ఈ ఏడాది విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి. ఆయన శత జయంతి (జూలై 23, 2006)ని పురస్కరించుకుని పుస్తకం తీసుకురావాలని నిర్మలానంద ప్రయత్నించారు. పుస్తకం వెలువరించకుండానే వెళ్ళిపోయారు. ఆ బాధ్యతను ఇప్పుడు భుజానికి ఎత్తుకున్నాం. ఇందులో ప్రచురించిన వ్యాసాల్లో కొన్ని తెలుగు మాస, దిన పత్రికల్లో వచ్చినవే. రకరకాల కారణాల వల్ల పుస్తక రూపంలో రావడానికి 20 ఏళ్లు పట్టింది.
1970ల నుంచే భారతీయ విప్లవకారుల గురించి వ్యాసాలు, పుస్తకాలు సేకరించే అలవాటున్న నిర్మలానందగారికి, చంద్రశేఖర్ ఆజాద్ వివరాల సేకరణకు చాలా ఏళ్లు పట్టింది. బహుశా ఆజాద్ అజ్ఞాత జీవితమే అందుకు కారణం. మన మధ్య జీవించిన కాలం 24ఏళ్ల 7నెలలు. చిన్న వయసు నుంచే ఆయన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. గాంధీ అహింసతో దేశ విముక్తి కాదని బలంగా నమ్మిన ఆజాద్ (15ఏళ్లు) మొదట హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ (HRA)లో చేరారు. కాకోరి దోపిడిలో పాల్గొన్నారు. కుట్ర కేసు కారణంగా ముఖ్య నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్తో పలువురు ముఖ్యనేతలు ఉరిశిక్షలతో అమరులు అయ్యారు. ఒక్క ఆజాద్ చాకచక్యంగా తప్పించుకున్నారు.
ఆ తర్వాత రెండోది, చివరి మజిలీగా HSRA సాగింది. హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని.. హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA)గా ఆజాద్ మార్చారు. దళానికి నాయకుడు, ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్‌గా చివరి వరకు కొనసాగారు. ఆయనంటే సహచరులకేగాక వ్యతిరేక శక్తులకూ భయమే. ఆజాద్ లేకుండా గడ్డిపోచ కూడా కదిలేది కాదని ఉద్యమ సహచరులు చెబుతారు.
షహీద్ భగత్ సింగ్, ఇతర విప్లవకారుల జీవితం, రచనలు ఎన్నో వెలుగు చూశాయి. చాలా గ్రంథస్థం అయ్యాయి. భారత స్వాతంత్ర విప్లవోద్యమ చరిత్రలో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ప్రత్యేక స్థానం ఉంది.
పంజాబ్, ఢిల్లీ, లక్నో, కాన్పూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సాహిత్యం, ఆజాద్ వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చేవే. ఉద్యమ అవసరాల కోసం ఆజాద్ తన 24 ఏళ్ల ప్రాయం అంతా అజ్ఞాతంలో జీవించారు. ఆయన చరమాంకంలో పోలీసులు విడుదల చేసిన రెండు ఫోటోలు తప్పితే ఆజాద్ రూపం దళ సభ్యులకు తప్ప సామాన్య జనానికి ఏ మాత్రం తెలియదు.
ఆజాద్, భగత్ సింగ్ ఉద్యమ సహచరురాలు దుర్గా భాభీ (విప్లవకారుడు, HSRA జనరల్ సెక్రటరీ భగవతీ చరణ్ వోహ్ర భార్య) కృషి వల్ల ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి, పటిమ, దేశం కోసం బలిదానం గురించి రికార్డు అయ్యింది. దుర్గా భాభీ స్వయంగా ఆజాద్ పై వ్యాసం రాశారు. ఉద్యమ సహచరుల చేత వ్యాసాలు రాయించి పుస్తకాలు వెలువడానికి కారణమయ్యారు. విప్లవోద్యమం చల్లారిన తర్వాత లక్నోలో స్థిరపడిన దుర్గా భాభీ షహీద్ స్మారక – స్వాతంత్ర సంగ్రామ పరిశోధన సంస్థను స్థాపించారు. ఇది భారత విప్లవోద్యమం గురించి తెలుసుకోవాలని అనుకునే వారికి, పరిశోధన చేసేవారికీ అమూల్యమైన నిధి.
ఆజాద్ విప్లవ సహచరుల్లో ముఖ్యల వ్యాసాలను నిర్మలానంద అనువాదం చేశారు. వాటినే ఇప్పుడు “విప్లవ సహచరుల జ్ఞాపకాల మధ్య చంద్రశేఖర్ ఆజాద్” పుస్తకం తీసుకొస్తున్నాం. భగత్‌సింగ్ “నా నెత్తురు వృథాకాదు”, దుర్గాదేవి వోహ్ర “విప్లవ నారి దుర్గా భాభీ” పుస్తకాలను ఆదరించిన తెలుగు పాఠకులు, ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ పుస్తకాన్ని అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాం. ఎంతో ఓపికతో శ్రమకోర్చి పుస్తక ప్రచురణకు ముందుకు వచ్చిన “ఎన్నెలపిట్ట” పబ్లిషర్ కొర్లపాటి శేషుకు అభినందనలు.
– జయసూర్య ముప్పన
హైదరాబాద్




