మొదట్లో నాకు ఈ నాటకం మీద పెద్ద అంచనాలు ఏమి లేవు. ఓ రోజు పాణి గారు నాకు ఫోన్ చేసి  సిటీ యూనిట్ సభ్యులు వరలక్ష్మి గారి కథ “నీడలు” ను నాటకంగా వేద్దామనుకుంటున్నారు . మీతో మాట్లాడతారట ” అంటూ ప్రస్తావన తెచ్చాడు.

ఆ తర్వాత అనుకున్నట్లే చందు ఫోన్ చేసి” నీడలు “కథను నాటకంగా రాస్తే, యూనిట్ సభ్యులు నాటకం వేస్తారని , మీకు వీలవుతుందేమో చూడమని చెప్పాడు.

                                          ***

ఆ కథ ను నాకు పంపడం, నేను చదివేయడం ,వెంట వెంట జరిగిపోయాయి. పీడితులైన అనేక రంగాల ప్రజలు నియంతను వెంటాడుతారని, అంతిమ విజయం ప్రజలదేనని” నీడలు” ద్వారా రచయిత్రి చెప్పదల్చింది

దీన్ని నాటకంగా మలిచి నా, అది వేయడం సాధ్యం కాదనిపించి పక్కన పడేశాను. కానీ దానిలోని బలమైన కాన్సెప్ట్ నన్ను వెంటాడింది.

సాధ్యాసాధ్యాలను గురించి వరలక్ష్మిగారితో మాట్లాడాను. ఆమె   “కథను నాటకంగా మలిచేటప్పుడు , మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వీలైతే నే చేయండి ” అంది.

So, the ball is in my court  అన్నమాట.

                                            ****

 అందులో మొదటి భాగంలో పసిపిల్లలకు సంబంధించిన  సీన్లున్నాయి  “ఈ పిల్లలను ఎక్కడి నుంచి తేవాలి పసిపిల్లలు ఎక్కడ దొరుకుతారు “అనే ప్రశ్న వస్తే వరలక్ష్మి గారు ఆ ఘటన తీసేయమని చెప్పా రు. కానీ, అది నాటకంలో కీలకమైన ఘట్టం .పైగా  పిల్లలతల్లులతోనే నాటకం మొదలవుతుంది. ఏం చేయాలో తోచక వేరే ప్రాజెక్టు చేద్దాం అనుకున్నాం.

అదీగాక నాటకం మొత్తం “నీడలు” అనే కాన్సెప్ట్ తో నడుస్తుంది . ఈ నీడలు కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయడం మా వల్ల కాదనుకొని ఇంచుమించుగా ఈ కథని వద్దనుకునే పరిస్థితి వచ్చింది.

నాటకం రాయడంలో నాకెప్పుడూ ఇట్లాంటి సంకట పరిస్థితి ఎదురుగా లేదు. నేను రాసినవి కొన్నే నాటకాలే అయినా అవి నా సొంతంగా రాసినవి కావు. అవి కథల్లో నుండి  నవలలో నుండి అడాప్ట్ చేసుకున్నవే. “గౌరీ లంకేష్ “నాటకానికి ఆమె మీద వచ్చిన క్యాసెట్ నాకు ఆధారమైంది.  “ప్రజా వైద్యులు” నాటకానికి అరుణ తార లోవచ్చిన ఒక కథను ఆధారం చేసుకుని నాటకంగా మల్చాను . “చిరస్మరణ” నాటకానికి చిరస్మరణ “నవల ఆధారమైంది ఇట్లా నేను కథలను, నవలల్ని నాటకంగా మలచడంతో నాకు పరిస్థితి సులభంగా ఉండేది. ఇక్కడ పరిస్థితి వేరే రకంగా ఉంది.

రెండు రోజుల దాకా ఇవే తర్జన భర్జనలు. నాటకం రాయగలనా లేదా .. రాసినా ,ఇది నాటకంగా వేయగలమా ..లేదా .ఇవన్నీ సంశయాలు.

ఇదే విషయం ఉదయ్ (వెంకటేష్) సార్ తో చర్చిస్తే కాన్సెప్ట్ కొత్తగా ఉంది కాబట్టి రాస్తే బాగుంటుందని ప్రోత్సహించాడు.

                        ****

 నీడలు కాన్సెప్ట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి , అనుకున్నప్పుడు PKM మిత్రులు కర్నూల్ లో వేసిన” చిరస్మరణ “నాటకంలో ఒక దృశ్యం నాకు అక్కరకొచ్చింది.

 అందులో చివరి అంకం లో, దళిత యోధుల్ని ఉరి తీసే దృశ్యం ఉంటుంది .దీన్ని వీళ్లు ఎట్లా ప్రజెంట్ చేస్తారా అని కుతూహలంతో  ఎదురుచూస్తూ ఉన్నాను . దానికి వాళ్లు ఒక టెక్నిక్ ని వాడుకున్నారు. వేదిక మీద ఒక పెద్ద తెల్లని  కర్టెన్  గట్టి, దాని వెనుక లైటింగ్ ఏర్పాటు చేసి , వేదిక వెనుక మనుషుల్ని ఉరి తీసినట్టు నీడల ద్వారా చూపించగలిగారు.

“నీడలు “అట్లా చూపించవచ్చు , అని తెలుసుకున్నాక ఒక పెద్ద బరువు దిగినట్టు అనిపించింది. ఒక తొవ్వ దొరికినట్టు అనిపించింది.

 పోతే పసిపిల్లల సంగతి, సమస్యగా మారింది . పిల్లల బదులుగా బొమ్మల్ని పెట్టి సీన్ తీసేయొచ్చు కదా ..అనిపించింది . ఆ రకంగా ఆ సమస్య కూడా తీరినట్టు అయిపోయింది.

                                                      *****

 బాగా ఘర్షణ పడ్డది కథలోని మూలాంశం తోటే. భిన్న రంగాల ప్రజలు నియంతను నీడల్లాగా వేటాడుతారు అనేది నీడల ద్వా రా చూపించాలి . దీన్ని జనం ఎట్ల రిసీవ్ చేసుకుంటారో అనే భయం కూడా ఉండింది

 రిహార్సల్ జ రుగుతున్నప్పుడు ఒక మిత్రుడైతే ఇది పూర్తిగా మార్క్సిస్టు అవగాహనకు వ్యతిరేకమని , ప్రజల్ని తప్పుదోవ పట్టించడమేనని ముఖం మీద గుద్దినట్టు చెప్పాడు. నిజం చెప్పొద్దూ ..ఆరోజు తింటున్న అన్నం చేదు అనిపించింది.

 ఏది ఏమైనా ఇది ఒక ఫాంటసీ . గతంలో నేను రాసిన కథ ” రాతిప లకలు” ద్వారా  ఆదివాసీల మీద జరిగే నిర్బంధాన్ని చెప్పినాను.

 భిన్నమైన రూపాలతో కవులు , కళాకారులు తమ నిరసన తెలియజేస్తూ ఉంటారు . కొన్ని సార్లు పశుపక్ష్యాదులను, ప్రకృతి లోని అంశాలనూ, కొన్నిసార్లు పౌరాణికాల్లోని పాత్రల ని సైతం తీసుకొని , తమ ఆలోచన లుప్రకటిస్తుంటారు. నేను “నీడలు “కాన్సెప్ట్ తీసుకుంటే తప్పేమిటి అనిపించింది.

మహా శ్వేతా దేవి రాసిన” బషాయిటుడు “నవల నన్ను ముందుకు నడిపించింది. ఆ నవలలో హీరో బషాయిటుడును భూస్వాములు ఒక ఊర్లో చంపేస్తే , మరికొన్ని నెలల్లో మరోచోట అతను పుట్టుకొచ్చి పోరాటం మొదలుపెడతాడు. ఇక్కడ పోలీసులు చంపేస్తే మరొక చోట ప్రత్యక్షమవుతాడు . ఇట్లా ఐదు చోట్ల చంపేస్తే, ఐదు సార్లు బతికి వచ్చి పోరాటం కొనసాగిస్తాడు.  “ఇది ఎట్లా సాధ్యం ” అని ఎవరైనా అడగొచ్చు .  “కానీ ఒకచోట పోరాటం ఆగిపోతే , మరోచోట పుట్టుకొస్తుందనీ పీడన ఉన్నంతవరకు ప్రతిఘటన ఉంటుందని ” ఆమె సూచనప్రాయంగా చెప్పదల్చింది . నా దృష్టిలో అది గొప్ప నవల .(మహా శ్వేతాదేవి తన రచనల్లో పురాణాల పాత్రను వి రివిగా వాడుకుంది. అది వేరే విషయం)

రూపమేగాకుండా సారాన్ని కూడా చూడాలనేది నా అభిప్రాయం

                                                       *****

నాటకం ఆరు అంకాలుగా తయారైంది. చందుకు విషయం చెప్పాను .సుందరయ్య విజ్ఞాన్ భవన్లో మొదటి సమావేశం ఏర్పాటయింది .సభ్యులు నాటకాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారోననే భయంకూడా ఉండింది.

అక్కడికి చేరుకునేసరికి సంధ్యక్క , భూపాల్ వంటి సీనియర్లతో పాటు కొందరు యువకులు వచ్చి ఉన్నారు . చుట్టుపక్కల వాతావరణం అల్లరల్లరిగా ఉంది . అంత అల్లరిలోనూ “నీడలు “కాన్సెప్ట్ ని రెండు మూడు వాక్యాలు చెప్పాను . అది విన్న వెంటనే భూపాల్ సారు “బాగుంది. దీన్ని చేయొచ్చు ” అని ఆమోదం తెలుపడంతో సెన్సార్ తొలిగి నట్టయింది

రెండో సమావేశం సాహిత్య పరిషత్ హాలు (బొగ్గులకుంట)లో జరిగింది.

 కొత్త తరం సభ్యలు ముందుకు వచ్చారు. అందులో “చందు” తప్ప నాకు అంతా  కొత్తవాళ్లే. అయినా యువకులు సంసిద్ధులై వచ్చారు. వాళ్ళు ముందే నీడల ప్రదర్శన కోసం, ఒక లైటు , తెల్లటి క ర్టెన్ తెచ్చి పెట్టుకున్నారు. వాళ్ళ సంసిద్ధత చూసి ముచ్చటేసింది.

మొదటిరోజు రిహార్సల్ బాగా జరిగింది.

ఇక్కడ ఒక స్పూర్తినిచ్చే విషయమేమంటే, ఒకసారి రిహార్సల్ అయిన తర్వాత సభ్యులందరం గుండ్రంగా కూర్చొని తప్పొప్పులు ఎప్పటికప్పుడు చర్చించుకునేవాళ్ళం. పిల్లలు నటన విషయంలోనే కాకుండా, రచన విషయంలో కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు. అవసరమైన చోట్ల నాటకంలో మార్పులు చేసి నెక్స్ట్ సెషన్ కు తెచ్చేవాడిని

                                                       ****

పోతే, పాటలగురించి చెప్పాలి .

అన్ని చిన్నపాటలు అయినా, నాటకంలో చక్కగా ఒదిగిపోయాయి . ఇందులో ఉదయ్ సారు చక్కటి సహకారం అందించాడు. మేము మహబూబ్నగర్ నుండి హైదరాబాద్ కు వచ్చేటప్పుడు , నాటకం గురించి లోతుగా చర్చించేవాళ్ళం .  “నీడలు “నాటకం కాబట్టి శ్రీ శ్రీ కవిత “నీడ లు”లోని చరణాలు పెడితే బాగుంటదని ఉదయ్  సారు సూచించాడు.

ఆదివాసి పాట సమయంలో ఇటీవల సుప్రసిద్ధమైన పాట “గావ్ చోడబ్ నహి/ జంగల్ ఛోడబ్ నహి” అనేది కూడా ఉదయ్ సారే సూచించాడు. కాకపోతే దాన్ని ప్రొజెక్టర్  ద్వారా  ప్రజెంట్ చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు.

 పిల్లల మీద రాసిన పాట ,తంగేళ్ల సుదర్శన్ పాట నుండి బాణీ తీసుకొని చిన్న పాట రాసుకున్నాను. “ఎంత తల్ల డిల్లిరో పాపలు/ ఎంత చితికిపోయిరో కనుపా పలూ”..

మరొక పాటని కొత్తగా వచ్చిన యువ మిత్రుడు సనత్ జయ సూర్య ఇచ్చాడు . అతని గొంతు కంచు కంఠంలా మోగడంతో ఆ పాట అతడే పాడాలని నిశ్చయించాం .పోతే బత్తాయిల మీద రాసిన పాటను జయ సూర్య తన హావభావాలతో కొత్త ఊపిరిచ్చాడు . అది అతనే పాడాడు.

                                                              ***

మొదటి రిహార్సల్ అయిన వెంటనే పిల్లలు చేసిన గొప్ప విషయం ఏమిటంటే వాళ్లు  “నీడలు “అనే ఒక వాట్సాప్ గ్రూపుని సృష్టించారు.( అది ఇప్పటికీ కొనసాగుతున్నది) దానికి సుబ్బారావు పాణిగ్రాహి ని ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టారు. ఇందులో సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు . కొత్త కొత్త విషయాలు చేరడం మొదలయ్యాయి . రానిసభ్యులు గ్రూప్ చూసుకొని విషయాలు తెలుసుకొని అప్డేట్ అయ్యేవాళ్ళు.

గతంలో ఐదు నాటకాలు వేసిన ఇట్లా ఒక గ్రూపు ఏర్పాటు చేసుకోవడం అనేది కొత్త విషయం. దీని ద్వారా అందరూ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకునే వీలు కలిగింది.

రిహార్సల్ జరుగుతున్నప్పుడు , సభ్యులు విలువైన సూచనలు ఇచ్చే వారు. కొత్తగా వచ్చిన యువకుడు రాజశేఖర్ (ఎస్సై పాత్ర) సూచనతో అంకాలు సైతం , అటు ఇటు మార్చేసి అర్ధవంతంగా చేయగలిగాము .

 సభ్యుల్లో అందరూ రిహార్సల్ కు వచ్చేవారు కాదు. నిరాశగా ఉండేది . అందరూ ఎక్కడో ఒకచోట ఉద్యోగాల్లో ఉండేవాళ్లే .వాళ్ల టైం దొరికేసరికి  కష్టమయ్యేది.   నాటకంలో  “స్వామీజీ “పాత్ర కోసం కొంత శ్రమించాల్సి వచ్చింది . అందుకు రామ్ కీ ఆహార్యం కూడా బాగా పనికి వచ్చింది . మొదట్లో డైలాగులు చెప్పడంలో తడబడ్డా, మెల్లగా దారికొచ్చాడు . ఆయన కాషాయం దుస్తుల్లో అదరగొట్టేశాడు.

 నాటకంలో ప్రధాన పాత్ర గారి “నియంత”కు భూపాల్ గారిని అనుకున్నాం . కానీ ,ఆయన కుటుంబ పరిస్థితులవల్ల ఏ రిహార్సల్  కు రాలేని పరిస్థితి ఏర్పడింది . చివరికి విజయవాడలో సభకు ముందు ఒక రోజే ఆయన రిహార్సల్లో పాల్గొన్నారు. ఆయన అనుభవం నాటకానికి బాగా పనికి వచ్చింది

                                                               ****

రిహార్సల్ లో  సమిష్టి కృషి , అన్ని కష్టాలను దూరం చేసింది. ఖర్చులు మొత్తం సభ్యులమే భరించుకున్నాం. నల్గొండ మిత్రుడు  ఐదువేలు ఇచ్చాడు . ఒకసారి సంధ్యక్క ఇంటి నుండి సభ్యులకు వంట చేసి తెచ్చింది.

మా సభ్యురాలు భవాని గురించి ప్రత్యేకించి చెప్పాలి . తనకు రెండున్నర సంవత్సరాల కూతురు ఉంది. పేరు “సాహిత్య”. ఆ పిల్లను తాను వీపుకు  గట్టుకొని, ఝాన్సీ రాణి యుద్ధానికి బయలుదేరినట్టు , స్కూటర్ మీద రిహార్స లుకు బయలుదేరి వచ్చేది. (ఆ పిల్లకు మేము బుజ్జి భీముడు, దొడ్డు భీమమ్మ అని ముద్దు పేర్లు పెట్టుకు న్నాం)

నాటకం జరుగుతున్నప్పుడు ఆ పిల్ల అప్పుడప్పుడు బాగా సతాయించేది . సభ్యులందరూ ఆ పిల్లను బయటికి తీసుకెళ్లడం సముదాయించడం, తమ డ్యూటీగా, ప్రేమగా స్వీకరించారు. హైదరాబాదు నుంచి విజయవాడకు ట్రైన్ లో పోతున్నప్పుడు కూడా  ఆ పాపని సముదాయించడంలో టీం సభ్యులు బాగా తోడ్పడ్డారు.

ఆహార్యం గురించి చర్చ జరిగేది . పోలీసులు , ఆదివాసీలు  శ్రామిక మహిళలు ఎట్లుంటరు ..అనేదాని మీద చర్చ జరిగేది.  అవసరం అనిపిస్తే నెట్లో సెర్చ్ చేసి , ఆహార్యా లను సరిదిద్దే వాళ్ళం. నియంత వేషభాషల మీద చర్చ జరిగేది.

“ఈ నాటకంలో టెక్నాలజీ కూడా ఒక పాత్రనే” అని పదేపదే చెప్పే వాడిని . మా పిల్లలు దానిని చక్కగా వాడుకున్నారు. తీవ్రమైన కాలు నొప్పితో గూడ నేను రిహార్సల్ కు హాజరయ్యే వాడిని. నాటకం స్పిరిట్ లో నాకు అది  పెద్ద బాధ  అనిపించలేదు.

                                                               ***”.

 27, 28 జనవరి విరసం సభలు .

అందరం జనవరి 26 నాడు విజయవాడ చేరుకున్నాం .మాకు అది గణతంత్ర దినోత్సవం అన్న సంగతే తెలువదు .  సభకు ముందు రోజే , మేం చేసుకున్న రిహార్సల్ మాకు బాగా పనికి వచ్చింది . మిత్రుడు రామ్ కీ కాషాయ బట్టలతో పూర్తిగా సిద్ధమై వచ్చాడు. అది అక్కడున్న వాళ్ళందరికీ ఉత్సాహం కలిగించింది. (మా నాటకం  “నీడలు” గ్రూపులో ఇప్పటికీ రామ్ కీ ని ” స్వామీజీ” అని పిలుస్తాం)

 ఇరవై ఆరు నాడు రాత్రి , మా అమ్మాయిలు పెద్ద సాహసమే చేశారు . వాళ్లు రాత్రి పది దాటిందాకా కూడా రూముకు రాకపోయేసరికి (ఏంపిల్ల లు వీల్లు..వోగెం లేదు. పాడులేదు. . రేపు నాటకం పెట్టుకుని  ఆరోడ్ల  మీద  తిరుగుడేంది)   విసుక్కున్నాను.  కాని వాళ్ళు చేసిన సాహసానికి ఆశ్చర్యపోయాను.

మాకు అప్పటికి వేదిక మీద కర్టెన్ దొరకలేదు . తెల్లారితే నాటకం వేయాలి . కర్టెన్ లేకపోతే నాటకం ఫెయిల్ అవుతుంది. అమ్మాయిలు కర్టెన్ కోసం రోడ్డుమీద పడ్డారు. ఆరోజు గణతంత్ర దినోత్సవం ఉండడంతో, షాపులు తొందరగా మూసేస్తున్నారు . అక్కడ కనబడుతున్న వాటిల్లో ఒకే ఒక్క షాపు తెరిచి ఉందట. దాన్ని కూడా యజమాని మూసేసే ప్రయత్నంలో ఉన్నాడు. మా పిల్లలు అక్కడికి వెళ్లి యజమాని వేడుకున్నంత పని చేశారు. అతడు విషయాన్ని అర్థం చేసుకొని షాపు తెరిచి , కర్టెన్ కు కావాల్సినంత బట్ట ఇచ్చాడు.

బట్ట అయితే దొరికింది గాని దానికి కర్టెన్ రూపం రావాలి కదా. ఆ రాత్రి ఒంటిగంటకో ఏమో , మా భవాని దయ్యం లాగా లేచి , ఒక మిత్రుడి స్కూటర్ మీద అరసవెల్లి సార్ ఇంటికి పోయి , ఆయనను నిద్ర లేపి , అంత పెద్ద కర్టెన్ ను  ఒక్కతే కుట్టి పడేసింది . అది సుమారుగా ముప్పయి అడుగుల పొడవు,  పదిహేను అడుగుల వెడల్పు ఉంటుంది. ఒక్కతే అంత పెద్ద కర్టెన్ ను, అరగంటలో ఎట్లా  కుట్టగలిగిందో. నాకు అర్థం కాలేదు.

 తెల్లారి వచ్చి చూసేసరికి ధవళ కాంతుల్లో కర్టెన్ ప్రత్యక్షమైంది. “ఎవరో బాగా కష్టపడ్డారు” అనుకున్నా  గానీ, అది మా పిల్లలే చేశారని తర్వాత తెలిసి సంతోషపడ్డాను.

                                                           ****

మొదటిరోజు చివరి ప్రోగ్రాం లో మా నాటకం ఉంటది. గంట ముందే మా పిల్లలు డ్రెస్సింగ్ రూంలో చొరబడి ఆహార్యంలో మునిగిపోయారు. పూసలు ,దండలు , పట్టీలు ,చేతి దండలు, తూవ్వాల  లు ఇలా ఏమేమో సమకూర్చుకున్నారు . రౌడీ వేషాల కోసం అచ్చంగా రౌడీల లాగానే బొట్టు పెట్టుకుని పట్టిలు కట్టుకొని తయారయ్యారు .

 మేము చివరి క్షణాన్ని సైతం వినియోగించుకున్నాం . ఇంకా నాటకం కొద్ది నిమిషాల్లో మొదలవుతుందనగా, రాజశేఖర్ (ఎస్సై )సూర్య (విద్యార్థి నాయకురాలు) ను పక్కకు పిలిచి డైలాగులు చెప్పమన్నాను. అక్కడ కూడా కొంత ఇంప్రూవ్ అయింది.

                                                           ***

ఏదైతేనేం ,అనేక అవాంతరాలు దాటి నాటకం మొదలైంది .

ఉత్సాహం  పట్టలేక, కాలు నొప్పితోనే మెట్లు దిగివచ్చి, ప్రేక్షకుల దగ్గర నిలబడి నాటకం చూశాను .ప్రేక్షకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అనే భయం . చాలామంది తమ సెల్ ఫోన్ లో నాటకాన్ని బంధిస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండటంతో ప్రేక్షకులు నాటకానికి కనెక్ట్ అయ్యారని తెలిసింది. ఇంకమాటిమాటికి దిగి చూడవలసిన అవసరం లేదనిపించింది

నాటకం పూర్తయింది .

 ఒక ఉద్విఘ్న పరిస్థితి .

 కళ్యాణ్ రావు గారు చాలా ఉద్వేగంతో స్టేజి మీదకు వస్తుంటే, ఎదురేగి ఆహ్వానించాం.  ఆయన అట్లా రావడమే మాకు ఒక ఇన్స్పిరేషన్.  “అది నాటకంలా లేదు. జీవితంలా ఉంది” అని  అనడంతో దానికదే ఒక సర్టిఫికెట్  అయింది. ఆయన సభ్యుల్ని పేరుపేరుగా మెచ్చుకోవడం భూపాల్ సార్ ను కౌగిలించుకోవడం చాలా సంతోషం అనిపించింది. స్టేజి మీదకి రాఘవాచారి రావడం , అరసవిల్లి కృష్ణ మైక్ తీసుకోవడం అంతా కలలాగా మారిపోయింది. we  were on the clouds nine.

బయటికి వచ్చిన తర్వాత వేణు సార్ సంతోషంగా కౌగిలించుకున్నాడు. భూపాల్ సార్ అన్నం తింటుంటే ఎంగిలి చేయితోనే కౌగిలించుకున్న ఉద్విగ్న పరిస్థితి.

హరగోపాల్ సార్ నాటకం చూసి  “మన వాళ్ళలో ఏదో స్పార్క్  ఉందయ్యా  ” అన్నాడట.

తమిళనాడు నుండి వచ్చిన ఒక ఉద్యమకారిణి. ” I  remember every scene of your drama ” అనడంతో  తబ్బిబ్బయ్యీము . 

అరసవెల్లి కృష్ణ గారు మాట్లాడుతూ ” నాటక ప్రస్థానం మొదలైంది” అని మా మీద పెద్ద బరువే  పెట్టాడు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

                                                                 ***

 లోపాలూ ఉన్నాయ్.   ము గింపు బాగా లేదని, బలంగా లేదని తమిళనాడు మిత్రులుగాక వేరే మిత్రులు కూడా విమర్శించారు. కొన్నిసార్లు లైటింగ్ ఫెయిల్ అయింది .కొన్నిసార్లు డైలాగులు పొరపడినట్లుంది .

ఇవి సవరించుకొదగిన లోపాలు . మరుసటి రోజు మిత్రులు నాటకం గురించి మాట్లాడుతుంటే గర్వమనిపించింది .ఇదంతా  “సమిష్టి కృషి “అని పదేపదే చెప్పుకొచ్చాను .ఇప్పుడు అదే చెప్తున్నాను

 “మనవాళ్లు మన వేదిక మీదనే కాకుండా , ఇతర వేదికల మీద కూడా వేస్తే బాగుంటుందని ” వరలక్ష్మి గారి మాటలు మనకు హెచ్చరికలు.

 సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్లో ఇసుకలో , సభ్యులందరం కూర్చొని నాటకం గురించి మదింపు చేసుకున్నాం . విమర్శలు వచ్చాయి . సభ్యులు వాడిగా వేడిగా చర్చించారు. నామీద  కూడా విమర్శ వచ్చింది . నాతో సహా అందరం విమర్శల్ని వినమ్రం గా స్వీకరించాం.

ఒక మహత్తరమైన అనుభవాన్ని మాత్రం కోల్పోయాం

 సభకు సిలింగేర్ఉ ద్యమకారులు రావడం కొత్త ఊపునిచ్చింది. నాటకంలో పాడే పాట    “గావ్ ఛోడబ నహీ/.    జంగల్  ఛోడబ నహీ ” కు  సిలింగేర్ అమ్మాయిలను కూడా కలుపుకొని డాన్స్ చేయాలనుకున్నాం. మధ్యాహ్నం పూట భోజనశాల దగ్గర మా వాళ్లు, సిలింగేర్ సభ్యులు కలిసి వేసిన స్టెప్పులు అద్భుతంగా పడ్డాయి. నాటకానికి కొత్త ఊపు వస్తుందనుకున్నాం.కానీ చివరికి నాటకం వేసే సమయానికి వాళ్లు మాకు కనపడలేదు .  “వాళ్ళు వెళ్లిపోయారు” అని ఎవరో చెప్తే నిరాశ పడ్డాం, కానీ వాళ్ళు నాటకం అయిపోయిన తర్వాత వచ్చారు అని తెలిసింది. ఎక్కడో సమాచార లోపం జరిగింది . వాళ్లతో కలిసి డాన్స్ చేసే గొప్ప అనుభూతిని కోల్పోయాం.

 కొందరు నాటకం సక్సెస్ అయిందన్నారు . కొందరు విమర్శ చేశారు . ఏదైతేనేం ఒక అడుగు పడ్డది

 “బాసగూడ “నాటకం సక్సెస్ అయిన తర్వాత , “గౌరీ లంకేష్”  తర్వాత  , ” నీడలు “ఓ  క్రమం  మొదలైంది.

 నాటకంలో సభ్యులేగాక ,బయటి వాళ్ళ సహకారం మరువలేనిది. ముఖ్యంగా, విజయవాడ మోహన్ రావు సార్ మేలు మరువలేనిది దగ్గరుండి పెద్దన్న లాగా అన్ని చూసుకున్నాడు.  ఎక్కడా కనపడడు . లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు . ఇంకెందరో పేరుపేరునా దండాలు .

ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి .చాలా స్టడీ చేయాలి. నేర్చుకోవాలి .

 నాటకం మారాకు వేయాలి . మహావృక్షంగా మారాలి.

Leave a Reply