గత కొద్ది మాసాలుగా ఆపరేషన్ కగార్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకింత చర్చ జరుగుతుందనే సందేహానికే తావు లేకుండా శవాల కుప్పలు జవాబులు చెపుతున్నాయి. ఇప్పటికీ నాలుగు మాసాలుగా మధ్య భారతంలోని అడవులు ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులలోని అడవులు తుపాకీ మోతలతో దద్దరిల్లుతున్నాయి. ఈ అడవులు దండకారణ్యంగా మన దేశ రాజకీయ చిత్రపటంపై అనధికారికంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అనధికారికంగానే అత్యున్నత పోలీసు అధికారుల కనుసన్నలలో మీడియా అతి ఉత్సాహంతో ఆ అడవుల గుండా నేపాల్ సరిహద్దుల వరకు కొనసాగే రోడ్ మ్యాప్ ను రూపొందించి ఆ నడవాకు రెడ్ కారిడార్ గా పేరు పెట్టింది. కానీ, ఇపుడు ఆ నడవా రక్తసిక్తమవుతోంది. ఆ నడవా ప్రాముఖ్యతను సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే, ఈ సందర్భంగా దాని ప్రత్యేకతలను తెలుసుకుంటే సరిపోతుంది.

ఆ నడవా మన దేశంలో పోటెత్తిన 1970ల నాటి నక్సల్బరీ విప్లవోద్యమానికి గత అర్ధ శతాబ్దానికి పైగా తిరుగు లేని కేంద్రంగా నిలిచింది. గత ఐదు దశాబ్దాలకు పైగా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ సాయుధ భద్రతా బలగాల ఇనుప బూట్ల పదఘట్టనలతో ఆ నడవా ఎంత నలిగిపోతున్నప్పటికీ, మళ్లీ మళ్లీ నేనున్నానంటు నూతన అధ్యాయాలతో నూతన రూపాలలో తలెత్తుకొని ముందుకు వస్తునే ఉన్నది. ఆ నడవా కోసం దేశంలోని రెండు వర్గాల మధ్య ఎందుకింత యుద్ధం జరుగుతున్నది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. మన దేశంలోని అత్యంత సుసంపన్నమైన ప్రాకృతిక సంపదలకు ఆ నడవా అనుపమానమైన నిలయంగా నిలిచి వుంది. ఆ నడవా మన దేశంలోని అనేక అతి ప్రాచీన మూలవాసీ జనసముదాయాలకు నిలయంగా వుంది. ఆ తెగలలో ఇప్పటికే అనేక తెగలు అడుగంటి పోగా మిగిలిన అతి పెద్ద తెగలకు చెందిన సంతాల్, ముండా, గోండు, కోందు సహ ఇతర పలు తెగలకు పెట్టింది పేరుగా ఆ నడవా కొనసాగుతోంది. భారతదేశంలో దాదాపు రెండువందల సంవత్సరాలకు పైగా జరిగిన భ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక తిరుగు బాట్ల గురించి తెలిసిన వారికి ఈ తెగల ప్రాశస్త్యం గురించి, పోరాట సంప్రదాయం గురించి, వీరత్వం గురించి, త్యాగాల గురించి విడిగా చెప్పాల్సిన పనే వుండదు. ఇప్పటికీ ఆ ఆదివాసీ ప్రజా పోరాట వీరుల త్యాగాలను, బలిదానాలను సొమ్ము చేసుకోవడానికి వర్తమాన దేశ పాలకులు పోటీ పడుతుతుండడం తెలిసిందే. సిద్దో, కానో, గుండాదూర్, బాబూరావుల నుండి బిర్సా ముండాల వరకు దోపిడీ పాలకులు ఏ ఒక్కరినీ వదలకుండా వారి ప్రయోజనాల కోసం వారిని ఘనంగా కీర్తీస్తూ ప్రజల ముందుకు రావడం చూస్తునే వున్నాం. ఇక ఆ నడవాకు గల ముఖ్యమైన రాజకీయ ప్రాధాన్యతలలో ఒకటిగా చెప్పుకోవలసింది, ఈశాన్య జాతుల ప్రాంతాన్ని సరిహద్దులుగా కలిగి వుండడం.

మన దేశ పాలకులు ఆ నడవాలోని మూలవాసులను ఆకర్షించడానికి చేపడుతున్న చిత్తశుద్ధి లేని రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు అనేకం వున్నాయి. ఆ నడవాలోని మూలవాసులను మభ్య పెట్టడానికి మన దేశ రాజ్యాంగాన్ని మించిన ఆయుధం మరోటి లేదనే చెప్పవచ్చు. అందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక షెడ్యూళ్లనే (5వ, 6వ షెడ్యూల్స్) తిరుగులేని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలో వాటిని పొందుపరిచినపుడు వ్యక్తులుగా ఎవరి దృష్టిలో ఏముందనేదానికి ఎలాంటి ప్రాధాన్యతా వుండదు. ఆ రాజ్యాంగ స్వభావాన్ని, దానిని అమలు చేసే రాజ్యాంగ యంత్ర స్వభావాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగి నపుడే, ఏ రాజ్యాంగమైనా అది రూపొందించిన వర్గాల ప్రయోజనాలకు అతీతంగా, తటస్థంగా వుండదనీ, అంతిమంగా అధికారంలోవున్న వర్గాల ప్రయోజనాల కోసమే అది అమలవుతుందని గ్రహించినపుడే రక్తమొడుతున్న అడవులలో అస్తవ్యస్తమవు తున్న ఆదివాసుల జీవితాలు అర్థమవుతాయి. వారి పూర్వీకుల పోరాటాలు, త్యాగాలు మరింత స్పష్టంగా తెలుస్తాయి. అంతేకాదు, ఆ ఆదివాసీలు ఎన్నడు కూడా తమ కోసం మాత్రమే పోరాడ లేదనీ, పోరాడడం లేదనీ, వారు మన దేశం కోసం, మన ప్రజల కోసం రక్త తర్పణం చేస్తున్నారనీ, ఆ పోరాటాలలో మనమూ భాగం కావాలనే చైతన్యం పెంపొందుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా పెట్టబడి సంచయనంలో భాగంగా పెట్టుబడిదారులు విపరీతమైన లాభాపేక్షతో కుత్తుకలు ఉత్తరించుకునే పోటీలో భాగంగా విశ్వ వ్యాప్తంగా వనరులను కొల్లగొట్టుకు పోవడంలో పోటీ పడుతున్నారు. ఈ పోటీకి తగినట్టే  వాళ్లు నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలు సృష్టిస్తున్నారు. పెట్టుబడిదారీ విధాన వికాస క్రమంలో జాతుల వికాసం అన్నారు. జాతీయ మార్కెట్లు అన్నారు. పెట్టుబడుల విస్తరణ కోసం, ముడి పదార్థాల సేకరణ కోసం వ్యాపార లావాదేవీలతో కూడిన వర్తక ఒడంబడికలు చోటుచేసుకొని రాజ్యాల దురాక్రమణకు పూనుకొని వలసాక్రాంతం చేసుకున్నారు. పెట్టుబడుల, ఉత్పత్తుల కేంద్రీకరణ, సాంద్రీకరణలతో దోపిడీ శక్తులు సంఘటితమవుతూ కార్టెల్స్, సిండికేట్లు ఏర్పర్చుకున్నారు. ఆ క్రమంలో ద్రవ్య పెట్టుబడి రంగం మీదికి వచ్చింది. ఫలితంగా, వెలుగుచూసిన అతి భారీ కంపెనీలు, వాటి అధికోత్పత్తుల అమ్మకాల కోసం ప్రపంచ పునర్విభజన వారి ఎజండా మీదికి వచ్చి విశ్వ యుద్ధాలకు తెరలేపాయి. మరోవైపు, వారి దోపిడీ పీడనలకు చరమగీతం పాడే ఆధునిక పారిశ్రామిక శ్రామికవర్గం రంగం మీదికి వచ్చి దోపిడీ రహిత సమాజాల నిర్మాణం కోసం సామ్యవాద వ్యవస్థలను నెలకొల్పడానికి పూనుకొని పలు దేశాలలో విజయాలు సాధించింది. ఆ విజయాలను వమ్ము చేయడానికి అనేక రెట్ల బలాన్ని కూడగట్టుకొని కుట్రలు,కుతంత్రాలతో పాటు యుద్ధాలకు  పాల్పడడం చరిత్రలో చూస్తున్నాం. ఇదంతా (ద్రవ్య) పెట్టుబడి సంచయనంలో భాగంగానే జరుగుతోందనేది అర్థం చేసుకోవాలి. ఎక్కడ అపారమైన వనరులు వున్నాయో, ముడి సరుకుల సేకరణ కు కావలసిన అవకాశాలు  వున్నాయో వాటిని మరుభూమి చేసైనా సరే, కొల్లగొట్టడమే పెట్టుబడికి తెలిసింది. ఎక్కడ చౌకగా వనరులతో పాటు శ్రమశక్తిని కూడ పొందవచ్చునో, అక్కడికి తమ పరిశ్రమలను విస్తరింపచేయడమే ద్రవ్య పెట్టుబడికి తెలిసింది. ఇపుడు యం.యన్.సీలు విశ్వరూపం ధరించాయి. వాటి దోపిడీ మార్గంలో ఎదురయ్యే అన్ని రకాల ఆటంకాల అడ్డు తొలగించుకోవ డమే అది నేర్చుకుంది. లేకపోతే, అది తాను సృష్టించుకున్న సుడిగుండాల నుండి గట్టెక్కలేదు. అంతిమంగా తాను సృష్టించిన శ్రామిక వర్గం దానికి గోరీ కడుతుందనీ, దానితో, దాని ఉనికే ఉండదనీ దానికి అర్థమైంది. అందుకే అది తన దోపిడీకి అడ్డు నిలిచినవారిని తొలగించుకోవడానికి రక్తపాతానికే పూనుకుంటుంది. ఇది చరిత్ర తేల్చిన సత్యం. లాటిన్ అమెరికాలోని రెడ్ ఇండియన్ల నుండి మన మధ్య భారతంలోని బైగాలు, గోండులు, కువ్వీలు, సంతాల్ ల వరకు అనేక తెగలు ద్రవ్య పెట్టుబడులకే బలి అవుతున్నాయి. పైగా అవేవో తమకు తాముగా అస్థిత్వాన్ని కోల్పోతున్న తెగలంటూ వాటికి పీవీటీజీ (పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) ట్యాగ్ తగిలించారు. వాటి ఉద్ధరణ పేరుతో ప్రభుత్వాలు ప్రత్యేక పాకేజీలను కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై ప్రకటిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల చైతన్యంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనాదిగా తమ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను, సోదరభావాన్ని హరించివేస్తూ తమ మనుగడకు ప్రమాదకరంగా మారిన ఎంతటి శక్తులతోనైనా దేనికైనా వారు తెగించి తలపడుతున్నారు. గతంలో దోపిడీదారులు అనేక చోట్ల బైబిల్ ఆసరాతో బందూకులను చేతపూని ప్రపంచాన్ని జయించ పూనుకున్నారు. మన దేశంలో బ్రాహ్మణవాదం మరో రూపంలో ఆ మార్గాన్నే అనుసరించింది. ఇప్పుడూ అదే చేస్తున్నది కాకపోతే, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నది. ఈనాడు మన దేశంలోని బ్రాహ్మణం లేద హిందుత్వం ఫూలే దంపతులను, అంబేడ్కర్ ను జపిస్తున్నది. ఆదివాసీలకు జాతీయ గౌరవదినాలు ప్రకటిస్తున్నది. మతాలు ఏవైనా, వాటిని ఏ పేర్లతో పిలుస్తున్నా వాటి పరమార్థం ఒక్కటే. వాటికి పాపం, పుణ్యం, పరమాత్మ, తప్పు, నేరం, చేయ కూడనిది, నీతిమాలినది అంటూ ఏదీ లేదు, వుండదు. కాకపోతే, అది మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, సమాహిత అభివృద్ధి, గాంధేయ సోషలిజం, పేదరిక నిర్మూలన, మహిళల హక్కులు, లౌకికవాదం లాంటి అనేక పదబంధాలను సృష్టించి తమ ముసుగు దాడులను ఎక్కుపెడుతోంది. తన సైనిక చర్యలకు, యుద్ధాలకు సాధికారతను కల్పించుకోవడానికి శాంతి, అహింస అనే రెండు పదాలు తిరుగులేని అస్త్రాలుగా, తన వాదనలకు బలం చేకూర్చే వందిమాగదులను సమకూర్చుకొని వర్గ స్పృహ లేని వారిని వంచించడానికి, వారి అండతో అమాయకులను మోసగించడానికి ద్రవ్య పెట్టుబడి పూనుకుంది. దాని ఆర్థిక విధానాలకు కూడ మోసకారి పేరును ‘నయా ఉదారవాద’ ఆర్థిక విధానాలు అంటూ తగిలించడం అందులో భాగమే!

పెట్టుబడికి కావలసింది వనరుల దోపిడీ, అది ఆశించేది చౌక శ్రమ శక్తి. అందుకు అది ప్రపంచంలోని ఏ మూలా వదలకుండా విస్తరించింది. ఈరోజు కార్పొరేట్ శక్తులు అనే పదం సర్వవ్యాప్తమైంది. ఆ శక్తులు పాల్పడుతున్న విధానాలనే కార్పొరేటీకరణ అంటున్నారు. అందులో భాగంగానే మధ్య భారతంలో అది తన పెట్టుబడుల విస్తరణకు, చౌక శ్రమ శక్తి దోపిడీకి పూనుకుంది. దానికి అడ్డుపడుతున్న వారిని తొలగించుకోవడానికి దశాబ్దంన్నర క్రితం శ్వేత బీభత్సమయ సల్వాజుడుం అన్నారు, ఆ తరువాత హరిత వేట అన్నారు. అయినా అడ్డు తొలగలేదు. దానితో ఆ అడ్డు తొలగించుకోవడానికి మరింత ఆధునికమైన, పాశవికమైన ఆపరేషన్ సమాధాన్ అన్నారు. ఇపుడు కగార్ అంటున్నారు. ఇవన్నీ పేర్లలో మార్పే తప్ప అన్నీ సైనిక చర్యలే. ఒకదానిని మించిన అణచివేత ఆపరేషన్ మరోటి. ఒక దానిని మించిన ఆధునికత, అధిక సాధనా సామగ్రిలతో, అధిక బలాలతో, నూతన టెక్నాలజీలతో కొనసాగుతోంది. 15 ఏళ్ల క్రితం డ్రోన్ లు లేవు. హెలీ కాప్టర్ ల నుండి ఆదివాసీ కుగ్రామాలపై బాంబులు, కాల్పులు జరుపలేదు. అవి మేక్ ఇన్ ఇండియా, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ స్థానం కోసం ఎగబాకాలనుకుంటున్న నేటి హిందుత్వ పాలకుల కాలంలోనే జరుగుతున్నాయి. ఇదే నేటి రక్తపాతానికి మూలం.

నేటి కార్పొరేటీకరణను వ్యతిరేకించే అన్ని రకాల శక్తులు తమ మనుగడ కోసం, తమ భవిష్యత్తు కోసం, మానవాళి మంచి కోసం పరితపిస్తున్నాయి. అవి మధ్య భారత అడవులలో పారుతున్న నెత్తుర్లను అరికట్టాలనీ  శతకోటి విధాలా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, కార్పొరేట్  వర్గాల ప్రయోజనాలకు, ద్రవ్య పెట్టుబడి వికాసానికి అంకితమైన మన దేశ పాలకులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిన్నటి కాంగ్రెస్ పాలకులు సాధారణ ఆదివాసీ ప్రజలను కాల్చి చంపకూడదంటుంటే, వారు భద్రతా బలగాల మనోబలాన్ని దెబ్బ తీస్తున్నారంటూ, వారికి క్షమాపణలు చెప్పాలంటూ నేరస్థులను వర్తమాన పాలకులు వెనుకేసుకొస్తున్నారు. ఉగ్రవాద హిందుత్వ శక్తుల ఆదేశాలను పాటిస్తూ ఫాసిస్టు జియోనిస్టు బలగాలను మరిపింపచేస్తున్న సాయుధ పోలీసు బలగాల చేతులలో నిర్ధాక్షిణ్యంగా అసువులు కోల్పోతున్న ఆదివాసీ యువతను అమరులుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఏ కారణాల రీత్యా పేర్కొన్నప్పటికీ, ఏ ప్రయోజనాలను ఆశించి అన్నప్పటికీ అది వాస్తవం. కానీ, అధికారంలో వున్నవారు వారి మీద తీవ్రమైన వత్తిడులు తెస్తూ వారి మాటలను ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. అయితే, నిన్నటి వరకు కాంగ్రెస్ హయాంలో చేసేదేంటి? అనేది చర్చ కాదు  ఇక్కడ. ఇపుడు కాంగ్రెస్ వాళ్లే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందనే పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోవడానికే దానిని ఉల్లేఖించాల్సి వచ్చింది. ఈ రోజు మధ్య భారత అడవులలో ప్రత్యేకించి బస్తర్ అడవులలో అసువులు కోల్పోతున్న వారు దేశం కోసమే తమ నులివెచ్చని నెత్తుర్లను ధారపోస్తున్నారనేది ఒక చేదు నిజం. అందుకే వారు అమరులు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగం చేసే వారెవరైనా అమరులే.

భారత పాలకులు తాము మధ్య భారతంలో కానీ,  బస్తర్ అడవులలో కానీ కొనసాగిస్తున్న నరసంహారానికి సాధికారత పొందాలనీ పోలీసుల కాల్పులలో మరణిస్తున్న వారంతా మావోయిస్టులేనని దబాయిస్తున్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన నూతన సంవత్సరం జనవరి 1 నాడు బీజాపుర్ జిల్లా ముదువెండిలో పోలీసు కాల్పులలో చనిపోయిన 6 మాసాల నెత్తుటి గుడ్డును మావోయిస్ట్ అనడం ఎంతటి హాస్యాస్పదం! ఆ తరువాత 20 రోజులలో ఆ పక్కనే వున్న బెల్లం నేండ్రలో పోలీసు కాల్పులలో మరణించిన ఇద్దరు మైనర్ బాలికలతో పాటు ఒక ఆదివాసీ రైతును మావోయిస్టులేనంటూ దబాయించడం పోలీసుల నేరపూరిత చర్యలను సమర్థించడమే అవుతుంది. ఆ తరువాత వరుసగా గత మూడున్నర మాసాలలో బీజుపుర్ జిల్లా గంపూర్ అడవిలో, పిడియా గ్రామాల మధ్య, చీపురుబట్టిలో, కొర్చేలీలో ప్రాణాలు కోల్పోయిన వారంతా మావోయిస్టులేనని పోలీసులు ప్రకటించడమే కాదు. వారి వద్ద మారణాయుధాలు, విస్పోటకాలు, విస్పోటకాలను మించిన డిటోనేషన్ శక్తి కలిగిన విప్లవ సాహిత్యం దొరికిందంటూ శవాల పక్కన సమకూరుస్తూ లోకాన్ని నమ్మింపచేయడంలో పోలీసులను  మించినవారు మరొకరు వుండరు. తమ బిడ్డలను చంపవద్దంటూ ప్రజలు వీధులలోకి వచ్చి ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలను వేడుకుంటున్నారు. అయినా వాళ్లంతా చంపదగిన మావోయిస్టులేనని చెప్పకనే చంపి చూపుతున్నారు. ఇక్కడే పోలీసుల నీతిమాలిన మరో విషయాన్ని కూడ చెప్పుకోవాలి. ఇటీవలే మూలవాసీ ప్రజా ఉద్యమాల నాయకుడు సురుజు టేకంను రాజనంద్ గాం జిల్లా పోలీసులు మార్చ్ చివరలో అరెస్టు  చేసి ఆయన దగ్గర డిటోనేటర్లు, కార్డెక్స్, నిషేధిత సాహిత్యం దొరికిందనీ తప్పుడు ఆరోపణలతో ఉగ్రవాద నిరోధక చట్టం కింద బెయిల్ సైతం దొరకని పాశవిక చట్టాన్ని ప్రయోగించి జైలు పాలు చేశారు. మూడేళ్ల కాల వ్యవధితో ప్రారంభమైన ఈ సైనిక అణచివేత ఆదివాసీ పల్లెలలను వల్లకాడు చేయాలనుకుంటున్నది. విప్లవ ప్రజలలో భయోత్పా తాన్ని సృష్టించి ఆ అడవులలో సమూలంగా విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనుకుంటున్నది.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టు నాయకత్వాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా తమ సైనిక ఆపరేషన్ లు కొనసాగుతున్నాయనీ పదే పదే ప్రకటిస్తున్నాడు. ఆ ప్రాంతాలను గనుల తవ్వకాలతో, పైప్ లైన్లతో, లేబర్ కాలనీలతో, కాలుష్య వాతావరణంతో నింపేయాలనుకుంటున్నది. దానినే అభివృద్ధిగా చిత్రిస్తున్నది. దిల్లీ పాలకులు కానీ, రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కోరుకునేది  అదే. అందుకే అడవులలో రక్తపాతం కొనసాగుతోంది.

పోలీసులు తమ కాల్పులలో చనిపోతున్న ప్రతి ఒక్కరిని మావోయిస్టుగానే చెపుతుంటే, దానికి మరో రకంగా వత్తాసు  పలికే వివిధ శక్తులు గ్రామస్థులను, మావోయిస్టులను వేరు చేసి చూస్తూ పోలీసుల హత్యలకు సాధికారత కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మావోయిస్టులనైతే చంపండి కానీ, గ్రామీణులను హత్య చేయకూడదంటున్నారు. నిజానికి మావోయిస్టులు లేకుండ బస్తర్ అడవులలోని మూలవాసీ ప్రజల మిలిటెంట్ పోరాటాలు, వారి మనుగడ, వారి అడవులకు రక్షణ అనూహ్యం. ప్రజలు అమూల్యమైన అతుల్యమైన త్యాగాలు చేస్తూ విప్లవోద్యమాన్ని కాపాడుకుంటున్నారు. ఆ ఉద్యమంలో వున్నవారు  తమ వాళ్లేనని, తమ కోసమే పోరాడుతున్నారనీ వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అందుకే వారు ప్రాణాలను ధారపోస్తూ ఉద్యమాన్ని కాపాడుకుంటున్నారు. వారు బాంబుల బారిన పడుతూ పోరాటాలను కొనసాగిస్తున్నారు.

మావోయిస్టులను చంపాలనీ భారత రాజ్యాంగంలో కానీ, భారత చట్టాలలో కానీ ఎక్కడా రాసిలేదు. నేరస్తులను కున్నపుడు వారిని నిర్బంధించి కోర్టులో ప్రవేశపెట్టాలనే చట్టం చెపుతుంది. కానీ, ఈ చట్టాల పట్ల గౌరవం, చట్ట విధేయత వుంటే, కేంద్ర హోంమంత్రి పోలీసుల అమానవీయ చర్యలను ఎంత మాత్రం ప్రశంసించేవాడే కాదు. ఆయన నిన్నటి వరకు అనేక హత్యానేరాలను ఎదుర్కొన్న హిందుత్వ అధినాయకుడే కాబట్టి మానవ సంహారాన్ని ఆయన సమర్థిస్తున్నాడు. ఎప్రిల్ 16నాడు కాంకేర్ జిల్లా ఛోటే వెటియా పోలీసు స్టేషన్ పరిధిలో గల కల్ పర్- ఆపటోల అడవిలో జరిగిక ఎదురుకాల్పుల మరణాలపై ఆ ప్రాంత విప్లవ పార్టీ ప్రతినిధి కామ్రేడ్ మంగ్లీ విడుదల చేసిన ప్రకటనలో తెలియచేసిన విషయాలు పోలీసుల పాశవికతకు అద్దం పడుతున్నవి. పోలీసుల ఎదురుకాల్పులలో 12 మంది విప్లవకారులు అసువులు బాయగా, క్షతగాత్రులైన 6 గురిని పోలీసులు పట్టుకొని కాల్చి చంపారు. అంతే కాదు, మరో 11 మందిని వెంటాడి పట్టుకొని ఊళ్లో వున్న అమరుల స్థూపం వద్దకు తీసుకెళ్లి ఒక్కొక్కరిని కాల్చి చంపారనీ మంగ్లీ అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని మీడియాకు విడుదల చేసింది. అంతేకాదు, బతికి వున్న వారితోనే మరణించిన వారి శవాలను తమ వాహనాల వరకు మోయించి అక్కడే వారిని చంపి కారుతున్న రక్తంతోనే శవాలన్నీ వాహనాలలో వేసుకొని వెళ్తుంటే, దారంతా నుని వెచ్చని రక్తపు ధారలతో ఎరుపుమయం అయిందనే వాస్తవం వింటుంటే, హిందుత్వ పాషాణం బోధపడుతుంది. ఖాకీ జవాన్ లలో రాజ్యాంగంపై, చట్టం పై విశ్వాసం వున్నవారు సజీవంగా చేతికి చిక్కిన వారిని కాల్చకూడదంటే, కరుడుగట్టిన డీ.ఆర్.జీ గూండాలు, బస్తర్ ఫైటర్స్ పై అధికారుల ఆమోదంతో కాల్చిచంపడం, అలాంటి జవాన్ ల భ్రమలను పటాపంచలు చేసితీరుతుందని ఆశిద్దాం. కానీ, యధార్థాలను తారుమారు చేసే శక్తులు, వృత్తి ధర్మానికే  కళంకం తెస్తున్న స్వార్థపూరిత శక్తులు నేరస్థ పోలీసు అధికారులను పట్టుకొని ఎన్ కౌంటర్ స్పెషలిస్టులంటూ, 34 ఎన్ కౌంటర్లకు బాధ్యుడనీ, ఆరు పథకాలను సాధించిన ఘనుడనీ, కాంకేర్ జిల్లా పఖాంజుర్ ఎస్సై లక్ష్మన్ కెన్వట్ ను శిక్షించాలని కాకుండా అత్యంత అభ్యంతరకరమైన విధంగా వారిని అభినందిస్తూ పొగడ్తలతో  ముంచుతూ బాధ్యతా రహితంగా అప్పటికే గోదీ మీడియా ప్రపంచానికి పరిచయం చేయడం ఫాసిజానికే చెల్లుతుంది.

భారత జియోలాజికల్ సర్వే వారు చేపట్టిన సర్వేలో అత్యంత విలువైన లిథియం నిల్వలు ఛత్తీస్ గఢ్ లోని జెంజ్రా, కట్గోరాలో బయటపడడంతో వేదాంత, జిందల్, అదానీ, ఓలా ఎలక్ట్రిక్, శ్రీ సిమెంట్, ఓరియంట్, దాల్మియా, రుంగ్టా, అల్ట్రా టెక్ సహ 50 కి పైగా ఘరానా కార్పొరేట్ సంస్థలు వేలం పాటల కోసం పెంపర్లాడుతున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమంటే గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సవరించిన గనుల చట్టం ప్రకారం దేశంలో లిథియం, గ్రాఫైట్, గ్లాకోనైట్ లాంటి విలువైన 20 రకాల గనుల తవ్వకాలను ప్రైవేటుసంస్థలు చేపట్టవచ్చు.  లిథియంను తెల్ల బంగారంగా కొనియాడుతున్నారు. మన దేశం ఇప్పటి వరకు ఈ పదార్థాన్ని చైనా, అర్జెంటీనా, చిలీ, సింగాపుర్ దేశాల నుండి 80 శాతం దిగుమతి  చేసుకుంటున్నది. మొదట ఈ గనులు కశ్మీర్ లో వెలుగు చూడగా, ఇపుడు ఛత్తీస్ గఢ్ లోని కోర్బా ప్రాంతంలో వెలుగుచూశాయి. రెండూ విప్లవోద్యమాల ప్రాంతాలే కావడం భారత ప్రభుత్వానికి పెనుసవాలుగా నిలిచి సైనిక చర్యలతో వాటి స్వాధీనానికి పూనుకుంటు న్నది. మరోవైపు అత్యంత కీలకమైన 18 రంగాలలో గనుల తవ్వకాలకు కేంద్రం మొదట గతేడాది నవంబర్లో తిరిగి ఇటీవలి మార్చ్ నెలలో వేలం వేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లలో గ్రాఫైట్, టంగ్సటన్, వాండియం, కోబాల్ట్, నికెల్ మున్నగు 18 రకాల కీలక గనుల కోసం 30 లక్షల కోట్ల రూపాయల (362 బలియన్ డాలర్లు) వేలం జరిగింది. మైనింగ్ కంగ్లామరేట్ వేదాంత లిమిటెడ్ అల్యూమినియం నుండి జింక్, ఇనుము, స్టీల్, చమురు-గ్యాస్ వరకు గల 50కి పైగా నున్న గనుల ప్రాజెక్ట్ లలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో విస్తరించ పూనుకుందని ప్రకటించింది. ఈ విస్తరణలో ఒడిశాలోని లాంజీగఢ్ అల్యూమినియం కర్మాగారం కూడ వుంది. అక్కడ  2 మిలియన్ టన్నుల నుండి యేటా 5 మిలియన్ టన్నులకు తవ్వకాలను పెంచాలనుకుంటున్నది. ఇక్కడే ఇటీవల ఎన్ కౌంటర్ లో దసురు అనే విప్లవకారున్ని పట్టుకొని కాల్చి చంపారు. ఛత్తీస్ గఢ్ లోని బాల్కో లో కూడ ఉత్పాదకతను విస్తరించే పథకం వుంది. ఈ పెట్టుబడుల సంచయనానికి ఆదివాసీల జీవితాలను, మన దేశ అడవులను, అపారమైన సంపదలను బలిపెట్టడమా? లేక  వాటిని అడ్డుకుంటున్న ప్రజలతో, ప్రజాహిత శక్తులతో, వారికి నాయకత్వం వహిస్తున్న పోరాట శక్తులతో భుజం భుజం; గళం గళం కలుపడమా? వీటిలో రెండవదే ఈ నాటి రక్తపాతాన్ని అరికట్టడానికి ఎంతటి కష్టదాయకమైన మార్గమైనప్పటికీ అదే సరైన జవాబవుతుంది.

Leave a Reply