నల్లమల విప్లవోద్యమం ఏమి మిగిల్చుకోలేదని అది ఒక పరాజిత గాథ అని మాట్లాడే మేధావులు చాలా మందే ఉన్నారు సమాజంలో. నిజానికి నల్లమల ఉద్యమం ఏమి మిగిల్చుకోలేదా! సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదా?అది ఓడిపోయిన కథ మాత్రమేనా? ఎందుకని సో కాల్డ్ మేధావులకు ఈ వివక్ష? ఉత్తర తెలంగాణ,విప్లవోద్యమాన్ని రొమాంటిక్ గా గంటలు గంటలు ఎత్తిపాడుతూ, ఉపన్యాసాలు దంచే వారికి నల్లమల్ల విప్లవోద్యమం ఎందుకని చిన్నగా కనిపిస్తుందో వింతగా తోస్తుంది. బహుశా నేను అనుకుంటాను నల్లమల్ల విప్లవోద్యమంలో మొదటి తరాన్ని మినహాయిస్తే ఆ విప్లవోద్యమం సెట్ బ్యాక్ గురయ్యేవరకు దళితుల ముఖ్యంగా మాల మాదిగల కొందరు బీసీల నాయకత్వంలో నడిచింది. అట్లా అట్టడుగు కులాల నాయకత్వంలో నడిచినందుకేనా ఈ వివక్ష అనే అనుమానం కలుగుతుంది.
నల్లమల విప్లవోద్యమంలో వందలాది మంది ఎన్కౌంటర్లకు గురి అయ్యారు, మిస్సింగ్లకు గురి అయ్యారు. అత్యద్భుతంగా సాహసాల్ని ప్రదర్శించారు. నల్లమల ఏరియాలో ఉండే ఓ కుటుంబం మొత్తం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని పెంపుడు కుక్క కూడా దళంతో పాటే తిరిగిందని జనాలు చెప్పుకునే ఉద్యమ తీవ్రత ఎందుకని ఈ అగ్రకుల మేధావుల కళ్లకు కనిపించదో! అల్లం రాజయ్య పుస్తకంలో చెప్పిన దొర మీద కోపం దొర పొగరుబోతు ఎద్దు మీదకు మళ్లీ దాని చావుకు కారణం అయినట్టు, అది జగత్విదితం అయినట్టు పైన చెప్పిన పెంపుడు కుక్క ఉదంతం ఎందులో తక్కువని?
నల్లమల విప్లవోధ్యమంలో శేషన్న అనే నాయకుడు ఉద్యమంలో భాగంగానే ఓ సారాబట్టీ ధ్వంసం సమయంలో తన చెయ్యిని కోల్పోయి ఒంటి చేత్తోనే చివరిదాకా విప్లవంలో కొనసాగి ఎన్కౌంటర్లో చంపబడ్డాడు. అతడు చనిపోయాక పెద్ద పులిని చంపాము అని అతడి శవం మీద ఎక్కి పోలీసు గర్వాన్ని ప్రకటించాడు అట్లాంటి హృదయ దహన గాథలు ఎన్నో నల్లమలలో ఉన్నాయి.
గ్రామాల్లోని దళితులకు, అడవుల్లోని చెంచులకు కుల పీడనను, వర్గ పీడనను ఎదిరించే ధైర్యం నల్లమల ఉద్యమమే ఇచ్చింది. చాలా మామూలు మనుషులను కూడా మహామహులుగా మార్చింది. మహా నాయకులుగా తీర్చిదిద్దింది. ప్రజల కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా అర్పించే వ్యక్తిత్వాన్ని మనుషుల్లో స్థాపితం చేసింది నల్లమల విప్లవోద్యమం. అట్లాంటి నల్లమల ప్రభావానికి ఉదాహరణనే నారాయణపేట జిల్లా మక్తల్ లోని మాదిగవాడలో పుట్టిన కర్రెo నర్సప్పది. బస్ స్టాండ్ లో తల్లి తండ్రితో పాటు మూటలు మోస్తూ,మహిళలతో పాటు కూలికి తంగేడు చెక్క కొట్టడానికి వెళుతూ, చర్చికి వెళ్లి శ్రద్ధగా ప్రార్థనలు చేసుకుంటూ ఎలాంటి ప్రాపంచిక వ్యాపకాలు లేని కర్రెo నర్సప్ప 1986 మక్తల్ లో ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ చదువులకు వనపర్తికి వెళ్ళాక రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ ఎస్ యు)ప్రభావానికి లోనయ్యాడు. దానివల్ల అతడి ప్రపంచమే పరిపూర్ణంగా మారిపోయింది. ఓ మహా తిరుగుబాటుదారుడిగా, స్పార్టకస్ వోలే తయారై ఊరికి వచ్చాడు. రవన్నగా, సత్తెన్నగా, షమీ పాషగా, దేవదాసుగా అనేక పేర్లతో ఉమ్మడి జిల్లా మొత్తంగా, అటు కర్నూల్ లోకి తుంగభద్రాను దాటి ఎమ్మిగనూరు దాకా, ఇటు రాయచూరు, గుర్మిట్కల్ వరకు విస్తరించి పనిచేశాడు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల ఊడలు దిగిన హిందూ మతోన్మాదాన్ని సాయుధుడై ప్రతిఘటించాడు. ప్రతిఘటిస్తున్న సాటి పీడిత జనులకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. రాడికల్ విద్యార్థి సంఘం ఎక్కడైతే నడవడానికి అవకాశం లేదో, అక్కడ ప్రత్యామ్నాయంగా మరో పేరుతోటి కవర్ విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేశాడు. అంబేద్కర్ సంఘాలను ఆర్గనైజ్ చేశాడు. తన చుట్టూ తన పరిధిలో ఉండే ప్రతి ఒక్కరిని విప్లవంలోకి ఆకర్షించాడు. విప్లవ అవసరాలకు అనుగుణంగా వారిని ఉపయోగించుకున్నాడు.
శత్రువు కళ్ళు గప్పి తిరగడంలో, రెక్కీ నిర్వహించడంలో అతడికి అతడే సాటి. విప్లవకారుడు నీళ్లలో చేప ఉన్నట్టు ప్రజల్లో కలిసిపోయి ఉండాలి అనే మాటకు అతడే నిలువెత్తు ఉదాహరణ. వనపర్తిలో సాంబశివుడు(ప్రభాకర్) తో కలిసి విప్లవానికి గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చాక పార్టీ అతన్ని గద్వాలకు సెంట్రల్ ఆర్గనైజర్గా పంపింది
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 1990 ఆ సమయంలో చెన్నారెడ్డి సర్జరీ కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు అదే ప్రాంతం నుంచి యాక్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రెవెన్యూ మినిస్టర్, రెడ్డి కులపు భూస్వామి పై పెద్ద పోరాటాన్ని నడిపాడు. మొట్ట మొదట అతడు ఆర్గనైజర్గా గద్వాలకు వచ్చినప్పుడు విద్యార్థులతో ట్యూషన్స్ చెప్పే వంకతో పరిచయాలు పెంచుకుని వాళ్ల దగ్గరే షెల్టర్ పొందాడు. కొన్ని సార్లు ఏమీ లేని సందర్భాలలో ఒట్టి మంచినీళ్ళతో కడుపు నింపుకున్నాడు. ఎవరివి నువ్వు అని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అడిగితే హౌసింగ్ బోర్డ్ ఉద్యోగిని అని చెప్పుకున్నాడు అలా మొదలు పెట్టిన అతడి ఉద్యమ ప్రయాణం అనతి కాలంలోనే ఉగ్రరూపం తీసుకున్నది.
రాష్ట్రమంతా ప్రజా కోర్టులు జరుగుతున్న సమయం అది. ఆ సమయంలోనే అక్కడి మంత్రి, భూస్వామిని సవాల్ చేస్తూ దమ్ముంటే గద్వాల తేరు మైదానానికి రావాలని, అతణ్ణి అక్కడికి ఈడ్చుకు వస్తామని కరపత్రం వేశాడు. ప్రజలు వేలాదిగా వినతి పత్రాల్లో సమస్యలు రాసుకుని మైదానానికి వచ్చారు. అది పెద్ద సంచలనంగా మారింది. అదే రోజు మొత్తంగా గద్వాల పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని అణువణువునా నర్సప్ప కోసం గాలిస్తున్న సమయంలో ఇక అతను అక్కడ ఉండే పరిస్థితి లేదు కనుక వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్లి పొమ్మని అతడి అనుచరులు చెప్పినప్పుడు ఓ బ్రాహ్మణుడి వేషం వేసుకొని, ఆయుధంతో సహా బస్సు ఎక్కి బస్సులో కూర్చున్నాడు. పోలీస్ పార్టీ అతడు ఎక్కిన బస్సును ఆపి సెర్చింగ్ మొదలు పెట్టింది. అతడు ఏమి తెలియనట్టుగా స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించి పోలీసులు అతని వివరాలు అడిగినప్పుడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అతడు బ్రాహ్మణుడి పేరు చెప్పి, ఆయుధాన్ని అక్కడే వదిలేసి “జమ్మిచేడు” వద్ద బస్సు దిగి క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. ఇది మరుసటి రోజు పేపర్ కి కూడా వచ్చింది. అంతటి సృజనాత్మకమైన పోరాట రూపాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.
కర్రెం నర్సప్ప. ఈ ఘటన అప్పటి ఆధిపత్య శక్తుల గుండెల్లో అది ఎంతటి భయాన్ని కలిగించి ఉంటుందో, రాష్ట్రంలో ఎంతటి కలకలాన్ని రేపి ఉంటుందో ఊహించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం గద్వాల వైపు చూసిన సమయం అది. ఈ ఘటన అతడి గుండె ధైర్యానికి ఓ ఉదాహరణ.
అక్కడ ఆయన ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత మహబూబ్నగర్ కి సెంట్రల్ ఆర్గనైజర్ గా వచ్చాడు. అక్కడ మరింత శక్తివంతంగా పని చేయడం మొదలు పెట్టాడు. పోలీసుల కండ్లుగప్పి నర్సప్ప పాలమూరు టౌన్ లో 30 యూనిట్లను నడిపాడు. కానీ అసలు ప్రత్యేకత ఏమిటంటే అంతకు ముందు ఉన్న వాళ్ళు నల్లమల అడవిని కేంద్రంగా చేసుకొని ఉద్యమాన్ని నడిపితే నర్సప్ప మహబూబ్నగర్ పట్టణంలో ఉంటూనే ఉద్యమాన్ని నడిపాడు.
కొండపల్లి సీతారామయ్య “పట్టణ పని విధానం” అనే డాక్యుమెంట్ను అక్షరాల ఆచరణలో పెట్టి పాలమూరు జిల్లా కేంద్రంలో పనిచేశాడు అతను 1991,1992 జిల్లా కేంద్రంలో జరిగిన గుడిసె వాసుల పోరాటం అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణుల ఆధిపత్యం లో ఉన్న ఖాళీ జాగాలో గుడిసెలు వేయించాలని పోరాటాన్ని నడిపాడు. ముఖ్యంగా మాదిగలకు, ముస్లింలకు, గౌండ్లకు, ముదిరాజులకు ఒక రెడ్డి కుటుంబానికి మొత్తానికి ఎనిమిది నుంచి తొమ్మిది కుటుంబాలకు అక్కడ గుడిసెలు వేయించి ఆ పోరాటాన్ని విజయవంతం చేసి పాలమూరు నడిబొడ్డున భూ పోరాటాన్ని విజయవంతం చేశాడు. అందుకోసం భూమి యజమానులను సరిగ్గా డీల్ చేయడమే కాకుండా కళాశాల ప్రిన్సిపాల్ ను కూడా సమన్వయం చేశాడు
దళితులను అక్కడ నివసించనీయని బ్రాహ్మణ ఛాందసుల్ని కొబ్బరి మట్టలతో కొట్టి వేకువ జామునే బుద్ది చెప్పారు విప్లవకారులు. అందులో నర్సప్ప ప్రముఖంగా ఉన్నాడు.
ఆ భూ పోరాటం కొనసాగుతున్న కాలమంతటిలోనూ అక్కడ దొరికిన ప్రతి సంబంధాన్ని విప్లవంలోకి సమీకరించాడు. ఉద్యమ అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అట్లా భూ పోరాటంలో ఇండ్లను కట్టుకున్న వాళ్ళ పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు. అక్కడే స్థిరపడిపోయారు.
మహబూబ్నగర్ ఆర్గనైజర్ గా ఉన్న నర్సప్పను పోలీసులకు పట్టించమని ఎన్నో సార్లు పేపర్ ప్రకటనలు వచ్చాయి. ముఖ్యంగా అతడు అక్కడ కార్యకర్తలతో పని చేయించడం అనేది వెనుక ఉండి చేయించలేదు. ఏకంగా తనే రంగంలోకి దిగి పక్కన ఉండి సాయుధుడై పోస్టర్లను వేయించాడు. పోస్టర్లను వేయించడం అంటే ఆషామాషిగా కాదు. వరంగల్ పని పద్ధతి ద్వారా నేర్చుకుని ఒకే సమయంలో ఏకబిగి నగరమంతా పోస్టర్లు వెలిసేలా టెక్నిక్ను ప్రదర్శించాడు.
నర్సప్ప ఎక్కడున్నాడు అని పోలీసులు వెతుకుతున్న క్రమం లోపల 200 మంది సానుభూతి పరుల లిస్ట్ ను అప్పటి సిఐ చదివాడంటే అతడు ఎన్ని సంబంధాలను సమీకరించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
పాలమూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకోవద్దని, లెక్చరర్లు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పవద్దని, వారందరినీ పిలిచి మర్యాదగా సర్ది చెప్పాడు
ఈ కాలమంతా అతను ఎక్కడ ఆశ్రయం పొందిన సరే మహిళల పట్ల చాలా మర్యాదగా సంస్కారవంతంగా మెలిగాడు. వ్యభిచారాన్ని అసహ్యించుకున్నాడు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండమని పేరుపేరునా అందరినీ హెచ్చరించాడు. ఆహారపు అలవాట్లలోనూ, సమయపాలనలోనూ తన వర్గ చైతన్యాన్ని ప్రదర్శించాడు. ఎక్కడ ఉన్నా నిరంతరం అధ్యయనంలోనే ఉన్నాడు. పోలీసులు ఎంత నిశ్శబ్దంగా వచ్చి అతడి కోసం వెతికినా, సానుభూతి పరుల ఇండ్లపై రైడ్లు జరిపినా ఎక్కడా దొరకలేదు.
అతని ఆచూకి తెలిసిన వాళ్ళను అరెస్టు చేసినా, కేసులు పెట్టినా, కోదండం వేయించినా సరే అతని ఆచూకి చెప్పలేదంటే అతడు వాళ్ళ ప్రేమను ఎంతగా చూరగొని ఉంటాడు. వాళ్ళని ఎంతగా ఎడ్యుకేట్ చేసి ఉంటాడు అనేది ఇక్కడ మనం గమనించాలి. ముఖ్యంగా ఇక్కడ పని చేస్తున్నప్పుడే సారా బట్టిలను ధ్వంసం చేసే పోరాటం మొదలైంది. ఫలితంగా కార్యకర్తల మీద టాడా కేసులు నమోదయ్యాయి. కానీ వాళ్ళు చలించలేదు. కాటన్ మిల్ కార్మికుల వద్ద సైతం ఆయుధం సీజ్ చేయబడ్డది అంటే అది నర్సప్ప నింపిన స్ఫూర్తి.
1992 తరువాత అక్కడి నుంచి అతను నల్లమల అడవికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పర్ ప్లాట్ ఏరియా దళ కమాండర్ గా ఏరియా కమిటీ బాధ్యుడిగా బాధ్యతలను నిర్వర్తించాడు. ఇక్కడికి వచ్చాక అతని పని మరింత తీరిక లేకుండా సాగింది. అటవీ ప్రాంతం కావడం వల్ల ఫారెస్ట్ ఆఫీసర్ల జులుం ఎక్కువగా ఉండేది. భూస్వాముల, వడ్డీ వ్యాపారుల దోపిడి ఎక్కువగా ఉండేది. దీనిని అప్పటి విప్లవోద్యమం తీవ్రంగా ప్రతిఘటించింది. దళ కమాండర్ గా ఏరియా కమిటీ బాధ్యునిగా నరసప్ప ఈ ప్రతిఘటనలో ముందు వరుసలో ఉన్నాడు. ఆవులు కాసే వాళ్లకు వారి యజమానులు జీతాలు పెంచాలని 12 kg ల బియ్యం, 12 kg ల జొన్న, 5 kg ల పిండి, 2 kg ల నూనె, సబ్బులు ఇవ్వాలని ఉద్యమం ఈ డిమాండ్స్ ను ముందుకు తెచ్చింది. అది కల్పించని వారిపై విప్లవోద్యమం చర్య తీసుకున్నది. ఫారెస్ట్ ఆఫీసర్లను కాళ్లు చేతులు ముడుచుకొని సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్నది. ఇందులోనూ నర్సప్ప పాత్ర ఉంది.
కరువు దాడులు నడపడంలోనూ అతడు ముందు పీఠీన నిలబడ్డాడు. ముఖ్యంగా అడవిలో చెంచులకు చదువు నేర్పడం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓపికగా వారికి చదువు చెప్పడమే కాకుండా చెంచు పెంటల్లోకి తిరిగి వైద్యం చేశాడు. అప్పటి చెంచులు “బోడినెత్తి ఆయన చేసిన వైద్యం వల్ల మా పిల్లలకు పానం మంచిగా అయింది” అని చెప్పుకునే వాళ్ళు నర్సప్ప గురించి.అక్కడే కాదు స్వగ్రామంలో అతను ఉన్నపుడు కూడా అతను తన జూనియర్లకు కెమిస్ట్రీ,ఫీజిక్స్ ట్యూషన్స్ చెప్పి వారి ఉత్తీర్ణతకు సహకరించాడు. అంటే అతడికి మొదటి నుంచి సైన్స్ పై అంత గురి ఉండేది.
జీవిత నేపథ్యం వలన చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేని దళంలోని చెంచు కామ్రేడ్లను ప్రేమగా దగ్గరకు పిలిచి “తమ్మీ మీ కోసమే ఈ చదువు, మీ కోసమే ఈ పార్టీ పోరాడేది, మీ కోసమే ఇన్ని త్యాగాలు, మీరు విప్లవానికి అవసరం” అని సర్ది చెప్పి వాళ్లకు చదువు నేర్పాడు.
చదువు చెప్పడంలో భాగంగానే డిక్టేషన్ చెప్పి రాయించాడు. లెక్కలనూ నేర్పాడు
నర్సప్ప ప్రభావంతోటి ఉద్యమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అతనిలాగే పూర్తికాలం ఉద్యమానికి అంకితమైన వాళ్ళు. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు శ్యామ్, ఈదన్న, సాంబశివుడు(ప్రభాకర్) వీళ్ళంతా అందుకో ఉదాహరణ.
వనపర్తి టౌన్ లో సాంబశివుడు కొండపల్లి సీతారామయ్య వ్యాసం చదువుతుండగా అతని ఆసక్తిని గమనించిన నర్సప్ప అతడికి రాజకీయాలు చెప్పి, విప్లవంలోకి తీసుకొచ్చాడు ఇది అతడి పరిశీలనా శక్తికి నిబద్ధతకు ఉదాహరణ
ఈ కాలంలోనే అప్పర్ ప్లాట్ దళం చేసిన ప్రతి కరువు దాడిలో నర్సప్పది ముఖ్యమైన పాత్ర. ఈ దాడుల్లో దళాలు స్వాధీనం చేసుకున్న బియ్యం, జొన్నలు, సబ్బులు, నూనెలు అన్నిటిని ప్రజలకు, పంచిపెట్టారు
అతడి వ్యక్తిత్వంలోని మరో సుగుణం
ప్రతి కార్యకర్తను కూడా అపురూపంగా కాపాడుకోవడం 1992 లో సంక్షోభ సమయంలో అప్పర్ ప్లాట్ ఏరియా నుంచి ప్లీనంకు దళం బయలుదేరినప్పుడు ఒక చెంచు కామ్రేడ్ అనుకోకుండా తన దగ్గర ఉన్న వస్తువులను పోగొట్టుకున్నాడు. అయితే అతడు వస్తువులను పోగొట్టుకున్నందుకు పార్టీ ఎక్కడ అతన్ని దండిస్తుందో అని భయపడి యూనిఫామ్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కర్రెo నర్సప్ప అతడి దగ్గరకు వచ్చి, ఏమీ కాదు తమ్మి భయపడకు అని సర్ది చెప్పి ముందుకు తీసుకెళ్ళాడు. సరిగ్గా ఈ సమయంలోనే బెంజిమన్ అమరత్వమొందాడు ఈ ఘటన సమయంలో గద్దర్ గణపతి అక్కడే, అక్కడే నర్సప్ప కూడా ఉన్నాడు. బెంజిమన్ పై గద్దర్ పాట పాడిన సమయంలో నర్సప్ప ఆ పాటకు సాక్షి
అతను ఈ ప్రాంతంలో విప్లవోద్యమానికి ఎంత నమ్మకమైన కార్యకర్త అంటే 1995 సమయంలో నల్లమల్ల అడవికి బహుశా మిలిటరీ క్యాంపు పని మీద వచ్చిన నంబాల కేశవరావును, పటేల్ సుధాకర్ ను పికప్ చేసుకొని సురక్షితంగా లోపలికి తీసుకువచ్చాడు. అది అతడి ప్రత్యేకత.
1990 దశకంలోనే నర్సప్ప అప్పర్ ప్లాట్ ఏరియాలో ఉండగానే ఐఆర్డిపి ద్వారా దళితులకు, ఆదివాసులకు అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని రాయితీలను ప్రకటించింది. బావుల తవ్వకాల్లో, పశువుల కొనుగోలులో, ఇండ్ల నిర్మాణంలో సబ్సిడీలను ఇవ్వ చూసింది. నర్సప్ప అక్కడ కమాండర్ గా ఉండడం వలన ఈ విజయం మన ఉద్యమం వల్లనే సాధ్యమైనదని, ప్రభుత్వం దయ కాదని మార్క్సిస్టు కోణంలో విశ్లేషించాడు i r d p నుంచి వచ్చే ఈ ప్రయోజనాలను ముందుగా ప్రజలకే చెందాలని అందరూ వాటి కోసం ప్రజలందరూ దరఖాస్తు చేసుకున్న తర్వాతే విప్లవకారులుగా మనం వాటి వైపు చూడాలని
మనం ఆ ప్రయోజనాలను పొందటానికి తొందర పడవద్దని, అంతిమంగా ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యమనే దిశగా శ్రేణులను నడిపించాడు.
సిద్ధాంతాన్ని, తత్వశాస్త్రాన్ని ఏకదాటిగా వల్లవేయడం కాదు వాటిని జీవితంలో ఎలా ఆచరించి చూపాలో అనేదానికి నర్సప్ప జీవితం, అతని ఈ ఆచరణ ఒక ఉదాహరణ.
విప్లవంలో ఎంత పెద్ద నాయకుడి మీదైనా సరే సూటిగా విమర్శ పెట్టడం, ఎంత కింది స్థాయి కార్యకర్త అయినా సరే అతడు పెట్టిన విమర్శను స్వాగతించడం అతడి విప్లవ జీవితంలో చెప్పుకోదగ్గ లక్షణం. అతడి మీద ఉన్న విమర్శ ఏమిటంటే ఎప్పుడూ చదువుకోవడం కోసమే దళం నుంచి కాస్త ఎడంగా ఉంటాడు అనేది. వేల సంవత్సరాలుగా చదువు వాసన లేని మాదిగ కులం నుంచి వచ్చాడు కదా, బహుశా ఆ చదువుపై అతడికి అందుకే అంత ఆపేక్ష కావచ్చు. అమ్మ నవలను ఎప్పుడూ పక్కనే ఉంచుకునేవాడు అని చెప్తారు. ఎంతైనా అమ్మ నవల్లోని పావెల్ వలే అట్టడుగు కులం నుంచి ఎదిగి వచ్చిన కార్మిక వర్గ పుత్రుడు కదా నర్సప్ప అందుకే ఆ నవలని అంతగా ప్రేమించి ఉంటాడు.
1990 చివరి దశకంలో అరెస్ట్ అయినప్పుడు రెండు మూడేళ్ల పాటు చంచల్ కూడా జైల్లో జైలు జీవితాన్ని గడిపాడు. కానీ అక్కడ కూడా అతడు తన విప్లవ దీక్షను దృఢంగా వ్యక్తంచేశాడు. ఇంటరాగేషన్ చేస్తూ పోలీసులు సెల్లో బంధించి తల మీద చెప్పులతోటి ఏకదాటిగా 100 -150 దెబ్బలు కొట్టినా సరే, మీరు నన్ను కొట్టినా, చంపినా నా నుంచి నిజాలను రాబట్టలేరు. అని పోలీసులకు తెగించి చెప్పిన తెంపరి అతడు. జైల్లో ఉంటూనే అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్న కామ్రేడ్స్ కు వ్యవసాయ విప్లవం అనే అంశం మీద పాఠాన్ని బోధించాడు. అది అతడి ప్రతిభకు ఉదాహరణ అతడు జైల్లో ఉన్నప్పుడే శాఖమూరి అప్పారావు, బండి ప్రకాష్, మోడెం బాలకృష్ణ జైల్లో ఉన్నారు. వారితో గొప్ప స్నేహం అతడికి.
ఎంత చెప్పినా అతడి ధైర్యమే అత్యంత చైతన్యంతో కూడుకున్నది. జైలు నుంచి నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో తన మీద నమోదు అయిన కేసుల విషయంలో కోర్టుకు వస్తూ సంకెళ్ళలో బంధించబడి కూడా పీపుల్స్ వార్ పార్టీ జిందాబాద్, ఎన్కౌంటర్లన్నీ బూటకపు హత్యలే, వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, అంటూ గోడలు దద్దరిల్లేలా నినాదాలు ఇచ్చాడు. తన కేసును తనే వాదించుకుంటానని జడ్జి ముందు ప్రతిపాదన పెట్టాడు. అంతేందుకు మార్గమధ్యంలో పోలీసుల మధ్య నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అప్పటి పార్టీ నాయకుల నిర్ణయం ప్రకారం విప్లవ ఖైదీలు తప్పించుకొని పోతే, కింది స్థాయి పోలీసు ఉద్యోగుల ఉద్యోగాలు పోతాయి కనుక మనం ఆ కీడును వారికి చేయకూడదు అనే సూత్రాన్ని ఆచరించి, అట్లా తప్పించుకొని పోలేదు. అంతటి నిబద్ధుడు కర్రెo నర్సప్ప.
ఎక్కడ ఉన్నా అతని ధ్యాసంతా విప్లవమే. ఎట్లా బతికినా అతడి మనసంతా సమసమాజ స్వప్నమే. అందుకనేమో జైలు నుంచి కోర్టుకు వస్తున్న క్రమంలో నల్లమల కొండలను చూస్తూ.. పక్కన ఉన్న సహచర ఖైదీకి ఇంకా ఎంత కాలమే ఈ బందిఖానా జీవితం? నల్లమల కొండలు పిలుస్తున్నాయి అనేవాడు. ఎప్పుడెప్పుడు ప్రజల మధ్యకు వెళ్దామా ఎప్పుడు రణరంగంలో సాయుధులమై ముందుకురుకుదామా అనే తపన అతడిది.
తరాల పల్లె కౌముది తల్లికి రాసిన ప్రేమతో కవిత చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది గానీ.. ఓ సమయంలో నర్సప్ప అరెస్ట్ అయ్యి పోలీసుల చెరలో చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటూ…బయటకు వెళ్ళేందుకు దారిని వెతుకుతున్న క్రమంలో తనని పరామర్శించడానికి వచ్చిన తన తల్లిని గొడ్డు మాంసంలో ఎక్కువగా కారం వేసుకొని వండుకొని రమ్మని పురమాయించాడు. అట్లా కారపు మాంసం తిని విరోచనాలు కలిగేలా చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యి, అక్కడ డాక్టర్ను ఒప్పించుకొని తిరిగి అడవిలోకి వెళ్ళిపోవడము అనే అతని ప్లాన్ ఎంత విప్లవాత్మకమైనది.. ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రచారంలోకి రాలేదు.
అన్ని మానవ సంబంధాలు, ప్రేమలు విప్లవ ప్రయోజనాలకే లోబడి ఉండాలని పుస్తకాల్లో చదువుకోవడమో, నల్లా ఆదిరెడ్డి, గజ్జెల సరోజల జీవితాల్లో చదువుకుంటాము గానీ నర్సప్ప తన తండ్రి మరణించి, దిక్కులేనిది గా మారిన తన తల్లిని కూడా వర్గ దృష్టితోనే చూసాడు. తను నమ్మిన విప్లవం కోసం భిక్షాటన చేసే తల్లిని కూడా ఒంటరిగా వదిలి అందరికోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు నర్సప్ప జైలు నుంచి తండ్రి అంత్యక్రియలకు వచ్చినప్పుడు విలేకరులు ప్రశ్నిస్తూ
“ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, మీ అమ్మకు దిక్కులేక ఒంటరిదయ్యింది , నువ్వేమో విప్లవోద్యమంలో వున్నావ్, ఇప్పుడు నిన్ను వదిలిపెడితే ఇంటి దగ్గర ఉండి మీ అమ్మను చూసుకుంటావా? తిరిగి ఉద్యమంలోకి పోతావా” అని.
దానికి ఆయన చెప్పిన సమాధానం…
“నన్ను ఇప్పుడు వదిలేసినా నేను ఉద్యమంలోకే వెళ్తాను. ఎందుకంటే సమాజంలో మా అమ్మ లాంటి తల్లులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా మా అమ్మలాగే ఏ దిక్కూ లేదు. వాళ్ళందరూ విముక్తి అయినప్పుడే
నా తల్లికి కూడా విముక్తి ఉంటుంది .కనుక నేను మళ్ళీ విప్లవం లోకే వెళ్తాను అని. ఎంత మార్క్సిస్టు చైతన్యం ఇది! ఎంతటి ఆచరణీయ జీవితమది
పుట్టిన ఊరు పట్ల ఎనలేని ప్రేమను కలిగి ఉండే విప్లవకారుల జీవితాలను పుస్తకాల్లోనో సినిమాల్లోనో చూస్తాం కానీ నర్సప్ప శత్రువు పట్ల ఎంత కఠినుడో పుట్టిన ఊరు పట్ల, తన స్నేహాల పట్ల అంత ప్రేమ గలవాడు. ఒకనాడు దట్టమైన అడవిలో తన సహచర ఉద్యమ మిత్రుడిని, తన ఊరి వాడిని “శంకర్ ఈ మధ్య మన ఊరికి ఏమైనా వెళ్ళొచ్చావా? అని భుజం మీద చేటీ చేయి అడిగాడు ప్రతిగా అతను.. లేదన్నా నేను ఎందుకు వెళ్తాను? అక్కడ నాకేమీ పని?అన్నాడు దానికి సమాధానంగా నర్సప్ప ఇంత కఠినంగా నువ్వు ఎలా ఉంటావు శంకర్?అని కళ్ళనిండా దుఃఖంతో స్పందించాడట
అది అతని హృదయం…మానవీయ స్పందన. ఊరికోసం వాడకోసం దేశం కోసం సమస్త పీడిత జన విముక్తి కోసం అజ్ఞాతంలోకి వచ్చిన విప్లవకారుడి స్పందన అది.
మాదిగ వాడలో పుట్టి నిప్పు రవ్వలా దోపిడీ చితిని తాకిన కర్రెo నర్సప్పను తయారు చేసింది నల్లమల విప్లవోద్యమం కాదా? అతడి ద్వారా ప్రత్యక్షంగా, నల్లమల ద్వారా పరోక్షంగా ప్రేరణ పొంది వివిద రంగాల్లో, రూపాల్లో పనిచేస్తు చలనంలో ఉన్నవారు నల్లమల ఉద్యమ ప్రతిబింబాలు కాదా?
చాలా మంది అగ్రకులత్వం ఇంకా వదులుకోని, వర్గేతర లక్షణాలను ఇంకా వదులుకొని మహా మేధావులు రచయితలు అన్నట్టు నల్లమల్ల ఉద్యమం ఏమి మిగిల్చుకోలేదు అనుకుంటే, అది వారి అంధత్వానికి, చెవుడు నటించే కుట్రకు పరాకాష్ట అవుతుంది. నల్లమల్ల ఉద్యమం ఎలాంటి నిప్పు రవ్వలను వెలిగించిందో నర్సప్ప ఒక ఉదాహరణ మాత్రమే. అతడి గద్వాల పోరాటం ,వనపర్తి పోరాటం, పాలమూరు పోరాటం, అప్పర్ ప్లాట్ ఏరియా పోరాటం ,అతడి చిట్టచివరి యాక్షన్ అవన్నీ నల్లమల్ల ఉద్యమం నీడలో రాజుకున్న కొలిమికి ఒక ఉదాహరణ మాత్రమే. నల్లమల్ల దెబ్బతిని ఉండొచ్చు. కానీ ఆ ఉద్యమానికి మరణం లేదు. కర్రెo నర్సప్పకూ మరణం లేదు.



