వాలని మబ్బులు- వానమెతుకులు
రాయలసీమ రైతు కథలు సంకలనానికి శ్రీనివాసమూర్తి రాసిన ముందుమాట నేను ఆరోతరగతిలో వున్నప్పుడు మావూరికి ఆపిల్, దానిమ్మ, కమలాలు వంటి 'అమ్ముకునే' పండ్లు వచ్చేవి కాదు. పల్లెల్లో వాటిని కొనలేరు.అందుకని ఎవరూ తెచ్చి అమ్మరు. ( నీళ్లు లేవు కాబట్టి అరటిపండ్లు కూడా మా వూళ్ళో దొరకవు. ఎప్పుడైనా కర్నూలు పోతున్నప్పుడు వెల్దుర్తిలో బస్సు ఆగితే "అరటిపండ్లేయ్!" అంటూ బస్సును చుట్టుముట్టే ఆడవాళ్ళ అరుపులు యిష్టంగా వింటూ ఒక డజనుకొనడం ఆనాడు మాకు అపురూపం ) వూరి కొండల్లోనో,తోటల్లోనో పండే సీతాఫలం, జామ, మామిడి కూడా బాగా అగ్గువ అయినప్పుడు మాత్రమే ఇంటిదగ్గరికి అమ్మొచ్చేవి. టమేటా కాలంలో మాత్రం