అడవిని కాపాడాలంటూ ఉద్యమిస్తున్న ‘హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి’ వ్యవస్థాపక సభ్యుడు, ‘ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్’ కన్వీనర్ అలోక్ శుక్లాకు ఈ ఏడాది ‘గోల్డ్ మ్యాన్ అవార్డు’ లభించింది. గోల్డెన్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేసే కార్యకర్తలకు ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డును గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు. ఈ సంవత్సరం, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్‌మెంట్ అవార్డును భారతదేశానికి చెందిన అలోక్ శుక్లాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుగురు కార్యకర్తలు – దక్షిణాఫ్రికాకు చెందిన నాన్‌లే మబుతుమా, సినెగుగు జుకులు, స్పెయిన్‌కు చెందిన తెరెసా విసెంటే, ఆస్ట్రేలియాకు చెందిన ముర్రావా మరూచీ జాన్సన్, యుఎస్ నుండి ఆండ్రియా విడోర్, బ్రెజిల్ నుండి మార్సెల్ గోమ్స్ అందుకున్నారు.
‘ది వైర్’ జర్నలిస్టు సంతోషి మార్కంతో జరిగిన సంభాషణలో అలోక్ శుక్లా వెల్లడించిన వివరాలు.
మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అడవులను రక్షించడానికి బొగ్గు గనులకు వ్యతిరేకంగా దశాబ్దానికి పైగా పోరాటం కొనసాగుతోంది. 1 లక్షా 70 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న జీవవైవిధ్యంతో నిండిన హస్‌దేవ్ అరణ్యం దేశానికి అమూల్యమైన సంపద. ఈ అడవిని నాశనం చేయడం వల్ల తాము నీరు, అడవులు, భూమి నష్టపోవడమే కాకుండా తమ జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతుందని అక్కడి స్థానిక ప్రజలు, ప్రధానంగా ఆదివాసీలు అంటున్నారు.
హస్దేవ్ అరణ్య పర్యావరణ దృక్కోణంలో చాలా సున్నితమైన ప్రాంతం. ఇది చత్తీస్‌గఢ్ ప్రజలకు ఆక్సిజన్ అందించడమే కాకుండా దేశం మొత్తం మీద రుతుపవనాలను అదుపులో ఉంచడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ కారణంగానే ఈ అడవిని మధ్య భారత దేశపు ఊపిరితిత్తులుగా పరిగణిస్తారు.
ఇక్కడ నివసించే ఆదివాసీలు, ఆదివాసేతరుల జీవనోపాధి, సంస్కృతి పూర్తిగా ఈ అడవిపైనే ఆధారపడి వున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ అడవులు ఇక్కడ నివసించే ప్రజలతో పాటు అసంఖ్యాకమైన అడవి పశుపక్ష్యాదులకు జీవనాధారం. అందుకే ఈ అడవులను కాపాడేందుకు ప్రజలు పోరాడుతున్నారు. ఇప్పటి వరకు ఈ అడవికి జరిగిన విధ్వంసానికి మూల్యం చెల్లించుకోవడం దాదాపు అసాధ్యం.
గత 12 ఏళ్ల పోరాటం వల్ల ఇక్కడి నివాసులు పెద్ద ప్రాంతాన్ని కాపాడుకోవడంలో సఫలమయ్యారు. 2012లో ప్రారంభమైన పర్సా ఈస్ట్ కేటే బసన్ వంటి ఇప్పటికే పనిచేస్తున్న బొగ్గు బ్లాకులలో ప్రస్తుతం గనుల త్రవ్వకం జరుగుతోంది. రెండవ దశ విస్తరణ కోసం అడవులను నిర్మూలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రజా ఉద్యమం కారణంగా ప్రతిపాదిత 22 బొగ్గు బ్లాకుల్లో ఇంకా మైనింగ్ ప్రారంభం కాలేదు.
2021లో ప్రజలు రాయ్‌పూర్‌కు పాద యాత్ర చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఒత్తిడి చేశారు. దీని కారణంగా 21 గనులను రద్దు చేయాలనే ప్రతిపాదనను ఆమోదించారు, లెమ్రు ఎలిఫెంట్ రిజర్వ్ నోటిఫై అయింది. ఇది ఆ పోరాటం సాధించిన పెద్ద విజయం.
2021 అక్టోబర్‌లో ‘అక్రమ’ భూసేకరణకు నిరసనగా ఆదివాసీ సంఘాల సభ్యులు దాదాపు 350 మంది రాయ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి, ప్రతిపాదిత గనిపై తమ నిరసనను నమోదు చేయడం గమనార్హం.
అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ గని ఉన్నచోట గ్రామసభల హక్కులను కాలరాస్తూ గత ఏడాది డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపరీతంగా చెట్లను నరికివేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం సాగుతోంది. హస్దేవ్ అరణ్య ప్రాంతంలో పర్సా ఈస్ట్, కేతే బసన్ (పిఇకెబి) రెండవ దశ విస్తరణ బొగ్గు గని కోసం చెట్ల నరికివేత పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ ఎత్తున జరిగింది. పిఇకెబి -I గని పొడిగింపు అయిన పిఇకెబి -IIలో చెట్లను నరికివేయడానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయని స్థానిక పరిపాలనా యంత్రాంగం అంటోంది.
పర్సా ఈస్ట్, కేతే బాసన్ బొగ్గు గనులు మైన్ డెవలపర్ ఆపరేషన్ కాంట్రాక్టర్‌గా అదానీ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలో ఉన్నాయి.
అంతకుముందు, అటవీ శాఖ పిఐకెబి ఫేజ్-2 బొగ్గు గనిని 2022 మేలో ప్రారంభించడానికి చెట్లను నరికివేసే కసరత్తును ప్రారంభించింది, దీనిని స్థానిక గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆగిపోయింది.
గనుల త్రవ్వకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఉపాధి లభిస్తుందని దేశంలోని ఒక వర్గం భావిస్తోంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు వచ్చినా ఈ వాదనలతో చర్చ జరుగుతుంది. అభివృద్ధి, విధ్వంసంపైన చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ అభివృద్ధి పేరుతో తీసుకొచ్చినవే. మైనింగ్ ప్రాజెక్టులు నిజంగా అభివృద్ధిని తెచ్చి ఉంటే, యాభైల నుండి మైనింగ్ కొనసాగుతున్న దంతెవాడ, మానవ అభివృద్ధి సూచిక పరంగా భారతదేశంలో అత్యంత సంపన్నమైన జిల్లాగా ఉండాలి. అయితే అక్కడ పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు.
హస్‌దేవ్ పోరాటం కేవలం గ్రామాలను కాపాడే పోరాటమే కాదు, మొత్తం అభివృద్ధి నిర్వచనాన్నే సవాలు చేసింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు వాతావరణ మార్పు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది కాబట్టి అభివృద్ధికి కొత్త నిర్వచనం రావాలనే సందేశాన్ని ఇచ్చింది.
ఆదివాసి సముదాయం అడవిని సంరక్షించింది, సురక్షితంగా ఉంచింది. నేడు అభివృద్ధి పేరుతో భూమిని సర్వనాశనం చేస్తున్నారు, ఈ పరిస్థితిలో ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆదివాసీ ప్రాంతాల వైపు చూడాలి. వారి పద్ధతులు నేర్చుకోవాలి, సహజ వనరులను కాపాడుకుంటూ అభివృద్ధి చెందాలి.
అడవుల నరికివేత జరుగుతున్న చోట , ఆదివాసీల రాజ్యాంగ హక్కులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అందుకు వ్యతిరేకంగా ధృఢంగా పోరాడండి. దేశమంతటా, ప్రపంచమంతటా అందరినీ పోరాటంలో చేరమని కోరాలి. ఎందుకంటే ఈ పోరాటం మనందరి ప్రాణాలను కాపాడటానికి జరుగుతున్న పోరాటం.
గోల్డ్‌మ్యాన్ అవార్డును గెలుచుకోవడం గురించి అలోక్ శుక్లా చెబుతూ , ‘ఇది హస్‌దేవ్‌లో పోరాడుతున్న మా సహచరుల మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది. ఇతర పోరాటాలు చేస్తున్నవారికి మరింత మరింత శక్తితో పోరాడగలమనే విశ్వాసాన్ని కలిగిస్తుంది” అని అన్నారు.
అనువాదం : కె. పద్మ