2026 ఏప్రిల్ 12
కాశీపూర్ బ్లాక్‌లోని సిజిమాలి బాక్సైట్ గని కోసం వేదాంత అల్యూమినియం లిమిటెడ్ చేపట్టిన రోడ్డు నిర్మాణ కార్యక్రమం భారీ సంఖ్యలో పోలీసులు, పరిపాలనా యంత్రాంగ అధికారుల సమక్షంలో జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగి వివాదం చెలరేగింది.
మంగళవారం భారీ పోలీసు, పరిపాలనా యంత్రాంగ సిబ్బంది సమక్షంలో ప్రారంభమైన ఈ రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్థులు వ్యతిరేకించడంతో పోలీసులకూ, వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్థులు పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపణలు రావడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, కలెక్టర్ ప్రభావిత ప్రాంతానికి వెళ్లాడని అధికార వర్గాలు అంటున్నాయి.
అయితే, అధికారులు తమను భూ యాజమాన్య పత్రాలు చూపించమని అడిగారని గ్రామస్తులు ఆరోపించారు. వారెంట్ పెండింగ్‌లో ఉన్న సుబాస్ సింగ్ మాఝీని అరెస్టు చేయడానికి తాము కాందమాల్ గ్రామానికి వెళ్లామని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రాంతంలోకి ప్రవేశించి, నివాసితులను భయపెట్టడానికి ప్రయత్నించారని గ్రామస్తులు ఆరోపించారు.
అధికారులు తలుపులు బాదారని, తలుపులు తెరిచిన వారిని బెదిరించారని, కొందరు గ్రామస్థులపైన శారీరకంగా దాడి చేసారని; తాము ఆత్మరక్షణకు ప్రయత్నిస్తే, పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారని కూడా స్థానికులు తెలిపారు.
పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో, ఆసుపత్రికి వెళితే అరెస్టు అవుతామనే భయంతో పలువురు గ్రామస్తులు గాయపడి, తర్వాత ఇంటి వద్దనే చికిత్స పొందారని సమాచారం. పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ వల్ల తమ పశువులు చనిపోయాయని గ్రామ మహిళలు ఆరోపించారు. పోలీసులు గ్రామస్తులపైన దాడి చేశారని కూడా స్థానికులు ఆరోపించారు.
60 ఏళ్ల రావణ్ మాఝీ అనే వ్యక్తి ముఖానికి బాష్పవాయు షెల్ తగిలింది; ఒక వృద్ధురాలిని చితకబాదడంతో ఆమె తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తన తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారని, తాను బయటకు రాగానే తనపై దాడి చేశారని ఆ గాయపడిన వృద్ధురాలు తెలిపింది. తమను పదునైన ఆయుధాలతో బెదిరించారని కూడా కొందరు మహిళలు చెప్పారు.
సిజిమాలి గనికి నిర్మించ తలపెట్టిన రహదారి కారణంగా తాము నివాసాలు కోల్పోతామని, తమ భూములు చేజారిపోతాయని ఆందోళన చెందుతూ గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. ఏప్రిల్ 3 నుండి ఆ ప్రాంతంలో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163 కింద అధికారులు నిషేధాజ్ఞలను విధించారు.
రాయగడ కలెక్టర్ ఇంతకుముందు కూడా నివాసితులతో చర్చలు జరిపేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడు; అయినప్పటికీ కాంతమాల్ గ్రామంలో భయం, ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. తమతో చర్చలు జరపకుండా భూమి పట్టాలు (భూమి పత్రాలు) చూపించమని కలెక్టర్ అడగడం “చాలా దురదృష్టకరం” అని నివాసితులు అన్నారు.
కలెక్టర్ జిల్లా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారా లేక వేదాంత సంస్థకా అని వారు ప్రశ్నించారు. తమ భూమిని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో, రహదారి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు—విల్లులు, బాణాలు, గొడ్డళ్లు, కర్రల వంటి సంప్రదాయ ఆయుధాలతో సన్నద్ధులై—గ్రామస్తులు సిజిమాలి కొండ వద్ద రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు.
సగబారి, కాంతమాల్, సారంబాయి, బాంతేజీలతో సహా ఎనిమిదికి పైగా గ్రామాల ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. “మేము తూటాలకు ఎదురొడ్డి నిలబడటానికైనా సిద్ధమే, కానీ మా భూమిని ఆ కంపెనీకి అప్పగించము,” అని గ్రామస్తులు స్పష్టం చేశారు. కొండల పాదాల వద్ద కాపలా కాస్తున్న మహిళలు, అటువంటి ప్రయత్నం ఏదైనా జరిగితే తాము దానిని గట్టిగా ప్రతిఘటిస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా, సిజిమాలి సమీపంలో ఉన్న కలహండిలోని తలంపదార్‌కు చెందిన 21 మంది నివాసితులను పోలీసులు ఎటువంటి కారణం లేకుండా అదుపులోకి తీసుకుని, అక్రమ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు; వీరిలో ఇద్దరు పాఠశాల విద్యార్థినులు కూడా ఉన్నారు.




