తెలంగాణ సర్కారు ఏడాదిన్నర క్రితం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అకునూరి మురళి, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు మరియు ఇద్దరు సభ్యుల ఆద్వర్యంలో తెలంగాణ విద్యా కమీషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన అధ్యయనంలో రాష్ట్రంలో విద్యా వెనుకబాటును స్పష్టంగా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో ప్రస్తుతం విద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి విద్యారంగం వెనుకబాటు నుండి బాగు చేయడానికి పలు సిఫార్సులు చేసింది. కేంద్రంలో ఎన్డిఏ సర్కారు రూపొందించిన నూతన విద్యా విధానం-2020లోని అశాస్త్రీయ విధానాలు తిరస్కరించాలని, ఉచిత నిర్బంధ విద్య బోధనను 18 ఏళ్ల వరకు పెంచాలనే సిఫార్సులు వీటిలో అత్యంత అవసరమైనవి. రాష్ట్రంలో నేడు అమలవుతున్న విద్యావిధానం విషయంలో కఠోర వాస్తవాలను ఈ రిపోర్ట్ వ్యక్తం చేసింది. బడి బయట వున్న పిల్లల నుండి అసలు బడి అంటే ఏంటో తెలవని వారి సంఖ్యను కూడా వాస్తవాల రూపంలో వెలుగులో తెచ్చింది. ఈ వాస్తవాలే ఇప్పటి ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి.
వంద మంది విద్యార్థులలో 26 మంది మాత్రమే ప్రభుత్వ బడులలో చేరుతున్నారని సగానికి ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నారని, ప్రభుత్వ రంగంలో 36% శాతం ఏకోపాద్యాయ బడులు కాగా, 86 % బడులలో అన్ని తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చొపెట్టి విద్య బోధన జరుపుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని, కనీస సౌకర్యాలు లేవని తేల్చారు. నాణ్యమైన విద్య బోధనలో మన స్థానం 26 అని, మూడవ తరగతి విద్యార్థులు కింది తరగతి పుస్తకం కూడా చదవలేని వెనుకబాటు తనం ఉందని, ఇంకా ఉన్నత విద్య సంస్థలకు 77% కళాశాలకు న్యాక్ గుర్తింపు లేకపోవడం యూనివర్సిటీల్లో 80% ఖాళీలలతో భ్రష్ఠు పట్టించిన విషయం కుండ బద్దలు కొట్టడంతో మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పాలకులకు ఈ నివేదికలోని సిఫార్సులు ఎలా మింగుడుపడతాయనేది ప్రజలు చర్చించుకుంటున్నారు.
నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక అమలుపై స్పష్టత ఇవ్వకపోగా కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే ఉపాధ్యాయుల వేతనాల విషయంలో మురళి కమీషన్ సిఫార్సులను, ఉపాధ్యాయుల పదోన్నతుల అంశం ముందుకు తెచ్చి మెజారిటీ ప్రజలకు ఉపయోగకరమైన సిఫార్సులు అమలు చేయకుండా తొక్కి పెట్టింది అనేది వాస్తవం. నిజానికి దేశంలోని అన్ని రంగాలలో ప్రైవేటీకరణ వేళ్లూనుకున్న నేపథ్యంలో విద్యా కమీషన్ తనకున్న పరిమితులతో ఆచరణలో సాధ్యాసాధ్యాలు పరీశీలించి నివేదికను విడుదల చేసింది. ఆందుకే ప్రైవేటు విద్యా వ్యవస్థను ఒకే సారి రద్దు చేయాలనే డిమాండ్ నుంచి పక్కకు జరిగి ప్రభుత్వరంగ విద్యలో నాణ్యత పెంచి బాగు చేయడమే లక్ష్యంగా తన నివేదికను సమర్పించిందని భావించవచ్చు. ఈ కమీషన్ ప్రజలందరికీ ఒకే రకమయిన విద్య అందించాలనే కామన్ స్కూల్ విద్య విధానంను సూచించనప్పటికీ ఈ కమీషన్ చేసిన సిఫార్సులు గమనిస్తే అందుకు ఒక ప్రయత్నం మాత్రం జరిగిందని భావించవచ్చు.
తెలంగాణలో పాఠశాల విద్య అంటే ప్రైవేటు విద్యనే అనే భావన నెలకొంది. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులకు టక్కున గుర్తొచ్చేది నర్సరీ, ఎల్కేజి, యూకెజి భోధన, ఇంగ్లీష్ మీడియం భోధన చేసే ప్రైవేటు పాఠశాలలే. ఈ రకమైన ప్రైవేటు భోదన మాత్రమే నిజమైన, నాణ్యమైన చదువుగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మురళి కమీషన్ ప్రభుత్వ రంగంలో కూడా నర్సరీ , ఎల్‌కెజి, యూకెజి లను బోధించే పూర్వ ప్రాథమిక విద్యను తీసుకరావలనడం, నర్సరీ నుండి పి.జి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్య బోధన జరపాలనడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలు కలిగినట్టి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో విస్తరించి ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాలని చెప్పడం, ప్రతి తరగతికి ఒక గది నిర్మాణం చేయాలనడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌళిక సదుపాయాల కల్పన, నిత్యం మానిటరింగ్ కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనడం వంటివి పేద, మద్యతరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరం. పాఠశాల విద్యలో మరో సిఫార్సు ఆయా సొసైటీలుగా కొనసాగుతున్న గురుకుల విద్య సంస్థలను ఒకటిగా కలపడం. కుల వ్యవస్థను సుస్థిరం చేస్తున్న ఆయా కులాల గురుకులాలను కలిపి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ పౌరసమాజం నుంచి వచ్చినదే. ఈ నివేదికలోని ఈ సిఫార్సు చేయడం అత్యంత కీలకమైనదిగా భావించవచ్చును.
ఇక ఇంటర్మీడియట్ విద్యలో చేసిన సిఫార్సులను పరిశీలిస్తే మెజారిటీ సిఫార్సులు ప్రైవేటు కళాశాలల, కోచింగ్ సెంటర్ల దోపిడీని అరికట్టేవే. ప్రైవేటు పాఠశాలల మరియు జూనియర్ కళాశాలలో ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించాలని సిఫార్సు చేయడం ఆహ్వానించదగ్గది. నేటికి ఇంటర్మీడియట్ విద్యలో ఫీజుల వసూలు నియంత్రణకు ఒక విధానం అంటూ ఏది లేదు. ఐఐటి, నీట్ వంటి పోటి పరీక్షల విషయంలో జరుగుతన్న అవినీతి, వ్యాపారం నియంత్రణకు చట్టాలలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడం, రాష్ట్ర స్థాయి లో జరిపే ఈఎపిసెట్ ప్రవేశ పరీక్ష రద్దు చేసి నేరుగా ఇంటర్మీడియట్ మార్కులతో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర డిగ్రీ కోర్సులలలో అడ్మిషన్లు ఇవ్వాలనడం చాలా ఏళ్ళుగా ప్రగతిశీలవిద్యార్థి సంఘాలు, ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నట్లు ఒక విద్యార్థి ఎన్ని పరిక్షలు రాయాలి ? ఒక అర్హత పరీక్ష చాలు అనే డిమాండ్ ను ముందుకు తేవడమే. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులు విలీనం చేసి తరగతుల విధానం తీసుకురావడం అనేది ఫిన్లాండ్, ఫిలిపీన్స్, జపాన్ వంటి విద్యాభివృద్ధి చెందిన దేశాల్లోని విద్యార్థులపై ఒత్తిడి లేని భోధన విధానంను ఇక్కడ పరిచయం చేయడం, పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మూడు సార్లు బోర్డు పరీక్షలు హాజరయ్యే క్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఒత్తిడి లను కూడా మనం గమనించాలి. అసలు పరీక్ష విధానమే సరికాదనే అవగాహనతో ఆలోచిస్తే ఈ విషయంలో సమాధానం దొరుకుతుంది. ఈ సిఫార్సులు ర్యాంకులు పేరుతో ప్రకటలిచ్చి విద్య వ్యాపారం చేస్తున్న కార్పోరేట్, ప్రైవేటు విద్య సంస్థల నడ్డివిరిచేవే. వారి వ్యాపారాన్ని అరికట్టేవే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ సిఫార్సులు అమలుచేసి విద్య వ్యాపారం అరికట్టాలి. ప్రైవేటు పాఠశాలు, ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించాలనే కమీషన్ సిఫార్సులు ఈ విద్య సంవత్సరము అమలు చేస్తామని నేటికీ చట్టం రూపొంచకుండా మళ్ళీ ఈ అంశంపై మరో మంత్రుల కమిటీ వేశారు. ఇది ప్రైవేటు విద్య దోపిడీని కొనసాగించడమే అవుతుంది.
ఇక ఉన్నత విద్యలో లోపాభూయిష్టమైన విధానాలను, పాలకుల నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతున్న ఈ నివేదిక విద్యార్థులకు భారంగా మారిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రద్దు చేయాలనడం, విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలనడం, ప్రొఫెసర్ల నియామకాలు జరపాలని చెప్పడం, ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలుగా మార్చడం, ఐటిఐ లను అప్ గ్రేడ్ చేయడం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అనుబంధంగా హాస్టళ్ల ఏర్పాటు చేయాలని చెప్పడం వంటి సిఫార్సులు విద్యార్థులకు ఉపయోగకరమైనవే. కమీషన్ సూచించిన విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు పన్నెండవ తరగతిలో 45% పెంచడం, పి.జి లో 50% విషయంలో పునరాలోచన చేయాల్సింది. ఎందుకనగా విద్య బోధనలో నాణ్యత ప్రమాణాలను మెరుగు పడకుండా, మౌళిక సదుపాయాల కల్పన అభివృద్ధి కాకుండా విద్యార్థులలో స్కిల్, విద్య అభ్యాసం మెరుగుపడవు. ఈ ప్రతిపాదన మరో పదేళ్ల తర్వాత సాద్యం కావచ్చు. వైస్ చాన్సలర్ల నియామకాల్లో ప్రభుత్వ జోక్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయా వర్సిటీ పాలక మండళ్ళలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం అనవసరమైనది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు దొర్లినప్పటికీ వీటిని సాకుగా చూపి మొత్తం నివేదికను తిరస్కరిస్తే తక్షణంగా మెజారిటీ పేద మధ్యతరగతి విద్యార్థులకు, బడుగుబలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం అవుతుంది. ఈ నివేదిక అమలైతే గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ప్రజల మధ్య చర్చకు ఉంచి ఉపయోగకరమైన సిఫార్సులు అమలు చేయాలని అడగడంతో పాటు సమాన శాస్త్రీయ విద్య సాధన దీర్ఘకాలిక లక్ష్యంగా ప్రజలు, విద్యార్థులు ఉద్యమించాలి. అందులో భాగంగా తక్షణమే మురళి కమీషన్ చెప్పినట్లు విద్యారంగానికి 18% నిధులు మంజూరు చేయాలి. ఈ నిధులు ప్రతి ఏడాది పెంచుతూ వార్షిక బడ్జెట్లో 30%కు పెంచాలి. షెడ్యూల్ ఐదు ఆదివాసీ ప్రాంతాల్లో స్థానిక భాషలో విద్య బోధన జరపడం, ఆయా వెనుకబడి జిల్లాల్లో ఉన్నత విద్య సంస్థలు ఏర్పాటు చేయడం అవసరం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కె.కెశవరావు చైర్మన్ గా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది . ఆ కమిటీ ఈ ఏడాది తెలంగాణ నూతన విద్యా విధానం రూపొందిస్తామని మురళి కమీషన్ సిఫార్సులను అమలు చేయబోము అని ప్రకటించిన నేపథ్యంలో ఆకునూరి కమిటీ నివేదికలో బడుగు బలహీన వర్గాల పేదలకు ఉపయోగపడే సిఫార్సులు తెలంగాణ నూతన విద్య విధానంలో చేర్చాలని, ప్రభుత్వ విద్య బలోపేతానికి ఆ కమీషన్చేసి సిఫార్సులను పరిగణలోకి తీసుకొని నూతన విద్యా విధానం రూపొందించాలని విద్యార్థులు, ప్రజలు ఉద్యమించాలి. లేని యెడల పేద, మద్యతరగతి మెజారిటీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
31-05-2026
-కోట ఆనంద్, ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్
.




