిగించాయి’’. 1951లో ఈ సంస్థ వార్షిక సదస్సులో అధక్షోపన్యాసం ఇస్తూ గోద్రెజ్‌ (ఆ సమయంలో భారత దేశంలో అతిపెద్ద సబ్బుల తయారీ కంపెనీ యజమాని, జాతీయ బూర్జువా వర్గ ప్రతినిధి, కానీ ఇప్పుడు కాదు) ఇలా అన్నాడు: ‘‘ఆ రోజులలో విదేశీ ప్రభుత్వ బలాన్ని ఎదిరించి గెలిచి నిలబడలిగిన సబ్బుల పరిశ్రమ ఇప్పుడు మన జాతీయ ప్రభుత్వపు అర్థంలేని ధోరణిని ఎదుర్కోలేకపోతున్నది’’ ‘‘మన ప్రభుత్వపు అర్థంలేని ధోరణి ‘‘కారణంగా బెంగాల్‌ లోని మధ్య తరహా కంపెనీలన్నీ, బెంగాల్‌ కెమికల్స్‌, బంగా లక్ష్మి కాటన్‌ మిల్స్‌, మొహిని మిల్స్‌, బెంగాల్‌ ఇమ్మూనిటి, బెంగాల్‌ లాంప్‌, కలకత్తా కెమికల్స్‌, బెంగాల్‌ పాటరీస్‌ మొదలైనవి తుడిచిపెట్టుకుపోయాయి, లేక దళారీలు వారి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంతో మూతపడ్డాయి.1947కు ముందు భారతదేశంలోని మందుల పరిశ్రమ ప్రధానంగా ‘‘స్థానికంగా జరిగిన కృషి’’ అంటే జాతీయ బూర్జువా వర్గం ప్రయత్నాల మూలంగానే అభివృద్ది చెందింది.

కానీ 1947 తర్వాత ప్రభుత్వం ‘‘భారత దేశంలో మందుల తయారీ ప్రారంభించిన బహుళ జాతి కంపెనీల (సామ్రాజ్యవాద పెట్టుబడితో ముందుకొచ్చిన లభాపేక్షగల అతిపెద్ద కంపెనీలు) బారి నుండి స్థానిక కంపెనీలను రక్షించలేదు నిజానికి మన ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టటాన్ని ప్రోత్సహించింది. ప్రభుత్వం అనుసరించిన లైసెన్సు, ధరల విధానం, పేటెంటు వ్యవస్థ స్థానిక కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపింది’’ అని సుదీప్‌ చౌదరి రాసాడు. అయన ఇంకా ఇలా రాసాడు: ‘‘బహుళ జాతి కంపెనీల వస్తూత్పత్తి కార్యకలాపాల స్థానంలో ఉత్పత్తి చేయటానికి స్థానిక కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం అడ్డంకి కాదు. నిజానికి 1976 -77లో బహుళజాతి కంపెనీలు ఉత్పత్తి చేసిన మందుల విలువలో కనీసం 76.8% ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం స్థానిక కంపెనీలకు వుంది. అట్లాగే 1977 -78 సంవత్సరాలలో బహుళజాతి కంపెనీలు అమ్మకం చేసిన సూత్రీకరణల విలువలో కనీసం 97.8% తయారుచేసే శక్తి వాటికి వుంది. బహుళజాతి కంపెనీలు తయారు చేసే మందులతో పోలిస్తే స్థానిక కంపెనీల మందుల నాణ్యత తక్కువగా వుంది అని సూచించే ఆధారాలు ఎక్కడా లేవు.’’ చిన్నతరహా పరిశ్రమల రంగానికి అనేక రకాలుగా సహాయం అందిస్తామని ప్రభుత్వం బాహాటంగా తన విధానాన్ని ప్రకటించింది. కానీ అనేక ఇతర అధికార ప్రకటనల మాదిరిగానే ఇది కూడా ఆచరణకు నోచుకోలేదు. ఆ వివరాలలోకి వెళ్ళే బదులు17 పరిశ్రమల మంత్రిత్వశాఖ తరఫున ఫోర్డ్‌ ఫౌండేషన్‌కి చెందిన అంతర్జాతీయ పెర్స్పెక్టివ్‌ ప్లానింగ్‌ బృందం మూడు దశాబ్దాల క్రితం చేసిన చిన్న తరహా పరిశ్రమల సర్వే గురించి చెప్పాలి. ఏ హెచ్‌ హన్సన్‌ ప్రకారం ‘‘ప్రస్తుతం ఉన్న కేటాయింపుల వ్యవస్థలో పెద్ద కంపెనీలతో పోల్చినప్పుడు చిన్న తరహా కంపెనీలు ‘అరుదైన ముడి పదార్ధాలు, దిగుమతిచేసుకున్న విడిభాగాలను’ పొందటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి అనేది ఈ బృందం కనుగొన్న ముఖ్యమైన విషయం.

వాటి ఉత్పత్తి సామర్ధ్యంతో పోల్చినప్పుడు పెద్ద కంపెనీలకంటే తక్కువ కేటాయింపులు అందుకుంటున్నందువల్ల ఈ చిన్న తరహా కంపెనీలు బ్లాక్‌ మార్కెట్‌ పై ఎక్కువ ఆధారపడవలసి వస్తున్నది, అక్కడ చాలా అధిక ధరలు చెల్లించి ముడిసరుకులు కొనవలసి రావటం నష్టాలకు దారితీస్తున్నది. ‘చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయం అందుతుంది అన్న హామీ ఉల్లంఘన’’ ను ఈ పరిశోధనా బృందం తీవ్రమైన విషయంగా పరిగణిస్తుంది.’’1990లో చిన్న తరహా పరిశ్రమల సహాయ మంత్రి స్వయంగా చెప్పిన మాటలను ఇక్కడ ఉటంకించాలనుకుంటున్నాను: ‘‘చిన్న తరహా పరిశ్రమలకు 836 అంశాలలో (ఆ తర్వాత ఆ సంఖ్య తగ్గింది) రాయితీలు వున్నాయి. వీటిని పెద్ద పరిశ్రమలు ప్రమాదకరంగా ఆక్రమించుకున్నాయి  ఉదాహరణకు టూత్‌ పేస్ట్‌. పెద్ద పరిశ్రమలకు లైసెన్సు ఇచ్చిన సామర్ధ్యాన్ని పెంచలేదు కానీ అవి చిన్న పరిశ్రమలకు ఉత్పత్తిలో కొంత భాగాన్ని బయటకు ఇవ్వటానికి అనుమతించ బడిరది. పెద్ద పరిశ్రమలు (ప్రధానంగా బహుళ జాతి కంపెనీలు) చిన్న పరిశ్రమలు చేసిన ఉత్పత్తులపై తమ బ్రాండ్‌ పేరు ముద్రించి అమ్మకం చేసారు, ఆ విధంగా ఎక్కువ లాభాలు పొందారు. ఉదాహరణకు చెప్పుల విషయమే తీసుకుంటే చిన్న పరిశ్రమలు వాటిని తయారు చేయగా బహుళజాతి కంపెనీలు వాటిని అమ్మకం చేస్తున్నాయి.’’చిన్న తరహా పరిశ్రమలు తన కార్మికులకు జీవించటానికి సరిపడే వేతనాలకంటే తక్కువ చెల్లిస్తూ తమ ఉనికికోసం పోరాటం చేస్తుంటే, బహుళజాతి కంపెనీలు లాభాలు పిండుకుంటున్నాయి. జాతీయ బూర్గువా వర్గం బ్యాంకులు తదితర ద్రవ్య సంస్థలనుండి రుణాలు పొందే విషయంలోనూ పారిశ్రామిక ముడి సరుకుల కేటాయింపు విషయంలోనూ ఎల్లప్పుడూ వివక్షకు బలైంది.

జాతీయ బూర్జువా వర్గం యాజమాన్యంలోని పరిశ్రమలు సరిపడినంత మూల ధనం లేక క్రుశించిపోతుంటే బడా దళారుల కంపెనీలు మాత్రం ‘‘సులభంగా అందుబాటులో వున్న ప్రభుత్వ నిధులను జలగాల్లగా పీలుస్తున్నాయి.’’ అవి ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకులను పీల్చి పిప్పిచేసి మూతపడేటట్లు చేస్తున్నాయి. ‘‘గత 5 ఏళ్ళుగా ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలు చిన్న పరిశ్రమలు అవసరం లేదు అనే ఒక ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి’’ అని ఇటీవల ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ నివేదించింది.1947లో అధికార మార్పిడి తర్వాత భారత పాలక వర్గాలు భారత అర్ధక వ్యవస్థలో విదేశాంగ రంగాన్ని వారసత్వంగా పొందారు,అది భారతదేశపు విదేశీ వాణిజ్యం, పరిశ్రమలు, తోటలు ఉద్యానాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ రంగాలపై ప్రాబల్యం సంపాదించింది. సామ్రాజ్యవాద నియంత్రణను బద్దలు కొట్టటానికి ప్రయత్నించే బదులు అది బహుళజాతి కంపెనీల శాఖలు, ఉప కంపెనీలు విస్తరించటానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించింది. భారత బడా పెట్టుబడులతో చేతులుకలిపి బహుళజాతి కంపెనీలు ఉమ్మడి వాణిజ్య కంపెనీలు ప్రారంభించటానికి కూడా సహాయపడింది. సామ్రాజ్య వాద దేశాలు, అవి అదుపు చేసిన అంతర్జాతీయ ద్రవ్య సంస్థలనుండి విదేశీ పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, రుణాలు (‘సహకారం’గా పిలిచేవారు) భారత ‘అభివృద్ది’ ప్రణాళికలో భాగమయ్యాయి. విదేశీ పెట్టుబడి సాంకేతిక పరిజ్ఞానం పొందటానికి భారత పాలక వర్గాలు అత్యాశ కనబరచాయి. కొద్ది సంవత్సరాల క్రితం అమలులో వున్న నియంత్రణ వ్యవస్థలు కూడా ఈరోజున నాశనం చేయబడ్డాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థ అణువణువునా చొచ్చుకురావటాన్ని బడా దళారుల తొత్తులు భారతదేశంలోని సమస్యలన్నిటికీ అదే పరిష్కారం అని ప్రశంసిస్తున్నారు. 1947 తర్వాత నుండి సృష్టించిన వాతావరణంలో జాతీయ బూర్జువా వర్గానికి చెందిన మధ్యతరహ పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయి.బంబాయికి చెందిన గోల్డెన్‌ టుబాకో కంపెనీ 1978 ఏప్రిల్‌లో ‘‘భారత దేశంలో ప్రమాదకరమైన బహుళజాతి కంపెనీలు ’’ అనే పేరుతో విడుదల చేసిన ఒక కరపత్రంలో జాతీయ బూర్జువా వర్గం అనుభవిస్తున్న సమస్యలు వ్యక్తమయ్యాయి. అది ఈ క్రింది విధంగా ప్రకటించింది:‘‘బహుళజాతి కంపెనీల ద్వారా నయా వలసవాదాన్ని ఎక్కువగా అమలుచేస్తూ దానిని ప్రచారం చేస్తున్నారు, వాటిలో చాలా వరకు గుత్తాధిపత్యం వహిస్తున్నాయి, అవి పెద్ద రాక్షస రూపం దాల్చి అభివృద్ది చెందుతున్న వివిధ ఆర్థిక వ్యవస్థలకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తూ అవి ఎన్నుకున్న రంగాలలో అర్ధక ఆధిపత్యం సాధిస్తున్నాయి – ఈ ఆధిపత్యం స్థానిక పరిశ్రమల గొంతు నులిమి భయపెట్టి వాటిని నాశనం చేస్తున్నది. ఇవి అనేక విధాలుగా కొన్ని కంపనీలు కలసి సంయుక్తంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ముఖ్యమైన అంగాలను కబళిస్తున్నాయి, ఈ ప్రమాదకరమైన క్రమంలో అవి ఆతిథ‌ దేశాలలో వాటి స్వంత సహజ వనరులపై సార్వభౌమత్వాన్ని లేకుండా చేస్తున్నాయి, వాటిని నాశనం చేస్తున్నాయి కూడా.’’ (వక్కాణింపు జోడిరచబడింది)లండన్‌లోని బ్రిటిష్‌ అమెరికన్‌ బహుళజాతి కంపెనీకి అక్షరాలా భారతీయ అనుబంధ కంపెనీ అయిన ఐ టి సి, వజీర్‌ సుల్తాన్‌ టుబాకో కంపెనీ గురించి ఆ కరపత్రం ఇలా ప్రకటించింది: ‘‘భారతదేశంలో అది ప్రారంభించబడి నప్పటి నుండి సిగరెట్‌ వ్యాపారంలో గుత్తాధిపత్యం వహిస్తూ అది దాదాపు 200 స్థానిక కంపెనీలను తుడిచిపెట్టింది… దేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత కూడా దాని గుత్తాధిపత్యాన్ని ఏ విధంగానూ అదుపు చేయలేదు, నియంత్రించలేదు. అందుకు విరుద్ధంగా సిగరెట్‌ పరిశ్రమలో దాని ఎదురులేని స్థానం (ఇప్పుడు పొగాకు పరిశ్రమలో కూడా) ఇతర కంపెనీలను తనలో విలీనం చేసుకుంటూ పెరిగి పోతూ అత్యధిక వనరులు కలిగి దూకుడుగా ముందుకు సాగుతున్న భారతీయ కంపెనీలను కూడా అది భయపెట్టి మూతపడేటట్లు చేసింది. అతి స్వల్పమైనది, సామాజికంగా వాంఛనీయం కానిది అయిన సిగరెట్‌ పరిశ్రమలో పనిచేస్తున్న ఒక గుత్తాధిపత్య సంస్థ ఒక స్వతంత్ర దేశంలో దాని జాతీయ ఆర్థిక వ్యవస్థలో నిర్దేశించే స్థానం సంపాదించటం చాలా విచిత్రంగానూ విభ్రాంతి కలిగించేదిగానూ వుంది.

అటువంటివి ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి, ఇదంతా చూసి మన గొప్ప దేశం ఆర్థిక రంగంలో అంగీకారంతో వలసగా ఉండటానికి రాజీపడిరదా అని ఆశ్చర్యపోయేటట్లు చేస్తుంది.’’ ఐ టి సి సిగరెట్‌ తయారీ, పొగాకులో మాత్రమే గుత్తాధిపత్యం వహించటం కాక అనేక ఇతర వ్యాపారాలలోకి విస్తరించింది – హోటల్‌ వ్యాపారం, ప్యాకేజింగ్‌, ముద్రణ, కాగితం తయారీ, వ్యవసాయ వ్యాపారం, చేపలు రొయ్యలసాగు (అక్వాకల్చర్‌), ఆర్థిక సేవలు, అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ వ్యవస్థలు లాంటివి సాగిస్తూ ఐ టి సి భద్రాచలం, ఐ టి సి హోటల్స్‌ వంటి అనేక అనుబంధ కంపెనీలను ప్రారంభించి సింగపూర్‌, బ్రిటన్‌లలోకూడా అనేక అనుబంధ కంపెనీలను ప్రారంభించింది. అది ఆహార శుద్ధి పాకింగ్‌, విద్యుత్తు, ఉక్కు, సిమెంటు వంటి కొత్త రంగాలలోకి ప్రవేశించటానికి కూడా ప్రణాళిక వేస్తున్నది. ‘‘గత 10 ఏళ్లలో ఐ టి సి మొత్తం వ్యాపారం, లాభాలలో సగటున 35% పెరుగుదల సాధించింది’’ అని కొద్ది సంవత్సరాల క్రితం ఐ టి సి ప్రకటన పేర్కొంది. అప్పటి ఐ టి సి చైర్మన్‌ కే ఎల్‌ చుగ్‌ ఇలా అన్నాడు: ‘‘ఐ టి సి కి పెద్ద స్థాయిలో ఆలోచింది వ్యాపారం సాగించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక సంస్కరణలు మాకు అపారమైన అవకాశాలను తెరిచి పెట్టాయి. మేము వాటిని పూర్తిగా వినియోగించుకుంటాం, మా వ్యాపార కార్యకలాపాలలో మా ఆర్థిక బలాన్నీ, నిర్వహణా నైపుణ్యాన్నీ ఉపయోగించి పెద్ద గెంతు వేస్తాము.’’1990ల మొదట్లో ప్రవేశపెట్టిన ‘‘ఆర్థిక సంస్కరణలు’’ దేశ ప్రజల రక్తాన్ని పీల్చి జాతీయ బూర్గువావర్గ పరిశ్రమలను నాశనం చేస్తుండగా, అది బహుళజాతి కంపెనీల శాఖలు, అనుబంధ కంపెనీలు, వాటి దళారులతో మిలాఖతు కంపెనీలు పెరిగి, విస్తరించటానికి కొత్త అవకాశాలను తెరిచింది. ఈ పుస్తకం మొదటి కూర్పును సమీక్షిస్తూ పార్థ చటర్జీ ‘‘భారత బడా బూర్జువా వర్గం: దళారీ యా లేక జాతీయమా?’’ అనే తన వ్యాసంలో కొన్ని విషయాలతో నాతో అంగీకరించాడు, మరి కొన్ని విషయాలతో అంగీకరించలేదు. ఫ్రాంటియర్‌ పత్రిక 1986 ఫిబ్రవరి 1, 8 తేదీల సంచికలలో పార్ధ చటర్జీకి నా జవాబు ప్రచురితమైంది. ఇక్కడ నేను మా ఇద్దరి మధ్య అంగీకారం లేని ఒక అంశాన్ని వివరించటానికి పరిమితమవుతాను. భారత బడా బూర్గువా వర్గం విదేశీ పెట్టుబడితోనూ, వలస ప్రభుత్వంతోనూ మొదటి ప్రపంచ యుద్ధం అంతం వరకూ చేతులు కలిపింది అనే విషయంలో అతడు నాతో అంగీకరించినట్లు అనిపిస్తుంది. ‘‘బ్రిటిష్‌ గుత్తాధిపత్య పెట్టుబడి భారత బడా పెట్టుబడి పరస్పరం ఘర్షణ పడే బదులు (రెండవ ప్రపంచ) యుద్ధానంతర కాలంలో పరిపూరకమైన పాత్రలు పోషించటానికి చూసాయి’’ అనే నా అభిప్రాయంతో కూడా అతడు అంగీకరించాడు. ‘‘1930ల చివరినాటికి భారత బడా బూర్జువా వర్గపు ప్రధాన రాజకీయ ఉద్దేశం కచ్చితంగా తమ స్వంత అధికారికంగా స్వతంత్ర స్థితిని కలిగివుండటమే’’నని అతడు వాదించాడు.

కానీ 1947 తర్వాత భారత బడా బూర్జువా వర్గం దళారీగా మిగిలిపోయింది అనే నా వాదనతో అతడు ఏకీభవించలేదు. ‘‘భారత బూర్జువా వర్గం దళారీయా లేక జాతీయ స్వభావంగలదా అనే పాత సమస్య చాలా వరకు రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం తలెత్తిన సమస్య, దానికి ఇప్పుడు కాలం చెల్లింది’’ అని అతడునొక్కి చెబుతాడు.‘‘దేశం అధికారికంగా రాజకీయ స్వాతంత్రం పొందిన తర్వాత భారత బూర్జువా వర్గానికి ఒకటి గాక అనేక సామ్రాజ్యవాద శక్తులను ఆకర్షించటానికి వాటి మధ్య బేరసారాలు సాగించటానికి స్వేచ్చ లభించింది అని సునీతి ఘోష్‌ గుర్తిస్తాడు’’ అని పార్థా చటర్జీ రాసాడు. నా అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పకుండా నేను రాసిన వాక్యంలోని ఒక భాగాన్ని మాత్రమే ఉటంకించి చటర్జీ నాకు న్యాయం చెయ్యలేదు. నేను రాసింది ఇదీ: ‘‘అధికారిక రాజకీయ స్వాతంత్రం, అంటే వలస నుండి అర్ధవలసకు పరిణామం చెందటం (‘ఆర్థికంగా, దౌత్యపరంగా ఆధారపడి వలలో చిక్కిన’అధికారికంగా స్వతంత్ర దేశం) భారత బూర్జువా వర్గానికి, ప్రధానంగా బడా బూర్జువా వర్గానికి ఒకటిగాక అనేక సామ్రాజ్యవాద శక్తులను ఆకర్షించి వాటిపై మౌలికంగా ఆధారపడే చట్రం లోపలలే వాటి మధ్య బేరసారాలు ఆడటానికి స్వతంత్రం లభించింది…’’. దీని తర్వాత మరొక వాక్యం వుంది: ‘‘దళారీ బూర్జువావర్గం సామ్రాజ్యవాద దేశాల బూర్జువా వర్గంతో అనేక కనిపించే, కనిపించని దారాలతో కట్టివేయబడి ఉన్నప్పటికీ వాటి మధ్య బేరాలాడే శక్తి దానికున్నందుకే అది ‘స్వతంత్రంగా’ కనిపించేటట్లు చేస్తుంది.’’రెండవది, 1930ల చివరినాటికి భారత పెట్టుబడిదారులకూ ‘‘ప్రధానంగా కలకత్తాలో ఉన్నవారికి’’ వలస వచ్చిన పెట్టుబడిదారులకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం పెరిగింది అనే తన వాదనను సమర్ధించుకోవటానికి పార్థా చటర్జీ బెంతాల్‌ పేపర్లను ఉటంకించాడు. వాస్తవమేమిటంటే 1920లు, 1930లలో బ్రిటిష్‌ అధీనంలోని కంపెనీలలో మార్వారీ మధ్య దళారులు, వ్యాపారులు పెద్ద మొత్తాలలో పెట్టుబడులు పెట్టారు, వారికి ఆ కంపెనీలలో సంచాలకుల బోర్డులో సభ్యత్వం ఇచ్చారు, కానీ నియంత్రణ మొత్తం బ్రిటిష్‌ వారి చేతులలోనే వుండేది, ఈ కంపెనీలను వారు తమ నిర్వహణా సంస్థల ద్వారా అమలుచేసేవారు. వారిమధ్య తీవ్రమైన వ్యతిరేకత బదులు రెండువైపుల నుండి పరస్పరం సహకారం చేసుకోవాలనే బలమైన కోరిక వుండేది.1930ల చివరలో మొదలైన రెండవ ప్రపంచ యుద్ధం వారిని మరింత దగ్గర చేసింది. మైఖేల్‌ కిడ్రాన్‌ చెప్పినట్లు ‘‘ఈ దగ్గరకు రావటం అనేది వ్యక్తిగత కంపెనీల పరిధిని దాటింది.

యుద్ధం ఎన్నో పాత భారత -బ్రిటిష్‌ తగాదాలను కొనసాగించి కొన్ని కొత్తవాటిని కూడా – భారతదేశపు స్టెర్లింగ్‌ తేడాల భవిష్యత్తును అంతిమంగా నిర్ణయించిన సామ్రాజ్యపు డాలర్‌ నిల్వలు వంటివి – ముందుకు తేవటమే గాక అది భారత బ్రిటిష్‌ సహకారానికి కొత్త రాయితీలను కూడా కల్పించింది.’’ యుద్ధం కొనసాగినకొద్దీ వారి మధ్య సంబంధాలు మరింత సన్నిహితం, మరింత బలోపేతం అయ్యాయి. 1941లో బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూ జీలాండ్‌, దక్షిణాఫ్రికా, భారతదేశాలతో ఈస్టర్న్‌ గ్రూప్‌ సప్లై కౌన్సిల్‌ ఏర్పడిరది. భారత బడా బూర్జువావర్గం యుద్ధాన్ని కొనసాగించటానికి అత్యవసరం అయిన కొన్ని పదార్థాల సరఫరా కోసం బ్రిటన్‌ పై ఆధారపడిరది, అది ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కూడా అయింది. దాని ప్రతినిధులు అనేక కమిటీలలో సభ్యులుగా వున్నారు. ఉదాహరణకి జి డి బిర్లా పునర్నిర్మాణం, పునస్థాపన, పునర్‌ ఉపాధి కల్పించే కమిటీలో సభ్యుడుగా వున్నాడు. లాలా సర్‌ శ్రీ రాం పునర్నిర్మాణం, అమ్మకాలు, కాంట్రాక్టులు, ప్రభుత్వ కొనుగోళ్ళ కమిటీలో సభ్యుడు.1941 జులైలో టాటా సంస్థలో సీనియర్‌ డైరెక్టర్‌, అనేక సంవత్సరాల పాటు బంబాయి మిల్లు యజమానుల సంఘం అధ్యక్షుడు కూడా అయిన సర్‌ హోమీ మోడీ వైస్‌ రాయ్‌ ఎగ్సికూటివ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడుగా నియమింపబడ్డాడు. 1944 జూన్‌లో టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన సర్‌ అర్దేషిర్‌ దలై వైస్‌ రాయ్‌ ఎగ్సికూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నియమించబడి దాని ప్రణాళిక, అభివృద్ది విభాగానికి బాధ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. అతడు భారత ఆర్థిక అభివృద్ధికి ప్రణాళిక రూపురేఖల పై విజ్ఞాపన పత్రం రచయితలలో ఒకడు, అదే ఆ తర్వాత బంబాయి ప్లానుగా పేరుగాంచింది, దాని మొదటి భాగం 1944 జనవరిలో విడుదలైంది. దలైతో పాటు దాని రచయితలు భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వేత్తలు జె ఆర్‌ డి టాటా, జి డి బిర్లా, పురుషోత్తం దాస్‌ ఠాకూర్‌ దాస్‌, శ్రీ రాం మొదలైనవారున్నారు. ప్రొఫెసర్‌ పి ఏ వాడియ, ప్రొఫెసర్‌ కే టి మర్చంట్‌ ఈ విధంగా అభిప్రాయపడ్డారు: ‘‘బంబాయి ప్లాను రచయితలు ఊహిస్తున్నట్లు పెట్టుబడులకు భవిష్యత్తు వారికీ విదేశీ పెట్టుబడిదారులకూ మధ్య లాభాపేక్ష, వ్యాపారం పునాదిగా ఏర్పడే పవిత్రమైన కూటమి పై ఆధారపడిరది, అటువంటి పవిత్ర కూటమి చేదు అనుభవాలు మనకు గతంలోనూ వర్తమానంలోనూ కూడా వున్నాయి.’’వలస వచ్చిన బ్రిటిష్‌ పెట్టుబడి పతనం అంటే బ్రిటిష్‌ పెట్టుబడి పతనంతో సమానం కాదనీ, భారత ఆర్థిక వ్యవస్థ పై దాని ప్రాబల్యం అంతమయినట్లు కాదు అనే ముఖ్యమైన వాస్తవాన్ని పార్థా చటర్జీ ఉపేక్షించాడు.

భారతదేశంలో బ్రిటిష్‌ పెట్టుబడి స్వభావంలో మార్పును అతడు ఉపేక్షించాడు. వలస వచ్చిన బ్రిటిష్‌ సంస్థలు 1920ల చివరినుండి పతనం అవటం ప్రారంభమయిందనేది నిజమే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వలస వచ్చిన పెట్టుబడి దారులు నిశ్సబ్దంగా తమ ఆస్తులను తమ ఏజెంట్లకు, మధ్య దళారులకు మంచి ధరలకు అమ్ముకోవటం మొదలు పెట్టారు. బెంతాల్‌లు ప్రాతినిధ్యం వహించిన బ్రిటిష్‌ వలస పెట్టుబడి 1930ల చివరినాటికి, మెట్రోపాలిటన్‌ పెట్టుబడికీ భారత మార్కెట్లకు, ముడి పదార్ధాల వనరులకు మధ్యవర్తిగా వుండటం అనే తన ప్రాధాన ఉద్దేశాన్ని నెరవేర్చింది. రెండు ప్రపంచ యుద్ధాలకు మధ్య సంవత్సరాలలో బ్రిటన్‌ పారిశ్రామిక చట్రం మౌలికమైన మార్పుకు లోనయింది. 1939 నాటికి ‘‘బ్రిటన్‌ ఇంకెంతమాత్రం విక్టోరియన్‌ (పారిశ్రామికంగా బాగా అభివృద్ది చెందిన) ఆర్థిక వ్యవస్థగా లేదు’’ అని ఎరిక్‌ హాబ్స్‌ బాం అన్నాడు. సాంప్రదాయ బ్రిటిష్‌ పరిశ్రమలైన జవుళి, ఓడల నిర్మాణం, బగ్గు వంటి పరిశ్రమలు వాటి ఎగుమతి మార్కెట్ల పతనంతో అవి కూడా పతనమయ్యాయి. వాటి స్థానంలో ఇంజినీరింగ్‌, ఎలెక్ట్రికల్‌ వస్తువులు, రసాయనాలు, ఆటోమొబైల్స్‌ వంటి సాంకేతికంగా బాగా పురోగతి చెంది పెద్ద ఎత్తున ఉత్పత్తి పద్ధతులను అవలంబించిన కొత్త పరిశ్రమలు వచ్చాయి. మరొక ముఖ్యమైన మార్పు జరిగింది, మెట్రోపాలిటన్‌ (అభివృద్ది చెందిన దేశాల) పెట్టుబడి గుత్త పెట్టుబడి దశకు చేరుకుంది. ఉత్పత్తి కేంద్రీకరణ ఫలితంగా ఐ సి ఐ, యూనిలీవర్‌, గెస్ట్‌ కీన్‌ విలియమ్స్‌, బ్రిటిష్‌ ఆక్సిజెన్‌, జి ఇసి, ఇంపీరియల్‌ టబాకో మొదలైన అతి పెద్ద కార్పోరేషన్లు తలెత్తాయి. అవి భారతదేశంలో ‘ఇండియా లిమిటెడ్‌’ పేరుతో తమ స్వంత శాఖలను ఏర్పాటు చేయటం మొదలుపెట్టాయి. ఎరిక్‌ హాబ్స్‌ బాం వర్ణించినట్లు ‘‘పాత కాలపు యజమానుల సూర్యుడు అస్తమించసాగాడు’’, భారీ బహుళజాతి కంపెనీల సూర్యుడు ఉదయించ సాగాడు. భారతదేశంలో బ్రిటిష్‌ పరిశ్రమలకు సేవ చేస్తూ, అక్కడినుండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుని ఇక్కడనుండి ముడి పదార్థాలు, సగం శుద్ది చేసిన పదార్ధాలను ఎగుమతి చేసిన సాధారణ బ్రిటిష్‌ నిర్వహణ కంపెనీలు ఇంకెంత మాత్రం ఉనికిలో ఉండలేక పోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముందునుండీ భారతదేశంలో బ్రిటిష్‌ పెట్టుబడుల స్వభావం మారటం మొదలైంది.

అంతకుముందు ‘‘సాధారణంగా విదేశీ పెట్టుబడి చిన్న మొత్తంలో వుండేది, అది వ్యక్తులు పెట్టిన పెట్టుబడి, దానిని నిర్వహణ కంపెనీల ద్వారా ఇంగ్లండు నుండు వలస వచ్చినవారు నిర్దేశించేవారు’’. టామ్‌ లిన్సన్‌ ఇట్లా రాస్తాడు: ‘‘అందుబాటులో వున్న సమాచారం ప్రకారం స్వాతంత్రం వచ్చేనాటికి భారతదేశంలో బ్రిటిష్‌ ప్రయివేటు పెట్టుబడిలో దాదాపు సగం బ్రిటిష్‌ ఆధారిత కంపెనీలలో పెట్టిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడే. పోర్ట్‌ ఫోలియో పెట్టుబడి (అంటే బాండ్లు, వాటాలు, దిబెంచర్ల రూపంలో వుండేది, ప్రత్యక్ష పెట్టుబడి కానిది, ఇది ఎకువగా నిర్వహణ కంపెనీల కార్యకలాపాలకు సంబంధించింది) ప్రధానంగా తేయాకు, జనపనార, బగ్గు, షిప్పింగ్‌ వంటి పాత వ్యాపారాలలో కేంద్రికరించబడిరది. ప్రత్యక్ష పెట్టుబడి (ఎక్కువగా బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు సంబంధించినది) ప్రధానంగా రసాయనాలు, శుద్ధి చేసిన ఆహర పదార్ధాలు, ఫార్మాసూటికల్స్‌ (మందుల కంపెనీలు) పెయింట్లు, వార్నిష్‌ వంటి ‘కొత్త’ పరిశ్రమలలో పెట్టారు. టాంలిన్సన్‌ చెప్పినట్లు బ్రిటిష్‌ బహుళజాతి కంపెనీల అనుబంధ సంస్థలే ‘‘1930ల నుండి విదేశీ వ్యాపార సంస్థలలో అన్నిటికంటే క్రియాశీల రంగంగా మారాయి’’.రెండవ ప్రపంచ యుద్ధం అంతమయ్యేనాటికి ప్రారంభమయిన మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే సామ్రాజ్యవాద పెట్టుబడి స్థిరంగా పెరుగుతూ పోవటానికి హామీ కల్పించబడిరది, అది భారత ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం వహించసాగింది. సామ్రాజ్యవాద పెట్టుబడి, భారత బడా పెట్టుబడి కలసి సంయుక్త కంపెనీలు ఏర్పాటు చేయటానికి రెండు వైపుల నుండి అంగీకారం కనిపించింది.

1942 సెప్టెంబర్‌లో చర్చిల్‌ మంత్రివర్గంలో సభ్యుడైన ఎర్నెస్ట్‌ బెవిన్‌, ప్రభుత్వ కార్యదర్శి అమేరికి రాసిన లేఖలో ‘‘యుద్ధానంతరం ఎగుమతి వాణిజ్యం ఎక్కువగా వినిమయ వస్తువులలోనే జరుగుతున్నదనే మన స్వంత ఆలోచన గురించి’’ అతడికి అపోహలున్నాయి అని రాసాడు. ‘‘యుద్ధం తర్వాతి వాణిజ్యం విషయంలో భారతదేశ పారిశ్రామికీకరణకు నిండు హృదయంతో సహకారం అందిచటాన్ని’’ తక్షణం పరిగణించాలని, ‘‘అందుకనుగుణంగా ప్రణాళికలు తయారు చేసి వెంటనే పరిగణలోకి తీసుకోవాలని’’36 అతడు సూచించాడు. బ్రిటిష్‌ పెట్టుబడి మార్గదర్శకత్వంలో భారతదేశంలో యుద్ధానంతరం ఒక విధమైన పారిశ్రామికీకరణ జరగటం దాని ప్రయోజనాల దృష్ట్యా అవసరం అని భావించారు. టామ్లిన్సన్‌ ప్రకారం ‘‘1940ల చివరినాటికి బ్రిటిష్‌ వ్యాపారవేత్తలు ఇది జరుగుతుందని భావిస్తున్నారని ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఇండస్ట్రీస్‌ సమావేశాల చర్చలు, కరపత్రాలు సూచిస్తాయి’’. 1945 జనవరిలో అమేరి వైస్‌ రాయ్‌ వేవెల్‌కి ఈ క్రింది విధంగా సమాచారం ఇచ్చాడు: బ్రిటన్‌లోని వ్యాపారవేత్తలు ‘‘భారత పారిశ్రామిక విస్తరణకు సహకరించటానికి’’ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. దానిని ‘‘సక్రమంగా నిర్వహిస్తే’’, యంత్రాలు, పరికరాలు, విడి భాగాలు, సగం తయారయిన వస్తువులు, ధనికులైన భారతీయులకోసం అధునాతన వినిమయ సరుకులు మొదలైన ‘‘బ్రిటన్‌ సరుకులకు భారతదేశంలో మార్కెట్‌ ను విస్తరించటం ద్వారా’’ అది భారతీయ పెట్టుబడిదారులతో పాటు బ్రిటిష్‌ పెట్టుబడిదారులకు కూడా గణనీయమైన లాభాలు చేకూరుస్తుంది. భారతీయ పెట్టుబడిదారులతో సహకారం ద్వారా, భారతదేశంలో తయారీ పరిశ్రమలు నెలకొల్పటం ద్వారా బ్రిటిష్‌ గుత్త సంస్థలు భారత దేశంలో ఉత్పత్తికి మార్గదర్శకం వహించగలుగుతాయి, ‘‘ఇది భారత దేశ మార్కెట్‌ లో మన స్థితిని’’38 పటిష్టం చేస్తుంది అని వారు ఆశించారు. 1944 జనవరిలో వైస్‌ రాయ్‌ వేవెల్‌ భారత బడా వ్యాపారవేత్తల ప్రతినిధివర్గాన్ని బ్రిటన్‌కు (వారు కోరుకుంటే అమెరికాకు) పంపటానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. జె అర్‌ డి టాటా, జి డి బిర్లాల నాయకత్వంలోని ఈ ప్రతినిధివర్గం 1945 వేసవి కాలంలో సహకారం, పెట్టుబడి కోరుతూ ఆ రెండు దేశాలకు వెళ్ళారు. అంతకుముందే వాల్‌ చంద్‌ హీరా చంద్‌కీ అమెరికాకు చెందిన ఖ్రిస్లర్‌ కంపెనీకి మధ్య, కిర్లోస్కర్‌కీ బ్రిటిష్‌ ఆయిల్‌ ఇంజిన్స్‌కీ మధ్య భారతదేశంలో సంయక్తంగా పరిశ్రమలు పెట్టాలని ఒప్పందాలు కుదిరాయి. భారతదేశంలో సంయుక్త పరిశ్రమలు స్థాపించటానికి బ్రిటిష్‌ వ్యపారవేత్తలకూ భారతీయ బడా పెట్టుబడిదారులకూ మధ్య, ఉదాహరణకు ఐ సి ఐకి టాటాలకీ మధ్య, నుఫ్ఫీల్ద్‌కీ బిర్లాలకీ, ఇట్లా అనేక సంప్రదింపులు జరుగుతున్నాయని 1945 జనవరిలో వేవెల్‌ కి అమేరి సమాచారం అందించాడు.

బ్రిటన్‌ పెట్టుబడికీ భారతబడా పెట్టుబడికీ మధ్య సహకారాన్ని ప్రోత్సహించాలని అమేరీ, వేవెల్‌ లు ఇద్దరూ చాలా ఆత్రుతతో కృషి చేసారు. చిన్న పారిశ్రామిక వేత్త, బొంబాయి భారతీయ వ్యాపారుల ఛాంబర్‌ ప్రముఖ నాయకుడు అయిన మను సుబేదార్‌ 1945లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో అటువంటి సంయుక్త పరిశ్రమలను ‘‘అక్రమ పెళ్ళిళ్ళు’’గా ఖండిరచాడు.ఆ విధంగా బహుళజాతి కంపెనీలు భారత దేశంలో తమ శాఖలు, అనుబంధ సంస్థలు నెలకొల్పటంతో పాటు భారతీయ బడా వ్యాపారవేత్తలతో సహకార ఒప్పందాలు కుదుర్చుకుని ఇక్కడ ఉమ్మడి పరిశ్రమలు స్థాపించటం మొదలు పెట్టారు. సామ్రాజ్యవాద పెట్టుబడి భారతీయ బడా పెట్టుబడి సన్నిహితంగా కలగలసిపోవటం మొదలైంది. సాంకేతిక పరిజ్ఞానం, మూలధన వస్తువులు బహుళజాతి సంస్థల చేతిలో ఉండటంతో వాటి మూలధనం వాటా ఎంత ఉన్నప్పటికీ ఉమ్మడి పరిశ్రమల పై నియంత్రణ బహుళజాతి కంపెనీల చేతిలోనే వుంది. కిడ్రాన్‌ ఇలా రాస్తాడు: ‘‘సాంకేతికపరంగా శక్తివంతంగా వున్న పారిశ్రామిక రంగంలో సాంకేతిక పురోగతి చెందిన కంపెనీయే ఉమ్మడి కంపెనీ పై నియంత్రణ కలిగి వుండే అవకాశం వుంది’’. ‘‘విదేశీ మూలధన భాగస్వామ్యంతో పాటు విదేశీ మిలాఖతు సంస్థలకు ఆమోదం తెలపటం ఫలితంగా విదేశీ భాగస్వామికి ఒక ఆధిపత్య గొంతును ఇవ్వటమే గాక దేశ విదేశీ మారక వనరులను పరోక్షంగా కోల్పోవటానికి కూడా దారి తీసింది’’ అని పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధాన విచారణ కమిటీ అభిప్రాయపడింది. బహుళజాతి కంపెనీలు భారత బడా వ్యాపారులు ఇద్దరూ బలంగా కోరుకున్న ఈ రకమైన పెద్ద సాంకేతికపరంగా శక్తివంతమైన పారిశ్రామిక సంస్థలే వారిద్దరి మధ్య ఉమ్మడి వ్యాపారసంస్థలుగా అవతరించాయి. ఈ రకమైన సంస్థలనే అమెరీలు, వేవెల్‌లూ, భారత ప్రభుత్వము, దానికి ప్రణాళికలు రూపొందించేవారు నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చారు. విదేశీ పెట్టుబడి ‘‘దేశీయ పెట్టుబడులకు విస్త్రుత వనరులను ఆకర్షించటానికి ఉత్ప్రేరకంగా’’ పని చేస్తుందని మొదటి పంచ వర్ష ప్రణాళిక ఆశించింది. ‘‘ఉమ్మడి వ్యాపార వ్యవస్థ క్రింద భారతీయ వ్యాపారవేత్తలతో మిలాఖతై అనేక విదేశీ సంస్థలు కొత్త పరిశ్రమలను స్థాపించటం అనేది పెట్టుబడి పెట్టిన మూల ధనానికి భద్రత కల్పించేందుకు అనువుగా వుంటుంది’’ అని అది ప్రకటించింది. 

మనదేశంలో పెట్టిన విదేశీ పెట్టుబడులు, ప్రయివేటు ప్రభుత్వ రంగాలలో పెట్టిన భారత పెట్టుబడులు దేశంలోపల కొంత విస్త్రుత ప్రభావాలను కలిగిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. బహుళజాతి కంపెనీలు ఇక్కడ నెలకొల్పిన వాటి శాఖలు, అనుబంధ సంస్థలు, ఉమ్మడి వ్యాపారాలు, ఇంకా భారత బడా దళారీ పెట్టుబడిదారులు స్థాపించిన పరిశ్రమలు లేక ప్రభుత్వ పెట్టుబడితో పెట్టిన పరిశ్రమలు అన్నీ యంత్రాలు, పరికరాలు, విడిభాగాలు, పారిశ్రామిక ముడి పదార్థాల కోసం విదేశాలపై ఆధారపడినవే. డివిడెండ్లు, లాభాలు, రాయల్టీలు, సాంకేతిక ఫీజులు, వడ్డీలు మొదలైనవి బహుళజాతి కంపెనీలకు ఆకర్షణీయమైనవే కానీ అవి వాటితోనే సంతృప్తి చెందవు. అవి తన శాఖలను, అనుబంధ సంస్థలను, భారతీయ ప్రయివేటు లేక ప్రభుత్వ పెట్టుబడుల సహకారంతో నెలకొల్పిన పరిశ్రమలను తమ యంత్రాలు, పరికరాలు, విడిభాగాలను అంతర్జాతీయ ధరలకంటే చాలా ఎక్కువ ధరలకు అమ్ముకునే దుకాణాలుగా వాడుకుంటాయి. ఈ సరుకులకు మార్కెట్టు భారతదేశంలోని అంతర్గత మార్కెట్‌ గా కాక పశ్చిమ దేశాల పెట్టుబడి, జపాను పెట్టుబడి యొక్క ‘అనుబంధ అంతర్గత మార్కెట్‌’గా తయారయింది. అటువంటి ‘అభివృద్ది దేశ వనరులకు కొత్తవి జతచేసే బదులు ఉన్న వనరులు తరిగిపోయేటట్లు చేస్తుంది. అటువంటి ‘అభివృద్ది’ నుండి సామ్రాజ్యవాద దేశాలు, భారత దళారులు మాత్రమే ప్రయోజనం పొందుతారు.లాటిన్‌ అమెరికా గురించి చెబుతూ ఆండ్రే గుండర్‌ ఫ్రాంక్‌ ఇట్లా రాసాడు: ‘‘చిలీ విదేశాంగ మంత్రి వాల్డేస్‌ అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తో చెప్పినట్లు, అమెరికా వాణిజ్య శాఖ, లాటిన్‌ అమెరికా ఆర్థిక కమిషన్‌ విస్తృతంగా డాక్యుమెంట్‌ చేసినట్లు లాటిన్‌ అమెరికాలో సమకాలీన వలస చట్రాన్నీ, వాణిజ్య సంక్షోభాన్నీ సృష్టించింది కచ్చితంగా విదేశే పెట్టుబడులు, బయటి సహకారమూ, అంతేకాకుండా అవి అక్కడ వెనుకబాటుతనాన్నీదానివల్ల కలిగిన దేశీయ ఆర్థిక, వర్గ వ్యవస్థీకృత అస్తవ్యస్త స్థితినీ సృష్టించాయి… సామ్రాజ్యవాద దేశాలనుండి ‘విదేశీ సహాయం’ ఎక్కువైన కొద్దీ లాటిన్‌ అమెరికా మరింతగా వెనుబడి పోయింది.’’ఫ్రాంక్‌ లాటిన్‌ అమెరికా గురించి చెప్పింది భారతదేశానికి కూడా వర్తిస్తుంది.

 లాటిన్‌ అమెరికాకు చెందిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఇట్లా రాసాడు: జాతీయ ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పరం ఆధారపడటం అనేది అభివృద్ది చెందని దేశాల విషయంలో ఆధారపడటమే అవుతుంది, ఎందుకంటే ఆ దేశాలు ప్రభుత్వ మార్కెట్‌ ను, అత్యంత పురోగతి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తి సాధనాలను నియంత్రించే శక్తులకు లోబడి వున్నాయి కాబట్టి.’’ అయన ఇంకా ఇలా అన్నాడు: ‘‘ఆధిపత్య కేంద్రాలలో ప్రాబల్యంగల వారి ప్రయోజనాలు, ఆధారపడిన సమాజాల గురించి ప్రస్తావన లేకుండా ఆధారపడటం అనే భావనను అర్థం చేసుకోలేము. సూత్రం ప్రకారం స్వచ్చమైన అర్థంలో ‘బయటి వారి ఆధిపత్యం’ ఆచరణ సాధ్యం కాదు. ఆధిపత్యం అనేది దానివల్ల లాభపడే స్థానిక బృందాల మద్దతు దొరికినప్పుడే ఆచరణ సాధ్యమవుతుంది.’’ ‘‘స్వేచ్చా పోటీ రాజ్యమేలుతున్నప్పుడు సరుకుల ఎగుమతి అనే పాతరకపు పెట్టుబడిదారీ విధానం యొక్క సాధారణ లక్షణం. పెట్టుబడిదారీ విధానపు నూతన దశలో గుత్త సంస్థలు రాజ్యం ఏలుతున్నప్పుడు పెట్టుబడి ఎగుమతి సాధారణ లక్షణం’’ అని లెనిన్‌ అన్నాడు. సామ్రాజ్యవాద దేశాలనుండి పెద్ద ఎత్తున పెట్టుబడి ఈ దేశంలోకి రావటానికి భారత బడా బూర్జువా వర్గం, దాని రాజ్యం మార్గాలుగా పనిచేస్తాయి, అలాగే సామ్రాజ్యవాద దేశాల నుండి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల (ప్రపంచ బ్యాంకు, ఐ ఎం ఎఫ్‌ వంటివి)నుండి రుణ పెట్టుబడి దేశంలోకి ప్రవేశించి దాని అన్నిరంగాలపై ప్రాబల్యం సంపాదించి భారతదేశాన్ని అప్పుల ఊబిలోకి దించుతుంది. ఈ విధంగా మిలాఖతు అవడమే ఆధారపడే స్థితిని తయారు చేస్తుంది.బూర్జువావర్గం దళారీయా లేక జాతీయమా అనే ప్రశ్నకు కాలం చెల్లింది అనే తన వాదనకు మద్దతుగా పార్థా చటర్జీ ‘‘భారత బడా పెట్టుబడిదారీ వర్గం రాజకీయ షరతులను మార్చటానికి ప్రయత్నించడం అనేది చాల కీలకం’’, దాని ఆధారంగా బ్రిటిష్‌ గుత్త పెట్టుబడితో బేరసారాలు సాగించి దానితో మిలాఖతు అవుతుంది అని వాదిస్తాడు. పార్థా చటర్జీ ప్రకారం భారత బడా పెట్టుబడిదారీ వర్గం ‘‘బ్రిటిష్‌ గుత్తపెట్టుబడితో మిలాఖతు అవటం అనేది వలస రాజ్యం అధ్వర్యంలో కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్వతంత్ర రాజ్యంగా చేతులు కలుపుతుంది’’. పార్థా చటర్జీ ‘స్వతంత్ర రాజ్యం’ అనే పదాలు ఉపయోగించి నప్పుడల్లా వాటిని ‘అధికారిక’ అనే పదంతో జోడిరచి ఒక అర్హతను కల్పిస్తాడు. ‘అధికారికంగా సతంత్ర రాజ్యాన్ని’ స్వతంత్ర రాజ్యం’తో సమంగా చూపడం సరైనదేనా? పార్థా చటర్జీ ప్రకారం ‘‘అధికారికంగా స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించటం భారత బడా బూర్జువావర్గపు ప్రధాన రాజకీయ ఉద్దేశం అయినప్పుడు’’, వారు బేరసారాలాడి మిలాఖతు అయ్యే ‘‘రాజకీయ షరతులు’’ ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలన కాలంలో వుండే షరతులకంటే సారాంశంలో భిన్నంగా వుండే అవకాశం లేదు. వారు కొన్ని సామ్రాజ్యవాద శక్తుల మధ్య బేరాలు ఆడ వచ్చు కానీ వారు అప్పటికీ సామ్రాజ్యవాద కాడి క్రిందనే బందీలుగా వుంటారు.

సామ్రాజ్యవాదంపై వారు మౌలికంగా ఆధారపడటంతో వారికున్న పరిమితమైన బేరాలాడే శక్తి వారికి కొన్ని లాభాలు కొని తేవచ్చు కానీ ప్రజలకు కలిగే నష్టాలు మాత్రం అపారం.చటర్జీ ఇట్లా రాస్తాడు: ‘‘చారిత్రక కారణాలు ఏమయినప్పటికీ భారతదేశంలో జాతీయ ఉద్యమ నాయకత్వం బూర్జువావర్గం చేతిలోనే దృఢంగా ఉండిపోయింది, అదే విధంగా భారత రాజ్యం యొక్క కేంద్ర అంగాలు కూడా స్వాతంత్రం వచ్చినప్పటినుండీ ఆ వర్గం చేతిలోనే వున్నాయి.’’47 చటర్జీ చెప్పిన ప్రకారం అధికారిక రాజకీయ స్వాతంత్రాన్ని సాధించటమే లక్ష్యంగాల బడా బూర్జువావర్గం నాయకత్వం వహించిన ఉద్యమాలను జాతీయ ఉద్యమాలు అని ఎట్టిపరిస్థితిలోనూ భావించలేము. నిజానికి ఆ వర్గం జాతీయ విముక్తికోసం సాగే, సామ్రాజ్యవాద కక్ష్య బయట స్వేచ్చకోసం సాగే సామ్రాజ్యవాదవ్యతిరేక పోరాటాలను విచ్చిన్నం చేయటానికి ప్రయత్నించింది.49 1947 తర్వాత తలెత్తిన భారత రాజ్యం ‘‘వారి రాజ్యం’’ అంటే భారత బడా బూర్జువా వర్గపు రాజ్యం అనటంలో సందేహం లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ రాజ్యం స్వభావం ఏమిటి అనేదే?రెండురకాల వలస ఉపసంహరణల (డీకొలోనలైజేషన్‌) మధ్య మనం తేడా చూడాలి – నిజమైన వలస ఉపసంహరణ 1949లో చైనా సాధించింది, ఇక రెండవది భారతదేశం, పాకిస్థాన్ల లో జరిగిన బూటకపు వలస ఉపసంహరణ. చాలా కాలం క్రితమే 1920లో లెనిన్‌ ‘‘సామ్రాజ్యవాద శక్తులు ఒక పద్ధతి ప్రకారం సాగించే మోసం’’ గురించి హెచ్చరించాడు, అయన ఇలా రాసాడు , ‘‘సామ్రాజ్యవాద శక్తులు రాజకీయంగా స్వతంత్ర రాజ్యాల ముసుగులో ఆర్థికంగా, ద్రవ్యపరంగా మిలిటరీపరంగా తమపై పూర్తిగా ఆధారపడిన రాజ్యాలను ఏర్పాటు చేస్తాయి.’’ లెనిన్‌ చెప్పినదాని ప్రకారం అటువంటి ఆధారపడటం యొక్క ఒక రూపమే అర్ధవలస. 1947లో అధికార మార్పిడి తర్వాత భారత దేశం వలస నుండి అర్ధవలసగా మారింది అనేది నా బలమైన వాదన. బ్రిటిష్‌ గుత్త పెట్టుబడి అధీనంలో ఉండిపోయే బదులు అది వివిధ సామ్రాజ్యవాద దేశాల గుత్త పెట్టుబడిదారులకు సులభంగా అందుబాటులో వుండే వేటాడే స్థలంగా మారింది. (భారతదేశం వలస నుండి అర్ధవలసకు పరిణామం చెందటం గురించి నేను రాసిన ఇండియా అండ్‌ ద రాజ్‌ 1919-1947 లోనూ రాబోయే ఇండియా: ఫ్రం కాలని టు డిస్‌ మెంబర్డ్‌ సెమి కాలని అనే పుస్తకంలోనూ మరింత వివరంగా చర్చించటం జరిగింది).భారత రాజ్య సార్వభౌమత్వం అనేది ఒక అపోహ మాత్రమే. బడా బూర్జువావర్గము, భూస్వామ్య వర్గము సార్వభౌమత్వాన్ని ఏనాడూ కాంక్షించలేదు, బడా బూర్జువావర్గం యొక్క ‘స్నేహపూర్వకమైన నమ్మకమైన చేతులలో’నే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు 1947లో భారతదేశ ప్రత్యక్ష పరిపాలనను బదిలీ చేసారు. ‘స్వాతంత్రం’ సంపాదించిన తర్వాత భారతదేశం పెట్టుబడిదారీ సామ్రాజ్య వాద వ్యవస్థలోకి సమ్మిళితమై ఉండిపోయింది.

భారత ఆర్థిక వ్యవస్థకు సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక వ్యవస్తకు మధ్య వున్న పరిపూరకత విచ్చిన్నం అవలేదు, భారతదేశం సామ్రాజ్యవాద వ్యవస్థ కక్ష్యలో ఒక ఉపగ్రహంలాగా కొనసాగింది. హారి మాగ్డాఫ్‌ పేర్కొన్నట్లు ‘‘దీర్ఘకాలం సామ్రాజ్యవాద ఆధిపత్యం క్రింద వున్న ఈ దేశాలు(మూడవ ప్రపంచ దేశాలు) ప్రపంచ అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలకు లోబడి వుండే ఒక విధమైన ఉత్పత్తి వ్యవస్థను, ఒక వర్గ వ్యవస్థను, ఒక సామాజిక, మానసిక, సాంస్కృతిక నేపధ్యాన్ని రూపొందించుకున్నాయి.’’53 బ్రిటన్‌ కి అధికారిక సామ్రాజ్యంగా వున్నతర్వాత భారతదేశం అమెరికా నాయకత్వంలో ఇతర సామ్రాజ్యవాద శక్తులతో కలసి బ్రిటన్‌ పంచుకునే అనధికారిక సామ్రాజ్యంగా మారింది. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ ఆర్థికవేత్త, బ్రిటిష్‌ మంత్రి వర్గానికి ఆర్థిక సలహాదారు అయిన డాక్టర్‌ థామస్‌ బాలోగ్‌ 1963 లో ఇట్లా రాసాడు: ‘‘… ‘నయా సామ్రాజ్యవాదం బహిరంగ రాజకీయ ఆధిపత్యంపై ఆధారపడదు’. అమెరికాకు దక్షిణాఫ్రికాకు మధ్య వున్న ఆర్థిక సంబంధాలు సారాంశంలో బ్రిటన్‌కి దాని ఆఫ్రికన్‌ వలసదేశాలకు వున్న సంబంధాలకంటే భిన్నమైనవేమీ కాదు. వలసపాలనలోని షరతులను, నియమాలను అమలుచేసే పాత్రను అంతర్జాతీయ ద్రవ్య సంస్థ పూరిస్తుంది.’’ ఈ రోజున ఐ ఎం ఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ అనే త్రయం ఆ పాత్రను పోషిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై సామ్రాజ్యవాద పెట్టుబడి, భూస్వామ్య విధానపు అవశేషాలు వంటి వ్యవస్థాగత అడ్డంకుల ఉక్కుపిడికిలి తొలగించనంతవరకు భారతదేశం అభివృద్ది చెందకుండా అర్ధ ఆధారపడిన దేశంగా మిగిలిపోవలసిందే. భారతదేశం సామ్రాజ్యవాద వ్యవస్థలో ఉపగ్రహంగా తిరగటం కొనసాగుతూ, భారత బడా బూర్జువావర్గం దళారీలుగా సామ్రాజ్యవాద పెట్టుబడికి కొత్తగాచేరిన భాగస్వాములుగా సేవ చేసినంత వరకు దళారీ బూర్జువావర్గానికీ జాతీయ బూర్జువావర్గానికీ మధ్య తేడా కొనసాగుతుంది, దానికి కాలం చెల్లదు. ఈ పుస్తకం మొదటి కూర్పుకు రాసిన ముందుమాటలో చెప్పినట్లు ‘‘భారత బడా బూర్జువావర్గపు ఆవిర్భావాన్ని 1947 వరకు వెలికితీసి దాని తదుపరి అభివృద్ది క్రమాన్ని ముందుగా ఊహించి అంచనా వేస్తుంది’’. దాని ఆఖరి రెండు అధ్యాయాలలో భారత బడా బూర్జువావర్గం దళారీగా మిగిలిపోయిందా లేదా అనే సమస్యను చర్చించినప్పటికీ 1947 తర్వాత ఆ వర్గం పాత్రను వివరంగా అధ్యయనం చేయలేదు, ఎందుకంటే అది దాని ఉద్దేశం కాదు కాబట్టి. అటువంటి అధ్యయనాన్ని నేను వేరే ఒక పుస్తకం లో చేయాలని ఆశించాను కానీ అది పూర్తి కాలేదు. అయితే ‘డెవెలప్‌మెంట్‌’ ప్లానింగ్‌ ఇన్‌ ఇండియా లంపెన్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఇంపీరియలిజం, ఇంపీరియలిజమ్స్‌ టైటెనింగ్‌ గ్రిప్‌ ఆన్‌ ఇండియన్‌ అగ్రికల్చర్‌ అనే ఇంకా ప్రచురించబడిన నా పుస్తకాలలో భారత బడా బూర్జువావర్గం 1947 తర్వాత చిరుతపులిలాగా తన మచ్చలను మార్చుకోలేదు అని ఒప్పించటానికి వాస్తవాలు వాదనలూ వున్నాయి.

ఈ పుస్తకమూ, ఇండియా అండ్‌ ద రాజ్‌ 1919-1947 అనే పుస్తకమూ రెండిటినీ కలిపి సహ గ్రంథాలుగా అధ్యయనం చేయవచ్చు. అవి ఒకదానికి మరొకటి పూరకంగా వుంటాయి.

భారత సమాజపు సరైన వర్గ విశ్లేషణ చేయలేకపోవటమే భారత కమ్యూనిస్టు ఉద్యమపు ప్రధాన బలహీనత. తరుచుగా భారత కమ్యూనిస్టులు మొత్తం భారత బడా బూర్జువావర్గ స్వభావం జాతీయ స్వభావం కలదిగా విశ్వసించారు, మరికొన్ని సార్లు యావత్తు బూర్జువావర్గం సామ్రాజ్యవాదంతో రాజీపడిపోయిందనీ, సామ్రాజ్యవాద శిబిరంలో చేరిపోయందనీ నమ్మారు.

భారత బూర్గువావర్గం లోపల తేడాలున్నాయి అనే సమస్యకు 1947కి ముందూ ఈనాటికీ కూడా లోతైన పరిణామాలున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు ఈ ప్రశ్నకు సరైన సమాధానమే ప్రస్తుత భారత రాజ్య స్వభాన్ని సక్రమంగా అర్థం చేసుకోవటానికి కీలకం.అందుకే చాలామంది వాస్తవాలను గుర్తించటానికి ప్రతిఘటిస్తున్నారు.

ఈ పుస్తకానికి వచ్చిన స్పందన చాలా ప్రోత్సాహకరంగా వుంది. అంతకుముందు అపరిచితులుగా వున్న వాళ్ళు దీనిని చదివిన తర్వాత ఇప్పుడు విలువైన మిత్రులుగా మారారు.

ఈ పుస్తకం మూడు భాషలలోకి అనువదించబడిరది అనే వాస్తవం నాకు సంతోషాన్నిచ్చింది, కాని ఆ అనువాదాలు నన్ను నిరాశపరచాయి. మలయాళం, తమిళ అనువాదాలలో వివరణలు, గమనికలు పుస్తకంలో విడదీయరాని భాగాలైనప్పటికీ వాటిని తొలగించారు. హిందీ కూర్పు ప్రచురణకర్తల కోరిక పైన నేను హిందీ అనువాదాన్ని ఇచ్చాను కాని దానిని అంతిమంగా కూర్చి ప్రచురించిన విధం చాలా దురదృష్టకరంగా నిరాశపరచింది.

ఈ కూర్పు ప్రచురణ నాలుగు సంవత్సరాలు ఆలస్యం అయింది, అర్హత లేని వారిపై నేను నమ్మకం వుంచటం వల్ల అది జరిగింది.

ఈ పుస్తక ప్రచురణలో వివిధ రకాలుగా సహాయం చేసిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రత్యేకించి సరిదిద్దబడిన ఈ కూర్పును ప్రచురించిన రాడికల్‌ ఇంప్రెషన్‌ కు కృతజ్ఞతలు.

(గ‌మ‌నికః ఈ  వ్యాసంలో యాభైకి పైగా ఫుట్ నోట్స్ ర‌చ‌యిత ఇచ్చారు. పిడిఎఫ్లో చూడ‌వ‌చ్చు)

Leave a Reply