ఇండియాలో స్త్రీలు అనగానే కట్టు బొట్టు అంటూ మొదలుపెడతారు. అందం మాటున అణచివేత ఉంది. సాంస్కృతిక కట్టడి ఉంది. స్వేచ్ఛగా కదలడానికి వీలు లేని ఆహార్యం స్త్రీలకు నిర్దేశితమైంది. తరాలు మారినా, ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా ఇష్టంగానో అయిష్టంగానో ఈ గుదిబండను స్త్రీలు మోస్తూనే ఉన్నారు. ‘తగలెయ్యాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్త్రీవాదులతో సహా. ఎందుకంటే అది వదిలించుకోవడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది మాత్రమే కాదు. అది సమాజంలో నీ ఉనికిని, గుర్తింపును, గౌరవాన్ని నిర్దేశించేది. ఒక కుటుంబానికి సంబంధించిన, సమూహానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల భారాన్ని మోయవలసింది స్త్రీలే. తన పురుషుని ఉనికిని, హోదాను, సంపదను ప్రదర్శించేది స్త్రీయే. స్త్రీల అలంకరణలన్నీ వారి సొంతం కాదు. వారి కోసం కాదు.

ఇప్పుడు కుటుంబమే కాదు, రాజ్యం కూడా సంస్కృతి పేరుతో స్త్రీలను నిర్దేశిస్తోంది. ఎలా ఉండాలి,  ఎక్కడుండాలి, ఏం చేయాలి అని ప్రభుత్వ సాంస్కృతిక సలహాదార్లు, ప్రజాప్రతినిధులు, దేశ సంస్కృతీ పరిరక్షకులు సెలవిస్తున్నారు. సంస్కృతిలోని అన్ని ఆధిపత్యాలను ఫాసిజం తన చేతుల్లోకి తీసుకుని అన్ని ప్రజాస్వామిక చర్చలను రద్దుచేసే పని మొదలుపెట్టారు. ఆధిపత్య సంస్కృతిని ప్రశ్నిస్తే చాలు, మన మహోన్నత సంప్రదాయాలను మంటగలుపుతున్నారని బెత్తం పట్టుకుని బయలుదేరుతున్నారు. సుదీర్ఘమైన సాంఘిక ఉద్యమాలను, సంస్కరణలను కాదని పాత రాచరిక అనాగరిక పద్ధతులవైపు లాక్కుపోతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చిందే ‘బొట్టు’ కవిత. స్త్రీవాద రచయిత కొండేపూడి నిర్మలది పదునైన స్వరం. ఆ స్వరంలో రాసిన ఒక్క కవితలో ‘బొట్టు’ అనే సాంస్కృతిక చిహ్నాన్ని పురుషాధిపత్య ప్రతీకగానే కాక మెజారిటీ మత ఆధిపత్య ప్రతీకగా కూడా  నిరూపించారు. ఛాందసవాదులు అక్కసుపట్టలేక ఈమె హిందూ వ్యతిరేకి అంటూ విషం కక్కారు. సోషల్‌ మీడియా పోకిరీలు ఆమె మీద దారణమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. నేరుగా ఫోన్‌చేసి బెదిరించేదాకా కూడా ఇది సాగింది. స్త్రీవాదం మీద, స్త్రీవాద సాహిత్యం మీద ఎనభైల నుండి ఎంతో చర్చ ఉంది, వాదవివాదాలున్నాయిగాని ఇంత దిగజారుడు సంస్కృతిని మన సమాజం ఇప్పటి దాకా చూడలేదు. అవును, ట్రోలింగ్‌ కల్చర్‌ చాలా వేగంగా విస్తరిస్తోంది. అన్ని ప్రగతిశీల భావాల మీద ఇదే తరహా దాడిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రధాన స్రవంతి మీడియా భాష కూడా మెల్లగా మారిపోతోంది. భాషలో, వ్యక్తీకరణలో, వాదనలో ప్రజాస్వామికత కనుమరుగవుతోంది. అన్ని చోట్లా ఫాసిజం తన మూకను తయారుచేసుకుంటోంది. ఒక సమాజం ప్రజాస్వామీకరణ చెందడం సుదీర్ఘ ప్రయాసతో కూడుకుని ఉంటుంది. యుగాలుగా వంటబట్టినవి వదిలించుకోవడం అంత సులువు కాదు. ఉదాహరణకు కులస్వభావం, పితృస్వామిక స్వభావం అంత తొందరగా పోయేవి కావు. దానికి అనేక రూపాల్లో పోరాటాలు జరగాలి. అదే సమాజం అనాగరికతలోకి జారుకోవడం చాలా సులువు. ఆ మూక స్వభావం ఇప్పుడు మనం చూస్తున్నాం.

సంప్రదాయవాదులు అంతగా ఉలికిపడటానికి అసలు ఈ కవితలో ఏముంది? కవికి అంత ద్వేషాన్ని ఆపాదించేలా అందులోని భావాలు ఉన్నాయా? ఈ కవిత హిందువుల మీద ద్వేషం ప్రదర్శించిందా?

ప్రగతికి, మార్పుకు ప్రతిబంధకంగా ఉన్న ఆచారాలను సంప్రదాయాలను గతంలో ఎంతో మంది నిరసించారు. పాత అలవాట్లను సమాజం వదిలించుకుంటూ ముందుకు పోవడం చరిత్రగతిలో చాలా సాధారణం. బొట్టు అనేది అలంకరణ విశేషం మాత్రమే అయితే దాని మీద ఈ ఇంత చర్చ, రభస అవసరం లేదు. కొంత మంది చెబుతున్నట్లు పసుపు, కుంకుమ ఆరోగ్యానికి మంచి చేసేవైౖతే దానిని అంగీకరించేవాళ్లు ధరిస్తారు. మూత్రం తాగేవాళ్లు ఉన్నట్లు ఇలాంటివాళ్లు ఉండొచ్చు. అది నియమం అయితే, అది కూడా కొంతమందికే అయితే ఏదో ఒక దశలో తప్పకుండా ప్రశ్నిస్తారు.

‘బొట్టు ఎన్నాళ్ళు దిద్దుకోవాలో, ఎందుకు రాల్చుకోవాలో నా చేతిలో లేదు’ అంటున్నారు కవి. ‘బొట్టు లేని మొహం ఒక మొహమే కాదని’ అంటారు కదా, మరి భర్త చనిపోతే ఎందుకు ఆ బొట్టుకు దూరం కావాలి? అట్లా బొట్టు తుడిపేసి ఆ స్త్రీని అశుభానికి సూచికగా చూపి అవమానించడం ఎటువంటి సంస్కృతి? ఎవరు ‘పునిస్త్రీ’లో, ఎవరు ‘విధవ’లో మొహం మీద ముద్ర వేయడం వెనక ఏం పనిచేస్తున్నది? ఇటువంటి ముద్రలు మగవాళ్లకు ఎందుకుండవు? అసమానత్వాన్ని, అణచివేతను అమలుచేసే ఏ సంప్రదాయమైనా అనాగరికమైనదే. ప్రజాస్వామ్యంలో అది పొసగదు. సమాజం ప్రజాస్వామీకరణ చెందే క్రమంలో ఇటువంటి పొసగని అనేక విషయాల మీద ఘర్షణ ఉంటుంది.

బొట్టును ఇష్టంగా పెట్టుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే అది అలవాటుగా, ఇష్టంగా, బాల్యక్రీడగా అయ్యే క్రమం ఎలా ఉంటుందో వివరిస్తారు. ‘పదకొండో రోజు ముద్దుపెట్టాల్సిన చోటు అమ్మ బొట్టుపెట్టేసింది’. అప్పడు ప్రవేశిస్తుంది బొట్టు తన జీవితంలోకి. అంటే ఊహ తెలియని వయసులోనే. అప్పటి నుండి మొహం ఖాళీగా ఉండన్విరు.

అయితే కవి దీనిని అంత సాదాసీదా విషయంగా చెప్పరు.

‘నుదిటి మీద కాటు వేసుకొని విషకన్యలా నవ్వుకోవడం బాల్యక్రీయ అయింది’ అనడం వెనక ఈ సంప్రదాయం మీద ఆమె బలమైన ఆక్షేపణ వినిపిస్తుంది. బొట్టును పాము కాటుతో పోల్చడం కాస్త నివ్వెరపరుస్తుంది కూడా. కానీ సంప్రదాయాలు, ముఖ్యంగా అలంకరణ విశేషాలు స్లో పాయిజన్‌ లాంటివి. మెల్లగా ఎక్కించుకుని విషకన్యలా మారిపోయి, బొట్టు లేని స్త్రీలను చిన్నచూపు చూస్తారు. సంప్రదాయానికి ఒదిగిపోతారు, అదే సంప్రదాయాన్ని పరిరక్షించడానికి తయారైపోతారు. ఇదంతా ఒక కనపడని హింస.

సమాజం పోరోగమించి మనుషులు ఎదిగి ఆలోచించడం మొదలుపెడితే వీటి గుట్టు బైటపడుతుంది. అట్లా చైతన్యం పెరిగి కొంతమంది స్త్రీలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఫాసిజం కోరలు విసిరింది.

సంస్కృతి రాజ్యం చేతిలో ఆయుధమూ, అణచివేత సాధనమూ అయ్యాక అది మరింత హింసాత్మకమైంది.

అందుకే ‘ఇప్పుడు బొట్టు సూక్ష్మరూపి ఎంతమాత్రం కాదు’ అంటారు. అంతే కాదు ‘బొట్టుకు గడ్డాలు, మీసాలు వచ్చాయి’ అంటారు. ఇది చదవగానే నిలువెత్తు తిలకాలు దిద్దుకుని వీధుల్లో వీరంగం చేసే మూకలు మనకు గుర్తురాక తప్పదు. వ్యాపారంలోనూ, రాజకీయంలోనూ ఇంకా చాలా రంగాల్లో బొట్టు ప్రవేశించిందని, ఇన్ని రకాల తిలకాల మధ్య మనమెటో దారితప్పుతున్నామని గుర్తుచేస్తారు.

‘బొటన వేలితో బొట్టెట్టి చూపుడు వేళ్ళు నరుక్కుపోతున్నారు’ అనడంలో మతరాజకీయం ప్రజలను మాయచేసి దోపిడి చేస్తున్న వైనం కనపడుతుంది. ఇంకా హిందుత్వ పేరుతో చేస్తున్న హింసను, నాటుతున్న భయాన్ని ‘బొట్టు’ అనే ప్రతీకను తీసుకొని చిత్రించారు. అందుకే ‘బొట్టు’ ఈకాలపు స్త్రీవాద కవిత. ఫాసిజం విజృంభిస్తున్న వేళ బలమైన స్త్రీవాద ప్రతిఘటనా స్వరం.

దీనిమీద జరుగుతున్న ట్రోలింగ్‌ అంతా ఈ కవితలో ఉన్న శక్తిని తెలియజేసేదే. సహజంగానే వాళ్లు చర్చకు నిలబడరు. ప్రజాస్వామ్యం, స్త్రీల హక్కలు వంటి సున్నితమైన విషయాలను అర్థం చేసుకునే మనుషులే అక్కడ ఉండరు. అది ఒక మంద, అంతే. ఫాసిస్టులు దానిని అవిశ్రాంతంగా పెంచి పోషిస్తున్నారు.

‘కాలం నడుస్తున్నట్టు లేదు.

కాళ్ళీడ్చుకుంటూ పోతున్నట్టుగా ఉంది.

అక్కడ ఎగరాల్సిన సీతాకోకచిలుక గొంగళపురుగై పాకుతోంది’

వాళ్లు కాలాన్ని వెనక్కి తీసుకుపోవాలనుకుంటున్నారు. కానీ అది సాధ్యమా? ప్రపంచ పెట్టుబడిని రెండు చేతులతో కావలించుకుంటున్న ఫాసిస్టులు ఏ రాతియుగంలోకో ఎలా తీసుకుపోతారు? సాంస్కృతికంగా వెనక్కి, ఆర్థికంగా ముందుకు మరింత పెట్టుబడి, మరింత విధ్వంసం, మరింత దోపిడి. ఆ విన్యాసం ఎంతో కాలం సాగడానికి చరిత్ర నియమం అంగీకరించదు. అన్ని మలినాల్ని తోసేసుకుని ప్రవాహం ముందుకే సాగుతుంది. ఈలోగా ఎంత హింస జరగాలో? అటువంటి హింసకు తట్టుకుని కాలం పరీక్షకు నిలబడ్డ కవి కొండేపూడి నిర్మలకు అభినందనలు.

4 thoughts on “ఈకాలపు స్త్రీవాద కవిత  ‘బొట్టు’

  1. చాలా సంతోషం ఇచ్చింది మీ సమీక్ష varalakshmi

  2. Thank you నిర్మల గారూ. Trolling గురించి విన్నాక రాయకుండా ఉండలేకపోయాను.

  3. వరాలూ, “ఈకాలపు స్త్రీ వాద కవిత గురించి నీ సమీక్ష చాలా సహేతుకంగా, అద్భుతంగా ఉందిరా . ప్రేమపూర్వకమైన అభినందనలు!

Leave a Reply