2026 మే 18

తరచుగా జరుగుతున్నట్లే, చారిత్రాత్మక కమల్ మౌలా మసీదు ఒక హిందూ దేవతకు అంకితం చేసిన దేవాలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది’.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌లో ఉన్న కమల్ మౌలా మసీదు 78 ఏళ్ల మహమ్మద్ రఫీక్‌కు మరో ఇల్లు.

రఫీక్ 50 ఏళ్లుగా ఆ మసీదులో ముస్లింలను ప్రార్థనకు పిలిచే ముఅజ్జిన్‌గా ఉన్నారు. అతనికి ముందు 1947లో భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం రాకముందే అతని తాత హాఫిజ్ నజీరుద్దీన్ ప్రార్థనలను నిర్వహించేవారు.

కానీ పురావస్తు ప్రాముఖ్యత కలిగిన, సంరక్షిత స్మారక చిహ్నమైన భోజ్‌శాల సముదాయంలోని మసీదులోకి ఇప్పుడు ధార్‌లోని రఫీక్‌కు, ఇతర ముస్లింలకు ప్రవేశం లేదు.

ఆ స్థలంలో మసీదు కంటే ముందే ఒక దేవాలయం ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పైన మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. ఆ మధ్యయుగపు సముదాయం ఒక హిందూ దేవతకు అంకితం చేసిన ఆలయమని శుక్రవారం తీర్పు ఇచ్చింది.

మే 17 ఆదివారం నాడు, 13-14వ శతాబ్దానికి చెందిన ఆ స్మారక చిహ్నం, తీవ్ర హిందూ ఆధిపత్య “హిందుత్వ”తో ముడిపడి ఉన్న కాషాయ జెండాలతో నిండిపోయింది. యువకులు భక్తి గీతాలకు నృత్యం చేస్తూ, ఆ కార్యక్రమాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య, హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడగా, స్థానిక కార్యకర్తలు దేవత తాత్కాలిక విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ధార్ అనే సాధారణ పట్టణంలోని కమల్ మౌలా మసీదు ఒక్కటే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం లేదు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంతో మరింత ధైర్యం పుంజుకున్న అతివాద  హిందుత్వ కార్యకర్తలు, ఫలానా మసీదును దేవాలయం పైన నిర్మించారని భారతదేశం అంతటా ఇలాంటి వాదనలే చేస్తున్నారు.

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ కూడా ఇస్లామిక్-యుగపు కట్టడాల కింద దేవాలయ మూలాలను కనుగొనే హిందుత్వ ఉద్యమం నుండి తప్పించుకోలేకపోయింది. తాజ్ మహల్ ఒక మసీదు కాకుండా సమాధి అయినప్పటికీ, దాని 17వ శతాబ్దపు మొఘల్ మూలాలు దానిని కూడా ఒక వివాదాస్పద అంశంగా మార్చాయి.

భారతదేశంలోని రఫిక్ వంటి లక్షలాది మంది ముస్లింలకు ఈ జ్ఞాపకాల తుడిచివేత తీవ్రమైన బాధను కలిగిస్తుంది. “గత శుక్రవారం వరకు ఈ మసీదు మాది; ఈ రోజు అది మాది కాదు,” అని అతను బలహీనమైన స్వరంతో అన్నాడు. “ఇలాంటిది జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.”

పాతుకుపోయిన ఇస్లామోఫోబియా :

కమల్ మౌలా మసీదు ఉన్న స్థలం, లేదా భోజ్‌శాల సముదాయం అని పిలవబడే ప్రాంతం దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉంది. 1950ల చివరలో ఈ స్థలంపైన తొలి హిందూ జాతీయవాదులు తమ హక్కులను ప్రకటించారు.

చారిత్రక కట్టడాల పరిరక్షణ బాధ్యత కలిగిన ప్రభుత్వ సంస్థ అయిన భారత పురావస్తు శాఖ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో -ఎఎస్‌ఐ) 2003లో కుదిరిన ఒప్పందం ప్రకారం హిందువులు ప్రతి మంగళవారం ఈ స్థలాన్ని సందర్శించడానికి, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉండేది.

ఇప్పుడు కోర్టు తన తీర్పులో ఈ స్థలాన్ని వాగ్దేవి అంటే వాక్కు దేవత ఆలయంగా ప్రకటించి హిందువులు అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది.  ముస్లిం సముదాయ వాదనను తోసిపుచ్చింది.

కోర్టు తన తీర్పులో ముస్లిం సముదాయ పిటిషన్లను కొట్టివేసింది. అయితే జిల్లాలో మసీదు నిర్మించుకోవడానికి ప్రత్యామ్నాయ భూమిని వెతుక్కోవడానికి వారికి అనుమతినిచ్చింది.

రెండు సంవత్సరాల క్రితం ఈ కట్టడంపై ఎఎస్‌ఐ చేసిన సర్వేపైన కోర్టు ఎక్కువగా ఆధారపడింది. ఈ కేసులోని హిందూ పక్షాలు ఈ తీర్పును చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించాయి. సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేస్తామని ముస్లింలు ప్రతిజ్ఞ చేశారు.

“విద్వాంసులు అంతర్జాతీయ విద్వత్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే పద్ధతి, ఖచ్చితత్వం, నిర్ధారణల కోసం చూస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత, నాసిరకమైన సర్వేలకు పెద్దగా విలువ ఉండదు,” అని ఎఎస్ఐ కార్యకలాపాలను ప్రస్తావిస్తూ, భారత ఉపఖండంపైన దృష్టి సారించిన చరిత్రకారిణి ఆడ్రీ ట్రష్కే అన్నారు.

“భారతదేశంలో మసీదులను లక్ష్యంగా చేసుకునే ప్రస్తుత ధోరణి హిందూ జాతీయవాదంలో పాతుకుపోయిన ఇస్లామోఫోబియాలో భాగం” అని ఆమె అల్ జజీరాతో అన్నారు.

“ముస్లిం సమాజాలను వేధించడానికి, బెదిరించడానికి, హాని చేయడానికి హిందూ జాతీయవాదులు ఉపయోగించే అనేక మార్గాలలో ఇది ఒకటి. ముస్లింల మత స్వేచ్ఛను పరిమితం చేయడానికి భారతదేశం చేస్తున్న నిరంతర ప్రచారాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి,” అని ట్రష్కే జోడించారు.

వరద గేట్లను తెరిచారు :

ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి ధర్మాసనం ఒక అడుగు ముందుకేసిందని ముస్లిం పక్ష వాదులు, కోర్టు తీర్పు విమర్శకులు అంటున్నారు.

అల్ జజీరా సమీక్షించిన ఆగస్టు 1935 నాటి ఒక అధికారిక గెజిటెడ్ నోటీసులో అప్పటి ప్రభుత్వ అధికారులు ముస్లిం ప్రార్థనలపై ఎటువంటి నిషేధం లేదని, ఆ సముదాయం “ఒక మసీదు, భవిష్యత్తులో కూడా అది మసీదుగానే ఉంటుంది” కాబట్టి ప్రార్థనలు కొనసాగుతాయని రాశారు.

కానీ ఆ బ్రిటిష్ కాలం నాటి నోటిఫికేషన్ ప్రస్తుత చట్టాల కంటే ముందు నాటిదని పేర్కొంటూ కోర్టు దానిని అంగీకరించలేదు.

వివాదాస్పద స్థలంలోని ఆలయంలో ఉండాల్సిన వాగ్దేవి విగ్రహాన్ని ప్రస్తుతం లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారని హిందూ పక్షం చేసిన విజ్ఞప్తి మేరకు, ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకురావడాన్ని పరిశీలించాలని కూడా కోర్టు భారత ప్రభుత్వాన్ని కోరింది.

ఇక్కడ ప్రస్తావించిన విగ్రహాన్ని గరుకైన తెల్ల పాలరాయితో చెక్కారు. దీనిని ఆ దేవతకు ఉన్న మరో పేరుతో “అంబిక” అని పిలుస్తారు.

బ్రిటిష్ మ్యూజియం ఆ కళాఖండం గురించి ఇచ్చిన వివరణ ప్రకారం అది పరమర రాజవంశానికి చెందిదని  1875లో ధార్‌లోని సిటీ ప్యాలెస్ శిథిలాలలో బ్రిటిష్ మేజర్-జనరల్ విలియం కిన్‌కైడ్ దీనిని కనుగొన్నారని పేర్కొంది.

“ఆ వివరణతో పాటు ఉన్న పటంలో ‘కమల్ మౌలా మసీదు’ను సిటీ ప్యాలెస్ నుండి వేరుగా గుర్తించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది,” అని ఈ కేసులో ముస్లింల తరఫున వాదించిన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయవాది అషర్ వార్సీ అన్నారు.

“చారిత్రక ఆధారాలు ఆ విగ్రహం కమల్ మౌలా మసీదు ఉన్న ప్రదేశంలో దొరకలేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రతిపక్షం పచ్చి అబద్ధాలు చెబుతోంది,” అని వార్సీ అన్నారు.

ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వార్సీ “ఇది ఒక తప్పుడు తీర్పు. ఇది స్థిరపడిన చట్ట నియమాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే” అని కూడా అన్నారు.

ఆగష్టు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అన్ని ప్రార్థనా స్థలాల మతపరమైన స్వరూపాన్ని యథాతథంగా నిలిపివేసే భారతదేశ ప్రార్థనా స్థలాల చట్టం-1991ని ఆయన ప్రస్తావించారు. ‘మతపరమైన ప్రదేశాల స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించే ఎలాంటి కొత్త వాదనలనైనా నిరోధించడమే’ దీని ముఖ్య ఉద్దేశం.

“హైకోర్టు నిర్ణయం పూర్తిగా అసంబద్ధం, ఎందుకంటే ఎఎస్‌ఐ ఇప్పుడు హిందుత్వ శక్తులకు దాసిగా మారిపోయింది,” అని దక్షిణ భారత నగరమైన హైదరాబాద్ నుండి ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

“ప్రస్తుత ప్రభుత్వం గనుక మసీదులన్నింటినీ [దేవాలయాలుగా] మార్చాలని భావిస్తే, అది భారతదేశంలోని అతిపెద్ద మైనారిటీ సముదాయమైన ముస్లింల ప్రార్థనా స్థలాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని సందేశాన్ని పంపుతుంది,” అని ఒవైసీ ‘అల్ జజీరా’తో మాట్లాడుతూ పేర్కొన్నారు.

ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో ఉన్న 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పు ‘దుర్వాసన’ మధ్యప్రదేశ్ హైకోర్టు తాజా తీర్పులోనూ ‘ఘాటుగా వస్తోందని’ ఆయన వ్యాఖ్యానించారు.

“ఇటువంటి వాదనలు, తీర్పులు అన్నీ తెరపైకి రావడానికి మార్గాన్ని బాబ్రీ తీర్పు సుగమం చేసింది. ఇదంతా ఎక్కడ ముగుస్తుంది? కచ్చితంగా ధార్‌లోని కమల్ మౌలా మసీదుతో మాత్రం కాదు” అని ఆయన అన్నారు.

 బాబ్రీ కూల్చివేత హిందువుల ఆత్మాభిమానాగ్నిని రగిలించింది :

తమ ప్రధాన దైవమైన రాముడి జన్మస్థలమైన భూమిపైన, మొదటి మొఘల్ పాలకుడు బాబర్ కాలంలో ఒక ఆలయం ఉన్న స్థలంలో ఈ మసీదును నిర్మించారని వాదిస్తూ, భారతదేశంలోని హిందూ జాతీయవాద నాయకులు అతివాద మూకలకు నాయకత్వం వహించి 16వ శతాబ్దపు బాబ్రీ మసీదును కూల్చివేశారు.

1949 వరకు ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేసేవారు. ఆ తర్వాత హిందూ పూజారులు మసీదు లోపల విగ్రహాలను ప్రతిష్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కూల్చివేత దేశవ్యాప్తంగా హిందూ-ముస్లిం అల్లర్లకు దారితీసింది. ఈ అల్లర్లలో 2,000 మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలే.

సంవత్సరాల తరబడి జరిగిన తీవ్ర న్యాయ పోరాటం తర్వాత, రామ మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు వివాదాస్పదంగా ఆ స్థలాన్ని హిందువులకు కేటాయించింది.

2024 జనవరిలో జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఇది హిందుత్వ ఉద్యమంలో ఒక పెద్ద విజయానికి సంకేతం. “కాలచక్రం వెనక్కి తిరుగుతోంది, హిందువుల ఆత్మాభిమానపు రోజులు తిరిగి వచ్చాయి” అని ఆయన అన్నారు.

నిజానికి ఇతర చారిత్రక మసీదులపైన ఇలాంటి వాదనలే మోడీ బీజేపీకి ప్రధానాంశంగా ఉన్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని మరో రెండు పట్టణాలలో మసీదులను దేవాలయాలుగా పేర్కొంటూ, ఆ పార్టీ “అయోధ్య కేవలం ఒక చూపు మాత్రమే; కాశీ, మధుర మిగిలి ఉన్నాయి”  అనే నినాదాలను తమ ప్రచారంలో ప్రధానాంశంగా చేసుకుంది.

వారణాసిగా సుపరిచితమైన కాశీ మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం కూడా. 2024లో, వారణాసిలోని ఒక న్యాయస్థానం ఆ పట్టణంలో ఉన్న 17వ శతాబ్దపు జ్ఞానవాపి మసీదు కింద ఒక హిందూ దేవాలయం ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని, దాని లోపల హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

అయోధ్యలో జరిగిన దానిని మధురలో పునరావృతం చేయాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. తమ దేవుడైన శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలోనే మరో మొఘల్-యుగపు మసీదు అయిన షాహీ ఈద్గా ఉందని వారు వాదిస్తున్నారు.

ధార్ విషయానికొస్తే ఆదివారం వివాదాస్పద భోజ్‌శాల స్థలం వద్ద హిందూ భక్తులు చేరారు. అత్యున్నత పోలీస్ అధికారితో సహా జిల్లా పరిపాలన ఉన్నతాధికారులు హిందూ విగ్రహాల ప్రతిష్ఠాపన వేడుకలలో పాల్గొన్నారు.

ఈ కేసులో ఒక పక్షంగా ఉన్న స్థానిక హిందూ సంస్థ కన్వీనర్ గోపాల్ శర్మ ఆదివారం నాటి వేడుకలు తనకు ఒక పండుగలా అనిపించాయని, “ఇస్లామిక్ పాలకులచేత అవమానాలకు, ఆలయ కూల్చివేతకు గురైన మా దేవత గౌరవాన్ని పునరుద్ధరించడానికి మేము 720 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాము” అని అల్ జజీరాతో అన్నాడు.

1300వ దశకంలో ఒక ముస్లిం పాలకుడు ఆలయాన్ని ధ్వంసం చేశాడన్న ఆయన వాదనకు మద్దతు ఇచ్చే స్వతంత్ర చారిత్రక ఆధారాన్ని అల్ జజీరా కనుగొనలేకపోయింది.

“ఇది కేవలం ఒక స్మారక చిహ్నం కోసం జరిగిన పోరాటం కాదు. ఇది హిందూ నాగరికత కోసం జరిగిన పోరాటం. బాబ్రీ మసీదు కూలిపోయినప్పటి నుండి, అది హిందువులలో గర్వ భావనను రగిలించింది. ఆ విశ్వాసమే ఇప్పుడు దేశంలో హిందూ వ్యవస్థను స్థాపించడానికి మమ్మల్ని నడిపిస్తోంది,” అని ఆయన అన్నాడు.

“భారతదేశంలో లౌకిక రాజకీయాల నెపంతో ఇన్నేళ్లుగా మత సామరస్యం అనే దాన్ని సహించారు. ఇప్పుడు భారతదేశాన్ని లౌకిక రాజకీయాలు నడపడం లేదు. మోడీ హిందుత్వ నడుపుతోంది.”

కమల్ మౌలా మసీదు కేసుపై తీర్పు ఇచ్చేటప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు బాబ్రీ తీర్పును ఆదర్శంగా తీసుకుందని; రెండు సందర్భాల్లోనూ, మసీదు నిర్మించుకోవడానికి ముస్లిం పక్షానికి రాజీ ప్రత్యామ్నాయ భూములను కోర్టు వదిలిపెట్టిందని ఒవైసీ అన్నారు.

“బాబ్రీ తీర్పు; ఈ హైకోర్టు తీర్పు సాక్ష్యాధారాలు లేదా న్యాయం ఆధారంగా కాకుండా, ప్రజా విశ్వాసం ఆధారంగా నిర్ణయమయ్యాయి,” అని ఆయన అల్ జజీరాతో అన్నారు.

తెలుగు: పద్మ కొండిపర్తి

https://www.aljazeera.com/features/2026/5/18/hindu-order-runs-india-court-declares-another-medieval-mosque-a-temple

Leave a Reply