ఈ మధ్యకాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆయా వర్గ ప్రజలలో ఆందోళనలు రేకెత్తించాయి. ఈ తీర్పులు  సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కేవలం సాంకేతిక అంశాలపై కాకుండా అవి సహజ న్యాయానికి అనుగుణంగానూ, హేతుబద్దంగానూ ఉండాలన్న అభిప్రాయం ఆయా వర్గ ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

 ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దళితులు మతం మారితే వారి యొక్క ఎస్సీ,  ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని చెప్పడం జరిగింది. ఈ తీర్పు వలన తక్షణం అన్యాయానికి గురయ్యేది దళిత క్రైస్తవులు. పుట్టుకతో దళితులుగా పుట్టి తదనంతరం క్రైస్తవులుగా మతం మారిన వారు ఇప్పుడు వారు పొందిన రిజర్వేషన్ సౌకర్యం భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవడమే కాకుండా,  ఆ రిజర్వేషన్ సౌకర్యాన్ని వారు కోల్పోవడం జరుగుతుంది. ఈ తీర్పు పై అన్ని వైపుల నుంచి నిరసన వ్యక్తం కావడం జరుగుతుంది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని నియమించడం జరిగింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తున్న దళిత, వామపక్ష, ప్రజాస్వామ్య వాదుల అభిప్రాయం ఏమిటంటే, సామాజిక వెనుకబాటుతనం నుంచి వారి అభివృద్ధి కోసం ఏర్పరిచిన రిజర్వేషన్లు, మత ప్రాతిపదికపై రద్దు చేయడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదన హేతుబద్ధమైనదని చెప్పవచ్చు.

ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన మరో వివాదాస్పదమైన తీర్పు ఏమిటంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యా హక్కు చట్టం – 2009 అమలులోనికి వచ్చిన తేదీ నుంచి ఎవరైతే సర్వీస్ లోనికి వచ్చి ఉంటారో, వారు టెట్ పరీక్షను రెండు సంవత్సరాలలోపు పాస్ కావాలని, అలా పాస్ కాని వారికి ప్రభుత్వం పదోన్నతులు నిరాకరించడమే కాకుండా వారు ఉద్యోగానికి కూడా అనర్హులని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు పై దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనకు గురికావడం జరిగింది. వారు రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టులో వేసినప్పటికీ న్యాయమూర్తుల మనసు మారలేదు. ప్రభుత్వాలు కూడా మిన్నకుండిపోయాయి. అయితే ఈ తీర్పులోని అసంబద్ధమైన అంశాలు ఏమిటంటే, ఈ తీర్పుకి ముందు సర్వీసులోనికి వచ్చిన ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయడం, అంతే కాకుండా ప్రభుత్వ రంగ పాఠశాలలతో సమానంగా గత నాలుగు దశాబ్దాల నుంచి ప్రైవేటు రంగంలోని అన్ -ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు వర్తింపచేయకపోవడం, గతంలో కేవలం ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష వెయిటేజ్ కోసం నిర్వహించిన టెట్ పరీక్ష ఇప్పుడు ఇన్-సర్వీస్ టీచర్లకి కూడా గుదిబండగా మారింది.

ఇది ఎలా ఉంటే ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల కారుణ్య నియామకాలలో ఇచ్చిన తీర్పు మరింత ఆశ్చర్యంగా ఉంది. అదేమిటంటే, ఇకపై కారుణ్య నియామకాలు కేవలం కాంట్రాక్టు, పొరుగు సేవల విధానంలోనే జరపాలని, ఇంతవరకు  పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు కూడా ఈ నిబంధనను వర్తింప చేయాలని తీర్పునిచ్చారు. అసలు కాంట్రాక్ట్, పొరుగు సేవల విధానమే అసంబద్ధమైనది. వెట్టి చాకిరీకి ఇది మరోరూపం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. అటువంటి విధానాన్ని రద్దు చేయవలసిన న్యాయస్థానాలు ఈ విధంగా కారుణ్య నియామకాలకు వర్తింప చేస్తూ తీర్పునివ్వడం విడ్డూరంగా ఉంది.  ఇప్పటికే ఈ తీర్పు పై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పై విషయాలు మనకు తెలియజేస్తున్నదేమంటే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పాలకులు దళిత, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అలంబిస్తున్నారు.  వీటికి తోడుగా  పుండు మీద కారం చల్లినట్లుగా సుప్రీం కోర్టు, హైకోర్టులు ప్రజావ్యతిరేకమైన, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా తీర్పులు  ఇవ్వడం వలన, పాలకవర్గాలకు మరింత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించటానికి దోహద పడినట్లు అయింది. కావున దళితులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ కోర్టు తీర్పులను వ్యతిరేకిస్తూ, ఈ తీర్పులపై చట్ట సవరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, పోరాడవలసిన అవసరం ఏర్పడింది.

——- పేడాడ కృష్ణారావు,

 గౌరవ అధ్యక్షులు,

డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, శ్రీకాకుళం.

Leave a Reply