ఒకటి:
 లోహ సందర్భం


నిర్భయత్వానికి 
చాలా సార్లు తోడు దొరకదు!
భీరువులు జనాభాగా నిండిపోయిన ప్రపంచం కదా!

దాహం వేసినప్పుడు దాహమే తోడు
ఆకలేసినప్పుడు ఆకలే దోస్తు

పక్క మీద కళ్ళ నుంచి దొర్లిన కలత కలలా
"హింస" మీద పడి 
రక్కడానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుంది

డ్రోన్లు నెత్తి మీద ఆడుతున్నపుడు
బాంబుల కంట్లో కన్ను పెట్టి చూస్తూ 
ప్రాణాన్ని ఉగ్గబట్టుకోవాలి
పక్కన పడి విచ్చుకునే అగ్నిదాహానికి 
ఆహుతైపోకుండా కాపాడుకోవాలి


ఆయుష్షుకీ, మృత్యువుకీ మధ్య గీతలన్నీ 
కరిగిపోయిన కాలపు సందిగ్ధత లో 
స్పష్టమైన చూపుతో ముందుకెళ్ళాలి

దుమ్మూ - ధూళీ, పొగను పీలుస్తున్న 
గాలి ఊపిరితిత్తులను 
శుభ్ర పరుస్తూ దృశ్యాన్ని వడగట్టాలి

భూమ్మీద ఆహారాన్ని ధ్వంసం చేస్తూ 
ఆకాశంమ్మీద నుంచి సహాయంగా జారవిడుస్తున్న 
లోహ సందర్భంలో 
నీ ధైర్యం సామ్రాజ్యవాద వ్యతిరేక 
యుధ్ధానికి చిరునామా!

గాజా నగరవాసీ
క్షతగాత్ర సహవాసీ
సాహసీ

యుధ్ధాన్ని ఎదుర్కొవడంలో 
నువ్వు ప్రదర్శిస్తున్న తెగువ
నీ నిర్భయత్వం-
నగరాలు  శిధిల  మైదానాలై పోతున్నా 
మాతృభూమిని 
వొదిలిపోని నీ పట్టుదల-

సమస్త ప్రపంచ శ్రమజీవులకు రక్షణ కవచం..
చరిత్ర మీద అద్దుతున్న నెత్తుటి జ్ఞాపకం..

రెండు :
గాజాకు ప్రేమతో...


ఇది ప్రేమ లేఖ‌ మాత్రం కాదు
అలాగని ప్రేమతో రాయనిది కూడా కాదు

అక్షరాల తటపటాయింపు 
ఈ కవితమ్మొత్తం కనబడవచ్చు
కానీ నీకు నా సందేశం స్పష్టంగా 
చేరాలనే ఆశ మాత్రం 
నీ యుధ్ధ  వ్యతిరేకతలా సజీవమైందే!

పోరాటమే కదా మిగిలింది నీకైనా నాకైనా
నీదైన దేశాన్ని నీది కాదుపొమ్మనే ప్రబల శక్తితో నువ్వూ
బుల్డోజర్ అంత ద్వేషపు బరువును గుండెల పై  మోస్తున్న నేనూ 
కాల సముద్రపు కరకు కెరటాలకు
ఎదురీదుతున్న వాళ్ళమే!!

వెలుతురు దేవుడి
గుండె లోపల అణువుల పరివర్తన జరిగి
శక్తి విడుదలైనట్టు

మౌనం శబ్దంగా పరిణామం చెందే 
ఒకానొక ఆగ్రహ నాదం నాలోంచి బయల్పడి
నీ దాకా చేరడానికి పడుతున్న యాతనకు 
ఏ పేరు పెట్టలేం...

యుధ్ధాన్ని అపగలిగీ ఆపని ద్రోహ కాలం కదా
విద్రోహ దినాలన్నీ నీ పక్కనే తిష్ట వేసుకున్నాయి కదా

గాజాకు ఇప్పుడు కన్నీళ్ళ నజరాన కాదు
సానుభూతి పవనాలు అస్సలవసరం కాదు

గొంతుకడ్డం పడ్డ దుఃఖాన్ని 
లోనికి దింపుకునే గుక్కెడు నీళ్ళు కావాలి...
నిప్పుల వర్షం కాదు 
జలాన్ని ఆకాశం కురిపించాలి 

వరుస విమానాలు వందల శరాఘాతాలు
తప్పించుకుంటే బతుకు లేకపోతే మృత్యువు 
ఈ రెండు పదాల మధ్య లోలకంలా
ఊగుతున్న నీ ఊపిరి మీద పరుచుకున్న
సామ్రాజ్యవాద డేగల నీడను 
తుడిచిపెట్టే ప్రపంచం పరివారంగా నీ చుట్టూ మూగాలి

మరణాన్ని మాత్రమే 
విసర్జించే నవీన ఆయుధాలకు విరుగుడుగా
సహానుభూతి మాటలో చెప్పలేను
కన్నీటి సిరా తో ప్రేమ లేఖ రాయలేను

ఏడువందల కోట్ల కంఠాల ప్రతిధ్వని 
ఆయుధమై 
మద్దుతుగా సమస్త మానవాళి నీ పక్కన  నిలబడాలనుకుంటున్నాను

నేను నిలబడతాను.

Leave a Reply