తల్లి అయితేనేం ఒడిలో పసిపిల్ల అయితేనేం 
తూటా తుపాకి నుంచి దూసుకొచ్చిందంటే
నెత్తురు తాగకుండా నేల రాలదు
ముగ్గురయితేనేం మావోయిస్టులు పదముగ్గురయితేనేం
పట్టాలు తప్పిన డబుల్‌ ఇంజన్‌ రైలు
రక్తదాహానికి నాలుగు నెలల్లో
ఏభయి అయితేనేం ఎందరయితేనేం
మనుషులుగా ఆటంకమైన వాళ్లందరూ
అసువులు బాయందే
అడవిలో కంపెనీ కాల్మోపలేదు

పక్షులయినా అడవిలో కాయో పండో తిని
విహాయసంలో ఎగిరినపుడు
విత్తనాలు వెదజల్లుతాయి
ఎదురిచ్చే కృతజ్ఞతతో
బాక్సైట్‌ దోచుకొని ఆకాశంలోకెగిరిన
భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు మాత్రం
చెట్టు చేమలనూ, జనావాసాలనేకాదు
నేల సారాన్ని ధ్వంసం చేసి
ఆదివాసీ ఉసురు తీసిగానీ ఎగురవు
అర్థంకాని పరాయి లోకపు
లోహ విహంగం ఆకారంగా
హృదయ రహిత రాజ్యం నీడగా
మనుషుల మధ్య భీతావహంగా అసహ్యంగా
లూటీ సర్కారు జనతన సర్కార్‌
సరిహద్దుల్నే చెరిపేసేదాక ఈవియం యంత్రంగా

అమరుల స్థూపాలను కూలుస్తూ
భద్రతా బలగాలు
అభద్రతా భావాన్ని రగిల్చే సైనిక పటాలాలు
జ్ఞాపకాలను చంపేసే పిరికితనంతో
అడవిలో కూల్చిన స్థూపం ఏమవుతుంది
మట్టిలో మట్టవుతుంది కొండంచు వాగవుతుంది
వృక్షాల వేళ్లు అవుతుంది
మట్టి మనిషి ప్రాణాలు అమరత్వంలో
ఎప్పుడో పంచ భూతాల్లో కలిసి
ఆదివాసికి అండగా ఉన్నాయి

అయినా అడవిలో ప్రతి చెట్టూ
అడివేతరంగా పోరాడి
నింగికెగసిన ఒక జ్ఞాపక చిహ్నమే
ప్రాణ వాయువు వీచే ఒక త్రాణయే
రణ క్షేత్రంలో ఒక సాల వృక్షమే

భూమి కింద అడవి గర్భంలో
ఖనిజాలు మాత్రమే లేవు
తర తరాల ఆదివాసీ పోరాట యోధుల
త్యాగాల సారం ఉంది
ప్రజలు నిర్మిస్తున్న చరిత్ర పునాది ఉంది
విస్ఫోటనం చెందుతున్న విప్లవ విత్తనం ఉంది
ప్రజా యుద్ధ బహిరంగ రహస్యముంది

నాలుగు నెలలే నాలుగు దిక్కులూ కావు
రాగల కాలాలూ కావు
ఎంత మంది మనుషులు, ఎన్ని ప్రాణాలైనా
అంకెలు సంఖ్యలుగా మారి భయపెడతాయని
నీవనుకోచ్చుగానీ
నుదుట మరణ శాసనం రాసుకొని
యుద్ధ రంగంలో దిగిన
ప్రజా యుద్ధ వీరుల చాలు అది
పెద్దిశంకర్‌ నుంచి
అన్నె సంతోష్‌ దాకా
కార్చిన నెత్తురు
మిళింద్‌ ఆనంద్‌ దూలాల స్వేద జలంతో
ఎన్ని కాగడాలయి అడవిలో
పలాస వృక్షాలై పుష్పించాయో చూడు

మనుషులు నదులై ప్రవహించే
నర్మద, శబరి, ఇంద్రావతి, గోదావరి
వెయిన్ గంగ , ప్రాణహిత గమనం
నీ దోసిట్లోంచి రక్త వర్తమానంగా
జారిపోతూ ఉండగానే
తోసుకొచ్చే దండకారణ్య గమ్యం అది.

14 -04 -2024

One thought on “కగార్  యుద్ధం

Leave a Reply