హిందుత్వ కౌటిల్య మాతృభాషా వాదం

భాష అలోచనల ప్రత్యక్ష వాస్తవానికి రూపం – మార్చ్‌
థ‌ల్‌ముత్తును త‌ల‌చుకోనివాడు
నాట్య‌రాజ‌న్‌ను గుర్తు చేయనివాడు
తేనెలొలుకు ప‌లుకుల‌తో ఎంత
భాషాభిమానాన్ని చాటుకున్నా
చాణక్య‌నీతి చెల్ల‌దుగాక చెల్ల‌దు
బ్రాహ్మ‌ణ దుర‌హంకార‌వాదం
హిందీ ఆధిప‌త్య దుర‌భిమానం
మ‌ట్టిగ‌ర‌వ‌క త‌ప్ప‌దు

మన ప్రియమైన భారత దేశం అనేక భాషలకు, సంప్రదాయాలకు, జాతులకు, మూలవాసుల సముదాయాలకు, సంస్కృతులకు నిలయం. వైవిధ్యం దీని ప్రత్యేకత. వాటిని సంరక్షించుకోవడం మనందరి విధి. అవి ఈనాడు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటి అస్తిత్వం తీవ్ర ప్రమాదంలో ఉంది. తెగలు లుప్తమవుతున్నాయి. భాషలు అడుగంటిపోతున్నాయి. తర తరాల వారసత్వ సంపద వినాశనపు అంచులలో అస్థిత్వానికై కొట్టుమిట్టాడుతున్నవి. యేడాది పొడుగుతా ఐక్య రాజ్య సమితి పేరు మీదనో, జాతీయ దినాలుగానో ప్రపంచంలో పాటించని రోజు మిగల లేదు. మన దేశంలో ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక వికాసానికి, సాంస్కృతిక వైవిధ్యానికి ఏకైక ప్రధాన శతృవుగా బ్రాహ్మణవాదం నిలిచింది. భిన్నత్వాలను గుర్తించని ఏకరూపత దాని నైజం. దానిని ఎదుర్కోకుండా మనం మన ప్రజల సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోలేం. భాషల వికాసాన్ని అశించలేం. మన దేశంలో అతి ప్రాచీన సంప్రదాయాలకు ప్రతినిధులుగా మిగిలిన మూలవాసుల భాషలనేకం అడుగంటి పోయాయి. వాటికి అత్మగౌరవంతో, అత్మాభిమానంతో లిపిలు కనుగొంటున్నప్పటికీ దోపిడీ పాలక వర్గాలు తమ అధిపత్య భావజాలంతో వాటిని ప్రోత్సహించడం లేదు. అనేక భాషలు, తెగలు బ్రాహ్మణవాదానికి బలై మానవ ఇతిహాసపు పొరలలో క‌ప్పివేయబడినాయి. అ క్రమాన్ని అడ్డుకోవాలి. చరిత్ర పొరలను తవ్వి అనేక వాస్తవాలను వెలికి తీస్తున్నారు. ఇంకా తీయాలి. వాటిని అడ్డుకుంటున్న బ్రాహ్మణవాదాన్ని ఎదుర్నోవాలి. ఒకే భాష, ఒకే సిద్ధాంతం, ఒకే దేశం, ఒకే నాయకుడు అనే ఫాసిస్టు భావజాలానికి చరమగీతం పాడాలి. 2019 లో ఐక్య రాజ్య సమితి భాషా వ్యవహారాల కమిటీ ప్రపంచంలో 2,160 భాషలు అడుగంటి పోయాయని ప్రకటించింది.

మన దేశంలో సుదీర్హ కాలంగా బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న చరిత్ర ఉంది. హిందీ భాష అధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న చరిత్ర కూడ ఉంది. తమిళనాడులో 1937 నుండి హిందీ వ్యతిరేక ప్రజాందోళన సాగుతోంది. ఆ సమయంలో మన దేశంలో బ్రిటిష్‌ పాలన కొనసాగుతోంది. అప్పటి హిందీ వ్యతిరేక ప్రజా ఉద్యమంలో జైలు పాలైన అనేక వందల మందిలో నిరహారదీక్షకు పూనుకున్న థల్‌ముత్తు, నాట్యరాజన్‌లు కటకటాల మధ్యనే అసువులు బాసి అమరత్వం పొందారు. వారిని మనం ముందుగా తలచుకుందాం. వారి మాతృభాష ప్రేమను గౌరవిస్తూ, సర్వ భాషల సమానత్వాన్ని ఎత్తిపడుతూ అ వీరుల స్మృతిలో జోహార్లర్పిద్దాం. వారి త్యాగ ఫలితంగా 1940 ఫిబ్రవరి 21కి అంగ్ల పాలకులు తమ అదేశాన్ని ఉపసంహరించుకున్నారు. బ్రిటిష్‌ హయాం నుండి సాగుతున్న హిందీ అధిపత్య వ్యతిరేక ప్రజా ఉద్యమం 1948, 1950, 1959లలో తిరిగి తిరిగి తలెత్తింది. అ భాషా పోరాట జ్వాలలు చల్లారడం లేదు. మధ్య మధ్య రగులుతునే ఉన్నాయి. కాకపోతే నయా ఉదారవాద ఆర్థిక విధానాల మూలంగా వాటి వాడి, వేడి తగ్గుతోందని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆర్థిక విధానాలను ఎంత తీవ్రంగా అడ్డుకోగలిగితే, స్వావలంబన విధానాలు ఎంతగా అమలు చేయగలిగితే అంతగా ప్రజల భాష సహ సమస్య సాంస్కృతిక వ్యవహారాలలో ప్రగతిశీల మార్పులకు దారులు సుగమం అవుతాయి.

1940 నాటి ఫిబ్రవరి 21, ఇపుడు ప్రపంచ భాషాదినం జరుపుకుంటున్న ఫిబ్రవరి 21 సందర్భవశాత్తు కలిసి వచ్చిన తేదీలే తప్ప ఐక్య రాజ్య సమితి ప్రకటించింది మాత్రం బంగ్లాదేశ్‌లో తమ బంగ్లా భాష గుర్తింపు కోసం పాకిస్తాన్‌ ప్రభుత్వంతో పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరుల స్మారకార్థం ఈ దినాన్ని పాటిస్తున్నాం. మన దేశంలో 78.05 శాతం ప్రజలు ఇండో అర్యన్‌ భాషలు మాట్లాడుతారనీ, 19.64 శాతం ప్రజలు ద్రవిడ భాష మాట్లాడుతారనీ మిగితా 2.31 శాతం ప్రజలు ఇతర కుటుంబాలకు చెందిన భాషలు మాట్లాడుతారనీ అధికారిక లెక్కలు చెపుతున్నాయి. ఇండో అర్యన్‌ భాషలన్నపుడు చాలా వరకు సంస్కృతం కమ్మేసిన భాషలు అనుకోవచ్చు. ద్రవిడ భాషలు అనుకున్నపుడు మన దేశంలోని దక్షిణాదికి చెందిన మూలవాసీ భాషలతో సహ మిగితా భాషలనుకోవచ్చు. వీటినే ప్రాచీన భాషలుగా మనం చెప్పుకోవాలి. కానీ, దోపిడీ పాలక వర్గాల వివక్షకు బలవడంతో వాటి వికాసం నిలిచిపోవడమే కాకుండా ప్రపంచ మార్కెట్‌ ఆవిర్భావం, విస్తరణతో అవి అస్థిత్వం కోల్పోతున్నవి. ప్రపంచంలో గుర్తింపు పొందిన భాషలు 7 వేలున్నవి. కానీ, వీటిలో ఈ శతాబ్దం ముగిసే నాటికి ఒక 1,500 భాషలు లుప్త‌మ‌వుతున్నాయ‌ని ఆస్ట్రేలియా వాళ్లు జరిపిన ఒక పరిశోధనలో ఇటీవలే తెలియవచ్చింది.

జాతుల వికాసంలో భాష ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. జాతిని గుర్తించడంలోని నాలుగు ప్రామాణికతలలో భాష ఒకటి. వ్యాపార వాణిజ్యాల అభివృద్ధి, మార్కెట్‌ విస్తరణ, భాషా వికాసానికి చాలా దోహదం చేశాయి. ఫ్యూడల్‌ కాలంలో సంసృత భాషలోనే రచనలు సాగినా మన దేశంలో 11-17 శతాబ్దాల మధ్య చేతి వృత్తులవారి నాయకత్వంలో వెల్లువెత్తిన భక్తి ఉద్యమాలతో స్థానిక భాషలు ఎంతగానో వికసించాయి. మన దేశంలో పాళీ, హిందుస్తానీ, ఇంగ్లిష్‌ పాలక భాషలుగా, అస్థాన భాషలుగా ప్రజలకు అందనంత దూరంలో ఉంటుండగా సమాంతరంగా ప్రజల వ్యవహారాలు వారి భాషలో సాగాయి. ప్రభుత్వ యంత్రాంగం, వ్యాపార వర్షాలు వారి భాషలను అభ్యసించి వారిని నిలువు దోపిడీ చేసేవారు. చేస్తున్నారు.

మన దేశంలో అనేక భాషలు, అనేక లిపిలు విలసిల్లినాయి. కాకపోతే భారత బ్రాహ్మణవాద పాలకవర్గాల కుట్రల ఫలితంగా మూలవాసుల భాషలు క్రమక్రమంగా అడుగంటిపోతున్నాయి. వాటికి అసలు భాషగా గుర్తింపే లేదు. వాటిని మాండలికాలుగా వ్యవహరిస్తూ చిన్నచూపు చూడడం జరుగుతోంది. ‘మాకు మరో భాషే లేదు. మాకున్నది ఏకైక భాష సంస్కృతం. మిగితావన్నీ దాని పిల్ల భాషలే’ అంటూ విద్వేష గురూజీ గోల్వల్కర్‌ స్వదస్తూరీతో రాసి పెట్టాడు. కాషాయాంబరులకు అది వేద వాక్కుతో సమానం. ఒకే భాష, ఒకే సిద్ధాంతం, ఒకే దేశం అనేదే వారి సైద్ధాంతిక అవగాహన. వారు దానికి ఒకే నాయకుడు అని కూడ జత చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో 22 భాషలనే పేర్కొన్నారు. మొదట ఈ సంఖ్య మరీ తక్కువగా ఉండేది. ప్రభుత్వ గుర్తింపు పొందిన భాషలు 22. అవి: అసోం, బంగ్లా, బోడో, డోంగ్రీ, గుజరాతీ, బంగ్లీ, కన్నడ, కశ్మీరీ, కొంకణీ, మైథిలీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ ను పేర్కొన్నారు. మరోవైపు దేశంలో పదిలక్షల జనాభా మాట్లాడే భాషలకు గుర్తింపు ఇవ్వాలని అధికారికంగానే చెపుతుంటారు. కానీ దాన్ని ఎవరూ లెక్కలోకే తీసుకోవడమే లేదు. పిడికెడు మంది మాట్లాడని సంస్కృతానికి నేడు కూడ పెద్ద పీట‌ వేయడం భారత పాలక వర్గాల బ్రాహ్మణిజానికి అద్దం పడుతుంది. మైనార్టీల భాషలకు రాష్ట్రపతి సంరక్షకులు అంటూ వారికి సర్వాధికారాలు ఇచ్చారు. కానీ, ఏ రాష్ట్రపతి సక్రమంగా అ బాధ్యతలు నిర్వహించలేదనీ అడుగంటి పోతున్న వారి భాషలే సెలవిస్తున్నాయి.

మన రాజ్యాంగం ఆర్టికల్‌ 348 ప్రకారం దేవనాగరి లిపితో హిందీని అధికార భాషగా గుర్తించింది. అంకెలు మాత్రం అంగ్లంలో ఉండాలని రాశారు. ఇంగ్లిష్‌ ప్రాధాన్యత గురించి స్పష్టంగానే పేర్కొన్నారు. ప్రతి యేటా సెప్టెంబర్‌ 14 జాతీయ భాషా హిందీ దినంగా పాటిస్తున్నారు. 2006 నుండి విశ్వ హిందీ దినంగా జనవరి 14ను పాటిస్తున్నారు. ఈ రకంగా రాజ్యాంగంలో రాసి, కేవలం హిందీకే పట్టం కట్టడం అంటే దేశంలోని ప్రాంతీయ అస్థిత్వాలను కాలదన్ని మిగితా భాషలన్నిటినీ దిగతుడుపు చేస్తూ లక్షలాది, వేలాది, ప్రజల వందలాది మాతృభాషల ఉనికిని, చరిత్రలో అవి సాధించిన వారసత్వ సంపదలను మంటకలపడం తప్ప మరొక‌టి కాదు. ప్రాంతీయ భాషల హోదా గురించి ఆర్టికల్‌ 347 ప్రకారం రాష్ట్రాల విధానసభలు నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రాలలో ప్రజలు మాట్లాడుకునే పలు భాషలలో ఎన్ని భాషలను అధికార భాషలుగా గుర్తిస్తారనేది రాష్ట్రాలకే వదిలారు. మాతృభాషలో విద్యాబోధన అన్నారు. అందుకోసం కూడ ఎన్ని పోరాటాలు! ఇప్పటికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పిల్లలు అందుకు నోచుకోనే లేదు. ఇక అదివాసీ పిల్లలైతే భాష రాని బడిలో ఎదురయ్యే బాధలు పడలేక చదువుకు, పంతులుకు దండం పెట్టే పరిస్థితులే వారిని నేటికీ వెంటాడుతున్నాయి. ఇక ఆర్టికల్‌ 51 చదివితే మన దేశంలో ఇంత ప్రజాస్వామికమా అని నివ్వెరపోవడమే మన వంతవుతుంది. రాజ్యాంగాన్ని ముందుపెట్టి భారత ప్రజలను బ్రాహ్మణ పాలక వర్గాలు నిజంగానే బాబాసాహెబ్‌ గుర్తించినట్టు ఆయన్ని దాని రచనలో ఒక టూల్‌గానే వాడుకున్నారన్నది దాని అక్షర అక్షరంలో ప్రకటితమవుతుంది.

మాతృభాష దినం నాడు దేశ ఉప రాష్ట్రపతి మన రాజ్యాంగంలోని అర్జికల్‌ 347ను తనదైన శైలిలో గుర్తుచేస్తున్నాడు. ఈయన తన శేష జీవిత కాలాన్ని ఇలాంటి ప్రవచనాలకే అంకితం చేయాలనుకుంటున్నాడు కాబోలు! కరుడుగట్టిన కాషాయ ‘ప్రవక్త’ (అధికార ప్రతినిధిగా గణుతికెక్కుతున్నాడు. గతంలో ఈయన ఇలాంటిదే ఏదో ఒక రోజు మాట్లాడుతూ భాష అడుగంటిపోవడం అంటే ఒక మానవ సమూహ తరతరాల చరిత్ర, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతిని భవిష్యత్తరాలు కోల్పోవడమేనని తెగ బాధపడిపోతూ మాట్లాడాడు. దాన్నే ఈసారి ఐదు సూత్రాలలో బంధించాడు. భాష అడుగంటిపోవడం అంటే అస్థిత్వాన్ని కోల్పోవడం అంటున్నాడు. ఒక జాతి యొక్క గతాన్ని భాష ద్వార భవిష్యత్తు తరాలకు అందించాలి అంటూ అది మనిషి మూలాలను తెలుపుతుంది అని బహు చక్కగా బోధిస్తున్నాడు. ఆయన పాటించాలనీ చెపుతున్న ఐదు సూత్రాలు:

  1. ప్రాథమిక విద్యా మాతృభాషలో బోధించాలి
  2. పరిపాలనా భాషగా మాతృభాష ఉండాలి.
  3. న్యాయ వ్యవస్థలో మాతృభాషను వినియోగించాలి
  4. సాంకేతిక విద్య మాతృభాషలో సాగాలి.
  5. ఇంట్లో లేదా వ్యవహారిక భాషగా మాతృభాషనే వాడాలి.

ముప్పవరం గారి ఉపదేశాలు ఇవి. నిజానికి ఆయన ఒక దేశ ఉప రాష్ట్రపతిగా రాజ్యాంగాన్ని ఏమేరకు అమలు పరుస్తున్నాడో నిజాయితీగా చెప్పాలి. కానీ, ఆయ‌న‌కు ఆ స్వేచ్ఛ‌ ఎక్కడిది? ఆయన రెండు రకాల కట్టడుల మధ్య అధికారాన్ని నెరపుతున్నాడు. ఒకటి రబ్బరు స్టాంపుగా బాధ్యతలు నెరవేర్చడం, రెండు విద్వేష గురూజీ బోధనలను ఏకరవు పెట్టడం! ఈ రెండూ విశాల ప్రజారాశుల ప్రజాస్వామిక అకాంక్షలను పాతరేసేవే.
పైనే చెప్పినట్టుగా ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు తగదునమ్మా అన్నట్టు ఇలాంటి సందర్భాలలో సందేశాలు ఇచ్చే అదనపు వర్క్‌ డివిజన్‌కూడ కేసరియా కుటుంబం నుండి తీసుకున్నట్టుంది. ఆయన ఇటీవలే “శ్రీరాముడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ చదివి, తమ జీవితాలకు అన్వ‌యించుకుని, ఆచరించాలని” – చెప్పాడు. (ఏప్రిల్‌ 2021). ఇది అక్షరాల కంచి కామకోటి శంకరాచార్యుల వారి అద్వైతాన్ని శిరసావహిస్తుందనేది అర్థం చేసుకోవాలి. ఈయన ఒక లౌకిక, సామ్యవాద, గణతంత్ర భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పెద్ద మనిషి మన దేశంలో రాముడిని పూజించని, భగవంతుడిగా నమ్మని మూలవాసులు, ముస్లింలు, పంచములుగా ముద్రపడిన శ్రమజీవులు జనాభాలో దాదాపు సగానికిపైగా ఉంటారనే సోయైనా లేకుండా మాట్లాడడం కాకపోతే మరేంటిదిది! వేదాలు వింటేనే చెవులల్లో సీసం పోసిన బ్రాహ్మణం శ్రమజీవులకు చదివే హక్కునెక్కడిచ్చింది?

ఉప రాష్ట్రపతి గారు సెలవిచ్చే రామాయణం ఏం చెపుతోందో ఈయనకు తెలియక కాదు. తెలిసేఅధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పాలకవర్గ బ్రాహ్మణవాదాన్ని ప్రచారం చేస్తున్నాడు. రామాయణంలోని మూలభూతాంశం చాతుర్వర్జాలు తమతమ వర్ణ ధర్మాలను ఆచరిస్తూ జీవించడమే కదా! స్త్రీ అణచివేతే కదా! అదే కదా ‘దశవర్షసహస్రాణి’ రామరాజ్యం. శంబూకుడి తల నరికిన ఘనత రాముడిదని బ్రాహ్మణ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఉప రాష్ట్ర‌ప‌తిగారికి తెలువదనుకోగలమా! వర్ణవ్యవస్థను, స్త్రీ అణచివేతను ఆ పురుషోత్తముడి జీవితం నుండి నేర్చుకోమని సెలవివ్వడమా ఇది! నమ్మకాలు, విశ్వాసాలు, మనోభావాల పేరుతో మూఢ‌త్వాన్ని ప్రోత్సహించే వారు ఏ మతస్థులైనా, సామాన్యులైనా, సంపన్నులైనా, మతాధిపతులైనా, మంత్రులయినా, ఆర్టికల్‌ 51 ఎ (హైచ్‌) ప్రకారం అది రాజ్యాంగ ఉల్లంఘనే అని తెలిసి ఉప రాష్ట్రపతే ప్రజలకు ఇలాంటి సందేశం ఇవ్వడం అంటే ఆయన ఎంతటి కరుడుగట్టిన హిందుత్వ శక్తో అర్థం చేసుకోవాలి. మరోవైపు అదే సమయంలో దేశ ప్రధాని అయోధ్యలో రామ‌మందిరానికి శిలాన్యాసం చేస్తూ రాముడు దేశ ప్రజల దేవుడనే ఫత్వా జారీ చేశాడు. లేకపోతే దేశంలో ఎన్ని గుజరాత్‌లనైనా సృష్టించగల “హిందూ హృదయ సామ్రాట్ ఆయన. గుజరాత్‌ మారణహోమానికి సూత్రధారి, కర్మయోగి పుస్తక రచయిత అలా మాట్లాడడం వాళ్ల ఎజండాలో భాగమైన భవిష్యత్‌ రామరాజ్య స్థాపనలో భాగమే. వెంక‌య్య‌ గారి ఉద్బోధ సరే, అమృత మహోత్సవాలు మహాదానందంగా జరుపుకుంటున్న ఈ నాయకులు మన రాజ్యాంగం ఘోషిస్తున్న అర్జికల్‌ ౩347ను 72 ఏండ్లుగా ఎందుకు అమలు జరుపడం లేదనేది ఒక్కసారి అలోచించాలి. అక్షరాల 2022 సంవత్సరం ప్రపంచ భాషా దినం రోజు 29వ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేకు ఆ రాష్ట్రంలోని 4,000 మంది భాషాభిమానులు ప్రపంచ భాషా దినాన్ని పురస్కరించుకొని మరాఠీకి అధికార భాష గుర్తింపు ఇవ్వాలనీ, ప్రాచీన భాష హోదా కల్పించాలనీ ఉత్తరాలు రాయగా అవి శివసైనికుడు రాష్ట్రపతికి పంపాడు. మన దేశంలో ఇప్పటికి అనేక ప్రాంతాల భాషలకు అధికార భాషా హోదా కల్పించాలనీ కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్రాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే.

1963 లో ప్రాంతీయ భాషల చట్టం రూపొందించారు. 1965లో దక్షిణ భారతంలో ముఖ్యంగా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం రగులుకొంది. అ ఉద్యమంలో 63 మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని లాల్‌బహద్దూర్‌ శాస్త్రి రాష్ట్రాలలో ద్విభాషా బోధన జరుపుకోవచ్చని తెలిపాడు. అఆ తరువాత మరో ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కార్యాలయాలలో హిందీని అమలు పరచాలనీ తాఖీదులిచ్చాడు. 1990లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ పాఠశాలలలో ఇంగ్లిష్‌ భాషను తొలగించి ప్రభుత్వ కార్యాలయాలలో హిందీనే వినియోగించాలని అదేశించాడు. ఏ పాలకుడు ఏ అదేశం ఇస్తాడో, దాని దీర్హకాల పరిణామాలు ప్రజలపై ఎలా ఉంటాయో ప్రజాహిత ప్రజాస్వామిక ప్రభుత్వాలు తప్ప నిరంకుశ ప్రభుత్వాలు గుర్తించవు. మన దేశంలోని పాఠశాలలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం చూస్తున్నాం. అంటే పాఠశాలలలో మూడు భాషలు నేర్వడం, నేర్పడం ఏ భాషోద్ధ‌రణకో అలోచించాలి. 1961లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం దీనిని ప్రమోట్‌ చేసింది. కానీ హిందీకి ఎదురైన వ్యతిరేకతతో ఏడేళ్లు అమలు కాలేదు. 1968 నుండి అమలులోకి వచ్చిన త్రిభాషా సూత్రంతో ముందుకు వచ్చిన హిందీ అధిపత్యాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తూ తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో ద్విభాషా సూత్రమే అమలవుతున్న విషయం విదితమే. ఇప్పటికీ హిందీ రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం అమలు ఎలా ఏడుస్తుందంటే వారు తమిళం, మలయాళం, తెలుగులాంటి అన్ని భాషలను పక్కన పెట్టి తమ హిందీ సరసన రెండవ భాషగా కాలం చెల్లిన సంస్కృతాన్ని ఎంచుకోవడం అతి సాధారణం. సామ్రాజ్యవాద యుగంలో వారు ఇంగ్లిష్‌ వదలుకునే ప్రసక్తే ఉండదు.

తమది జాతీయ సాంస్కృతికవాదం అంటూ, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌లు, స్వాభిమాన్‌ మంచ్‌లు, సమరస వేదికలు ఏర్పర్చుకుంటూ గుండెలు వవిరుచుకుని చెప్పన్‌ ఇంచ్‌ ఛాతీ వీరులు కేసరియా కౌటింబీకులు గత 8 ఏళ్లుగా భారత రాజాకీయాధికారాన్ని నెరపుతున్నారు. వారు ఎన్నడూ ఉనికిలోనే లేని ‘భారత జాతిని తెగ కొనియాడుతూ “ఏక్‌ భారత్‌-శ్రేష్ట్‌ భారత్‌” అంటూ అనేక జాతులకు నిలయమైన మన భారతావనిలోని ప్రాంతీయ సంస్కృతులను, వివిధతలను ధ్వంసం చేస్తున్నారు. వారు భిన్నత్వంలో ఏకత్వం అంటూ దేశ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారు. ‘హిందీ, హిందూ, హిందుస్తాన్‌’ అనే దురభిమానంతో వివక్ష ప్రదర్శిస్తున్న దుష్ట అప్రజాస్వామిక శక్తులకు భాషా దినం జరుపుకునే నైతిక హక్కే లేదు. ప్రాంతీయ భాషలను హిందీకి పుట్టిన పిల్ల భాషలుగా కుదించి మాతృభాషా దినం జరుపడం, ప్రజాకర్షణ ఉపన్యాసాలు ఇవ్వడం కడుపుల్లో కత్తులు దాచుకునే బ్రాహ్మణవాదులకే చెల్లుతుంది.

మగధుల పాలనలో పాళీ, మొగలులు పాలనలో హిందుస్తానీ, బ్రిటిష్‌వారి పాలనలో ఆంగ్లం ఇలా రాజులు మారుతూ రాజ భాషలూ మారుతూ వచ్చాయి. ఇపుడు హిందీని ప్రజల మీద రుద్దుతున్నారు. కేంద్రంలో హిందుత్వ శక్తులు అధికారాన్ని చేపట్టినప్పటినుండి హిందీని దేశ ప్రజలందరిపై రుద్దడం పెరిగింది. పాలకవర్గ ముఠాల మధ్య విభేదాల కన్నా సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలు వారి మధ్య ఐక్యతనే ప్రధానం చేసి నిర్దేశిస్తున్న ప్రస్తుత తరుణంలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడ చాలా వరకు పదను కోల్పోతూ వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు బలవుతున్నాయి. ప్రజల మాతృభాష అకాంక్షలను సైతం దుష్ట పాలకులు తాకట్టుపెడుతున్నారు. వారి అవసరాలు, స్వార్ధ ప్రయోజనాల కోసం భాషను ఒక అయుధంగా వాడుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దేశంలోని ముఖ్యంగా హిందీయేతర రాష్ట్రాలలో వివిధ రూపాలలో ఇప్పటికీ హిందీ వ్యతిరేక ఉద్యమాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప నిజంగా పెరియార్‌, ఫూలే, అంబేద్క‌ర్‌ల బోధనల వెలుగులోనైనా ప్రజా అకాంక్షలను అ ఉద్యమాలు ప్రతిబింబించడం లేదు. ఇక “ఎర్ర రంగు” రాజకీయాలలో ఎర్రతనమే కరువవుతోంది. కనీస నిరసననైనా సహించలేకపోతున్న హిందుత్వ శక్తులు ప్రధానంగా అణచివేత చర్యలతో పాటు కుట్రలు కూహకాలకు తలపడడం చూస్తున్నాం. వాటిలో భాగమే ప్రపంచ మాతృభాష దినాన మొసలి కన్నీటి ప్రకటనల, సందేశాల వెల్లువ. ఆచరణలో మాత్రం ఎక్కడా ఏ అల్ప సంఖ్యాకుల భాష రాజ్యాంగ పరిధిలోనైనా గుర్తింపుకు నోచుకోవడం లేదు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజలే పోరాడాలి. పోరాటాల ద్వారానే మార్పు సాధ్యం. ప్రజలు తమ మధ్య పరస్పర సంవాదానికి తమకు నచ్చిన భాషను రూపొందించుకోవాలి తప్ప ప్రభుత్వాలు రుద్దకూడదు. ప్రజల మధ్య సంవాదం కోసం ఏ ప్రజల మధ్యకు మనం వెళతామో మనం వారి భాష నేర్చుకోవడమే సరైన విధానం అవుతుంది. కానీ, మన దేశ ప్రభుత్వాలు అ ప్రజాస్వామిక పద్ధతిని కాలరాచివేసి నిరంకుశంగా వారిపై ప్రధానంగా హిందీ, లేద రాష్ట్రాలలోని ప్రధాన భాషలను రుద్దడం చూస్తున్నాం. ఇటీవల ఒక ముంబాయి పాత్రికేయుడు విద్యాధర్‌ ధాటే ‘మరాఠీ భాష పక్షం” పాటించడంపై ఒక అంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో (భాషా సమస్యలు) ఛత్తీస్‌గఢ్‌ అనుభవాన్ని గుర్తు చేశాడు. అక్కడి ముఖ్యమంత్రి అదివాసీ ప్రజలతో హిందీలో మాట్లాడిన ఫలితంగా ఆయన భావాలు ప్రజలకు అర్థం కాలేదనీ, వాటిని దుబాసీ ద్వార అనువదించాల్సి వచ్చిందంటూ కొసమెరుపుగా నక్సలైట్లు స్థానిక ప్రజల భాష నేర్చుకున్న ఫలితంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ వారిని అరికట్టలేకపోతుందనీ అభిప్రాయపడినాడు. ఆ పాత్రికేయులు భాషా సమస్యల సందర్భంగానే ఈ వాస్తవాన్ని ఉటంకించినప్పటికీ, ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమంటే ప్రజలకు నక్సలైట్లకు మధ్య మొదటే చెప్పుకున్నట్టు *భాష ఆలోచన ప్రత్యక్ష వాస్తవానికి రూపం” కాబట్టి ప్రజల మౌలిక సమస్యలను వారి భాషలోనే వారితో పంచుకుంటున్నందున వారు ప్రజలతో మిళితమయ్యారు. వారితో తాదాత్యం చెందారు. అయితే, ప్రజల భాషలో ప్రజలతో సంవాదం అనే పని కొద్దికాలంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు కూడ చేస్తున్నారు. మూలవాసులలోని దుష్ట పెద్దలు మొదటినుండే ప్రజల భాషలోనే మాట్లాడుతున్నారు. కాబట్టి భాష భావానికి ఒక వాహకమే తప్ప దానికదే భావం కాదు. కాబట్టి ప్రజలకు ఎవరు ఏం చెపుతున్నారనేదే ప్రధానం తప్ప భాషే భావానితో సంబంధం లేకుండా దగ్గరికి చేర్చదు. భావం తమదైతే భాష నేర్చుకోవడం బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఇది గ్రహించాలి. మాతృభాష దినం జరుపుకుందాం. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి పూనుకునే వారే దానిని అనివార్యమైన ఒక మాధ్యమంగా మలచుకోగలరు.

“బ్రాహ్మణులు తమ మత గ్రంథాలన్నీ బయటకు తీయాలి. కైస్తవులంతా సమావేశమై బైబిలు ఎలా కలిసి చదువుతారో, అలా, వాటిని అందరితోనూ కలిసి చదవాలి. అప్పుడు వాటిలో ఉన్న అసమానత, అన్యాయం, బహిర్గతమై వాటి బండారం బయటపడుతుంది. నలుగురు కలిసి చదువుకోలేని శాస్త్రాలు హిందువులకెందుకు? పక్షపాత పూరితమైన గ్రంథాలు, పీడక సుతులు ఎందుకు?” – ఫూలే.

Leave a Reply