మా అప్పీలు  విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.’

ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది.

ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా,  అతని సహ నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి విజయవంతమైన పోరాటం వెనుక సంవత్సరాల తరబడి జరిగిన సన్నాహాలు వున్నాయి. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు జూనియర్‌లుగా ఉన్న న్యాయవాదుల బృందం చేసిన కృషి ఆ తయారీకి వెన్నెముక.

కోర్టులో వాదించిన సీనియర్‌ అడ్వకేట్లు.. త్రిదీప్ పైస్, ప్రదీప్ మంధ్యాన్, ఎస్పీ ధర్మాధికారిలు అయితే వారికి వివరాలందించడానికి బృందంగా పనిచేసిన న్యాయవాదులు బరుణ్ కుమార్, నిహాల్ సింగ్ రాథోడ్, హర్షల్ లింగాయత్, ఆకాష్ సోర్టే.

2017లో ప్రొఫెసర్ సాయిబాబా, మహేశ్ టిర్కీ, పాండు నరోటే ( ఆగస్టు 2022లో కస్టడీలో మరణించాడు ), హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీలపై  మావోయిస్టులు అనే ఆరోపణలపై జీవిత ఖైదు, విజయ్ టిర్కీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ శిక్షపై వెంటనే అప్పీల్ దాఖలు చేశారు.

అయితే 2018లో, ఆ అప్పీల్ దాఖలు చేసిన, ట్రయల్ కోర్టు డిఫెన్స్ లాయర్ సురేంద్ర గాడ్లింగ్‌ను భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేశారు.

“అప్పటికి అప్పీల్ విచారణకు కూడా లిస్టు కాలేదు” అని సాక్ష్యాధారాల రికార్డింగ్ ముగిసిన తర్వాత, విచారణ ముగింపుదశకు వస్తుండగా గాడ్లింగ్ బృందంలో చేరిన న్యాయవాది బరుణ్ కుమార్ గుర్తుచేసుకున్నారు.

నిందితులకు శిక్షను సస్పెండ్ చేయించడం, బెయిల్ తీసుకోవడం అనేది తమ మొదటి ప్రాధాన్యతగా వుండింది. కానీ  విజయ్ టిర్కీకి మాత్రమే బెయిల్ సాధించగలిగాం, వైద్యపరమైన కారణాలతో అప్పీలు చేసినప్పటికీ ప్రొఫెసర్ సాయిబాబాకు తిరస్కరించారు అని అతను గుర్తుచేసుకున్నాడు.

బెయిల్, పెరోల్‌ల కోసం చేసిన అప్పీల్‌లను పదేపదే తిరస్కరించిన తర్వాత, ప్రొఫెసర్ సాయిబాబా తల్లి అనారోగ్యంతో బాధపడి, మరణించిన తరువాత, అప్పీల్ తుది విచారణకు సిద్ధం కావాలని కోర్టు చెప్పింది. అయితే కోవిడ్ లాక్‌డౌన్ వల్ల కోర్టులు అప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే పని చేస్తున్నాయి అని బరున్ వివరించారు.

“డాక్యుమెంట్లు అత్యధికంగా వుండడంతో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అప్పీల్‌ను వాదించడం సాధ్యం కాదు” అని బరున్ చెప్పారు

గాడ్లింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత, కొత్త న్యాయవాదులను వెతకాల్సి వచ్చింది. నిందితులందరి తరపున న్యాయవాది ఒక్కరే కాకపోవడంతో ముగ్గురు సీనియర్ న్యాయవాదులకు వివరాలనందించే పనిని జూనియర్లుగా తాము విభజించుకొన్నామని, అప్పీల్ దశలో గాడ్లింగ్‌కు జూనియర్‌గా చేరిన ఆకాష్ సోర్టే చెప్పారు.

“మా అప్పీల్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మాకు విశ్వాసముండింది. మేము సాక్ష్యాలను విచ్ఛిన్నం చేసి అవి డొల్ల అని నిరూపించమని మాకు తెలుసు.” అని సోర్టే అంటాడు.

గాడ్లింగ్ లేకపోవడంతో, అతను తయారు చేసిన వ్రాతపూర్వక వాదనలు, అతని క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలపైన అతని జూనియర్లు ఆధారపడ్డారు.  “మేము వాటిని మళ్ళీ మళ్ళీ చదివేవాళ్లం” అని బరున్ గుర్తుచేసుకున్నాడు. “కానీ ప్రదీప్ సర్ ( ప్రదీప్ మంధ్యన్ ) మాకు ఆ పంక్తుల మధ్య వున్న అర్థాన్ని చదవడం నేర్పించారు. ఆయన మాతో ఒక రోజంతా ఎఫ్‌ఐఆర్ చదివించారు!”

 “కుట్ర చేసింది నిందితులు కాదు; అవతలి వైపువారు” అని అని ఆయన అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని బరున్ జోడిస్తాడు. “అతను పోలీసుల మనస్సును అర్థంచేసుకోగలడు. ఒక కథకుడిలా తన వాదనలను అభివృద్ధి చేశాడు. పోలీసు పత్రాల వెనుక ఉన్న విశాల చిత్రాన్ని ఎలా చూడాలో మాకు నేర్పించాడు.”

హర్షల్ లింగాయత్ విచారణ ప్రక్రియ అంతటా  గాడ్లింగ్ జూనియర్‌గా వున్నాడు. 41 ఏళ్ల వయస్సు గలిగిన అతను  ప్రొఫెసర్ సాయిబాబా విడుదలకు అవసరమైన పత్రాలను తీసుకోడానికి గడ్‌చిరోలికి డ్రైవింగ్ చేస్తూ, నిందితులందరినీ నిర్దోషులుగా ట్రయల్ కోర్టు విడుదల చేస్తుందని తాము ఎంత నమ్మకంగా ఉన్నారో గుర్తు చేసుకున్నాడు.

“వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల స్వభావం మాకు ఆ విశ్వాసాన్ని ఇచ్చింది, కానీ న్యాయమూర్తి దానిని విస్మరించారు. హైకోర్టు జాబితా చేసిన ప్రతి ఒక్క అంశాన్ని మేము ఎత్తి చూపాము. మా వాదనలను గుర్తించారు, కానీ ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదు,” అని అన్నాడు.

Yet, lamented Barun, a hype was created around that sessions court judgment. It was even found worthy of being included in the SCC Web site (Supreme Court Cases) and on Manupatra, an online data base for legal research.

అయినప్పటికీ, సెషన్స్ కోర్టు తీర్పు పైన ఒక సంచలనాన్ని సృష్టించారు అని బరున్ విచారం వ్యక్తం చేసాడు. ఇది ఎస్‌సిసి (సుప్రీం కోర్ట్ కేసులు) వెబ్‌సైట్‌లోనూ చట్టపరమైన పరిశోధన చేసే ఆన్‌లైన్ డేటా బేస్ ‘మనుపాత్ర’లో చేర్చడానికి కూడా అర్హమైనదిగా గుర్తింపు పొందింది.

ప్రొఫెసర్ సాయిబాబా తర్వాత తన వంతు వస్తుందని గాడ్లింగ్‌ చెప్పినప్పుడు లింగాయత్ కోర్టులో ఉన్నారు. (భీమా కోరేగావ్ కేసులో బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో గాడ్లింగ్ ఈ బెదిరింపుల వివరాలను ప్రస్తావించాడు.)

సోర్టే ఈ ఏడేళ్లుగా నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ప్రొఫెసర్ సాయిబాబాను కలుస్తూ, మందులు, బట్టలు అందజేస్తూ, ప్రతికూల వైఖరితో వుండే జైలర్లతో వ్యవహరిస్తున్నాడు. జైలులో మమ్మల్ని ఫోటోలు తీసే ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఉండేవారు’’ అని అన్నాడు.

ఎన్నో అపాయాలు ఉన్నప్పటికీ, జూనియర్‌లు ఎవరూ కేసు నుండి బయటకు వెళ్ళలేదు. నిజానికి, భీమా కోరేగావ్ కేసులో కూడా డిఫెన్స్ లాయర్లుగా వున్నారు. భీమా కోరెగావ్ విచారణ కమిషన్ ముందు హర్షాలి పొద్దార్ తరపు న్యాయవాదిగా బరుణ్ కుమార్ హాజరయ్యారు.

‘క్రిమినల్ కేసుల్లో, ప్రాసిక్యూషన్ సాక్షుల విశ్వసనీయతను అభిశంసించేందుకు క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రమే ప్రభావవంతమైన ఆయుధం’ అని సాయిబాబా, అతని సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ యిచ్చిన తీర్పులో కోర్టు వ్యాఖ్యానించింది.

విచారణ సమయంలో జరిగిన కీలక సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పైనే న్యాయమూర్తులు ఎక్కువగా ఆధారపడతారు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్‌ను సురేంద్ర గాడ్లింగ్ నిర్వహించారు.

ఎఫ్‌ఐఆర్‌లు, సీజర్ మెమోలు, అరెస్టు పంచనామాలు వంటి పోలీసులు ఆధారపడిన అన్ని పత్రాలను గాడ్లింగ్ నిశితంగా పరిశీలించాడు.  వాటిలో తాను కనుగొన్న వైరుధ్యాలతో, విచారణ అధికారి, పంచ్ సాక్షులు, ఇద్దరు నిందితులు తన ముందు అంగీకరించారని చెప్పిన మేజిస్ట్రేట్‌తో సహా సాక్షులను ఎదుర్కొన్నాడు.

కేసు ప్రక్రియ మొత్తంలో పోలీసులు ఉపా చట్టం నిబంధనలను ఎలా ఉల్లంఘించారో అతని క్రాస్ ఎగ్జామినేషన్ చూపించింది.

ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్‌లో మంగలిగా పనిచేసిన జగత్ భోలే క్రాస్ ఎగ్జామినేషన్‌లో చేసిన ఒప్పుకోళ్ళు (అడ్మిషన్లు), ఇష్టానికి వ్యతిరేకంగా ప్రొఫెసర్ సాయిబాబా ఇంటిపై దాడికి పంచ్ సాక్షిగా పోలీసులు అతన్ని తీసుకురావడం అనేది పోలీసుల చట్టవిరుద్ధతకు బహుశా అత్యంత దిగ్భ్రాంతి కలిగించే ఉదాహరణ.

తాను నిరక్షరాస్యుడిని అని పోలీసులకు చెప్పినట్లు తన క్రాస్ ఎగ్జామినేషన్‌లో భోలే చెప్పాడు. తన లాయర్ సమక్షంలో లేదా తన ఇంటిపై దాడి జరిగినట్లు విని పరుగెత్తుకొచ్చిన తన విద్యార్థులెవరి సమక్షంలోనయినా  సోదాలు నిర్వహించాలని ప్రొఫెసర్ సాయిబాబా అభ్యర్థించారని కూడా చెప్పాడు.

తమ ఇద్దరి అభ్యర్థనలను పట్టించుకోకుండా,  పోలీసులు తనను, ప్రొఫెసర్ సాయిబాబాను ఇంటి బయట ఉంచారని, వారు సోదాలు చేస్తున్నప్పుడు ఇంటి తలుపులు తాళం వేశారని కూడా భోలే చెప్పాడు.

అందువలన అతను సాయిబాబా ఇంటిని సోదాచేయడం గానీ  లేదా సామగ్రిని స్వాధీనం చేసుకోవడం గానీ చూడలేదు.

ఇద్దరు పంచ్ సాక్షులను విచారించారు. సీజ్ చేసిన సీడీ, డీవీడీ, పెన్‌డ్రైవ్‌లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య వుండే తేడాను గుర్తించడం తెలియదని, తాము  నిరక్షరాస్యులమని ఇద్దరూ అంగీకరించారు. ఒకరు స్టాక్ (రిజర్వు) పోలీసు పంచ్ సాక్షినని, మరొకరు సోదా జరగడాన్ని చూడలేదని అంగీకరించారు!

పోలీసు డాక్యుమెంట్లలో వున్నట్లుగా చూపించిన వైరుధ్యాలు:

1. ఎఫ్‌ఐఆర్‌లపై వ్రాసిన దాని మీద తిరిగి రాయడం (ఓవర్ రైటింగ్),

2. వేర్వేరు వివరాలను పూరించడానికి ఒకే ఎఫ్‌ఐఆర్‌లో వేర్వేరు చేతివ్రాతలను, వేర్వేరు ఇంక్‌లను వుపయోగించడం

3. అరెస్టు పంచనామా మొదటి- చివరి పేజీలలో వేర్వేరు తేదీలు.

4. హేమ్ మిశ్రా ఫేస్‌బుక్ పేజీలను చూపే స్క్రీన్‌షాట్‌ల దిగువన ఉన్న తేదీ, అతన్ని అరెస్టు చేసిన అధికారిక తేదీకి ముందు తేదీ.  కానీ అరెస్టు అయిన తర్వాత అతను వారి కోసం ఆ పేజీని తెరిచాడని పోలీసులు పేర్కొన్నారు.

5. ప్రొఫెసర్ సాయిబాబా ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులను మైనంతో సీలు చేసినట్లు లేదా పంచ్ సంతకంతో లేబుల్ చేసినట్లు సూచించలేదు.

‘ప్రాసిక్యూషన్ కేసు పూర్తిగా నిందితుడి నుండి నేరారోపణచేయగలిగిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది… నేరారోపణ చేసే విషయాలను స్వాధీనం చేసుకోవడం అనేది మొత్తం విచారణకు వెన్నెముక లేదా పునాదిగా వుంటుంది’ అని కోర్టు గమనించింది.

గాడ్లింగ్ క్రాస్-ఎగ్జామినేషన్ చేసిన సమయంలో గుర్తించిన  వైరుధ్యాలపైన  న్యాయమూర్తులు ఆధారపడడంవల్ల, ‘అరెస్టు చేసిన తేదీ నుండి నిందితుడి నుండి ‘నిందిత అంశాలు’ స్వాధీనం చేసుకోవడం వరకు, సాక్ష్యాలను సేకరించే ప్రతి అంశానికి సంబంధించి డిఫెన్స్ ‘సహేతుకమైన సందేహాన్ని సృష్టించడంలో విజయం సాధించిందని’ కోర్టు నిర్ధారించింది.

న్యాయవాదిగా చేసిన ఈ అద్భుతమైన పనికి, తగిన ప్రతిఫలంగా ప్రొఫెసర్ సాయిబాబా దోషిగా నిర్ధారించబడిన ఒక సంవత్సరం తర్వాత  2018, జూన్‌లో గాడ్లింగ్‌కు అరెస్టు లభించిందని అతని జూనియర్ హర్షల్ లింగాయత్ చెప్పారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,   ప్రొఫెసర్ సాయిబాబా, అతని సహ నిందితులకు శిక్ష పడిన ఈ కేసులో ‘కఠినమైన దర్యాప్తు’ చేసినందుకు, ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసిన, ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (గడ్చిరోలి) సుహాస్ బావాచేను అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సత్కరించారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్.

యాదృచ్ఛికంగా, భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన ఫాదర్ స్టాన్ స్వామి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబు ఇళ్లపై దాడులు చేసినప్పుడు పూణే పోలీసులతో పాటు ఆ అధికారి కూడా ఉన్నాడు. ఫాదర్  స్టాన్ స్వామి 2021 లో కస్టడీలో మరణించారు.

మార్చి 08, 2024

https://m.rediff.com/news/special/how-these-lawyers-worked-tirelessly-to-free-saibaba/20240308.htm?fbclid=IwAR1eI_XKqhn4YQJMSrJ1DCqVmhSeHj2uEteKuC_wq6Rvz9rjVy2CsF0BTUE

Leave a Reply