ఏదైనా ఒక రచనను, లేదా సిద్ధాంత ప్రతిపాదనను అంచనా వేసే సమయంలో దాని చారిత్రక సందర్భాన్ని చూడాలి. ఆరాధనా భావంతో కాకుండా విమర్శనాత్మకంగా చూడాలి. ఆ వ్యాసానికున్న స్పిరిట్‌ అవగాహన చేసుకోవాలి. మొత్తానికి ఆ సిద్ధాంత ప్రతిపాదన  ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాల్ని ఎట్లా చూస్తున్నది, అవి పరిష్కారం కావడానికి ఉన్న ఆటంకాలుగా వేటిని భావిస్తున్నది, వాటి మీద ఎటాంటి విమర్శనాత్మక వైఖరిని ప్రకటిస్తున్నది అని చూడాలి. 

జనవరి 27, 28 తేదీల్లో విరసం సభలో పి.వరలక్ష్మి ఇచ్చిన కీ నోట్‌ ప్రసంగాన్ని పై నేపథ్యంలో అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. ఆ కీనోట్‌ మొత్తం ఫ్రేం వర్క్‌ను పరిశీలించే ప్రయత్నం చేయలేదు. అది విరసం సభల కరపత్రంలోనే ఉన్నది. దాన్ని కీనోట్‌ మరింత స్పష్టంగా చెప్పింది.  ఇంకా వివరంగా చెప్పవలసిని అంశాలు అందులో ఉండవచ్చు. చేర్చవలసినవీ ఉండవచ్చు. అయితే కీనోట్‌ లక్ష్యం కేవలం ఒక ఫ్రేం వర్క్‌ను, అందులోని మౌలిక విషయాలను ప్రతిపాదించడమే.

ఈ వైపు నుంచి కరపత్రాన్నిగాని, కీనోట్‌ను కానీ సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశం చేసినవాళ్లెవరూ చూడలేదని వాళ్లు స్పందించిన పద్ధతినిబట్టి చెప్పవచ్చు. లేదా వాళ్లు రాసిన విషయాలనుబట్టి చెప్పవచ్చు. అందువల్ల అనేక అపోహలకు తావు దొరికింది.   ఇదొక రాజకీయ విషయం కాబట్టి చాలా సరళంగా, సూటిగా కీనోట్‌ ఉంది. అందులో ఎట్లాంటి సంక్లిష్టతే లేదు.  భారత రాజ్యాంగ స్వభావం, అది ఏర్పడిన చారిత్రక క్రమం, దాని అమలు చాలా సంక్లిష్టమైన అంశాలే. అయితే వాటిని ఒక పద్ధతిలో చాలా సరళంగా వివరించే ప్రయత్నం కీనోట్‌ చేసింది.

 రాజ్యంగం   చరిత్రలో   రూపొందిన  క్రమాన్ని అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగా రాజ్యాంగాన్ని, దాని పరిమితులను వివరించారు. అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అంచనా వేశారు. ఆ నాటి రాజకీయ వేత్తలలో అంబేద్కర్‌కు సముచిత స్థానమేమిటో వివరించారు. ఆయన లాగా భారత సమాజాన్ని విశ్లేషించిన వారు లేరని ఆ కీ నోట్‌లో పేర్కొన్నారు. ఇంకా రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్‌ పేర్కొన్నట్లుగా రాజ్యాంగం మీద, ప్రకటించుకున్న ఆదర్శాలకు,  ఆచరణకు వైరుధ్యం ఉంటుందని  అంబేద్కర్‌ సందే

హించినట్లు  వరలక్ష్మి పేర్కొన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం ద్వారా సమాజంలో కీలక మార్పులు వస్తాయని, ప్రజలు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలని కూడా అంటారు. ఇది చెబుతూనే అంబేద్కర్‌   రాజ్యాంగ విమర్శకుడు అని కూడా కీనోట్‌ అంటుంది.  దీని కోసం చాలా హేతుబద్ధ పరిశీలనలు చేశారు. అందులో తప్పేముందో అర్థం కాలేదు.

రాజ్యాంగం మీది చర్చ అది దళితులకు, పీడిత అస్తిత్వ ప్రజలకు ఇచ్చే రక్షణలను, అందులోని సమానత్వం అనే అతి ముఖ్యమైన భావనను గుర్తిస్తూనే విమర్శనాత్మకంగా ఉండాలని కీనోట్‌ చెప్పింది. ఈ విమర్శనాత్మక దృష్టి లేకపోవడం, రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వైరుధ్యాలు పరిష్కారం అవుతాయని అనడం, రాజ్యాంగ ఆదర్శాలతోనే ఫాసిజాన్ని తుదముట్టించగలం అనడం రాజ్యాంగవాదమని కీనోట్‌ చెప్పింది. వీటి మీద మన రోజువారి జీవితాన్ని పరిశీలించి కూడా లోతుగా చర్చించవచ్చు. రాజ్యాంగబద్ధంగా  ఎన్నికైన ప్రజా ప్రతినిధులనుకునే దళిత నాయకులు, దళితుల్ని చంపి శవాలను ఇళ్ళకు పార్శిల్‌ చేస్తున్నారు కదా! మౌలికంగా రాజ్య స్వభావమే మారితే రాజ్యాంగాలు మారుతాయని చెప్పడానికి కూడా చరిత్రలో ఆధారాలు ఉన్నాయని కీనోట్‌ ప్రస్తావించింది.  అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని ఆనాటి రాజకీయాలలో ఆయన నిర్వహించిన పాత్రను చారిత్రకంగా అంచనా వేసింది. అంబేద్కర్‌ ఆలోచనలన్నీ రాజ్యాంగంలో ప్రతిఫలించలేదని, అభిప్రాయాల్ని రాజ్యాంగ సభ ఆమోదించలేదని పేర్కొన్నదే కాని ఆయన స్థాయిని కుచించి మాట్లాడలేదు. దీని మీద చర్చించే విషయాలుంటే ఎంతయినా మాట్లాడవచ్చు.   విరసం కరపత్రంలో  అంబేద్కర్‌ ‘‘అవకాశం వున్నంతవరకు పీడిత ప్రజల హక్కులను సామాజిక న్యాయాన్ని సాధించే ప్రక్రియలను రాజ్యాంగంలోకి తీసుకొచ్చాడు’’ అని చెప్పింది. దాని వల్ల రాజ్యాంగానికి సామాజిక పరివర్తనా స్వభావం వచ్చిందని, అది ఎంత చిన్నదైనా సరే, మరే వెలుగు లేని, ఆసరా లేని పీడిత కులాల ప్రజలకు రాజ్యాంగమే మొట్టమొదటి అలాంటి రక్షణను ఇచ్చిందని కీనోట్‌ చెప్పింది. ఇంకా ప్రజలకు పాలకులకు వైరుధ్యం వస్తే రాజ్యాంగం పాలక వర్గం వైపే వుంటుందనే మౌలిక విషయం చెబుతూనే సామాజిక పరివర్తనలో రాజ్యాంగం నిర్వహించిన చిన్న పాత్రను చర్చించింది. అది చిన్న పాత్ర కాదు, విప్లవాత్మకమని, రాజ్యాంగం ద్వారా కుల నిర్మూలన జరిగిందని, జరుగుతుందనే అభిప్రాయాలు ఉంటే వాటిని సహేతుకంగా చర్చించాల్సిందే. 

ఇక్కడ ఇంకొక మాటను గుర్తు చేసుకోవాలి. రాజ్యాంగవాదం అన్నమాటనే తప్పు బట్టి దాన్ని అంబేద్కర్‌కు ఆపాదించి అంబేద్కర్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు అభిప్రాయాలున్నాయి. రాజ్యాంగానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని ప్రజలకు చెప్పిన అంబేద్కర్‌ ఆ ఆదర్శాలు, ఆశయాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు అమలు జరగనపుడు రాజ్యాంగేతర పద్ధతులు అవలంభిస్తారన్నమాట కూడా అన్నాడు. ఇలాంటి అనేక పరిశీలనలన్నిటినీ కలిపి అంబేద్కర్‌ను అంచనా వేయాలి. రాజ్యాంగం మీద ఆయన వైఖరిని చెప్పుకోవాలి. 

 దేశంలో కొనసాగుతున్న అణచివేతలకు, దోపిడీ దౌర్జన్యాలకు  రాజ్యాంగం   సాక్షీభూతంగా   నిలిచిందే తప్ప ఏమీ చేయలేకపోయింది. దేనికంటే రాజ్యాంగం తన వర్గ స్వభావం వల్ల పాలకవర్గానికి, సకల ఆధిపత్యశక్తులకు దిశా నిర్దేశం చేస్తూ ఉన్నది. రాజ్యాంగంలోనే ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయని కీనోట్‌ చెప్పింది.  రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలు పోరాట ఫలితంగా సాధించుకున్నవే! ఇంకా సాధించుకోవాల్సిన హక్కులకు పోరాటం చేయాలని అంటే అంబేద్కర్‌ను వ్యతిరేకించినట్లు కాదు కదా.   నామమాత్రంగా ఉన్న రాజకీయ సమానత్వం నుంచి వాస్తవ లోకంలోకి వచ్చి చూస్తే జరగవలసిన ఉద్యమమేమిటో బోధపడుతుంది. అదే కరపత్రంలో రాజ్యాంగబద్ధంగా  వ్యవహరించమనని ప్రభుత్వాలను డిమాండ్‌ చేసే క్రమంలో ప్రజలను రాజ్యాంగ పరిమితులకు బందీలను చేసే భావజాలం పెచ్చరిల్లుతుందని, అదే రాజ్యాంగవాదమని రాశారు.  పాలక వర్గాల   ఫాసిస్టు స్వభావాన్ని ఇది తెలియజేస్తుంది. దాన్ని ఎదుర్కోవాలని చెబుతుంది. అంతేగాని రాజ్యాంగవాద విమర్శ ఫాసిస్టులకు ఎలా ఉపయోగపడుతుందో అర్థంకాదు. ఈ చర్చ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలకు ఎట్టా హానీ చేస్తుందో ఎవ్వరూ చెప్పకుండా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు? అని సూచనలు చేశారు.  ఉత్పత్తి సంబంధాలలో, పంపిణీలో మార్పుల్ని రాజ్యాంగం తీసుకురాలేక పోయింది. ఇది వాస్తవం కాదా? కనీసం సామాజిక సమానత్వానికి రాజ్యాంగం తోడ్పడి వుంటే చుండూరు, కారంచేడు, లక్ష్మింపేట, ఖైర్లాంజీ వంటి దురాగతాలు జరిగి వుండేవా?  మన ప్రజాస్వామ్యమనేది అప్రజాస్వామికమైన భారత గడ్డపై తొడిగిన వస్త్రమని స్వయానా అంబేద్కర్‌ విశ్లేషించారు గదా. ఇలాంటి సమాజంలో రాజ్యాంగం పీడితులకు   ఎంతోకొంత ఆసరాగా ఉంటుందని చెబుతూనే, రాజ్యాంగంతోనే అంతా మారిపోతుందని, ప్రస్తుత సమస్య అయిన ఫాసిజాన్ని రాజ్యాంగంతోనే ఓడిరచగలమనే వాదన మీద చర్చ చేయాల్సి ఉంటుంది.  దీన్ని  ఇప్పుడు విరసం చర్చనీయాంశం చేయకపోయినా ఇంకెవరో ఒకరు చర్చ చేయాల్సిన పరిస్థితలు ఉన్నాయి. విషయ ప్రాధాన్యంగా చర్చలో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయి. లేకపోతే ఆరాధన, విశ్వాస ప్రకటనలకే పరిమితం అవుతాం. అవి వాస్తవ దృశ్యాలను చూడ్డానికి ఎంత వరకు పనికి వస్తాయో ఆలోచించాలి.

Leave a Reply