మనలో చాలా మందిమి మన చుట్టూ కమ్ముకుని ఉన్న విషాదాన్ని తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తుంటాం. ఆలోచనల్ని ఒక మేరకు మొద్దుబార్చి, నిద్రపుచ్చి, రేపటి కలలేవో కంటాం. అంతఃశ్చేతన పీడకలలా కలవరపెడుతుంది. ఉలిక్కిపడేలా చేస్తుంది. అయినా సంక్షోభం మనదాకా రాలేదని అనుకుంటాం.

మన ఎదుట నడుస్తున్న ఒక అసంబద్ధ నాటకాన్ని చూసి నవ్వుతుంటాం. కానీ అందులో మనమూ  పాత్రధారులమే అన్న విషయాన్ని గుర్తించలేకపోతాం. నిజానికి అదే పెద్ద విషాదం. దానిని గుర్తించినప్పుడు మనమిక నవ్వలేం. బహుషా ఏడవలేక నవ్వుతామేమో. ఒక నిస్సహాయ స్థితిలో, భరించలేని మానసిక ఒత్తిడిలో, బాధను, భయాన్ని, ఆందోళనను తట్టుకోడానికి మన మీద మనమే జోకులేసుకుని నవ్వుకుంటామేమో. ఇటీవల బజరా రాస్తున్న కథలు చదువుతున్నపుడు ఈ ఉద్రిక్తతనంతా అనుభవిస్తాం.

వ్యవస్థలోని అసంబద్ధతను, నీతిమాలినతనాన్ని, అబద్ధాలను, మోసాలను ఎండగట్టడానికి, నిలదీసి ప్రశ్నించడానికి సాహిత్యం వ్యంగ్య రూపాన్ని తీసుకోవడం మామూలే. అందులో సున్నితమైన హాస్యం మిళితమై, వ్యంగ్యం నవ్వు పుట్టిస్తుంది. అదొక గొప్ప సృజనాత్మక వ్యక్తీకరణ. పాఠకులు అందులోని కళను ఆస్వాదిస్తూనే, ఆలోచనలకు పదునుపెట్టుకునే అవకాశం ఉంటుంది.

అయితే అన్ని సున్నితత్వాలూ ధ్వంసం అవుతున్న కాలం ఇది. భాషలో, వ్యక్తీకరణలో పాలక పక్షం అత్యంత జుగుప్సాకరమైన తీరును ప్రోత్సహిస్తోంది. ఆధిపత్య సంస్కృతి అన్ని రంగాల్లోనూ విశృంఖలంగా అల్లుకుపోతోంది. మరోవైపు విమర్శను భరించలేని అసహనం విపరీతంగా పెరిగిపోతోంది. స్వేచ్ఛ, సమభావం, సహోదరత్వం వంటి ఆధునిక మానవీయ భావనలకు కూడా తప్పుడు అర్థాలు తీసి ట్రోలింగ్ చేసే పరిస్థితి. సైన్స్ అవహేళను గురవుతుంటే మూఢత్వం పల్లకీలు ఎక్కి ఊరేగుతోంది. వీటిని ఎండగట్టడానికి ఏ వ్యంగ్యం సరిపోదు. ఏ కథా రచయితలు సృష్టించలేని పాత్రలు, ఏ నాటక రచయిత తెరకెక్కించలేని నాటకం మన స్మార్ట్ తెరలను ఆక్రమించేసాయి. ఒక పతనం మొదలైంది. కొన్ని శతాబ్దాలగా ఈ దేశ ప్రజలు శ్రమించి, పోరాడి, రక్తం ధారపోసి నిర్మించుకున్న మానవీయ విలువలు, ప్రజాస్వామిక భావనలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ సాంస్కృతిక పతనాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఏ రాజకీయార్థిక సామాజిక పరిణామాలు దీనికి దారి తీశాయి? వీటి గురించిన విశ్లేషణలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. మరెన్నో వస్తున్నాయి కూడా. వాటినలా ఉంచితే సృజనాత్మక సాహిత్యం దీన్నంతా ఎలా నమోదు చేస్తున్నదో పరిశీలించడం చాలా అవసరం. ఎందుకంటే సాహిత్యం ఒక లోతైన సాంస్కృతిక వ్యక్తీకరణ. అది సమాజాన్ని ప్రతిబింబించడమే కాదు, అది సామూహిక వివేచనను, విలువలను, ఉద్వేగాలను మానవ జీవిత మూలాల నుండి అన్వేషిస్తుంది. తెలుగు సాహిత్యం ఈపని కొంతమేరకు చేసింది. చేయవలసింది మరెంతో ఉంది.

సమకాలీన అవ్యవస్థను (chaos), నాగరిక విలువల సంక్షోభాన్ని సృజనాత్మక సాహిత్యంలోకి తీసుకురావడం నేటి రచయితల ముందున్న అతి పెద్ద సవాలు. దానిని స్వీకరించిన తెలుగు రచయితలు, ముఖ్యంగా ఈ పది పన్నెండేళ్ల కాలంలో చాలా అరుదు. అటువంటి అరుదైన రచయితల్లో బజరా ఒకరు. పై సవాలును అందుకొని కథా సాహిత్యంలో ఈయనంత విస్తృతంగా రాస్తున్న వారు బహుషా లేరేమో. ఈ కాలమంతా ఆయన పది చేతులతో రాస్తున్నాడా అన్నట్లు కథలు రాస్తూనే ఉన్నాడు. మాతృక వారి ‘కతలు వెతలు’ శీర్షిక కోసం రాసినవే వందకు పైగా ఉన్నాయి. ఇతర పత్రికలకు రాసినవి అదనం. అలాగని ఆయన జీవిక కోసం రచన చేస్తున్న మనిషి కాదు. జీవించి ఉండడం కోసం రాస్తున్న మనిషి. ఇప్పుడు మనముందున్న ‘లోకాయణం’ కూడా ఈ లోకాన్ని చూసి, చూడలేక రాసి, మనతో పంచుకున్న వ్యథలే. భరింపశక్యం కాని అమానవీయతను, హింసను, అల్పత్వాన్ని, హోరెత్తిన ఉన్మాదాన్ని చూస్తూ ఉండలేక రచయితగా తన కలాన్ని ప్రతిఘటనగా ప్రయోగించాడు. ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. బాధితులతో కలిసి దుఃఖించాడు. సామాన్యునిలా తన నిస్సహాయతను వ్యక్తం చేసాడు. కతలు వెతలు శీర్షిక కింద ఇవి చక్కగా ఇమిడిపోయాయి. ఈ తరహా కథలు తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ప్రయోగం.

సమాజంలోని డొల్లతనాన్ని చూపడానికి ప్రహసనం (farce) అనే ప్రక్రియ సాహిత్యంలో ఉంది. వ్యవస్థలోని అసంబద్ధతను చూపడానికి ఇందులో అతిశయోక్తితో కూడిన సన్నివేశాలు సృష్టిస్తారు. మానవ బలహీనతలను, ‘మర్యాదస్తుల’ అసలు రూపాన్ని బహిరంగం చేసి ఎగతాళి చేస్తారు. నవ్వు పుట్టించే విషయాల వెనక బాధాకరమైన వాస్తవాలు, వ్యవస్థ దుర్మార్గాలు కనపడుతుంటాయి. విచిత్రంగా ఈరోజు వాస్తవ ప్రపంచంలో మనం రోజూ నేరుగా చూస్తున్న ఘటనలన్నీ ప్రహసనాలే. నదిలో పాలు పారబోసి ఉచ్చ తాగడం ఒక అధివాస్తవికత అందామా? ప్రహసనం అందామా? తాము ఎవరికి ఓటెయ్యాలో పౌరులు నిర్ణయించాల్సి ఉంటే, ఓటెయ్యాల్సిన పౌరులను నాయకులు ఎన్నుకుంటున్నారు. నేరం నిరూపించాల్సిన చట్టం నిర్దోషిత్వాన్ని, దేశ(రాజ)భక్తిని నిరూపించుకొమ్మని లేదంటే శిక్షిస్తానని ప్రజలను బెదిరిస్తున్నది. ఇది ఎటువంటి ప్రహసనం? ఈరోజు ఎస్ఐఆర్ (ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ)ను మించిన విషాద ప్రహసనం మరేదైనా ఉందా? దీనిని సాహిత్యంలోకి ఎలా పట్టుకుని రావాలి? ఇటువంటి అనేక ప్రహసనాలు దేశంలో నడుస్తున్నాయి. లవ్ జిహాద్, అర్బన్ నక్సలిజం, సనాతనం, వికసిత భారతం… ఎన్నని చెప్పాలి! ఈ పదాల వెనక రాజకీయ సామాజిక సాంస్కృతిక అర్థం ఉంది. దాడి ఉంది. హింస ఉంది. ఈ ప్రహసనాల కింది నలిగిపోతున్న కోట్లాది జీవితాల నిట్టూర్పులు ఉన్నాయి. ప్రభువుల పల్లకి మోస్తూ, వారి కీర్తినలతో తరించిపోతున్న మీడియా శబ్దకాలుష్యాన్ని దాటి వీటిని వినిపించాలి. ఈ కాలం సాహిత్యం ఆ పని చేస్తుందా?

బహుషా మాతృక వాళ్లు బజరాను ఈ ప్రశ్న అడిగి ఉంటారు. సామాన్య ప్రజలకు, కార్యకర్తలకు అర్థమయ్యేలా రాజకీయాలు చెప్పాలని యాక్టివిస్టులుగా వారి తాపత్రయం. తాననుభవిస్తున్న ఉద్రిక్తతనంతా కథలుగా వెల్లబోసుకోవాలని బజరా తాపత్రయం. ‘కతలు వెతలు’ వారికి వెదికయ్యింది. ఈ కలయిక కొత్త తరహా కథల్ని పుట్టించింది. ఈ కథల్లో వ్యంగ్యం ఉంది, ప్రహసనం ఉంది, అధివాస్తవిక ఛాయలు కూడా ఉన్నాయి. సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు రాజకీయాలు చెప్పడమూ ఉంది. అది ఎలాగంటే ఆయోధ్య బాలరాముడి చెంతకు చేరిన అక్షింతలు ‘లోకాయణం’ చెప్పినట్లు. దేశం మూలమూలల నుండి వచ్చిన అక్షింతలు దేశమంతా ప్రతిధ్వనిస్తున్న రామభజన విని మురిసిపోకు, అది మోడీ భజన అని ముక్కుపచ్చలారని అమాయక బాలరాముడికి చెప్పి భయపెడతాయి. ఇందులో నేరుగా రాజకీయాలు చెప్పారు కాబట్టి ఇది కథ కాదని కొంతమంది విమర్శకులు అనొచ్చు. రామాయణం చెబితేనే కథ అవుతుందా, లోకాయణం చెబితే కథ కాదా అని బజరా అంటాడు.

శివపార్వతులు కైలాసం దిగి వచ్చి తమ భక్తుల ఓవరాక్షన్ చూసి భయపడినా, వెంకటేశ్వరుడు పసిపాప ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సిగ్గుపడినా ఈ అధివాస్తవిక సన్నివేశాలు వాస్తవికతను నిర్మొహమాటంగా చెప్పడానికే. శిల్పం మాటున ఎక్కడ విషయం మసకబారుతుందో అని రచయిత కాస్త గట్టిగానే జోక్యం చేసుకున్నాడు. ఇది కూడా ఒక కథన పద్ధతే. ఈ పద్ధతిని అత్యంత జాగరూకతతో రచయిత ఎంపిక చేసుకున్నాడు. ఇటీవలి సామాజిక పరిణామాలకు ముందు ఆయన రాసిన కథలకు భిన్నమైన శైలి ఇది. ఈ సంకలనంలో సుమారుగా సగం కథలు ఈ శైలిలోనే నడిచాయి. కొత్త సామాజిక మాధ్యమాల ద్వారా జనబాహుళ్యంలోకి వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొనిపోవచ్చు. ఇవి పాలకవర్గ కథనాలకు శక్తివంతమైన కౌంటర్ కథనాలవుతాయి.

స్త్రీల మీద అత్యాచారాల వంటివే ఆదివాసుల మీద డ్రోన్ దాడులు. రెండిటిలోనూ బాధితులే నేరాలకు బాధ్యత వహించాల్సిన వాళ్లు. కొన్ని విషయాలు మాట్లాడటంలో ఉన్న సౌకర్యం కొన్ని విషయాలు మాట్లాడడంలో ఉండదు. చాలామంది సౌకర్యంగా మౌనాన్ని ఎంచుకున్న సందర్భాలలో, ఆ మౌనాన్ని బద్దలు కొట్టడం ఒక చారిత్రక అవసరం. చరిత్ర పాలకుల దుర్మార్గాలనే కాదు, మేధావుల మౌనాన్ని కూడా నమోదు చేసుకుంటుంది. అందుకే దండకారణ్యం మీద సైనిక దాడుల గురించి పట్టణ మేధావుల మౌనాన్ని రచయిత నేరుగా ప్రశ్నించాడు. సాదాసీదా సన్నివేశం, మామూలు సంభాషణ -నేపథ్యంలో ఆదివాసుల జీవన్మరణ పోరాటం ఒక కథ. మణిపూర్ మారణహోమం పట్ల పాలకుల మౌనం కన్నా, నగ్నదేశం ముందు పౌరులుగా నిలబడడానికి మనం సిగ్గుపడాలి అని తేల్చి చెప్పడం ఒక కథ. ఈ చెప్పటంలో తీవ్ర కంఠస్వరం ఉంది. అది కథను నడిపించింది. ఇటువంటి వ్యాఖ్యానాల వంటి కథనాలు కూడా ఈ కథల వరుసలో చేర్చారు. ఇక్కడ నిరసనను వ్యక్తం చేయడమే కథ. దానిని ఉద్రిక్తంగా చెప్పుకుంటూ పోవడమే ఆయన ఎంచుకున్న శిల్పం. కనీసం మూడు కథల్లో అత్యాచార భారతం ఆవిష్కృతమైంది. అది మతహింస రూపంలో కావచ్చు, ట్రోలింగ్ రూపంలో కావచ్చు, అత్యంత జుగుప్సాకంగా మారిన పితృస్వామ్య నీతి ఈరోజు వ్యవస్థను కాపాడుతున్న ఆయుధం.

రాజుగారి దేవతా వస్త్రాల గుట్టు బైటకి చెప్పిన పిల్లవాడి మీద రాజద్రోహం మోపడమే కాదు, పౌరులందరూ దేవతా వస్త్రాలే ధరించాలి అని రాజుగారు హుకుం జారీచేయడం అనే కథ కూడా రాజ్యం మీద నిరసనే. ఈ వ్యంగ్యం మనకు నవ్వు పుట్టించదు. ఇదే కథ బహుషా ఒక ఇరవై ఏళ్ల క్రితం చదివితే నవ్వుకునేవాళ్లం. అప్పుడది అధివాస్తవికత. ఇప్పుడు వాస్తవికత. ఎన్నికల సందర్భంలో ‘ఓటు’ తన అసలు విలువ తెలుసుకుని కుప్పకూలడం, భోలే బాబా పాదధూళి బిజినెస్ కావడం, ఒంటి మీద గుడ్డల్లేని పిచ్చివాడు స్వామీజీ కావడం… అతని పిత్తులు పవిత్రమై ప్రసిద్ధి పొందడం -ఇటువంటి సన్నివేశాలన్నీ ఏ మాత్రం అతిశయోక్తి కాని స్థితికి సమాజం చేరుకుంది. అందుకే ఈ ప్రహసనాలు నవ్వు పుట్టించకపోగా బాధ కలిగిస్తాయి, కలిచివేస్తాయి, సిగ్గుపడేలా చేస్తాయి. ఎందుకంటే ఈ సన్నివేశాల్లో మనం కూడా ఉన్నాం. లేదంటే మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు. పాత విద్యార్థుల కలయికల్లో, కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపుల్లో నగ్నంగా కనపడే విద్వేష రాజకీయాలు, అలవోకగా బూతులు రాసుకునే సంస్కృతి మనందరికీ కనపడే ఉంటుంది. అందరికీ అనుభవంలో ఉన్న వాటినే ఈయన కథలుగా చెప్పడం దేనికి? ఒకవేళ వీటిని అసహ్యించుకుని  దూరంగా ఉంటున్నారేమో; ఇది తప్పించుకునే, దులిపేసుకుపోయే మురికి కాదు, మనం ఈ మురికి కూపంలోనే జీవిస్తున్నాం అని హెచ్చరించడానికి. ఎదుర్కోక తప్పదు అని చెప్పడానికి.

హక్కులు అనే మాట ఈరోజు పెద్ద బూతు. అది దేశభక్తికి పెద్ద అపచారం. దేశభక్తి అయినా దైవభక్తి అయినా రాజభక్తికి లోబడడం షరతు. భక్తి రాజకీయాలు ప్రజల మానసికను నియంత్రించి చైతన్యరహితంగా మార్చడం వెనక కనీవినీ ఎరుగని దోపిడికి గురిచేసే వ్యూహం ఉంది. ఒకప్పుడు సాధించుకున్న హక్కులు మరుగున పడిపోయాయి. ఇప్పుడు ఎనమిది గంటల పని కాదు, ఇంక్రిమెంట్లు కాదు, బీమా సౌకర్యాలు కాదు, ఖాళీ సమయంలో కూర్చోవచ్చా అని అడగాల్సి రావడం వికసిత భారతానికి కార్మికులు చెల్లించుకుంటున్న మూల్యం. దీని మీద వెలుగు సారించిన కథ ఈ సంకలనంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. బట్టల షాపుల్లో, నగల షోరూంలలో, షాపింగ్ మాల్స్‌ లో అమ్మకాలు చేసే కార్మికులు పన్నెండు గంటలు నిలబడాలి. కస్టమర్లు ఉన్నా లేకున్నా నిలబడే ఉండాలి. ప్రైవేట్ స్కూల్ టీచర్లు పొరపాటున కూర్చుంటారేమోనని కుర్చీలు కూడా వేయరు. వీరిలో అధిక భాగం మహిళలే ఉంటారు. వీరికి ఇంటి పని అదనం. కీళ్లు అరగదీసుకుని చాకిరి చేయాలి. ఇటువంటి శ్రమదోపిడి మీద బజరా రాసిందే మొదటి కథ కావచ్చు. అసలు కూర్చునే హక్కు కోసం ఉద్యమాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగొచ్చు. రచయిత అన్నట్లు కూర్చొని కొలువు చేసేవారికి ఆ బాధ అర్థం కాదు. నిలబడలేక కూలిపోయేవారికి నాలుగు కాళ్ల జంతువులుగా మారిపోతే బాగుండునన్న కోరిక. మిరుమిట్లు గొలిపే మాల్స్ వెనుక ఎముకలు విరిగే శ్రమదోపిడియే నేటి వికసిత భారతం. ఈ భారతంలో తరచి చూసే కొద్దీ వేలకొద్దీ లోకాయణాలు కనపడతాయి. వాటిని చెప్పడానికి బజరా వంటి రచయితలు చాలా మంది కావాలి. మాతృక వంటి వేదికలు భిన్న మాధ్యమాలలో మరెన్నో రావాలి. వాట్సాప్ యూనివర్సిటీ తప్పుడు కథనాలను పటాపంచలు చేయాలి.

Leave a Reply