మరి కవి వేణుగోపాల్ పావురపడే మనిషి ఎవరు? ఆ మనిషి అతడు కావచ్చు. ఆమె కావచ్చు. మరి అతడు/ ఆమె కేవలం ఒక్క వ్యక్తేనా? కానే కాదు. మనిషి అస్తిత్వానికి ఏకరూపం లేదు. బహు రూపాలు ఉన్నాయి. అనంతమైన భిన్నత్వం ఉంది. కనుక సహజంగానే మనిషి ఆలోచనలోను, ఆచరణలోనూ అటువంటి విభిన్నత్వమే ఉంటుందని ఈ కవి భావిస్తాడు. అయితే ఆయనకు భిన్నత్వాన్నంతటినీ ఏకత్వంగా చూసే దృష్టి లేదు. సరికదా ఆ భిన్నత్వంలో ఏది అసలైన వైరుధ్యమో, ఏది వైవిధ్యమో అత్యంత స్పష్టంగా తెలిసిన కవి వేణుగోపాల్. అందుకే అటువంటి  వైవిధ్యపూరితమైన మనిషి బహుముఖ ప్రతిఫలనమే ఈ కవిత్వంలో కనిపిస్తుంది.

 ఏ మనిషి జీవితంలోనైనా ఆవశ్యకతను గుర్తించి చేసే ఆచరణతో పాటు భావోద్వేగాల పాత్ర కూడా అనివార్యంగా ఉంటుంది. భావోద్వేగాలు తీవ్రతరమై వెల్లువెత్తినప్పుడు మనిషి అనేక గాఢమైన అనుభూతులకు లోనవుతాడు. అది దుఃఖమో, ఆవేదనో, విచారమో, బాధనో, సంతోషమో ఏదైనా కావచ్చు. ఈ అన్ని అనుభూతుల వెనుక దృశ్యంగానో, అదృశ్యంగానో అనేకానేక ‘కన్నీటి సరుల దొంతరులు’ ఉంటాయి. ముఖ్యంగా భౌతికంగాను, మానసికంగానూ పలు అంతరాల దొంతరలున్న మన సమాజంలో మనుషుల్ని బేషరతుగా ప్రేమించాలంటే ఎన్నో బాధల బడబా  గ్నులను భరిస్తూ కన్నీటి అగడ్తలు దాటాల్సి ఉంటుంది. మరెన్నో వైరుధ్యాలతో సంఘర్షిస్తూ అనంతమైన వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సివుంటుంది. కచ్చితంగా కవి ఈ పనే చేశాడనడానికి ఈ కవిత్వమే తిరుగులేని దాఖలా.

 ఉదాహరణకు, తానే చేసిన పొరపాటు వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో కవి అనంతమైన దుఃఖాన్ని మోస్తూ, ఈ లోకం నుంచే వెళ్లిపోవాలనిపించే నైరాశ్యానికి గురయి కూడా తన మనిషితనాన్ని కోల్పోకుండా కాపాడుకున్నాడు. అంతేగాదు, కరకు వర్గ సంబంధాలలో భాగంగా ఒకవైపు మనిషి పరమ అమానవీయంగా, విధ్వంసపూరితంగా మారి పతనమవుతుండగా, అందుకు ప్రతిగా అత్యంత మానవీయతను ప్రదర్శిస్తూ నిరంతరం పోరాడుతూవున్న మనిషిని ఈ కవి ప్రేమిస్తున్నాడు. పైగా ప్రాణాలకు తెగించి పోరాడుతూ నూతన చరిత్ర నిర్మాతలుగా  అమరులై ఒరిగి కరిగిన ఈ మట్టిని ఒక సమున్నత జెండాగా సమాజాకాశంలో ఎగరేస్తూ గర్వపడుతున్నాడు (మాట్లాడకుండా ఉండగలనా? ).

 ‘మనిషంటే ఆలోచన కదా/ మనిషంటే మాట కదా/ మనిషంటే రాత కదా చదువు కదా/ మనిషంటే హాసం కదా స్నేహం కదా/ మనిషంటే పని కదా’ అని మనిషికి కవి అసలైన నిర్వచనం ఇస్తున్నాడు (మనిషంటే పని కదా). అటువంటి మనిషిని ప్రేమించాలని, తన అస్తిత్వం అంతమయ్యేదాకా అటువంటి మనిషితో అద్వైత స్నేహం చేయాలని కవి కోరుకుంటున్నాడు (ఎప్పటిదాకా).

దూరం దుఃఖమని తెలిసినప్పటికీ ,అలా దూరమైనప్పుడే ‘లోకం నీకెంత దగ్గరో తెలుస్తుంది’ అనంటాడు(దూరమూ దుఃఖమూ). అలాగే జీవితంలో నైరాశ్యపుటంచుల్ని తాకినప్పటికీ, ‘ఎంత చీకటి రాత్రి అయినా/ భళ్ళున తెల్లవారుతుంది ‘ అనే భవిష్యదాశను ప్రకటిస్తాడు (వాటీజ్ టు బి డన్?). ఇలాంటి ఎన్నో పరస్పర విరుద్ధమైన ద్వంద్వాల మధ్య జరిగే ఘర్షణలో దాగి ఉన్న గతితార్కిక సత్యాన్ని ఈ కవి తన జీవితం ద్వారానే అత్యంత సజీవంగా ఆవిష్కరించాడు.

కవిత్వం ఒక కవి స్వంత వ్యక్తీకరణ అయినప్పటికీ, ఆ కవికి ఒక జీవితం ఉంటుంది. జీవితానుభవమూ ఉంటుంది. జీవితానుభవంలో భాగంగా పరిసర సమాజం ఉంటుంది. ఎన్నో మానవ సంబంధాలూ ఉంటాయి. ఒక కవి జీవితానుభవంలో  ఎంతగా బయటి సమాజం, మానవ సంబంధాలు భాగమైతే ఆయన/ ఆమె కవిత్వంలో అంతగా సమాజం ప్రతిఫలిస్తుంది. ఈ కవి వేణుగోపాల్ కూడా అచ్చంగా  అటువంటి సామాజిక మానవుడే . ఆయనకు సమాజంతో, వందల వేలాది మనుషులతో విస్తృత మానవ సంబంధాలు ఉన్నాయి. కనుకనే నిర్భయ సంఘటనపై (నిర్భయా, ఎవరిదీ భారతం?), కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తూ 370 అధికరణాన్ని రద్దు చేసిన బిజెపి కేంద్ర ప్రభుత్వ రాజకీయ చర్య పై (కశ్మీర్ భాష్ప కళిక ; ఆ గాలిలో కలలేమవుతాయి? గిలానీ ),  ఆర్ ఎస్ ఎస్ హిందూ మతతత్వ శక్తులు లేవదీసిన ఘర్ వాపసీ పై (ఏ ఇంటికి రమ్మంటావు?), అమరుల బంధు మిత్రుల నాయకులు గంటి ప్రసాదం ను పట్టపగలే నరికి చంపినప్పుడు (మండుటెండలో మోదుగు పువ్వు), తమిళ ఈలం నాయకుడు ప్రభాకరన్ ను హత్య చేసినప్పుడు ( అస్తమించని ప్రభాకరన్ చూపు) ఇలాంటి అనేక సంఘటనలపై కవి స్పందించి కవితలు రాశాడు.

ఈ కవితా స్పందనలన్నీ మనిషి పట్ల కవి వేణుగోపాల్ కున్న మొక్కవోని విశ్వాసానికి అక్షర రుజువులు. సకల విధ్వంసాలకు, విశ్వవ్యాప్త విపణికి, విషపూరిత సామాజిక విభజనలకు ఏకైక విరుగుడు మనిషి మీద విశ్వాసం ఉంచడమేనని కవి ఘంటాపథంగా ప్రకటిస్తున్నాడు. ఆ మనిషి మీద విశ్వాసం వల్లనే ఇప్పటికి ఓడిపోయినా ఎప్పటికైనా మనిషే గెలుస్తాడని అత్యంత ధీమాగా చాటి చెబుతున్నాడు. ఒకానొక రోజు ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుందని, ఎదురులేని శక్తిలా అడ్డంకులు అన్నింటిని పడదోసి, సమ రాజ్యాన్ని స్థాపించి జననది మున్ముందుకే  సాగుతుందనే ఒక చారిత్రక విశ్వాసాన్ని తన యీ కవిత్వం ద్వారా ప్రకటిస్తున్నాడు కవి వేణుగోపాల్.

చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే- అట్టడుగున అందరూ కవులేనని ఆయన భావిస్తుండడం వల్ల, అటువంటి కవి హృదయం ఆయనకుండడం వల్లనే ఎన్. వేణుగోపాల్ మిగతా కవిత్వేతర ప్రక్రియల్లో సైతం అత్యంత  ప్రభావవంతంగా కృషిచేయగలుగుతున్నాడనేది సందేహాతీతమైన సత్యం.

Leave a Reply