ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీల్లో సైతం ప్రభుత్వమే పూర్తి ట్యూషన్ ఫీజును చెల్లించేది.  దీంతో తెలంగాణలో వందల కళాశాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నాణ్యత లేని ఇంజనీంగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు‌ కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో మెజారిటీ కళాశాలలు పాలక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులవే. 2014 అనంతరం రాష్ట్రంలో పాలకులు మారడం, ఏళ్ళుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల్లో చదివిన, చదువుతున్న విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలల్లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు ఫీజు బకాయిలు పదకొండు కోట్ల రూపాయలు పై చిలుకు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా‌ నెలకు రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేస్తూ కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ తీరు గమనిస్తే ఇకముందు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించకుండా విద్యార్థులపై భారమేయాలనేది స్పష్టమవుతోంది. 2021 నుంచి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరుగుతూ వచ్చాయి. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి ఏడువేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాంగ్రెస్  అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తామని, పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన  పాలకులు అధికారంలోకి వచ్చాక మొత్తం బకాయిలలో 10% కూడా చెల్లించలేదు. ఈ రెండున్నరేళ్లలో పెండింగ్ బకాయిలు మరో  నాలుగు వేల కోట్లు పెరిగి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి‌ పాత బకాయిలతో  కలిపి మొత్తం బకాయిలు 11,200 కోట్లకు చేరింది.

బకాయిల చెల్లింపుల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. 2025లో తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాలు సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా కళాశాలలు మూసివేస్తామని ప్రకటించాయి. ప్రభుత్వంతో చర్చల అనంతరం 1,200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గత ఏడాది అక్టోబర్ 1, నాడు కేవలం 300 కోట్లు విడుదలయ్యాయి. అయితే తర్వాత దసరా సమయంలో మళ్లీ నిరసనలు ఉధృతం కావడంతో ప్రభుత్వం మరో 200 కోట్లు విడుదల చేసింది. మొత్తం గతేడాది ఐదువందల కోట్లు మాత్రమే విడుదల చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఒక వైపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని లేని యెడల పరీక్షలకు అనుమతించమని విద్యార్థులను వేదిస్తూ ఉసురుపోసుకుంటున్నారు. మరో వైపు ప్రభుత్వంతో కుమ్మక్కై సమ్మెలు విచ్చిన్నం చేసి విద్యార్థులనే బలిపశువును చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో పలుమార్లు సమ్మె నోటీసు ఇచ్చి డిమాండ్ నెరవేరకుండానే విరమించారు. ప్రభుత్వం- ప్రైవేటు విద్యా సంస్థల మధ్య నలిగిపోతున్నది విద్యార్థులే.

ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యూషన్ ఫీజు విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించి జీవో-7 ను విడుదల చేసింది. ఈ జీవోలో పేర్కొన్నట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వేస్తామని ఇందులో పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని విద్యార్థులు తప్పనిసరిగా వారంలోపు కాలేజీలకు చెల్లించాలని, అలా చెల్లించని విద్యార్థుల తల్లిదండ్రులపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేస్తామని తెలిపింది. పాత బకాయిలు విడతలవారీగా చెల్లిస్తామని, విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతించబోమని అందులో బుకాయించింది. జివో విడుదలకు పరిమితమైన సర్కారు నిధులు విడుదల చేయలేదు. దీంతో యాజమాన్యాలు‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వంపై  ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం చెల్లించనప్పుడు విద్యార్థుల నుంచి కాలేజీలను వసూలు ఎందుకు చేసు కోనివ్వరని ప్రశ్నిస్తూ జీవో-7పై మే నెలలో హైకోర్టు స్టే విధించింది.2026,జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై  గతంలో విడుదల చేసిన జీవో-7ను ఉపసంహరించకుంది. దాని స్థానంలో జీవో-8 విడుదల చేసింది. కోర్సుఫీజు ను ఏడాదికి 4 విడతల్లో విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని అందులో పేర్కొంది.దాంతో పాటు ఫీజు విడుదలకు సంబంధించన మార్గదర్శకాలకై జివో నెంబర్ 9 జారీ చేసి  అడ్మీషన్ సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలో జమ చేసిన తర్వాతనే తీసుకోవాలని  చెప్పింది. ఈ 8,9 జీవోపై మళ్ళీ యాజమాన్యాల అభ్యంతరం మేరకు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులతోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల ఫీజులను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫీజుల చెల్లింపునకు ప్రభుత్వ హామీ నేపథ్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి ఫీజు వసూలుకు పట్టుబట్టకుండా అడ్మిషన్‌లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారమే ఫీజులు వసూలు చేసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేశారు. అయితే వాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రైవేటు యాజమాన్యాలు “ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటికైనా మీ ఖాతాలలో జమ అవుతుంది కాబట్టి మొత్తం ఫీజుల చెల్లించాలని ” విద్యార్దులను ఒత్తిడి చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలలో నిధులు వేస్తామని చెప్పడం పరోక్షంగా విద్యార్థులనే ముక్కు పిండి ఫీజు వసూలు చేయాలని ప్రైవేటు విద్యా సంస్థలకు సూచించడమే‌ అవుతుంది. ఇంతకంటే మోసం, దగా మరొకటి లేదు.

2021-2022 నుండి పదకొండు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా ఈ పథకాన్ని అమలు చేస్తామనడం తగదు. వెంటనే పెండింగ్ నిధులు విడుదల చేసి ఆ తర్వాత ప్రైవేటు విద్యా సంస్థలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడపాలి.

ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో ఇన్నాళ్లు ప్రజా సంపదను ప్రైవేటు యాజమాన్యాలకు దోచిపెట్టిన ప్రభుత్వం  నేడు మళ్ళీ ఆ పథకం అమలు పేరుతో  నేరుగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోపిడీ చేసేందుకు ప్రైవేటు యాజమాన్యాలకు దారులు తెరవడం అన్యాయం. ఇంకా ఈ పథకంతో విద్యార్థులకు ప్రయోజనం ఉందని చెప్పడం మోసం, వట్టి బూటకం. ఈ పథకం ముమ్మాటికి దోపిడీ శక్తుల కొరకే అనేది స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం – ప్రైవేటు విద్యా సంస్థలు కుమ్మక్కై మోసం చేస్తున్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీ, ప్రభుత్వ మోసకారి వైఖరిని ఎండగట్టాలి. ఇక మీదట ఉన్నత విద్యలో ప్రైవేటు విద్యకు స్వస్తి చెప్పి రీయింబర్స్మెంట్ నెట్వర్క్ కళాశాలలను ప్రభుత్వమే టేకోవర్ చేసి నడిపించాలి. ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి. అలా చేస్తేనే ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు,వాటిపై ఆధారపడి బతుకుతున్న భోధన బోధనేతర సిబ్బందికి న్యాయం జరుగుతుంది.

-కోట ఆనంద్, ప్రొగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్

16-07-2026

Leave a Reply