వ్యాసాలు

వర్తమాన సామాజిక సందర్భంలో మన రచన, ఆచరణ

సాహిత్యరంగంలో విశాల వేదిక నిర్మాణం కావాలి. ఎందుకంటే భావజాలరంగాన్ని నియంత్రించడానికి రాజ్యం పూనుకుంటున్నది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులూ, పోరాటాల ద్వారా యిన్నాళ్లూ సాధించుకున్న పౌరహక్కులూ కాలరాయడానికి కంకణం కట్టుకున్నది. కేవలం యిపుడు కొందరు మేధావులూ, రచయితలూ, కళాకారులూ (రాజకీయ భావజాల కారణంగా మాత్రమే గాదు, రాజకీయపార్టీల కార్యాచరణలో భాగమైనందుకు) రాజ్యపు నిర్బంధానికి గురయినారే గానీ యిక ముందర కనీస ప్రజాస్వామిక హక్కు గురించి మాటాడే అందరూ గురయే ప్రమాదం వుంది, రాజకీయ కార్యాచరణ లేకపోయినా! దీన్ని నివారించాలంటే విశాల వేదికలు అవసరం. ఈ విశాల వేదికలు గూడా రాజకీయాలీనంగా వుండాలి. వేదిక పరంగా యే రాజకీయపార్టీకీ అనుసంధానం గాకూడదు.