జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికలు – నాలుగు సంవత్సరాల తర్వాత – ఎట్టకేలకు ముగిశాయి. వాటిలో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించింది. ‘జెఎన్‌యులో మళ్లీ ఎరుపు వర్ణం పుష్పించింది’ అని వారు, వారి మద్దతుదారులు అంటున్నారు. అయితే ప్రతి పదవిలోనూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే తమలో విభేదాలు ఉన్న వామపక్షాలు మితవాదులకి భయపడి ఒక్కటయ్యారని, అయినా తమకు, వారికీ మధ్య తేడా చాలా తక్కువగా ఉందని అందుకే తమదే విజయమని అంటున్నారు. గతంలోలాగా విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఏబీవీపీ గెలిచి ఉండేదని వారి వాదన.

ఈ ఎన్నికలపై మీడియాలో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు రోజు ఏబీవీపీదే విజయమని ప్రకటించేందుకు మీడియా హడావుడి పడినట్లుగా కనిపించింది. జెఎన్‌యులోని ఎర్ర బురుజు పతనం గురించిన ఆలోచనే సంతోషంతో పిచ్చెక్కించింది. కానీ చివరికి ఫలితాలు వారిని నిరాశపరిచడంతో ఆసక్తి కోల్పోయింది. లెఫ్ట్ ఫ్రంట్ పదవులన్నింటినీ గెలుచుకుంది. ఫలితాలు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాయనే వాదన ఇప్పుడు మరో పక్షానికి వచ్చింది.

కానీ ఓట్ల తేడా చూస్తే మాత్రం విద్యార్థులు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా తిరస్కరించారని చెప్పలేం. బదులుగా, దాని విద్యార్థి విభాగం బలమైన పోటీదారుగా ఉద్భవించిందని, ఇక ముందు కూడా ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి. జెఎన్‌యు మళ్లీ ఎరుపు రంగులోకి మారిందని చెప్పడం వాస్తవాలను తప్పుగా చూపించడమే అవుతుంది.
జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలు జాతీయ వార్తగా ఎందుకు మారాలని ప్రజలు ఆశ్చర్యపోవచ్చు. అన్నింటికంటే, ఇది విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం మాత్రమే! జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలకు సంబంధించి బయటి ప్రపంచంలో ఉత్సుకత, ఉత్కంఠ అసాధారణమనే మాట వాస్తవమే.

ఈసారి అది చాలా ఎక్కువైంది. 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లలో జెఎన్‌యులోనూ, క్యాంపస్ వెలుపల కూడా చాలా మార్పులు వచ్చాయి. సాధారణ ప్రజలు లేదా హిందూ సమాజంలోని ఒక పెద్ద వర్గం జెఎన్‌యుని అనుమానంతో, ద్వేషంతో చూడటం మొదలుపెట్టారు. ఇది ముస్లింలు, వామపక్షాలు, రాజద్రోహులు, తీవ్రవాదుల కంచుకోటగా చిత్రీకృతమైంది. ఈ ప్రచారం ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసింది. ఇంతకుముందు, తల్లిదండ్రులు తమ పిల్లలను జెఎన్‌యుకి పంపడం గర్వంగా భావించేవారు, కాని ఇప్పుడు జెఎన్‌యుకి రావడానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పోరాడిన గాథలు నా దగ్గర ఉన్నాయి.

ఈ మార్పు స్వతహాగా జరగలేదు. 2016 నుండి, భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు జెఎన్‌యుకి వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వారితో పాటు, పెద్ద మీడియా, సినీ పరిశ్రమ కూడా అంతగా ఆహ్లాదకరంకాని జెఎన్‌యు చిత్రాన్ని ప్రజలలో వ్యాప్తి చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. యూనివర్శిటీకి వ్యతిరేకంగా ప్రచార యుద్ధం జరిగింది. జెఎన్‌యు ఉపాధ్యాయులు సినిమాల్లో విలన్ పాత్రలుగా మారారు. జెఎన్‌యునే ఒక పాత్రగా మారింది.

తాజాగా జెఎన్‌యు పేరుతో ఓ సినిమాని తీసారు. ఈ సినిమా పూర్తి పేరు ‘జహంగీర్ నేషనల్ యూనివర్శిటీ.’ సినిమా హాలులోకి అడుగుపెట్టకముందే ఈ పేరును బట్టి చిత్రనిర్మాత ప్రేక్షకులపై ఎలాంటి ముద్ర వేయాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. జహంగీర్ భారతదేశ చక్రవర్తి. అయితే ఇక్కడ ఆయన భారతీయతపై కాకుండా ముస్లిం కావడంపైనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

నేను ఈ సినిమా గురించి చదివినప్పుడు, 2016లో అహ్మదాబాద్‌కు చెందిన స్నేహితుడితో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. అతను ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. ఒకరోజు అతని డ్రైవరు ఢిల్లీలోని జిన్నా నేషనల్ యూనివర్శిటీ అనే యూనివర్సిటీ గురించి అడిగాడు. జెఎన్‌యును ఇలా వర్ణించడం ప్రారంభించారని తెలిసి నా స్నేహితుడు దిగ్భ్రాంతి చెందాడు. ఆ యూనివర్శిటీ విద్యార్థులకు భారీగా రాయితీపై ఆహారం లభిస్తుందని బయట రూ.180 ఖరీదు చేసే థాలీకి విద్యార్థులు కేవలం రూ.18 మాత్రమే చెల్లిస్తారు అని డ్రైవర్ ఆయనకు చెప్పారు. రాజకీయాలు చేస్తూ పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేస్తున్నారని, అంతేకాదు, ఈ డబ్బును తమ ‘దేశ వ్యతిరేక కుట్రల’ కోసం ఉపయోగించుకుంటున్నారని కూడా ఆ రోజుల్లో జెఎన్‌యు విద్యార్థులపై దుష్ప్రచారం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే.
2016 ఫిబ్రవరి 9నాడు జెఎన్‌యులో జరిగిన ఒక చిన్న మీటింగ్‌పై దుమారం రేగడంతో ఈ ప్రచారం మొదలైంది. అఫ్జల్ గురును ఉరితీసిన వార్షికోత్సవం సందర్భంగా కాశ్మీర్ సమస్యపై ఈ సమావేశం జరగాల్సి ఉంది. దీన్ని ఏబీవీపీ వ్యతిరేకించడంతో వారికి, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమావేశంలో ‘భారత్ తేరే తుక్డే హోంగే’ (భారత దేశమా నువ్వు ముక్కలైపోతావు) అనే నినాదం చేశారని అన్నారు.

ఈ సంఘటన జరిగినప్పుడు నేటి కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడిగా ఉన్నారు. సమావేశ నిర్వాహకులలో విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రమ నాగ తదితరులు ఉన్నారు. కన్హయ్య కుమార్‌తో సహా వారందరూ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపించారు. జీ టీవీ చాలా రెచ్చగొట్టే రీతిలో ఆరోపించిన రికార్డింగ్‌ను ప్రసారం చేసింది. ఛానెల్ వీడియోను తప్పుగా చూపించిందని, ఇది సంఘటన వాస్తవ చిత్రణ కాదని దాని జర్నలిస్టులలో ఒకరు తర్వాత రాజీనామా చేశారు. కానీ ఇతర ఛానెల్‌లు జెఎన్‌యు నుండి భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న దేశ వ్యతిరేక అంశాల కథనాలను ప్రసారం చేయడం కొనసాగించాయి.

రాత్రికి రాత్రే, జెఎన్‌యు, దాని విద్యార్థి నాయకులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. కన్హయ్య, ఉమర్‌లకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అప్పటి కేంద్ర హోంమంత్రి ప్రకటన చేశారు. ఈ సంఘటన తర్వాతే మీడియా, బిజెపి ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అనే పదాన్ని కనిపెట్టాయి. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’కి జెఎన్‌యు స్వర్గధామం అని మనకు చెప్పారు. లైంగిక వేధింపులు కూడా ఉన్నాయి. అంటే ప్రతి రకమైన దుష్ప్రవర్తనను జెఎన్‌యు విద్యార్థులు, ఉపాధ్యాయులు చేస్తున్నారు అని అర్థం.

బిజెపి, పెద్ద మీడియా జెఎన్‌యుపైన ముఖ్యంగా విద్యార్థి రాజకీయాలపై దాడి చేసింది. వారిని సమర్థించిన వారిని ‘తుక్డే తుక్డే గ్యాంగ్’లో చేర్చారురు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జెఎన్‌యుకు వెళ్తే, అతన్ని కూడా ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ సభ్యుడిగా ప్రకటించారు.

ఈ జెఎన్‌యు వ్యతిరేక ప్రచారం ప్రభావం చూపింది. జెఎన్‌యువిద్యార్థులు ఢిల్లీలోనూ, ఢిల్లీ వెలుపల కూడా హింసను ఎదుర్కోవలసి వచ్చింది. ఢిల్లీలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికులను జెఎన్‌యుకు తీసుకెళ్లేందుకు నిరాకరించారు.

ఇది ఇలా ఉండగా, యూనివర్సిటీని ధ్వంసం చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. జెఎన్‌యు ఉదారవాద కళా విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. జెఎన్‌యుని సమాజానికి సంబంధించినదిగా చేయాలి అనే పేరుతో, ఉదారవాద మేథలను పెంపొందించే మానవ విజ్ఞాన శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలను ప్రక్కకు నెట్టేయాలనే కోరికతో వైస్ ఛాన్సలర్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ మొదలైన ఇన్‌స్టిట్యూట్‌లు, సెంటర్‌లను జోడించాడు.

దీనితో పాటు ఉపాధ్యాయ పదవులకు సంఘ్ పరివార్‌తో అనుబంధం కలిగివున్నారని బహిరంగంగా తెలిసిన వ్యక్తుల నియామకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో జెఎన్‌యులోని అన్ని కేంద్రాలు అత్యంత మితవాద పక్షానికి చెందినవారితో మాత్రమే కాకుండా విద్యాపరంగా ఏమాత్రం సామర్థ్యం లేనివారితో నిండిపోవడాన్ని మనం చూస్తాం.

జెఎన్‌యులో విద్యార్థుల ప్రవేశ విధానాన్ని కూడా మార్చారు. దాని ప్రత్యేకమైన అడ్మిషన్ పాలసీ కారణంగానే అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుండి, దాదాపు భారతదేశం నలుమూలల నుండి పేద కుటుంబాల నుండి విద్యార్థులు జెఎన్‌యుకి వచ్చారు. క్యాంపస్‌లో మనం అన్ని భారతీయ భాషలను వినవచ్చు. గ్రామాలు, పట్టణాల నుంచి యువత జెఎన్‌యూకు చేరుకున్నారు. ఈ అడ్మిషన్ విధానం ఇప్పుడు పోయింది. ఇది జెఎన్‌యు జనాభా స్వరూపాన్ని ప్రభావితం చేస్తుంది.

భారతదేశంలో మేథో ఆధిపత్యాన్ని ప్రకటించాలనే ఆర్ఎస్‌ఎస్ ఆశయానికి జెఎన్‌యు చాలా కాలంగా అతిపెద్ద అడ్డంకిగా ఉంది. అందువల్ల, దానిని నాశనం చేయాలి లేదా పట్టుసాధించాలి అనేది దాని పురాతన స్వప్నం. విద్యార్థుల ప్రవేశాన్ని నియంత్రించడం ద్వారా లేదా ఉపాధ్యాయుల నియామకాన్ని తమ స్వంత వ్యక్తులతో నింపడం ద్వారా దీన్ని చేయవచ్చని వారికి తెలుసు.

హింసకు తావు లేని తీవ్రమైన సైద్ధాంతిక ఘర్షణలకు సాక్ష్యమిచ్చే క్యాంపస్ జెఎన్‌యు అని మీకు తెలుసు. నిజానికి యింతకంటే ప్రశాంతమైన క్యాంపస్‌ భారతదేశంలో యింకెక్కడా కనిపించదు.

గత పదేళ్ల బిజెపి పాలనలో ఇదంతా మారిపోయింది. జెఎన్‌యు విద్యార్థులు, ఉపాధ్యాయులు పలుమార్లు హింసను ఎదుర్కొన్నారు. ఈ దాడుల్లో ఎబివిపి సభ్యుల హస్తం ఉందని ఆరోపించారు. కానీ పోలీసులు, వారిపై చర్యలు తీసుకోకపోవడమే కాదు, ఆ ఘటనలను సరిగ్గా దర్యాప్తు కూడా చేయలేదు. జెఎన్‌యు అధికార యంత్రాంగం కూడా ఈ హింసాత్మక చర్యలను సహించింది, లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులనే నిందించింది.

జెఎన్‌యు దాని నిష్కపటత్వానికి ప్రసిద్ధి చెందింది. హాస్టళ్లలో డిన్నర్ చర్చలు, గంగా ధాబాలో అకస్మాత్తుగా జరిగే చర్చలు బయటి నుండి కూడా ప్రజలను ఆకర్షించాయి. ఇదంతా మారిపోయింది. పరిపాలనా యంత్రాంగం ప్రతిచోటా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. విద్యార్థుల చురుకుదనాన్ని నిరోధించే ప్రయత్నం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులపై పరిపాలనా యంత్రాంగం క్రిమినల్ కేసులు పెట్టింది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది జెఎన్‌యుఎస్‌యూ ఎన్నికలు జరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం పట్ల సగర్వంగా తన విధేయతను ప్రకటిస్తున్న వైస్ ఛాన్సలర్ జెఎన్‌యులో వుండడం వల్ల , అధికారులు ఎన్నికలను రద్దు చేయడానికి లేదా నిర్వహణలో అడ్డంకులు కల్పించడానికి ఏదో ఒక సాకును కనుగొంటారనే భయం ఉండింది.

సరళతకు, ప్రత్యర్థి విద్యార్థి సంస్థల మధ్య మేధో చర్చకు జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలు ప్రసిద్ధి చెందాయి. ఢిల్లీ యూనివర్శిటీలో ఎన్నికలకు లక్షల రూపాయలు ఖర్చు చేసే ఎబివిపి జెఎన్‌యులో చేతిరాత పోస్టర్లు, వాల్ రైటింగ్‌లు, స్వయంగా చెప్పడం ద్వారా ప్రచారం చేస్తోంది. వీటన్నింటిని మార్చే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఇది యూనివర్సిటీ రాజకీయ సంస్కృతి.

సరే, ఎన్నికలు జరిగాయి, పరిపాలనా యంత్రాంగం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించలేదని కాదు. ఓటింగ్ రోజు తెల్లవారుజామున 2 గంటలకు లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిపై అనర్హత వేటు పడింది. ఇది పాలనా యంత్రాంగం రిగ్గింగ్‌కు సంబంధించిన స్పష్టమైన కేసు. ఆందోళన కలిగించే విషయమేమిటంటే.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి వల్లే ఇది జరిగింది. ఇలా విద్యార్థుల శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించినా ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు.

లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది. సాపేక్షంగా కొత్త సంస్థ బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ (బాప్సా) అభ్యర్థి ఒక పదవిలో విజయం సాధించారు. ఇదే పదవికి వామపక్షాల అభ్యర్థి అభ్యర్థిత్వం రద్దయింది. లెఫ్ట్ ఫ్రంట్ వెంటనే ఈ పదవికి బాప్సా కి మద్దతు ప్రకటించింది. ఎబివిపి అన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ గెలుపు ఓటములు అంత ముఖ్యం కాదు. ఎన్నికలు జరిగాయనేది ముఖ్యమైన విషయం. వామపక్ష ఆలోచనలు, మితవాద ఆలోచనలు లేదా మధ్యేవాద ఉదారవాద ఆలోచనలు కలిసి ఉండగలవా లేదా అన్నది విద్యార్థుల ముందు ఈ ఫలితాలు విసిరిన ప్రశ్న. జెఎన్‌యు నిర్వచించేది పరస్పర చర్చ, ఆలోచనల పోటీలు. విజయవంతమైన ఫ్రంట్ మీద ఈ సంస్కృతిని రక్షించాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యర్థులను శత్రువులని లేదా అధ్వాన్నులని ఎగతాళి చేయకూడదు. చర్చలు, వాగ్వివాదాల కోసం క్యాంపస్‌ను సరియైన సురక్షిత స్థలంగా తిరిగి పొందడం అత్యవసరం. కొత్త యూనియన్, ఓడిపోయిన యూనియన్ ఈ సవాలుకు ఎలా స్పందిస్తాయో చూద్దాం.

https://thewire.in/rights/jnu-elections-students-body-left-right

One thought on “జెఎన్‌యు పరిణామాలు – రాజకీయ ప్రాసంగికత

  1. STUDENT UNION ELECTIONS— WHY POLITICAL PARTIES ENTRY IN TO THIS
    ELECTION -NEEDS DEBATE ON THIS ISSUE????

    -BUCHIREDDY GANGULA

Leave a Reply