ప్రొ. జిఎన్‌ సాయిబాబ కేసుగా ప్రపంచ గుర్తింపు పొందిన మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు 2013లో ఆహిరి పోలీసు స్టేషన్‌లో నమోదైంది. ఇందులోని ఆరుగురిలో మహేష్‌ టిర్కితోపాటు పాండు నరోటే, విజయ్‌ టిర్కి ఆదివాసులు. మిగతా వాళ్లు ప్రొ. సాయిబాబ, ప్రశాంత్‌రాహి, హేమ్‌మిశ్రా. పదేళ్లకు పైగా నడిచిన ఈ జీవిత ఖైదు కేసు బహుశా దేశ చరిత్రలోనే అరుదైన, అతి దుర్మార్గమైన కేసుగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ ఆరుగురి మీద కేసు పెట్టిందనే సంగతి ప్రజల కామన్‌సెన్స్‌లో కూడా భాగమైంది. ఈ ఆరుగురిలో ఒకరి(పాండు నరోటే) జీవితాన్నే హరించిన, ఐదుగురి పదేళ్ల జీవితాన్ని ధ్వంసం చేసిన ఈ కేసు కోర్టులను, న్యాయ పరిభాషను మించి భారతదేశంలోని సామాజిక రాజకీయార్థిక రంగాలకు విస్తరించింది. ఇంకా బాగా చెప్పాలంటే భారతదేశంలో కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సామాజిక సంఘర్షణలోంచి ఈ కేసు పుట్టుకొచ్చింది.

ముఖ్యంగా గత ఇరవై, పాతికేళ్లుగా పార్లమెంటరీ రాజకీయాలు, కార్పొరేట్‌స్వామ్యం, చట్టబద్ధ ఫాసిజం, ‘రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం’ ఒకపక్క, వీటిని ఎదిరిస్తున్న విప్లవోద్యమం, ప్రత్యామ్నాయ రాజకీయాలు, వాటిలో అట్టడుగు కులాల, వర్గాల, ఆదివాసీ తెగల భాగస్వామ్యం మరో పక్క ఎదురుబొరుదుగా నిలబడ్డాయి. పాలకుల కార్పొరేట్‌ ప్రాపంచిక దృక్పథానికి, విప్లవ ప్రజా పోరాటాల సమగ్ర ప్రజాస్వామిక ప్రాపంచిక దృక్పథానికి మధ్య సాగుతున్న రాపిడిలో పైచేయి సాధించడానికి రాజ్యాంగయంత్రమంతా కూడబలుక్కొని మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అనే తప్పుడు కేసును తయారు చేసింది.

ఈ కేసు వివరాలు పత్రికల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఆందోళనల రూపంలో జన సామాన్యంలోకి వెళ్లిపోయాయి. సాధారణ ప్రజల దగ్గరి నుంచి వేర్వేరు రంగాల్లో విశేష గుర్తింపు ఉన్న ప్రముఖుల దాకా దీని గురించి మాట్లాడారు. అయినా ఈ కేసు మీద సమగ్రమైన విశ్లేషణ వచ్చిందనుకోలేం. పోలీసులు రాసిన చార్జిషీటులోని ఆరోపణలను, వివిధ స్థాయిల్లో న్యాయస్థానాల వైఖరులనుబట్టే ఈ కేసు స్వభావాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దేనికంటే` ‘నేరం’ ఆపాదించగల స్థానంలో పోలీసులు ఉండవచ్చు. ఆ ఆరోపణలను సమర్థిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరి నుంచి కేంద్ర హోంశాఖా మంత్రుల దాకా మాట్లాడి ఉండవచ్చు. కోర్టులో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలనే వీధుల్లో సంఫ్‌ుపరివార్‌ మూకలు ప్రచారం చేసి సాయిబాబాను ఉరి తీయాలని కూడా డిమాండ్‌ చేసి ఉండవచ్చు. ఇదంతా హిందూ ఫాసిస్టు పాలన వల్లనే జరిగిందనే మాట నిజమే కావచ్చు. వీటన్నిటినీ దాటి పరిశీలించవలసిన లోతు, విస్తృతి ఉన్న కేసు ఇది.
మామూలుగా ఒక దుర్మార్గమైన తీర్పు వస్తేనో, ప్రజా వ్యతిరేకమైన చట్టం వస్తేనో ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని, అనుకూల తీర్పులో, చట్టాలో వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం మిణుకుమిణుమంటూ అయినా ఉందనే అభిప్రాయాలు వస్తుంటాయి. ఇట్లా అనుకోవడం తప్పేమీ కాదు. మన ప్రజాస్వామ్యానికి కచ్చితమైన ప్రమాణాలు లేకపోవడం, ఎప్పుడు ఏదైనా జరుగడానికి అవకాశం ఉండటం, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని అగంతక స్వభావం ఉండటం వల్ల ఆశ నిరాశల వ్యక్తీకరణలు తప్పడం లేదు. ఫలానా విషయంలో భారత ప్రజాస్వామిక వ్యవస్థలు ఇట్లాగే పని చేస్తాయనే గ్యారెంటీ లేకపోవడమే దీనికి కారణం. ఇవన్నీ మన ప్రజాస్వామ్యానికి కుదురు లేదని తరచూ రుజువు చేస్తుంటాయి.

సాయిబాబా కేసులో కూడా అదే జరిగింది. చివరాఖరికి పదేళ్లకు కేసు కొట్టేశాక ‘న్యాయమే గెలిచిందని’ అనుకోవాల్సి వచ్చింది. నిరాధారమైన కేసులో పదేళ్ల నిర్బంధం తర్వాత, అందులో ఒకరు జైల్లోనే మరణించాక కూడా మిగిలిన వాళ్లు ఏదోలాగా బైటపడ్డారని ఆనందించే దుస్థితికి మనల్ని ఈ ప్రజాస్వామ్యం తీసుకపోయింది. ఇప్పటికైనా మహత్తరమైన రాజ్యాంగం ఉండబట్టే, పవిత్రమైన న్యాయస్థానాలు ఉండబట్టే ఆ ఐదుగురైనా విడుదలయ్యారని అనుకోవాల్సి వస్తోంది. ఇది ఇక్కడితో ఆగదు. ఏవో ఇలాంటి ‘చిన్న’ సమస్యలు ఉన్నప్పటికీ మన దేశం ఉదారవాద ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగ విలువలతో పరిఢవిల్లుతోందనే దాకా వెళుతుంది. దీన్నే మరి కొంచెం జాగ్రత్తగా.. ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రావడం వల్ల పరిస్థితి ఇలా తయారైందిగాని లేకుంటే మరీ ఇంత అధ్వాన్నంగా ఉండదని కూడా అనేవాళ్లు ఉంటారు. సారంశంలో చెడ్డ పోలీసుల, హిందుత్వ మనస్తత్వం ఉన్న న్యాయమూర్తుల, వాళ్లను ప్రభావితం చేసిన పాలకుల దుర్మార్గంగా మాత్రమే దీన్నంతా కుదించే ప్రమాదం ఉంది.

ఏ సమాజంలో అయినా పోలీసులు, న్యాయస్థానాలు, చట్టాలు ఉంటాయి. దేనికంటే అవి నాగరికతా వికాసంలో భాగంగా ముందుకు వచ్చాయి. అవి లేని సమాజాలకంటే ఉన్న సమాజాలు మెరుగ్గా కనిపిస్తాయి. ఆ మెరుగైన స్థితి ఇండియాలో ఉన్నదని చెప్పడానికి సాయిబాబా తదితరులు విడుదల కావడమే ఉదాహరణ అనే వాళ్లు ఉంటారు. కానీ నాణేన్ని తిప్పి చూస్తే ఇంకో దృశ్యం కనిపిస్తుంది. అదే రాజీ కుదరని సామాజిక శక్తుల సంఘర్షణ. అందులో పాలకపక్షం చట్టాలను, న్యాయవ్యవస్థను ఆయుధాలుగా మార్చి ప్రజల మీద ఎక్కుపెడుతుంది. ప్రజల తరపున నిలబడిన మేధావులను భయపెట్టాలని చూస్తుంది. ఉదారవాద ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థలు సమాజానికి నాగరిక స్థాయిని పెంచకపోగా, ప్రజలకు రక్షణ కవచంగా పని చేయకపోగా పాలకుల చేతిలో ఆయుధాలుగా మారిపోవడం అనే వికృత పరిణామం జరిగిపోయింది. అంటే అవి పాలకులకు ఉపయోగపడే సాధనాలుగా ఉన్నాయేగాని, ప్రజలందరి అనుభవంలోకి వచ్చేలా వ్యవస్థీకృతం కాలేదు. ఈ వైరుధ్యం మధ్యనే మన ప్రజాస్వామ్యం మనుగడ సాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇందులో భాగంగానే ఈ ప్రజాస్వామ్యం సాయిబాబ కేసుల్లాంటి వాటిని తయారు చేసుకుంటుంది. కాబట్టి ఇలాంటి కేసులను భారత ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనవి కావు. పూర్తిగా దానికి తగినవే.

రాజ్యం తన మనుగడకు, తన అభివృద్ధి విధానానికి, తన భావజాలానికి అతి పెద్ద ముప్పుగా పొంచి ఉన్న ప్రజాపోరాటాల మీద దాడిగా సాయిబాబా కేసును గుర్తించాలి. ఆయన మేధస్సు గురించి, ఆయన నిర్వహించిన సామాజిక పాత్ర గురించి న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను ఒక ఆలోచనాపరుడి మీద అక్కసుగానే చూడ్డానికి లేదు. ప్రత్యామ్నాయ భావజాలం మీద, అందులోని రాజకీయాల మీద, అవి సమాజంలో ఎప్పటికైనా తీసుకరాగల మార్పుల మీద రాజ్యం అంచనాలవి. అంత తీవ్రస్థాయికి భారత సమాజ సంఘర్షణ చేరుకున్న సందర్భంలో ఈ కేసు నమోదైంది.

మన సామాజిక సంక్షోభాలకు దశాబ్దాల కిందటి లోతైన పునాదులు ఉన్నప్పటికీ, 2004 తర్వాత అది తీవ్రరూపం దాల్చింది. ఈ శతాబ్దపు ఆరంభం నుంచి భారతదేశం మరింత వికృతమైన సంక్షోభాన్ని అనుభవిస్తున్నది. దీన్ని పరిష్కరించే మార్గాలు కూడా తీవ్రమైన కాలం ఇదే. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విస్తరిస్తున్నదని, అందులో లోపాలు ఉన్నప్పటికీ వాటిని సర్దుబాటు చేసుకొని రాజ్యాంగ ఆదర్శాలను సాధించవచ్చని ఉదారవాద మేధావులు అంచనాకు వస్తున్న కాలంలో అట్టడుగు ప్రజలైన ఆదివాసులు, దళితులు, మహిళలు ప్రత్యామ్నాయ మార్గాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చారు. వలస వ్యతిరేక పోరాట కాలంలో, అధికార మార్పిడీ కాలంలో భారత బూర్జువా వర్గం రాజ్యాంగం ద్వారా ప్రకటించుకున్న ఉదారవాద ఆదర్శాలు పూర్తిగా అడుగంటిపోయిన దశలో ఈ కీలక మార్పులు తీవ్రమయ్యాయి. దీంతో బూర్జువా వర్గం సామాజికంగా, రాజకీయార్థికంగా కనీస ప్రగతిశీల, మానవీయ ముసుగును తీసేసి, తన సహజమైన ప్రజావ్యతిరేక లక్షణాన్ని పూర్తి స్థాయిలో సంతరించుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పాలకవర్గం ఇక ఈ దేశంలో నిర్వహించగల ప్రజానుకూల పాత్ర ఏదీ లేకుండాపోయింది. సామాజిక, సాంస్కృతిక, భావజాల రంగాలను అవి శరవేగంగా తిరోగమింప చేస్తున్నాయి. ఇక ఎంత కష్టభరితమైన మార్గంలో అయినా సరే పీడిత ప్రజలు మాత్రమే ప్రగతిశీల మార్పులు తేవాల్సిన చారిత్రక పరిస్థితులు ముమ్మరమయ్యాయి.

అలాంటప్పుడు సమాజం ఎట్లా ఉంటుంది? ఎంత ఒత్తిడికి లోనవుతుంది? ఎంత సంక్లిష్టంగా తయారవుతుంది? 2000`2010 మధ్యలో ఇదంతా కనిపిస్తుంది. ఒక పక్క అనేక తళుకుబెళుకుల అభివృద్ధి, దాని పక్కనే అమానవీయ విధ్వంసం పూర్తి స్థాయిలో రంగ స్థలం మీదికి వచ్చాయి. ఉదారవాద ప్రజాస్వామ్యం నిలదొక్కుకోని సమాజం కాబట్టి దాని రూపాలన్నిటినీ పాలకవర్గం తన దోపిడీకి, హింసకు, అణచివేతకు పూర్తిస్థాయిలో వాడుకోవడం మొదలు పెట్టింది. ఈ అలవాటు మొదటి నుంచీ ఉన్నప్పటికీ గత ఇరవై పాతికేళ్లుగా ఎక్కువైంది. ఇదంతా పైకి రాజ్యాంగ ప్రవేశికలోని సుభాషితాలకు, రాజ్యాంగయంత్రం పని తీరుకు మధ్య వైరుధ్యంగా ఉదారవాద మేధావులు కూడా గ్రహించగల స్థాయికి చేరుకుంది.

దీంతో సమాజం యావత్తు భీతిల్లిపోతున్నది. పాలకవర్గం ఇక తన ఉదారవాద ముఖాన్ని ప్రదర్శించడానికి వీల్లేని దశకు చేరుకున్నది. మామూలుగా ప్రజా పోరాటాలు రాజ్యాంగబద్ధతను పెంచడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా దోహదం చేస్తుంటాయి. సామాజిక ప్రగతి ఇట్లాగే ఒక్కో అడుగు మెల్లగా ముందుకు సాగుతుందని చాలా మంది అనుకుంటారు. ఇండియాలో అది కూడా ఎంతో కొంత జరిగింది. కానీ గత నలభై యాభై ఏళ్ల ప్రజాపోరాటాలు దీనికి భిన్నంగా మన దేశంలో ఏపాటి ప్రజాస్వామ్యం వ్యవస్థీకృతమైందో బైటపెట్టాయి. సారంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి దాన్ని సాధించుకోడానికి విప్లవ, ప్రజాస్వామిక పోరాటాలు ముందుకు వచ్చాయి. సామాజిక ప్రగతిలో అనేక చిక్కుముళ్లు ఉన్న భారత సమాజ ప్రత్యేకతల వల్ల విప్లవమే ప్రజాస్వామ్యాన్ని సాధిస్తుందనే సందేశాన్ని దేశమంతా వినిపించాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కావడమేకాదు, రాజ్య భావజాలానికి కూడా ముప్పుగా మారింది. 2010 నాటికి దేశం రాజకీయ, రాజకీయార్థిక, పాలనా, భావజాల సంఘర్షణలో కూరుకపోయింది. ఇందులో ప్రొ. సాయిబాబా తదితర వందలాది మంది మేధావులు ప్రజా భావజాలం తరపున నిలబడ్డారు. అందువల్ల రాజ్యం వాళ్లందరి మీద కక్షకట్టింది. ఈ పోరాటాల్లో ఆదివాసులు క్రియాశీలంగా ఉండటంతో మేధావులను వాళ్లతో జతకట్టి కుట్ర కేసు తయారు చేయడం మొదలు పెట్టింది. మహేష్‌ టిర్కి వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం అనే ఈ కేసులో మహేష్‌ టిర్కిని వ్యక్తిగా చూడ్డానికి లేదు. భారత రాజ్యానికి అత్యంత ప్రమాదకరంగా తయారైన ఆదివాసులందరికీ ఆయన, మిగతా ఇద్దరు ఆదివాసీ యువకులు ప్రతినిధులు.

ఆదివాసీ పోరాటాల మీద, మిగతా ప్రజా ఉద్యమాల మీద రాజకీయ, సైనిక యుద్ధం చేస్తున్న భారత రాజ్యం చట్ట పరిభాషలో భావజాల యుద్ధం కూడా చేయడానికి ఈ కేసును తీసుకొచ్చింది. సరిగ్గా ఈ కేసు నమూనాలోనే మరింత విస్తృత స్థాయి భావజాల, సాంస్కృతిక కోణాలతో భీమాకొరేగావ్‌ కేసును తయారు చేసింది. మహేష్‌ టర్కి కేసులోంచే భీమాకొరేగావ్‌ కేసులోకి సాక్షాధారాలను తీసుకరావడం యాదృశ్చికం కాదు. అది కేవలం న్యాయస్థానానికి పరిమితం అయింది కాదు. కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజానికి, విప్లవ ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలోని అన్ని తలాలు, అన్ని కోణాలు ఈ రెండు కేసుల్లో కనిపిస్తాయి. నిజానికి ఇది ఈ రెండు కేసుల్లోనే కాదు. డా. వినాయక్‌సేన్‌ కేసు దగ్గరి నుంచి భీమా కొరేగావ్‌ తర్వాత దేశవ్యాప్తంగా కశ్మీర్‌ ఉద్యమకారుల మీద, సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నిట్లో ఈ నమూనా ఉంది. స్థూలంగా కార్పొరేటీకరణను, సైనికీకరణను, హిందుత్వీకరణను వ్యతిరేకించే వ్యక్తుల మీద, ఉద్యమాల మీద పెట్టిన కేసులన్నిటిలో ఈ ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ కేసుల్లోని న్యాయ పరిభాషను డీకోడ్‌ చేసి రాజకీయార్థిక పరిభాషలోకి మారిస్తే నేరుగా అందరికీ అర్థమయ్యేలా భారత ప్రజాస్వామ్య సారమంతా బైటికి వస్తుంది.

అట్లా సాయిబాబా తదితరుల అరెస్టుకు, యావజ్జీవ శిక్షకు కారణమైన తప్పుడు ఈ కేసును రాజకీయ భాషలో ఆదివాసులు వర్సెస్‌ భారత రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆదివాసులు అనే మాట ఒకానొక పీడిత అస్తిత్వ సూచిక కాదు. భారత ప్రజలందరికీ వర్తించే విశాలమైన సామాజిక రాజకీయార్థిక వివరణ అందులో ఉన్నది. అట్లాగే ఇదొక సంక్షోభాన్నేగాక పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది.

గత ఇరవై పాతికేళ్లలోని రాజకీయార్థిక పరిణామాలను, ప్రజా పోరాటాల విస్తృతిని, ప్రత్యామ్నాయ నిర్మాణ ప్రయత్నాలను, వాటికి తగిలిన ఎదురుదెబ్బలను, నెత్తుటి గాయాలతో ప్రజలు అనుభవిస్తున్న కుంగుబాటును కలిపి ఈ కాలంలో ప్రభుత్వం పెట్టిన కేసులను, వాటిలోని ఆరోపణలను, వాటికి పోలీసులు చూపుతున్న ఆధారాలను, న్యాయస్థానాల్లో వాదనలను ఎప్పటికైనా సమగ్రంగా విశ్లేషించుకోవలసే ఉన్నది. అప్పుడు అది తప్పక వర్తమాన భారతదేశ సంఘర్షణా చరిత్ర అవుతుంది.

One thought on “మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

  1. Pani garu
    Sir
    Desham lo prajasaamyam undhaa??prajasaamyam unte varasathva – family paalanalu —untaaya??
    **uri thiyalani demand cheyavachhu ??provoke. Chesthoo raayadam. Deniki sir ??how many telugu
    People —(both states ) dalithulu -Muslims —BCS/SCS/ sai baba gari. Gurinchi galam yettindhi yeppudu pani garu —
    Medhaavulu —-plz define ///YEVARU
    AGRAKULALA RAJARIKAM —chief ministers —yenthakaalam sir
    Sonia politics —Rahul p.m ??
    Corrupted chief ministers —still playing active politics
    Pani. Garu — why donot u touch these subjects sir

    ================
    Buchireddy gangula

Leave a Reply